Wednesday, 31 December 2025

ఉదయరాగం

 


ఉదయరాగం


"ఆగామి శిశిర భయంబుచే జమిలి దుప్పటి కప్పుకొనెనేమొ ప్రకృతి కాంత!"

అని చలి తీవ్రతను తెలియజేస్తారు విశ్వనాథవారు. 'ఋతు సంహారం' లో. ఆంధ్రప్రాంతం లో పొగమంచు ఎక్కువ.. నల్లత్రాచు పైనుండి విడిచిన కుబుసంలాగా, చంద్రుడు రాల్చిన నుసి అన్నట్టు, తెల్లని మబ్బులు తెగిపడ్డట్డూ.. ఉపమిస్తారు ఈ పద్యం లో!


అవునండీ చలి పెరిగింది!  టెంపరేచర్ చూస్తే దాదాపు సింగిల్ డిజిట్ ని తాకింది...!  

తన ప్రతాపం తెలియ చేయడానికా అన్నట్టు గజగజలాడిస్తోంది చలి!


"ఎల్లజనముల దలసూపనీక వెలయు

నల్ల హేమంత ఋతురాజు యశము దిశల

నావరించెనొ యనంగ మంచగ్గలించె

రోదసి నతంద్ర చంద్రికా రుచిర రుచుల"

        (కంకంటి పాపరాజు)


"If winter comes, can spring be far behind?"  PB Shelly famously quoted in his 'Ode to the West wind'. 

ఇదెప్పటికీ పాతబడని సామెత లాంటిది.

శీతాకాలం వచ్చిందంటే, మరి వసంతం వచ్చినట్టేనట! 

ఈ ఎదురు చూపు బాగుంది. 

మనకేమో పుష్యమాసం ప్రవేశం తో ఉత్తరాయణం వచ్చినట్లే! 

కుచించుకు పోయిన పగళ్ళు, 

మండే నెగళ్లు.. !

గోరువెచ్చని సూర్యుణ్ణి  కలలు కంటూండగానే వచ్చేస్తుంది వేసవి‌. 

తిరిగి ఎండాకాలం లో ఈ చలికాలపు పొద్దును నెమరు వేసుకుంటాం..!

ఎన్ని కాంట్రాడిక్షన్స్!

చూస్తూ.. చూస్తూ యేడాది చివరి రోజుకి వచ్చేశాం. 2025 కి ఈ రోజుతో వీడ్కోలు పలికి, రేపటి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం!  2026 లో మళ్లీ కొత్త ప్రయాణాలు.. ప్రణాళికలు!

ఈ సారి రూట్ మాప్ యిలా ఉండాలిట..

ఒక మిత్రురాలు పంచిన జ్ఞానం యిది.


"గమ్యం -బ్రహ్మ

లక్షణం- సత్యం,జ్ఞానం, అనంతం బ్రహ్మ

మార్గము- సత్యం పరం ధీమహి

నిత్య స్మరణ- దేహోనాహం బ్రహ్మైవహం"


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Thursday, 18 December 2025

కోనసీమ ప్రయాణం 4

 

ద్వారకా తిరుమల


బెజవాడ కనకదుర్గమ్మ


కోనసీమ ప్రయాణం-4

లయ దర్శనాలు


రాజమండ్రి లో ఉదయమే ప్రయాణం అయి, వాడపల్లి, ర్యాలికి చూడ్డానికి వెళ్లాం. రెండూ తెలుసు కాని, చూడని ప్రదేశాలే.

వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని, ర్యాలీ కి బయల్దేరాం.


ర్యాలి లో ఉన్నది చెన్నకేశవుని ఆలయం  చాలా పేరున్న ఆలయం. ర్యాలికి ట్రాన్సఫర్స్ కోసం వస్తుంటారని తెలుసు.  ఇక్కడి ఆలయం కూడా పురాతనమైనదే.. పదకొండవ శతాబ్దానికి చెందినదేనట. చోళ రాజులు పాలించిన కాలం. ఆలయాల వలన, అప్పటి శాసనాల వల్ల మన చరిత్ర తెలుస్తుంది.

ఇక్కడ విష్ణుముర్తి స్త్రీ-పురుష రూపాలతో వుంటాడు.  ఏకశిలా సాలగ్రామం. ముందు కేశవుడు– శంఖచక్రగద పద్మాల తో నాలుగు చేతులతో ఉంటాడు.

వెనక భాగం లో అందమైన తలకొప్పు .. 

సొగసుగా గోచి పోసి కట్టిన చీర కట్టు తో మనోహరం గా వుంది.  వెనక కాలి పిక్క మీద సహజంగా ఏర్పడినట్టు వున్న పుట్టుమచ్చ కూడా కనిపించేలా ఈ చీర కట్టు వుంది.   స్వామి వారి పాదాల నుండి నిరంతరమూ సన్న గా నీరు ఉబికి వస్తూంటుంది. విష్ణు పాదాన కదా గంగమ్మ పుట్టింది.

