Friday, 8 January 2021

lockdown-musings



రాతి పూలు

అహములు సన్నములయ్యెను

దహనము హితమయ్యె, దీర్ఘదశలయ్యె నిశల్

 బహుశీతోపేతంబయి

యుహుహూ యని వఁడకె లోక ముర్వీనాథా!

-పోతన భాగవతం

ఇదీ చలి ప్రభావం.  రెండురోజులగా మరీ వణికిస్తోంది. ముసురు పట్టి మరీను. కాళ్లకు రాసిన లేపనం కరిగి  అప్పుడే ఏడాది కావస్తోంది.  దారులన్నీ మూతబడ్డాయి. 

అంచేత... ఉన్న చోటే గోపురం.. ! మానస సంచరమే సంచారం. లోలోపలే 'కొలంబస్' లా దారులు వెతుక్కుంటూ!ఉదయపు నడక కూడా డాబాపైకి మారిపోయింది నాకు.

మా ఇంటి పరిసరాలలో నే  ఓ చిన్న కొండ, దాని పైన దుర్గ గుడి. ఈ గుట్ట చుట్టూ కోటలా  పెద్ద పెద్ద రాతిబండలు...!

రోజూ చూస్తున్న దృశ్యాలే... 

సూర్యుడు వస్తాడు- రాడు. పందెమా.. ఎదురు చూపులు.

ఎండాకాలం పచ్చగా,ఎర్రగా మెరిసిపోయే  ఆ  రాతి బండలు, వర్షాకాలం అభిషేకం జరిపించుకుంటాయి. మంచు కమ్మినపుడో... మార్మికత ను తమలోనే దాచుకున్న మునులే అవుతాయి.  

అప్పుడు కురిసిన వర్షాలకి, ఆ కొండ ప్రాంతం పచ్చదనం తో నిండి 'మినీ' శ్రీశైలం లా ఉండేది మా డాబా మీంచి చూస్తే. అన్నట్టు అక్కడ దేవుడు కూడా మల్లన్న ట!  

ఆ బండరాళ్లని, వాటి చుట్టూ ఉండే  పచ్చని పొదలు , రోజూ చూస్తున్నా ఆ కొండ రాళ్ల మీద ఇంకా.... ఇంకా అభిమానం పెరిగిందే కాని విసుగు రాలేదు. 

నా మొబైల్ తో ఎన్ని ఫోటోలు తీసానో!

'డెక్కన్ రాక్స్ ఎన్నాళ్లకి చూసానో భలే గుర్తు చేసావ్' అని నా ఫ్రండ్ సరదా పడింది నే పంపిన ఫోటోలు చూసి. వాళ్లున్న  రాజభవన్ రోడ్ ప్రాంతం లో.. పొడుచుకు వచ్చిన రాళ్లు,గుట్టల పైనుంచి టాంక్ బండ్ కనబడేది ట వెనకటి రోజుల్లో. 

అప్పుడు గుర్తుకు వచ్చింది... ఈ బండల మాటున ఏ చరిత్ర ఉందో.దక్కన్ పీఠభూమి కి సంబంధించిన ముఖ్య నగరాల్లో హైదారాబాదు ఒకటి కదాని. 

'మా హైదరాబాదు' అని అనుకోగానే.. ఎత్తైన కొండ మీద నిలబడి జెండా ఎగరేసినట్టు  గర్వంగా ఫీలవుతారు హైదారాబాదు నగరవాసులు... 

హైదరాబాదు మహానగరం ఉనికి కి అసలు ఈ రాతి బండలే ఆనవాళ్ళు. ఇంకా చుట్టూ చెరువులు. కూడా. చారిత్రాత్మక స్మృతి చిహ్నాల లాగ అద్భుతమైన  ఈ రాతి అమరికలు, చూసే వాళ్లని ఓ రకమైన మోహం లో పడేస్తుంటాయి.

హైదరాబాదు లో ఈ stone lovers చాలామంది ఉన్నారు. కుర్రకారు అంతా తరచుగా ట్రెక్కింగ్ కి వెడుతూ ఉంటారు. అదొక అనుభవం.  ఫేస్‌బుక్ లో తమ పేజి ఉన్న, Society to save Rocks  సంస్థ ఒకటి దాదాపు రెండు దశాబ్దాల కి పైగా పని చేస్తోంది. హెరిటేజ్ ని కాపాడే ప్రయత్నం లో.

