Thursday, 16 February 2017

నా ఒరిస్సా యాత్ర విశేషాలు.

 విశాఖ లో అన్నాళ్లు ఉన్నా పూరి జగన్నాథుని చూడటం పడలేదు. మరి టైమ్ రావాలంటారు కదా...

నేను మరో ఇద్దరు ఫ్రండ్స్ కలిసి ఓరోజు పర్యాటక్ భవన్ కి వెళ్లాం. ఒరిస్సా టూరిజం సెక్షన్ లో మాట్లాడి...భువనేశ్వర్, పూరి,కొనార్క్, జాజిపూర్ సందర్శించేందుకు మూడు రాత్రిళ్ళు, నాలుగు పగళ్ల తో కూడిన పాకేజ్  టూర్ ఒకటి ఖరారు చేసుకొన్నాం. ఆ తర్వాత ఆన్ లైన్లో భువనేశ్వర్ డైరక్టుగా ఫ్లైట్ కు  టికెట్స్ తీసుకొన్నాం.

 మొదటి రోజు-ఎయిర్‌పోర్టు దగ్గర పికప్. హోటల్ అకామిడేషన్..బ్రేక్ఫాస్ట్ తర్వాత లోకల్, అంటే భువనేశ్వర్ లో రాజారాణి,ముక్తేశ్వర,లింగరాజ్  ఆలయాలూ,ఉదయగిరి, ఖందగిరి కేవ్స్...చూశాం. విలక్షణమైన శిల్పకళ గల ఆలయాలు దాదాపుగా పది,పదకొండు శతాబ్దాలనాటివి. కేవ్స్ మాత్రం రెండు, మూడు శతాబ్దాల నాటివి. గౌతమీపుత్ర శాతకర్ణి కాలాం నాటి inscrptions ..కేవ్ ఆర్ట్ చూసి ఆనందిస్తూ..అవి చదవడం (study) రాదు కదా అని అక్కడ బోర్డు పై ఉన్న వివరాలతో సంతృప్తి చెందాం.

భువనేశ్వర్లో ముఖ్యమైన ఆలయం 'లింగరాజ్' ఆలయం. సాండ్ స్టోన్ ఉపయోగించి కట్టిన 55 అడుగుల ఎత్తైన మందిరం. లోపలికి సెల్ ఫోన్లు,కెమేరాలు అనుమతించలేదు. ఈ ఆలయం విశేషం  ఏమిటంటే హరి,హరులిద్దరూ గర్భాలయంలో పూజలందుకొంటారు. ధ్వజస్థంభం పై కూడా నంది,గరుడులుంటారు. పండా సాయంతో ఏదో చిన్న పూజ.-మా చేత సంకల్పం చెప్పించాడు. మరీ ఎక్కువ దక్షిణ ఆశించలేదు. ఇచ్చినది తీసుకొన్నాడు.

 తర్వాత రాజా-రాణి మందిరం. ముక్తేశ్వరాలయం లో...చక్కగా పోటోలు తీసుకొని...మా ఫోటొగ్రఫీ కళ చూసుకుని మురిసిపోయాం. సోమవారం శలవు కావటం చేత మ్యూజియం, జూ చూడలేక పోయాం ప్రోగ్రాం లో ఉన్నప్పటికీ.

ఆ మర్నాడు బ్రేక్‌ఫాస్టు తర్వాత హోటల్‌ గది ఖాళీ చేసి....కొణార్క్ టెంపుల్ చూడ్డానికి బయల్దేరాం. దారిలో ధౌలి హిల్స్ పైన ఉన్న బుద్ధుని విగ్రహం,శాంతి స్తూపం చూశాం. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు పరివర్తన చెంది బౌద్ధం స్వీకరించాడు...ఈ శాంతి స్తూపం  కట్టించాడు. ఇది మూడవ శతాబ్దానికి చెందినది.  
అక్కడనించి ఇక ఎన్నాళ్ళగానో  చూద్దామని, చూడవీలు లేకపోయిన..కోణార్క్ టెంపుల్..దీని చుట్టూ అల్లబడిన అద్భుత భావ తరంగాలు..ఊహించుకొంటూ సాగింది కారు ప్రయాణం. 13వ శతాబ్దానికి చెందిన ఈ సూర్యదేవాలయం రధం ఆకారంలో ఉండి, ఏడు గుర్రాలు(శిధిలమయ్యాయి), ఇరవై నాలుగు చక్రాలతో ఉన్న ఈ మాన్యుమెంటు చూడగానే ఆకట్టుకొంది. అసలు ఈ శిల్పవైభవం చూడడానికి ఎంత సమయం వెచ్చించినా సరిపోదు. ఏనుగులు, గుర్రాలు, నాట్యం చేసేహాలు...నర్తకీ మణుల,వాద్యకారుల శిల్పాలు..ఇంకా  ఒక స్థాయిలో శృంగారభంగిమలు ..మొత్తం గా ఎటు చూసినా రాతి చెక్కడాలు పలుకరిస్తున్నట్లు, ఏదో మార్మికరహస్యం(mystical secret) చెపుతున్నట్టు ఉంటుంది.
Ayn Rand 'Fountain head' నవలలో ఆర్కిటెక్ట్ అయిన హీరో కి ఒక టెంపుల్ఎ కట్టేపని ఇస్తారు. చక్కటి డిజైన్ తో తన స్నేహిఓ న్యూడ్ బొమ్మను పెట్టి చక్కని మందిరం నిర్మిస్తాడు. గుడికి బదులు ఇటువంటి కట్టడంపై అతన్ని ప్రాసిక్యూట్ధి చేస్తారు. ఆ భావదారిద్ర్యం ఇక్కడ లేదు. శిల్పులు ఎంతో స్వేచ్ఛగా మందిరనిర్మాణం చేశారు.

చాలా మటుకు రిపేర్ వర్క్ నడుస్తోంది.  శిధిలమైనా ఇరవై నాలుగు రధచక్రాలతో  ఈ ఆలయం ఎంత ఠీవిగా ఉందంటే,  యుద్ధ భూమిలో నేలకొరుగుతున్నా పరాక్రమం తగ్గని వీరుడిలా.
ఇందాకాటిలాగే ఫోటో సెషన్...భంగిమ ఒన్...భంగిమ టూ..అన్నట్టు పోటోలు దిగాం...సెల్ఫీలు కూడా.

పూరీ బీచ్..రిసార్ట్‌ కి తిరుగు ప్రయాణం. రిసార్ట్‌ కి వెనుకవైపే బీచ్. రిఫ్రెష్ అయి బీ చ్ కి వెళ్లాం. పున్నమి దగ్గర్లో ఉన్నందువల్ల చంద్రుడి అందం...సముద్రం హోరు చక్కగా ఎంజాయ్ చేశాం.

మూడవరోజు,ఉదయాన్నే పూరి జగన్నాథుని ఆలయానికి...ఘనంగా జరిగే రధయాత్ర, ఆ స్వామి గురించి వినడం తప్ప...అంచనా లేదు. మేం వెళ్ళిన సమయంలో భోగం-నైవేద్యం- జరుగుతున్నందున ఓ గంట పైనే వేచి చూడాల్సి వచ్చింది. ప్రాంగణంలో ఉన్న గుళ్లన్నీ తిరిగి చూసి , జగన్నాధ దర్శనానికి వెళ్లాం. కొంత. జనం ఉన్నా సంతృప్తికరంగా అయింది దర్శనం. ఇక్కడ కూడా కెమేరాలు అనుమంతించక పోవడం తో బయటనుండే ఫోటో ఒకటి  తీసుకొని. తిరిగి హొటల్ లో బ్రేక్‌ఫాస్టు చేసి, చిలుకాలేక్ రైడ్ కి వెళ్లాం.