"హరిపాదాన పుట్టావంటే గంగమ్మా

శ్రీహరి పాదాన పుట్టావంటే గంగమ్మా"

పాట గుర్తుకు వచ్చింది


ఇట్లా గర్భాలయం లోకి వెళ్లడానికి ₹50/- ప్రత్యేక దర్శనం టికెట్  పెట్టారు. ర్యాలి ట్రాన్సఫర్స్ కోసం వెడతారని అందరికీ తెలిసినదే కదా.  బుధవారం ప్రత్యేకం. అయిదు బుధవారాలు అయిదు చొప్పున ప్రదక్షిణ చేయాలి అని రాసి వున్నది.


ర్యాలీ లో ఇలా చెన్నకేశవ-జగన్మోహిని ఆలయం వుంది అని  మాత్రమే అని తెలుసును. కాని పక్కనే శివాలయం కూడా  వుంది.  శ్రీఉమాకమండలేశ్వరస్వామి - ఆలయం అంటారు. అక్కడ పలకమీద పౌరాణిక నేపథ్యం రాసి వున్న దాని ప్రకారం, జగన్మోహిని గా వున్న విష్ణువును వెంబడించి వస్తాడు శివుడు.  ఈ చోటుకి వచ్చేసరికి శివ-కేశవులు యిద్దరూ పరస్పరం ఎదురుబడ్డారుట. విష్ణువు మోహినీ అవతారం చాలించి కేశవుడిగా నిలవగా, శివుడు ఇక్కడ శ్రీఉమాకమండలేశ్వర స్వామి గా ఆవిర్బవించాడుట‌.

విశేషం ఏమిటంటే.. పదకొండవ శతాబ్దం చోళ రాకుల కాలం లో నిర్మించిన ఈ ఆలయం లో శివలింగం నున్నగా కాకుండా రుద్రాక్ష వలె ఉంటుంది. సోమసూత్రం గాని, చండీశ్వరుడుగాని ఉండరు.  ఇక్కడ శివుడికి చేసిన అభిషేక జలం అంతా.. ఎంత చేసినా సరే గర్భగుడిలోనే యింకిపోతుందిట.  పక్కనే ఉన్న  కేశవుడి గుళ్లో జల ఊట కీ, శివాలయం లో అంతర్థానం అయ్యే నీటికి ఏమైనా సంబంధం వున్నదా? ఏమో..!








ఆ తరువాత  రావులపాలెం జంక్షన్ లొ చేసిన ఫలహారం గురించి చెప్పాలి.

నేను మొదటిసారి పనసాకుల లో వండే "పొట్టిక్కలు" రుచి చూశాను. దిబ్బరొట్టె, చెఱుకు పాకం.. అలా తలా కాస్త రుచి చూసాం.


అక్కడ నుండి ద్వారకా తిరుమల.  గుడి కట్టేస్తారేమోనని ఎంతోకంగారు పడుతూ వెళ్లిన మాకు, గర్భాలయంం లో స్పెషల్ దర్శనం చేసుకోవడం ఎంతో తృప్తిని యిచ్చింది.

చివరిగ గా అమ్మలగన్నయమ్మ విజయవాడ  కనకదుర్గమ్మ.. చల్లని చూపులు మామీద పడటం, అక్కడా ప్రత్యేక దర్శనం చేసుకోగలగడం పుణ్యం గా భావిస్తూ.. ఆ రోజే హైదరాబాదు రిటర్న్ అయ్యాం.


ఒక్క మూడు రోజుల్లో యిన్ని గుళ్లు తిరిగామా అని మాకే ఆశ్చర్యం కలిగింది.

అంతా భగవంతుడి కృప 🙏


స్వస్తి.



Tuesday, 16 December 2025

కోనసీమ ప్రయాణం-3

 

తొలి తిరుపతి


గొల్లలమామిడాడ గోపురం


ఆలయ దర్శనాలు


కాకినాడ  లో  పొద్దున్నే బయల్దేరి అన్నవరం, పిఠాపురం, తొలి తిరుపతి, గొల్లల మామిడాడ,  బిక్కవోలు, సామర్లకోట, ద్రాక్షారామం యిలా అన్నీ ఆలయాలను చూసుకుని  ఆ రాత్రికి రాజమండ్రి చేరాం. 


ఇందులో అన్నవరం, పిఠాపురం ..ఇవన్నీ ఇదివరకు చూసినవే కాని, ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టు ఉంది. ముఖ్యంగా అన్నవరం ఎన్ని సార్లు వెళ్లానో! కాని ఇప్పుడు పై అంతస్తు లో  స్పష్టంగా  ఒక పక్క సత్యదేవుడు, మరోపక్క శివుడు, కింద అంతస్తులో బ్రహ్మ.. చక్కని దర్శనం అయింది.

అలాగే పిఠాపురం లో  పూర్వం చూసిన గుర్తు లేదు. కుక్కుటేశ్వరుడి పక్కనే అద్దంలో "పురూహుతిక" అమ్మవారిని చూసాను. ఈ ప్రతిమే అసలైన శక్తిపీఠం అన్నారు.  పక్కన వేరే అమ్మవారికి ఉపాలయం ఉంది అనుకోండి. మరో విషయం చెప్పారు.. పిఠాపురం లో శిష్టికరణాల వీధిలో, శ్రీపాద శ్రీవల్లభుల పీఠం పక్కన, అసలైన శక్తిపీఠం ఉందని. నేను చూడలేదు.


ద్రాక్షారామం గర్భాలయం లో ప్రదక్షిణ చేయమని అక్కడి అర్చకస్వామి చెప్పారు. అక్కడో చిన్న స్థంభం సందున రావడం మోక్షమార్గం అని చెప్పారు. కైలాస మానస సరోవర యాత్ర తరువాత,ఇహం గాను,పరం గాను చూస్తే "తగ్గాను" నేను.. అందువల్లే సులభంగా బయటకు రాగలిగా!

అక్కడి 'మాణిక్యాంబ' అమ్మవారు శక్తిపీఠం. పేరుకు తగ్గట్టు మణిమయ కాంతితో కన్నుల్లో నిలిచిపోయారు. అక్కడే  కాలభైరవుని ఉపాలయం.  ఇవన్నీ చూసుకుని ఆ రాత్రికి రాజమండ్రి చేరాం.

ఈ ట్రిప్ లో చూసిన  'తొలి తిరుపతి'  'గొల్లల మామిడాడ'  ఇదే మొదటి సారి.


తొలితిరుపతి - 

కాకినాడ దగ్గర దివిలి గ్రామం లో వుంది. తిరుమల లో కంటే ముందే ఇక్కడ వెలిశాడట  వెంకటేశ్వర స్వామి.  శ్రీదేవి,భూదేవి రెండువేపులా ఉండే దివ్యమంగళ విగ్రహం.

ఈయనను శృంగారవల్లభస్వామి అంటారు. 'శృంగార' అన్న పదం సౌందర్యానికి చెందినది. పూర్వం మాకు తెలిసిన ఒకావిడ పేరు 'శృంగారమ్మ గారు'.

మా అమ్మ ఎప్పుడూ ఆవిడని తలచుకోవడం వల్ల ఆ పేరు గుర్తుండి పోయింది. బహుశా ఈ స్వామివారి పేరే పెట్టారేమో అని యిప్పుడు తోస్తోంది.


మరో విశేషం ఏమిటంటే, 

 "ఎంత మాత్రమున ఎవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు"- అని అన్నమయ్య శ్రీవేంకటేశుని కొనియాడినట్లు, ధ్వజస్థంభం దగ్గర నుంచుని చూస్తే ఎంత వారికి అంతే కనిపిస్తాడన్నారు. 

దీనికో అందమైన పురాణ గాథ నేపథ్యం చెబుతారు. ధృవుడు, అయిదేళ్ల పసివాడు. తండ్రి నిర్లక్ష్యం, పినతల్లి వేధింపు వల్ల క్షోభకు గురై, తల్లి చెప్పగా తపస్సు చేసుకుందుకు అడవిదారి పడతాడు.  నారదుడు కనిపించి 'నారాయణ' మంత్రాన్ని ఉపదేశించగా ఘోరమైన తపస్సు చేస్తాడు. శ్రీమహావిష్ణువు ప్రత్యక్షం అవుతాడు.. మహా వెలుగలా కనిపించిన నిలువెత్తు స్వామిని చూడలేకపోతే, స్వామి తన రూపాన్ని తగ్గించుకుని కనిపిస్తాడుట ధృవుడికి.

ఇదిగో, ఆ ఘటన యిక్కడే జరిగిందని, అందుచేతే, ఈ ఆలయం లో  స్వామివారు

ఎంత వారికి అంత మాత్రమే కనిపిస్తాడని చెబుతారు.  ఇటువంటి అందమైన ఉపాఖ్యానం వలన మనకీ మరింత 'లో చూపు' ఏర్పడుతుంది కదా!

మా తో ఆజానుబాహువులు ఎవరూ రాలేదు కనక ఆ తేడా తెలియలేదు సుమా! ఈయన ఆపద మొక్కులవాడే. పటికబెల్లం ప్రసాదం.

కష్టం తీరాక, ఎవరికోసం మొక్కుకున్నారో వారి ఎత్తు పటిక బెల్లం సమర్పించుకోవాలిట. వెనకాల వున్న బావి లో నీరూ పవిత్రమైనవి అని చెప్పారు.

ఇలా వరుస దర్శనాలు అయ్యాక ఆ రాత్రికి రాజమండ్రి చేరాం.

Monday, 15 December 2025

కోనసీమ ప్రయాణం-2

 




ఇక్కడ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం చూసుకున్నాక, దగ్గరలోనే ఉన్న వేణుగోపాల స్వామివారి ఆలయానికి వెళ్లాం. ఈయన సంతాన వేణు గోపాలస్వామిగా ప్రసిద్ధి. 
అక్కడనుంచి పేరూరు కి- ఆ ఊళ్లోనే మేం వెళ్లాల్సిన ఫంక్షన్. 
 పేరూరు లో మండువా ఇళ్ల గురించి చెబుతూ ఉంటారు. యూట్యూబ్ లో చాలా వివరంగా కూడా వుంటుంది. 
అయితే, నా అనుభవం ఏమిటి అంటే, ఇక్కడి జన జీవనం లయ బద్ధంగా సాగుతున్నట్లు తోచింది. 
దాదాపు గా అన్ని. యిళ్లూ పెంకుటిళ్లు. సంప్రదాయం ఉట్టిపడుతూ తీరైన యిళ్లు. చెట్టూ, చేమ పెరిగే లోగిళ్లు, ముగ్గులు తీర్చిన వాకిళ్లు, వేదపండితులు ఉన్న ఊరు.  కొన్ని యిళ్లలో నాలుగు తరాలవాళ్లు  ఉండటం గమనించాను. చిన్నతనం లోనే వివాహాలు కావడం వల్ల కాబోలు. 


ఇక అక్కడనుంచి పుణ్యక్షేత్రాల దర్శనం మొదలు. 
"అయినవిల్లి" లో స్వయంభువు అయిన సిద్ధి వినాయకుడు, దగ్గరలోనే 'పళ్ళాలమ్మ' అనే గ్రామదేవత ను దర్శించుకున్నాక, ముక్తీశ్వరం లో, త్రేతాయుగం లో శ్రీరాముడు ప్రతిష్టించిన శ్రీ క్షణముక్తీశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లాం.  ఎంతైనా పురాతన ఆలయాలను చూస్తుంటే దేవుడు ప్రత్యక్షం అయినట్టు వుంటుంది కదా!


అక్కడి వాగులూ, వంకలూ.  దారి పొడుగుతా చూసుకుంటూ ప్రయాణం చేశాం. అనుకోని ఆలశ్యం వల్ల చీకటిపడి, అంతర్వేది లో సముద్రాన్ని, గోదావరిని చూడలేకపోయాను. కాని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శన భాగ్యం మాత్రం చక్కగా దొరికింది. అటునుంచి కాకినాడకు.

కోనసీమ ప్రయాణం-1



నందంపూడి శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయం.

ఒక శుభకార్యాన్ని పురస్కరించుకుని కోనసీమ, ఆ  చుట్టుపక్కల ఉండే ప్రముఖ దేవాలయాలను సందర్శించడానికి  వెళ్లాను.

కొన్ని విశేషాలు మీ కోసం.


మొట్టమొదట వెళ్లినది  నందంపూడి  అనే అగ్రహారానికి. ఈ ఊరికి మొదట్లో ఆనందపురం అనే పేరు ఉండేదట. అందుకు చారిత్రక ఆధారం అక్కడ దొరికిన శాసనాలు.


ఈ అగ్రహారాన్ని పదకొండవ శతాబ్దంలో రాజరాజనరేంద్రుడు, బహుబాషా కోవిదుడు, పండితుడు అయిన  నారాయణభట్టు కి దానం ఇచ్చాడట. అందుకు సంబంధించి  రాయించిన  'దాన శాసనాన్ని' నన్నయ్య శాసనంగా  చెబుతారు. 

ఈ దాన శాసనం రాసినది ఆదికవి నన్నయ్యభట్టు.  నారాయణభట్టు నన్నయ్యకు సమకాలీకుడు, మిత్రుడు లేఖకుడు కూడా.  నన్నయ్య శాసనం గా పేరొందిన ఈ శాసనం  చరిత్ర కు ఆనవాలుగా ఇప్పటికీ వుంది. 


అక్కడో ప్రశస్తమైన శివాలయం చూశాం. 

ఉమారామలింగేశ్వర ఆలయం. 

'నంది శూన్య శివాలయం'. అంటే అన్ని శివాలయాల్లో ఉన్నట్టు నందీశ్వరుడు ఉండడు. తన అనుమతి లేకుండానే శివుడి దర్శనం చేసుకొనే వరం ఇచ్చాడుట నంది.

ఈ శివలింగానికి పానపట్టం ఉండదు. ఆలయం పశ్చిమ ముఖం గా ఉంటుంది.  ఈ ఆలయ తొలి నిర్మాణం కూడా పదకొండవ శతాబ్దానికి చెందినదే.  

మొదట్లో ఒక్క శివప్రతిష్టే జరిగింది.  ఆ ఊర్లో దంపతులకెవరికీ సంతానం కలుగకపోవడం తో దత్తత తెచ్చుకొనేవారట. ఎవరో ఒక స్వామీజీ ఆ ఊరి జమిందారు ఇంటికి వచ్చినపుడు అక్కడి పరిస్థితి ని గమనించి ఆలయం లో పార్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పారుట. అలా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించాక సంతానం కలగడం మొదలైంది. అమ్మవారిని 'సంతాన పార్వతిగా' ప్రఖ్యాతి. ఇతర ప్రాంతాల వారు కూడా సంతానం కోసం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని  ఫలితాలను పొందారని పూజారి శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పుకొచ్చారు.  


ఈ శివలింగం త్రేతాయుగం లో పరశురాముడు ప్రతిష్టించినట్లు అక్కడి శిలాశాసనం ద్వారా తెలుస్తోంది అని చెబుతూ అక్కడి రాతి ద్వారబంధం చూపించారు సుబ్రహ్మణ్య శర్మగారు.  ఆయన చూపించిన రాతి ద్వారబంధం మీద ఉన్న శాసనం చూశా.  అయితే వాటిపైన సున్నం వేశారు. అదృష్టం ఏమిటంటే అది అక్కడా, యిక్కడా పడేయకుండా స్థిరంగా ద్వారబంధం గా ఉండటం. 


ఇటీవల తొలి శాసనం గా చెప్పుకొనే అయిదవ శతాబ్దానికి చెందిన మరో దాన శాసనం కడప జిల్లా లో చెన్నకేశవ ఆలయం లో ఈ మధ్యనే లభించిందనే వార్తను చదివాను.  ఎంతో ప్రయత్నం మీద  అక్కడ నిర్లక్ష్యంగా పడిఉన్న శాసనాన్ని వెతికి మరీ పట్టుకున్నారు.  చరిత్ర కి, వాజ్ఞ్మయ చరిత్రకూ

ఈ శాసనాలు పునాది వంటివి. వీటిని  పరిరక్షించు కోవడం ఎంతైనా అవసరం కదా.

Sunday, 7 December 2025

 ఉదయ రాగం


"ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖతంత్రుల పైన,

జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన....

పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ."


తెల్లవార బోతోందని పక్షులు కిలకిలారావాలు చేస్తాయో,

లేక పక్షుల కలకలలు విని తూర్పున తెల్లవారుతుందో  కాని.. 

పక్షుల కూజితాలతోనే జగతికి 'మెలకువ' వస్తుంది. 

రాత్రంతా అణగారి వున్న గొంతుని విప్పి రెట్డించిన స్వరం తో చేస్తాయి 

ఈ రసనాదం!  విశ్వవ్యాప్తికి ఆది ఈ సునాదం కాబోలు!!


పక్షుల కు సంబంధించిన ఓ పురాణ కథ చదివాను.  ఇంద్రుడు మూడు తలలు ఉన్న విశ్వరూపుడిని చంపినపుడు, ఆ మూడు తలలూ మూడు రకాల పక్షులు గా ఉద్భవించాయిట! కపింజల  ( నీరు తాగే చాతక పక్షులు), కలవింగ(పిచుకలు), తిత్తిరి పక్షులు( కౌజు పిట్టలు)!

యాజ్ఞ్యవల్క్య మహర్షి శాపవశాత్తూ, తను నేర్చుకున్న యజర్వేదాన్ని రుధిరంగా కక్కినపుడు, ఈ తిత్తిరి పక్షులు వాటిని తిన్నాయట. అవి తైత్తరేయోపనిషత్తుగా  వెలువరించాయట-

ఇందులో వేదాంత పరమైన  సూక్ష్మం ఏదో ఉండే ఉంటుంది - పక్షులను ఆత్మకు ప్రతీక గా కూడా చెబుతుంటారు కదా.. అట్లా ఈ పక్షులు తాగేది ఆదిత్యుని ఆధ్యాత్మిక కిరణాలు!  ఇది ఉత్ప్రేక్షే! 

కాని‌ అవసరమైన ఊహ! 


శ్లో. 

ద్వా సుపర్ణా సయుజా సఖాయా

సమానం వృక్షం పరిషస్వజాతే

తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి

అనశ్నన్నన్యో అభిచాకశీతి||

(ముండకోపనిషత్తు 3.1.1)

జీవాత్మ, పరమాత్మలకు ప్రతీకగా పక్షి జంటను చెబుతూన్న ఈ శ్లోకం చాలా మందికి తెలిసిందే!

ఒక చెట్టు మీద వాలిన పక్షి జంటలో 

ఒకటి పళ్ళని ఆస్వాదిస్తూంటుంది. రెండోది నిర్లిప్తంగా చూస్తుంటుంది. ఈ రెండు పక్షులు జీవాత్మ పరమాత్మలకు ప్రతీకలు. చెట్టు శరీరానికి ప్రతీక.

జీవాత్మ కర్మ ఫలాలను అనుభవిస్తుంది.  పరమాత్మకు కర్మలను చెయ్యడం గాని, అనుభవించడం గాని ఉండదు. ఆయన స్సాక్షి మాత్రమే! 

చైతన్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అయిన  పరమాత్మను వదలి,  సంసార సౌఖ్యాలనే 'నీటి బుడగల' కోసం తాపత్రయ పడుతూ వుంటాం అందరమూ.  ఇది  కేవలం 'నీటి బుడగ' అని తెలిస్తే, యిక జన్మ రాహిత్యమే అంటారు పెద్దలు!

Friday, 21 November 2025

ఉదయరాగం

 






 హేమంత ఋతువు

కిందటి వారం దాకా ఉదయాన్నే గంగ వొడ్డున తిరుగుతూ, సూరీడు జారవిడిచిన నారింజరంగు చీరను చుట్టుకున్న గంగమ్మ తరంగాలలో స్నానించిన నాకు.. ఆ వెచ్చదనం ఇంకా స్వప్నం లాగే ఉంది!

ఇప్పుడిక్కడ  చలి బాగా పెరిగింది.. 
ఇక్కడో ఋతువు తెల్లటి పరదా చాటు చేసుకుని ఇళ్లల్లోకి జొరబడిపోయింది.. !
నందివర్ధనం పూవొకటి మంచు చినుకుని ఢీ కొని చెట్టు గుబురు పైనుంచి ఠీవి గా తలెత్తింది..
మాలతీ తీగకు గుత్తులుగా గిన్నె మాలతీలు విరబూసాయి!
బంతులు, చేమంతులు ఈ ఋతువు మాదేనన్నాయి..గర్వంగా!
 --  ఎంతో యిష్టంగా మంచు బిందువులను ముత్యాల్లా ధరించిన లేత గడ్డి పరకలూ.. సరేసరి..వస్తూ వస్తూ శీతాకాలం బహుకరించిన ముత్యాలహారాన్ని గర్వంగా చూస్తూ దక్షిణం వైపుకి తలతిప్పాయి!
 
