Friday, 21 October 2016

నా కాశీ యాత్ర

మాతా చ పార్వతీ దేవీ 
పితా దేవో మహేశ్వరః...

అయిపోయాయి.... నా పది రోజుల కాశీ యాత్ర ...ముగిసింది.జీవితంలో ఒకసారి అయినా కాశీ వెళ్లాలి అంటారు. అలాంటిది తొమ్మిది రాత్రులు నిద్ర చేసే అవకాశం వచ్చినపుడు వదులుకో బుద్దేయలేదు.
నా స్నేహితురాలు,తన బంధువులతో కాశీ యాత్ర చాలాముందే ప్లాన్ చేసుకొంది. నేనూ వస్తాను అనడంతో మరో ఫ్రండ్ ని కూడ కలుపుకొని ట్రయిన్ రిజర్వేషన్స్ కి ట్రై చేశాం. అంత సులభమా? అదీ దశరా రోజుల్లో.
ఒకప్పుడు ఏనుగు వీరాస్వామి గారు కాలినడకన మద్రాసు, హైదరాబాద్‌, నాగపూర్‌, అలహాబాదుల మీదుగా అంచలంచెలుగా కాశీ చేరారట. మహానుభావులు.
ఇది ఇరవై ఒకటవ శతాబ్దం పైగా వెలిగి పోతున్న భారతదేశం- మేం రాను పోను ఫ్లైట్ ఇంకా శృంగేరి మఠంలో రూమ్స్ బుకింగ్ (ఎంతో ప్రయత్నించిన మీదట) అన్నీ చేసుకొన్నాం. 


ఏమేం చూశాం....ఏం చేశాం 

ఆలయ సందర్శనం
పండగరోజులు కదా....విశాలాక్షి (శక్తి పీఠం),అన్నపూర్ణ ఆలయాలు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి. ఎంతో చక్కటి దర్శనం. అంతా లలిత చదువు కొన్నాం అక్కడ.
ఒక రోజు సాయంత్రం  విశ్వనాధ ఆలయంలో  ఋషి హారతి కి హాజరయ్యాం..రెండు కళ్లు చాలావేమో అనిపించింది. ఈ మూడు ఆలయాలుు, 
ఇంకా బిందుమాధవుడు,కాలభైరవుడు,వారాహి మాత తప్పనిసరిగా చూడాల్సినవన్నారు.
 కేదార్ ఘాట్ వద్ద ఉన్న శృంగేరి శంకరమఠం లో మహర్నవమి , విజయదశమి రోజున అమ్మవారికి సామూహిక కుంకం పూజ.. మరొక విశేషం.

ప్రయాగ వెళ్లే దారి లో సీతామారి- సీతామ్మవారు..భూమిలోకి వెళ్లిన స్థలం (ఇక్కడ కాస్త ఎమోషనల్ అయ్యాం అంతా)-- తర్వాత ప్రయాగలో వింధ్యావాసిని, మాధవేశ్వరి(శక్తి పీఠం) ఆలయాలు దర్సించాం.

గంగాస్నానం
పంచ ఘాట్ స్నానం...కేదార్ ఘాట్,అశి,దశాశ్వమేధ,పంచగంగ,మణికర్ణిక ఘాట్ల లో స్నానం...దంపతులు గా వచ్చిన వారు సంకల్ప స్నానాలు మణికర్ణిక లో చేశారు. అలాగే ప్రయాగ లో త్రివేణి సంగమం లో స్నానం..
సాయంత్రం కన్నుల పండుగ్గా అనిపించే గంగా హారతి..
ఈ సందర్భంగా మరోవిషయం. ప్రధాని మోడి గారి స్వచ్ఛ భారత్ ఉద్యమ ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. గంగానది,ఘాట్లు కాస్త శుభ్రంగా కనిపించాయి.


నగర సందర్శన లో 
బెనారస్ హిందూ యూనివర్సిటీ, బిర్లామందిర్..సారనాధ్ స్థూపం, జైన్ మందిరం.ఆ తర్వాత పంచ కోశ పరిక్రమ..మేం చుట్టి వచ్చినవి.

షాపింగ్-
గుడి దగ్గర ఉన్న షాప్స్ లో చిన్న అన్నపూర్ణ విగ్రహాలు,రుద్రాక్షల రిస్ట్ బాండ్స్,కాశీ తాళ్లు మా సావనీర్స్‌ కలక్షన్. బెనారస్ పట్టు డ్రస్ మెటీరియల్స్ ..బెనారస్ దుపట్టాలు బాగున్నాయి.
ప్రయాణంలో పదనిసలు అంటారు అలా...ట్రాఫిక్ ఆంక్షలవల్ల చాలామటుకు కాలినడక వెళ్లాల్సి వచ్చింది. కొన్నిచోట్ల మెట్లదోవ. కాశీలో విశ్వనాథుడు,అన్నపూర్ణ, విశాలాక్షి గుడులకు వేళ్లే తోవ చాలా సన్నగా,ఇరుకుగా ఉంటుంది...అందులోనే భక్తులతోపాటు..ఆవులు, అదేపనిగా హారన్ మోగించే మోటారు సైకిళ్లు...హరహర మహదేవ..అనుకొంటూ తప్పుకొంటూ,తప్పించుకొంటూ...ముందుకు సాగడమే. పోతే కాశీ లో అణువణునా..గోవుల కాలి గిట్టలనుంచి రేగిన ధూళి లో కూడా పరమేశ్వరుడు నిండి ఉన్నాడని గురువుగారు చెప్పారు. అంచేత తలవంచుకుని గబగబా ముందు కు పోవడమే.

ఆధ్యాత్మికం: 
సత్సంగత్సే నిత్సంగత్వం.. మేం ఉన్నది శృంగేరి శంకరమఠం..అనుకొన్న దానికన్నా వసతి గా ఉంది. ఇహ భక్తులంతా బంధువులేగా... రోజూ సాయంత్రం 5-6 గం.ల సమయంలో - పురాణశ్రవణం. కాశీఖండం,భాగవతం లోని కొన్ని ఘట్టాల నుంచి ప్రసంగాల తో యాత్రకి పరిపూర్ణత ఏర్పడిందనవచ్చు.

ఇన్ని చెప్పి అన్నపూర్ణ నిత్యాన్నదానం చెప్పక పోతే ఎలా...ఎప్పడు వెళ్లినా, ఎంతమందికైనా వేడి వేడి భొజనం- సాంబారు,అప్పడం,పచ్చడి కూర, మజ్జిగ...ఒక స్వీటు...మొత్తానికి ప్రసాదం తిని మేమూ తరించాం!
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ...