Sunday, 27 January 2019

అడవి నుండి అడవికి — సమీక్ష

అడవి నుండి అడవికి 

జయతి లోహితాక్షన్ అడవి నుండి అడవికి చదవడం. పూర్తయింది. కొన్ని అపుడపుడు చదివినా, అంతా  ఒక సంకలనంగా చదవడం..అందులో పుస్తక రూపంలో.. తిరిగి తిరిగి నచ్చిన పేజిల్లోకి వెళ్ళి చదూతూంటే నేనే అడవి చుట్డి వచ్చానా అనిపించింది

సాధారణంగా ఎవరైనా..ఆత్మకథ రాసినా సరే, అంతో ఇంతో కల్పన లేకుండా రాయలేరు ... పడికట్టు రాళ్లవంటి భావజాలం చొరబడకుండా ఉండదు..కాని, జయతి వివరణ, పసిపిల్లలు చూసినది చూసినట్లు చెప్పినట్లు  ఉంటుంది.

జయతి కి అడవి పరిచయం జరిగింది..ఛత్తీస్ ఘడ్ అడవుల్లో.. ఎంత ప్రేమలో పడిపోయిందో తను అడవి తో.
అక్కడి పురుగూ పుట్రా తోసహా... అక్కడి మనుషులతో సరేసరి.

వళ్లు గగుర్పొడిచె 'కాలానాగ్' చూసినపుడు... నదిలో పాము పిల్లలు ...తల్లి ని ఎట్లా ఫోటో తీయగలిగిందో..!

'జలగ చేత మత్తునిచ్చి నన్ను తనలో కలుపుకొంది అడవి'.ట ఇదేం మత్తు!

" పూర్ణ నవ్వింది. సాల ఆకుల మీద మంచు పూర్తి గా కరిగిపోయింది"

కట్టెలమోపు తో  అకడి స్త్రీలు ఒకరివెనక వారు లయబద్ధంగా  పరుగులాటి నడకతో వస్తూంటే,
'అది నడకలా లేదు. అడవిపాటకు అడుగులేస్తున్నట్టుగా' ఉందిట.

"వారు వస్తుంటే బాటనుండి పక్కకి తొలగి నిలబడాలనిపిస్తుంది"
కట్టెమోపుల కావిళ్ల కెత్తుకొని నడచి వస్తున్న 'లకడీవాలా' లయబద్దమైన నడక... అడవి మనుషుల శ్రమైక జీవనం... హారతులెత్తి నట్లు  ఇలా తన మాటల్లో దృశ్యమై నిలుస్తుంది.

తన మనసు ఉప్పొంగిన భావనలెన్నో ఇంతే  దృశ్య రూపం ఇస్తూ..
ఓ పెద్ద చెట్టు ను చూశాక... అడవి ఆత్మ దర్శనం కలిగినట్లైంది.ఎందరినో పిలిచి చూపించాలనిపించింది అంటూ ఆకాశంలో కి విస్తరించిన చెట్టు చూపిస్తారు.(కొండ అత్తి చెట్టు)

" ఎన్నెన్నో ఎత్తైన చెట్లున్నాయి. వేలవేల ఆకుపచ్చ వర్ణాలుగా ఉంది. చెట్లు కొన్ని ఆకులు రాల్చేసాయి.కొన్ని ఆకులు రాల్చడానికి సిద్దం చెసుకొంటున్బాయి. కొన్ని చెట్లు పుష్పిస్తున్బాయి. ఎండ కొన్ని ఆకు చిగుళ్లలో ఎర్రని ఎరుపై మెరుస్తుంటే,రాలబోతూ కొన్ని పండి ఎరుపెక్కి మెరుస్తున్నాయి....."
ఇలా సాగిన ఈ అడవి వర్ణన వాల్మీకి కావ్యం లా లేదూ!

సైకిళ్లమీద మైళ్ళ కి మైళ్ళు.. ప్రయాణం. ఘాట్ రూట్ లో సైతం.
అడవి దుంపలు తిని,అడవినీళ్లు తాగి,కొండగాలి పీల్చిన స్వేచ్ఛ.. అనుభూతి.
ఆరుబయట చేలలో ఆశ్రయం దొరికిన ఓ చోట..ఆరగింపు ఇలా ఉంది.. ఆకాశంలో 'చుక్కలు ఒక ముద్ద, మినపప్పు కూర తో కలిపిన అన్నం ఓ ముద్ద.' అటువంటి రాత్రి మళ్ళీ రాదనుకొంటూను.

తెలియకుండానే, ఆ సూఫీ సాధువు సమాధుల పక్కనే ఆదమరచి నిద్ర పోగల నిర్భీకత..ఆరాత్రి ఎవరు వచ్చి దుప్పటి కప్పారు?!

ఆవిడ తిరుమల అనుభవం..
మెట్ల దారిన తిరుమలకి వెడుతూ వస్తూ..గుంపులు గుంపులుగా... మనుషులు..
అన్నిదిక్కులనుండీ ఇంతమందిని ఒకచోటకు నడిపిస్తున్నది ఏది? ఈ అద్భుతం చూశాక ప్రత్యేకంగా శిలాతోరణం చూడ
లేదనిపించ లేదట.
.. 'నువ్వుకూడా చూడాలి అన్నారు... చూశావా అని తను అడగలేదు. నేను చూశాను'

మరో రామాయణ గాధ లాటి 'అమృత సంతానం' మీద ఆరాధనా పూర్వకమైన సమీక్ష..

"అయితే మీరు గుళ్లన్నీ చూస్తూ వస్తున్నారా?"

'అడవులు,అడవుల్లో మనుషులు,పల్లెలు,పంటలు, కాలువలు,నదులు, చెరువులు, కొండలు,గుళ్ళూ చూస్తూ వస్తున్నామన్నాను'.

గుండెలపైన చేతులేసుకొంది ఆమె కళ్లు మెరిశాయి.

'ఇన్ని చూసొచ్చిన మిమ్మల్ని చూస్తుంటే దేవుళ్లను చూసినట్టుందన్నది.'

వారిద్దరినీ చూసి అత్రి,అనసూయలను చూసినట్లు వుందని అన్నారు వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఎఫ్బిలో జయతి ని పరిచయం చేస్తూ. ఇవన్నీ చదివాక అలాగే అనిపించింది.

'మేమిద్దరం ఒకటి కాదు.మేమిద్దరం ఒక్కటే'
అంటూనే, ఈ చక్కని ప్రేమ కావ్యాన్ని తన జీవిత భాగస్వామి లోహితాక్షన్ కు అంకితం ఇచ్చారు.







No comments:

Post a Comment