Sunday, 27 January 2019

గయ లో మా అనుభవాలు

22/11/2018

అయోధ్యలో ట్రైన్ గంటన్నర ఆలస్యం!  అలా మరో గంట పొడిగింపు. చివరకి ట్రైన్ వచ్చింది. మాది స్లీపర్ కోచ్.. ఈమధ్య అలవాటు తప్పిందేమో, లోపల ఉన్న చెత్త అదీ,  సర్దుకోవడానికి సమయం పట్టింది. అందరి పరిస్థితి అదే. ‌

మర్నాడు గయ స్టేషను లో మాకెవరికీ లగేజ్ మోసే ఓపిక లేక పోర్టర్ ని పిలిచిచాం‌‌‌‌... Where would you like to go ... అంటూ కాస్త సర్ప్రైజ్  చేస్తూ, ఓ మధ్యవయసు పోర్టర్ బేరం ఆడాడు.  బయటకు వచ్చాక మేం వెళ్లవలసిన చోటికి తనే ఆటోలు మాట్లాడిపెట్టాడు.

మా బాంక్ హాలిడే హోమ్స్ అక్కడి కి, అంటే స్టేషన్ కు చాలా దూరంలో ఉన్న బుద్దగయ లొ ఉన్నాయి. వెళ్లడానికి  దాదాపు ముప్పావు గంట పట్టింది.  మా ప్లాన్ ప్రకారం ఆరోజు దర్శనాలు అవీ పూర్తి చేసుకొని, ఆ రాత్రి కే కాశీ కి ట్రైన్.  మేం వచ్చిన ఆటోల వాళ్ల తోనే మొత్తం డీల్ మాటాడుకున్నాం. అన్నీ తిప్పి, తిరిగి రైల్వేస్టేషన్ లో దింపాలని.  అలాగే ఫ్రెషప్ అయి బయలు దేరాం..

అష్టాదశ శక్తి పీఠాల లో వరుస క్రమంలో పదాహారవ ది గయ లోని మాంగల్య గౌరీ శక్తి పీఠం. సతీ దేవి స్తన భాగం ఇక్కడ పడిందని పురాణం. సర్వ మంగళ మాంగల్యే...శివే సర్వార్ధ సాధకే త్రయంబకే ,దేవీ నారాయాణి నమోస్తుతే...!

మొదట మాంగల్య గౌరీదేవి దర్శనం. కొంచెం క్యూ ఉంది. కాని దర్శనం బాగానే అయింది. ఒక చిన్న గుడారపు ఇల్లు లా కిందికి వుంటుంది.ద్వారబంధం దగ్గర, గర్భగుడిలో బాగా వంగి వెళ్లాలి. లోపల  హారతి  వెలుగు లోనే అమ్మవారిని దర్శించుకొన్నాం.

అటునుంచి గయ. ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే వారు ఉత్తమ గతులు పొందుతారని, వారికి మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం.  గయుడు అవడానికి రాక్షసుడైనా, విష్ణు భక్తుడుట. విష్ణుమూర్తి వల్ల వరం పొందుతాడు. మూడు భాగాలుగా విష్ణుమూర్తి చే ఖండింప బడిన గయుని శరీర భాగాలలో, శిరస్సు బీహార్ లో గయ లోను, నాభి భాగం ఒరిస్సాలో జాజి పూర్ లోను, పాదాలు  ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం లో  పడ్డాయని పురాణం. ఇక్కడ  విష్ణుమూర్తి పాదం మోపిన స్థలం కనుక, విష్ణుపాద ఆలయం ఉంది. ఆ పక్కనే పిండప్రదాన కార్యక్రమాలు జరుగుతాయి.