*"మాసానాం మార్గశీర్షోఽహమ్"*
అని పలికిన  శ్రీకృష్ణుడికి యిష్టమైన *మార్గశిర మాసం!* వచ్చేసింది.

శరదృతువు వెళ్లి హేమంత ఋతువు ప్రవేశించింది. 
ఇది  *శ్రీరామచంద్రుడికి యిష్టమైన ఋతువు!*

*శరదృతువు వెళ్లి నీకిష్టమైన హేమంత ఋతువు ప్రవేశించింది* అని అంటాడు లక్ష్మణుడు శ్రీరాముడితో!"
అరణ్య కాండలో.. అవి శ్రీరాముడు సీతా,లక్ష్మణులతో పంచవటి లో నివాసం ఉన్న రోజులు.. 
శీతాకాలం-
సూర్యుడు చంద్రుడిలా చల్లగా అనిపించే- వెలుగొందే కాలం;
ఉదయం వేళ సూర్య కిరణాలు తెలుపు పసుపు వన్నెలు తిరిగి చల్లగా ఉంటుంది.
పచ్చని గడ్డి పరకల మీద మంచు బిందువులు నిలిచి ముత్యాల్లా మెరుస్తూ వుంటాయి.
పొగమంచు చే కప్పబడిన నదీ జలాల ఉనికి బెగ్గురు పక్షులు తమ కిలకిలారావములతో తెలియచేస్తుంటాయి.
మధ్యాహ్నం వేళలో సూర్యకిరణాల స్పర్శ సుఖాన్నిస్తాయి!  అని అభివర్ణిస్తారు అరణ్యకాండ లో ఆదికవి వాల్మీకి.

అంతే కాదు శీతాకాలం.. భగవత్ చింతన కల వారందరికీ బహుపుణ్య కాలం!
అందరికీ మార్గశిర మాస శుభాకాంక్షలు!🌺🌺🙏

Wednesday, 19 November 2025





 కాశీ వాసం


"పరా, వైఖరీ ప్రయాణమైనాయి

 ఆయన రూపం చూచి వచ్చి చెబుదామని

 సింధువు చూడాలని గంగ వెళ్లినట్లు."

(అమృతానుభవం-  జ్ఞానదేవ్)

సరిగ్గా అందరం ఇంతే..  కాశీవాసానంతరం ఏదైతే వుందని అనుకుంటామో.. అదీ లుప్తమైపోతుంది!

తొమ్మిది రోజుల కాశీవాసం తరువాత మొన్న శనివారం15th November'25- సాయంత్రం తిరిగి వచ్చాను. 

గంగా స్నానం, డూంఢి గణపతిని,సాక్షి గణపతిని వేడుకుంటూ--కాశీ విశ్వనాథుడు, విశాలక్షీ,అన్నపూర్ణలను దర్శించుకోవడం. 

"సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో.."  -

విశ్వనాథుని సందర్శన కోసం విధిగా సాగించిన నడక ప్రదక్షిణ కాగా, మేమాడుకునే మాటలన్నీ స్తోత్రాలే అయి; ఆనందవనమనే కాశీ సందర్శనం లో  మనసూ శరీరం మరో ఆలోచన లేని స్థితి కి వచ్చేస్తాయి. 

ఇక పోతే, సత్రం లో భోజనం, మఠంలో అలుపెరగని నిద్ర .. ఇదండీ మా నిత్యకృత్యం. చూడదగ్గ వన్నీ చాలా వరకు చూశాం .. శ్రీనాథు మహాశయుడు అన్నట్టు‘ప్రాయమింతకు మిగుల గై వ్రాలకుండ’ ఇప్పుడైతే తిరగాను కాని, ఇకముందు శివయ్య దయ!🙏🌺🌺


Wednesday, 5 November 2025

ఉదయ రాగం


ఉదయ రాగం.


శరత్పూర్ణిమ


రావే రాధ రాణి రావే..

రాధ నీవే కృష్ణుడు నేనే ..

రమ్యమైన శారద రాత్రి..

రాసలీల వేళ యిదే !

రాసలీల వేళ యిదే !


అవునండీ.. సినిమా పాటే.. నాకూ ఈ నాలుగు ముక్కలకు మించి గుర్తులేదు‌.‌ కాని శారద రాత్రి గురించి ఓ చక్కని  పాట కాదా..ఈ శరత్కాలం అంతా వెన్నెల వేళలదీను.

రాస లీలా వేళ యిదే..!


అలనాడు శ్రీకృష్ణుడు శరత్పూర్ణిమ రోజున బృందావనం లో జరిపే రాసకేళి..పోతన భాగవతం లో అద్భుతంగా వర్ణించారు.