చిలుకా లేక్ విస్తీర్ణం 116,500 hectares . మొత్తం నాలుగు గంటలు ప్రయాణం. మోటారు ఉన్న గూటి పడవ మాకే ఎక్సక్లూజివ్. ఇహ మా సంతోషం అంతా,ఇంతా కాదు. పడవవాడు చెప్పినట్లు స్ట్రాటజిక్ పోజిషన్స్ లో కూర్చున్నాం మా స్మార్ట్ ఫోన్ ల తో.
నీరు ఎంత తేటగా ఉందో...పడవ అలా దూసుకు పోతుంటే..మనసు గాలిలో తేలిపోతుంటే.... అందరికీ ఇలాంటప్పుడు గుర్తొచ్చే పాట ఒకటే.

      " కొండగాలి తిరిగింది....గుండె            ఊసులాడింది"

మాలో ఎవరికీ సరిగ్గా రాకపోయినా, ఏవో కూనిరాగాలు తీశాం.

ఈ సరస్సు శీతకాలం లో వచ్చే అరుదైన వలస పక్షులకు ప్రసిద్ధి. అలాగే చేపల పెంపకంకూడా. అరుదైన Irrawady Dolphins గురించి కూడా రాశారు కాని మాకు కనిపించలేదు ...పడవాడు "ఓ...ఓ దేఖో.." అంటూ నే ఉన్నాడు.ఎక్కడా కనబడితేగా..?!

 మైగ్రేటరీ బర్డ్స్ చాలా తగ్గిపోయాయి. కొన్ని ఉన్నా మా బుల్లి కెమారా షాట్స్ కి అందలేదు. కాని నాలుగు గంటలు మోటార్ పడవ ప్రయాణం మాత్రం గొప్ప అనుభూతి నిచ్చింది.

నాల్గవ రోజు  జాజిపూర్ -గిరిజాదేవి శక్తిపీఠం ప్రోగ్రాం . వాళ్లు భిరజాదేవి అంటారట . బయల్దేరుతుంటే   ..చాలా మెట్లు ఎక్కాలని ఎవరో అనగానే గుండెల్లో రాయిపడింది. ఇంటర్నెట్ సరిగాలేదు సమాచారం కోసం చూద్దామంటే. అమ్మవారి దయవల్ల మామూలుగా నే ఉంది టెంపుల్. అమ్మవారి ఆభరణాలలో వడ్యాణం అక్కడ పడిందిట. అలాగే గయుడి నాభి అక్కడ పడటంవల్ల నాభిగయ అంటారని పురాణకధ. చక్కగా దర్శనం అయింది. అష్టాదశ శక్తిపీఠాలలో ఇది పదకొండవ ది. ఇకపై మిగతా శక్తి పీఠాలలో నేనింకా దర్శించ వలసినవి మూడే. అదో సంతృప్తి. కారణం లేదు.

ఇక భువనేశ్వర్ కి తిరుగు ప్రయాణం. సాయంత్రందాకా ట్రైన్ కి చాలా టైమ్ ఉండటంవల్ల దారిలో పట్కారి ఆర్ట్ గ్రామం చూశాం. వాళ్ళు  అక్కడ వస్త్రం పై సహజ రంగులు ఉపయోగించి దేవి,దేవతా చిత్రాలు, పురాణ ఘట్టాలు చిత్రిస్తారు. మన హైటెక్ సిటీ లో కూడా ఎగ్జిబిషన్ లో పెడతారుట. తర్వాత భువనేశ్వర్ లో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ చూసి, నచ్చినవి ఒకటి,రెండు  కొని తిరుగు ప్రయాణం అయ్యాం.

మొత్తం మీద ట్రిప్ బాగా జరిగింది.
 నా ఫ్రండ్స్ సుశ్రీ, శ్యామల గార్లు పాటించిన కొన్ని మెలుకువలు వల్ల ప్రయాణం  సౌకర్యం గా సాగింది.