మా గ్రూప్ లో  ఓ ఇద్దరు ఈ కార్యక్రమాలు అవీ చేయించు కోవాలని అక్కడ ఆంధ్రాశ్రమానికి వెళ్లాం. వాళ్ళు ఇందుకొసం ఓ పండిట్ ని మాట్లాడారు. అక్కడి అతనే.
వాళ్లిద్దరూ ఆ పనిలో ఉండగా, మిగతా వాళ్లం ఆలయం లోపలి కి వెళ్లాం.  'శుభ్రత' అంటే ఏమిటి అన్నట్లు ఉంది లోపల . అంతా,తడి మట్టి కాళ్లతో వస్తున్నారేమో గర్భాలయం కూడా జారుడు గా ఉంది.  విష్ణు పాదం దగ్గర వంగి దండం పెడుతూంటే, ఉన్నట్టుండి తోపులాట..నేను పైకివలేవలేక పోయాను చాలా సేపు.
ఆ తర్వాత వెనక అశ్వత్థ వృక్షం ఉంటే..వెళ్ళి చూశాము. పచ్చని చెట్టు.. పక్షులు వాలి పైన సందడి చేస్తున్నాయి... కాని కింద మనుషులు చేసిన ధ్వంసం... ఎవరికి చెప్పుకోను నా సంగతి అని అడుగుతున్నట్టు ఉంది.  దీనికి ప్రబలమైన కారణం ఉంది. దేశం మొత్తం  హిందువులు అంతా విధిగా  గయ లో పిండ ప్రదానం చేస్తారు. అందువల్ల యాత్రీకుల తాకిడి విపరీతం. ఇలా కాక మరెలా ఉంటుంది అనిపించింది.

వెనక కు వెళ్ళి నపుడు ఫల్గూ నది కి దారి అని బోర్డు చూసి వెళ్లబోతుంటే..నది అని పేరేకాని, నీళ్ళు లేవు అన్నారు. అయ్యో అని ఆగి పోయాం. ఇవతలకు వచ్చాక మా ఆటో అతను, పేరు 'మనోజ్ పాండే',  అసలు మీరు చూడాల్సిన ప్రదేశం ఇదే  అని చెప్పి మాకు  స్థల పురాణం చెప్పాడు.
సీత,లక్ష్మణ సమేతంగా శ్రీ రాముడు వచ్చి అక్కడ తన తండ్రి దశరథునికి ఉత్తర క్రియలు చేయడానికి వచ్చాడట. రామలక్ష్మణులు స్నానానికని వెళ్ళి నపుడు, దశరథుని చేతులు రెండు సీతముందు కనిపించి తాను చాలా ఆకలిగా ఉన్నానని రామునికి బదులుగా పిండం ప్రదానం చెయ్యమని సీతను అడుగగా , సీతాదేవి పిండములు తీసి ఆచేతులలో ఉంచిందిట. తరువాత శ్రీ రాముడు రాగానే సీతాదేవి ఆవిషయం చెబితే రాముడు ఆశ్చర్యపడతాడు..సాక్ష్యం చెప్పడానికి పిలిస్తే నదీ పలకదు, అక్కడ గోమాతా ఉలకదు..బ్రాహ్మడు కూడా ఏం మాడ్లాడడు. కాని అక్జడి రావి చెట్టు సాక్ష్యం ఇస్తుంది. అపుడు సీతాదేవి కోపంతో శపిస్తుంది ట. నదిని శాశ్వతంగా ఎండిపొమ్మని, అక్కడి బ్రాహ్మలంతా కక్కుర్తి తో ఎప్పటికీ ఒకరి ముందు చేయి చాచే ఉంటారని...(ఏదో తీవ్రమైన పదం వాడాడు హిందీలో)... ఈ చివరి మాట అంటూంటే పాండే గొంతు మారిపోయింది.. కొద్దిగా జీర. అవును. అతను 'పండిట్' అని మరో ఆటో డ్రైవర్ చెప్పాడు. అతనితో అందరం ఎండిన ఫల్గునీ నదిని చూశాం.
పురాణ కథ మాటేమోగాని ఆ దృశ్యం..  ఇంకా మా పాండే ను గమనించాక  ఎంతో బాధ కలిగింది.  పండాలు పీడిస్తారు అని ఈసడించుకొంటూనే ఉంటారు కదా..