కర్ణావతంసిత కర్ణికారప్రభ;

గండభాగద్యుతిఁ గడలుకొలుప

భువనమోహనమైన భ్రూవిలాసంబుతో;

వామభాగానతవదన మొప్ప

నపసవ్యకర మృదులాంగుళీ చాతురి;

షడ్జధ్వనికి మర్మసరణిఁ జూప

డాకాలిమీఁద నడ్డము చాఁచి నిల్పిన;

పదనఖద్యుతి భూమిఁ బ్రబ్బికొనఁగ


మౌళిపింఛముఁ గంఠదామమును మెఱయ

విలసితగ్రామముగ నొక్క వేణువందు

బ్రహ్మగాంధర్వగీతంబు పరఁగఁ జేసెఁ

జతురనటమూర్తి గోపాలచక్రవర్తి.


అలా బృందావనం లో.. 

తెల్లటి శరద్రాత్రి వెన్నెల పరచుకుని ఉండగా..

శ్రీకృష్ణుడు వేణువు ఊదడం మొదలు పెట్టాడు... 

మంద్రంగా మొదలై.. 

మధ్యమ,తార స్థాయిలలో రాగాలాపనలు చేస్తూ.....  

స్వరాలు.. కళలూ, జాతులూ, ఆరోహాణా..అవరోహణములు తెలిపేటట్లు అవ్యక్త మధురంగా సాగింది ఆ వేణు గానం. 

ఆ మధుర మంజుల నాదానికి గోపస్త్రీ లంతా బిలబిల లాడుతూ  వచ్చారు.  ఆనాటి బృందావనంలో.. అది శ్రీ కృష్ణుని రసరమ్య రాసకేళి..!


ఆతని మధుర మంజుల వేణుగానం వినడానికి  ఉత్సుకతతో ఓ నాడు కైలాస పర్వతం మీద తపస్సు వీడి, శివుడు వస్తాడుట.  అదీ అందమైన గోపస్త్రీ రూపం లో వచ్చి నృత్యం చేస్తాడు.. 

వేణుగానానికి పోటీయా అన్నట్టుండే విధంగా!

పున్నమి వెన్నెల తో  సాటి అన్న చందాన వెన్నలాటి తెలుపు- లావణ్యం కల 'శివుడు' చేసే ఆ నృత్యం- లాస్యం అనాలేమో-

అందరినీ ముగ్దులను చేస్తుంది. 

మరేమో.. గోపికా రూపధారి శివుని మూడోకన్ను పట్టి యిచ్చేస్తుందిట!

శ్రీకృష్ణుడూ వచ్చినదెవరో గ్రహించి నమస్కరిస్తాడుట. ఆవిధంగా శివుడు గోపీశ్వరుడు అయ్యాడట! అందుకు నిదర్శనం గా కృష్ణుని మునిమనుమడు వజ్రనాభుడు కట్టించిన మహదేవుని ఆలయం  'గోపేశ్వర్ మహదేవ్' మందిరం ఉత్తరాఖండ్ లో ఉంది. 


మనకు ఈ సారి నవంబర్ నెల రాకుండానే 

సగం రుతువు అయిపోయింది. అదీ కాకుండా అకాల వర్షాలు..

ఇవాళ చంద్రుడు కనబడతాడా అన్నది సందేహమే..! 

అయినా పగటి వెన్నెలలాటి శరత్కాలం ఇంకా పదిహేను రోజులు వుంది. ఆనక వచ్చే హేమంతం లోనూ చలిగాలులకి శరీరం ముడుచుకు పోతున్నా, మనసున మాత్రం ఆధ్యాత్మిక చింతన మరింత ధృఢమై శివవకేశవులను ఆరాధన కొనసాగుతూనే వుంటుంది.




Friday, 31 October 2025


 ఉదయ రాగం..


అక్టోబర్ నెల..

ఇవాళ్టి తో అక్టోబర్ నెల వెళ్లి పోతోంది

ఏవో కాసిని ఉదయరాగం కబుర్లు..

అమెరికా లో అయితే.. ఇది 'ఫాల్' సీజన్

ఇక చూడండీ.. చెట్లన్నీ రకరకాల రంగులతో  వింత శోభతో వెలిగిపోతూ ఉంటాయిట! ఇటువంటి చోట.. అక్టోబర్ నెలలో గడిపినందుకు అక్కడివారూ చాలా మురిసి పోతూంటారు..

మరి మనఁవో..?

మనకి అక్టోబర్ నెల లో శరద్రుతువు  మొదలు కదా.. ఈ నెల శేఫాలికలది- అదే  పారిజాతాలండీ! సంస్కృతం లో శేఫాలికలు అంటారట.

అక్టోబర్ లో మొదలై చలికాలం అంతా పూస్తాయి కదా..

ఈ చలికాలం అంతా పారిజాత పూల సందడే! 

ఎర్రని కాడ, తెల్లని రేకలు-- నింగికి ఎగిసేంత పరిమళమూను..

రాత్రి పూసిన పూలన్నీ ఉదయానికి వొత్తుగా రాలి  భూదేవిని అలరిస్తాయీ పారిజాతాలు!

"ఏ దివిలో విరిసిన పారిజాతమో " అన్నారు కదా సినీకవి.. 

ఆ శ్రీకృష్ణు తెచ్చి నాటినదే..

ఆ ఇంద్రుడి నందనవనం నుంచి తెచ్చినదే!

"పౌలోమి పార్వతి పద్మ పద్మజురాణి యును శిరంబునఁ దాల్తు రనుదినంబు"

అంటూ వర్ణించి మరీ యిస్తాడు నారద ముని. నంది తిమ్మన పారిజాతాపహరణ కావ్యం లో ! 

ఆ తర్వాత సత్యభామ అలక వగైరా -  ఆనక పారిజాతాపహరణం !

ఆ తర్వాతే

 "రుక్మిణీ సత్యభామాభ్యం సహితం  కృష్ణమాశ్రయే"

అనుకున్నాయిట పారిజాతాలూను..

పారిజాతాల గురించి చెబుతుంటే నాకు  కొన్నాళ్ల కిందట 'ఒటిటి' లో  చూసిన సినిమా ఒకటి గుర్తుకు వచ్చింది.  

ఒకమ్మాయి ప్రమాదవశాత్తూ మేడ పైనుండి కింద పడిపోతుంది. తలకి దెబ్బ తగలడం తో కోమాలోకి వెళ్లిపోతుంది.  ఆ అమ్మాయి స్నేహితుడు- కాస్తంత వెర్రిబాగుల వాడే..పడిపోయే ముందు తన గురించి అడిగిందని బాధపడతాడు-- 

ఈ అమ్మాయికి, పారిజాత పూలంటే చాలా యిష్టం. అలా అని దోశెడు పూలను ఏరుకొచ్చి.. ఐసియు లో- కోమా లో ఉన్న ఆమె గదిలోకి ఎవరూ చూడకుండ వెళ్లి.. ఈ పూలను దగ్గర గా పెడతాడు.. 

ఏదో వెర్రిపిల్లాడి ఆలోచన! 

కాని గమ్మత్తుగా.. ఆ సువాసన తగిలి ఆమెలో కదలిక వస్తుంది.

మెలకువా వస్తుంది..చాలా సున్నితమైన కథాంశం..

అందమైన శెఫాలికల కథ.  బెంగాలీయులకి ఈ 'శేఫాలిక' రాష్ట్రీయ పుష్పంట. 


Monday, 20 October 2025


 *ఉదయరాగం*


"కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...

తరుణం కాని తరుణంలో... "

'ఈ పూల చిగురింతలేలనో..! 😀

'వసంత ఋతువా... రానేలే..దు!'


'అప్పుచేసి పప్పుకూడు'- అవును ఆ సినిమా లో పాటే అప్పు తీసుకున్నా..


మల్లె మొగ్గలూ .. 

కోయిల గొంతు ...

'కోయిలేనా..?'

' అవును.  తింటూన్నదేదో గొంతుకు అడ్డం పడిందేమో.. పొలమరించినట్టు.. స్వరం ..'

చూడ బోతే,

ఒక్క గెంతు లో గుబురాకుల మధ్యలోకి.. మాయం!

రుతు సంహారం-  రుతువుల తీపి కలయిక- 

A sweet medley of seasons!

Wednesday, 15 October 2025



ఉదయ రాగం

🍂🍁

నా ఉదయపు నడక లో 

ఈ రాలిన  'పున్నగ పూలని' ఏరుకున్నా దారిలో.. 

 ఎంత పరిమళం! 

ఏరుకున్నది పూలను కాదు కొన్ని ఆనంద క్షణాలు- without any attachment..


'dedicating the first hours of the day to 'puttering'- makes me smarter and improve the energy levels all day long'- 

Jeff Bezos,the Amazon founder.


ఉదయాన్నే ఫోన్ ని పక్కన పెట్టి, ఓ గంట సేపు చేసే కాలక్షేపమే 'puttering'- 

అదీ ఆహ్లాదకరమైన పనే..

అంటే నిర్దిష్టంగా ఈ పని అని కాకుండా.. 

ఏ  పనైనా చేయడం- నిదానంగా కాఫీ తాగడం, పేపర్ తిరగేయడం కూడా ఈ కోవ లోకే వస్తాయి.

మరేమో నేనైతే దీన్ని 'me time' అన్నాను.


ఎక్కడో కనిపించకుండా పక్షి పిలుపు..!

గాల్లో గిరికాలు కొడుతూ.. రాలుతూన్న పండాకు !

 "పతితైః పతమానైశ్చ."  రామాయణ శ్లోకం గుర్తుకొస్తుంది యెప్పుడూ!

ఇలా రాలినవి, రాలబోతున్న పూలను చూసి.. 'సమీరుడు ఈ పూలతో ఆడుకుంటున్నాడా అన్నట్టు ఉంది కదా ...!' అంటాడు శ్రీరాముడు లక్ష్మణుడితో.


"పతితైః పతమానైశ్చ పాదపస్థైశ్చ మారుతః

కుసుమైః పశ్య సౌమిత్రే!  క్రీడన్నివ సమంతతః"


అది ఎటువంటి సమయం! అరణ్యం లో సీతా వియోగం తో గడుపుతున్న కాలం.

అయినా ఆ క్షణం గురించి.. ఆ చిన్ని, చిన్ని ఆనందాల గురించి వాల్మీకి చెబుతూనే ఉంటారు.. ' సీతే వుంటే..!' అన్న ఊహతో బాటు రాముణ్ణి మరింత కర్తవ్యం దిశ గా ఆలోచింప చేస్తూ ఉంటాయి..!


శుభోదయం అందరికీ🙏🌷🌷🌷