 ఇలాగే ద్వారక వెళ్లినపుడు ఓ పండిట్ అన్నాడు.
'మీకు తోచిన దక్షిణ ఇవ్వండి. కాని ఇక్కడి పండిట్ లు పీడిస్తారని బయట కు వెళ్ళి అనకండి' అని. మనం కొన్ని కొన్ని సందర్భాలలో పెట్టే ఖర్చు తో పోలిస్తే,ఇంత దూరం వచ్చి కాస్త వితరణ చూపిస్తే ఏం  అని అనిపించింది.
సరే ,రావి చెట్టు ను చూశారా.‌‌..సీతమ్మ దగ్గర శాశ్వతత్వ..వరం పొందింది కానీ...మనఁవే బతకనిచ్చేట్టు లేం.

అక్కడ్నుంచి బోధగయ. ఇక్కడ మాత్రం లోపలికి ఫోన్లు కెమెరాలు ఏమీ అనుమతించరు. గట్టి నిఘా ఉంది.
ఆ రోజు నవంబర్ 22 వ తారీఖు. పౌర్ణమి ఘడియలు వచ్చేయేమో, చల్లగా, ప్రశాంతంగా ఉంది. ఎత్తైన మెట్లు. దిగి వెళ్లాలి.  అక్కడనుంచే లోపలి బంగారు బుద్ద విగ్రహం దర్శనం అయింది. పెద్ద క్యూ . బుద్ధదేవుడుని మనసులో నే స్మరిస్తూ లోపలికి వెళ్లాం.

లోపలంతా చాలామంది బౌద్ధులు ప్రార్థనలు చేసుకొంటున్నారు వెనక ఉన్న బోధి వృక్షం దగ్గర కూడా చాలా మంది ఏదో జపిస్తూ ఉన్నారు.   బోధిచెట్టుకు  చుట్టూ ఇనుప కంచె.  కూర్చుందుకు కూడా స్ధలం లేదు.  అలా నిలబడే చూస్తూ.. ఇది  బుద్దభగవానుడు నడిచిన పవిత్ర స్థలం కదా అనుకోగానే మనసుకు కలిగిన పరవశం ..ఏం చెప్పను.
బుద్దుని బోధనల లాటి లోతైన విషయాలు..తాత్వికత  గురించి నేను చెప్పలేను కాని,  చిన్నప్పటి నుంచీ విన్న బుద్ధుని కధలు, బుద్ధభగవానుని పట్ల పెంచుకొన్న ఆరాధన.
"కోరికలే దుఃఖానికి మూలకారణం" అని  ఎంతో పదిలంగా చిన్నపుడు నోట్ బుక్ లో రాసుకొన్న కొటేషన్. ఆ నిమిషం లోనే అన్నీ గుర్తుకొచ్చాయి.  కొన్ని సెకన్ల పాటు ఆ జ్ఞాన మూర్తి కి మనసు లోనే నమస్కరించి బయటకు వచ్చా అందరితో కలసి.
ఆ ప్రదేశాన్ని అంత త్వరగా వదలడానికి మనస్కరించలేదు. కాని, మేము ఆ రాత్రికే  ట్రైన్ లో కాశీ కి వెళ్లాలి. తప్పదు కదా.
అకడ్నుంచి మళ్ళీ పరుగు. గెస్ట్ హౌస్ కి వెళ్ళి లగేజ్ తెచ్చుకొని తిరిగి అవే ఆటోల్లో స్టేషను కు. చిరునవ్వు తో మాకూడా ఉన్న ఆ ఆటో డ్రైవర్స్...ముఖ్యంగా నేను ఎక్కిన...ఆటో లో మనోజ్ పాండే ని మాత్రం మరచిపోలేను.











No comments:

Post a Comment