స్థూలంగా చూస్తే తూర్పు కనుమలకు, పడమటి కనుమలకు మధ్య ఉన్న ఎత్తైన ప్రాంతమే ఈ దక్కన్ పీఠభూమి.  దాదాపు అరవై ఐదు మిలియన్ సంవత్సరాల కిందట అగ్నిపర్వత విస్ఫోటనం వలన పెల్లుబికిన లావా వింధ్య పర్వతాలకి దక్షిణాన విస్తరించి ఎత్తైన పీఠభూమి గా ఏర్పడింది‌

ఇక్కడి రాళ్ల గురించి భౌగోళిక శాస్త్ర వేత్తలతో సహా చాలామంది మాట్లాడిన విషయాలను విన్నాను. ఈ రాక్స్ యొక్క ఉపరితలం మృదువుగా కనిపిస్తుందనీ...  అనేక సూక్ష్మ రంధ్రాలతో Porous గా వుండే ఈ రాళ్ళు తేమను పీల్చుకొని వాతావరణం నియంత్రిస్తాయని అంటారు . హైదరాబాదులో ఉన్న పెద్ద పెద్ద కొండ రాళ్లవలనే సహజంగా చాలా చెరువులు ఏర్పడ్డాయని అన్నారు.  

నగర విస్తరణ అనివార్యం అయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. కొండలు కరిగించారు. చెరువులు పూడ్చేసారు. గేటెడ్ కమ్యూనిటీ లు ఏర్పడ్డాయి.

బాధా కరమైన విషయం ఒకటి మనం గమనించాలి. అడవులు నశించి పోతున్నాయి అంటే, పూనుకుని మళ్ళీ మొక్కలు పాతి తిరిగి అడవులను పెంపొందించడం వీలవుతుంది.  కాని, ఈ రాళ్ల విషయం అలా కాదుకదా.  ఇవి సెడిమెంటరీ రాక్స్.  అరవై ఐదు మిలియన్ సంవత్సరాల నిక్షేపాలు.  కాపాడుకోవాలే తప్ప పునర్నిర్మించలేరు. అదే అంటారు ఈ సేవ్ రాక్స్ సొసైటీ వాళ్లు.  ఈ అవేర్నెస్ కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు

అయినా జరగవలసిన నష్టం జరగనే జరిగింది. అది మనకు తెలిసిన దే. ఇటీవలి అకాల వర్షాలు, వరదలూ, అడపాదడపా భూమి కూడా కంపించడం ఇవన్నీ దేనికి సంకేతాలు?

 పుష్పవిలాపంలా ..వినిపించని రాతిపూల మనోగతాలు         ఇలా కవిత లా రాసుకున్నా.. ఛందస్సు లేని కవిత..


#రాతి_పూలు


అప్పట్లో...

మా పూర్వీకులలో

#కొందరు_మహానుభావులకు

రెక్కలు ఉండేవట.

స్వేచ్ఛ గా చరిస్తూ, సంచరిస్తూ;

రాజాగ్రహం చవి చూసేదాకా

భయం తెలియలేదు.

అయినా ఒకరిద్దరు 

గాలి రెక్కలు పొదవి పట్టుకుని

ఎగిరి పోయి దాక్కున్నారని

వినికిడి. కాని చూసింది లేదు.

అదంతా పురాణం అని మీరన్నా

చేసేదేం లేదు. 

ఆనాటి కల్పనలనే కలలుగా 

కనడం తప్ప

కదల లేము మెదల లేము;

ఎండ కాసినా, వాన కురిసినా,

మంచు కమ్ముకున్నా అచలంగా

మేమే !


అప్పుడప్పుడు.. ఉలి తాకిడి

మా కలవాటే;

శస్త్రచికిత్స చేసే వైద్యుడిలా

ఓ కళాకారుడు వెన్నుతడతాడు.

సున్నితంగా తట్డి,విభజించి

మా లోని భాగాన్ని ఓ మూర్తి ని చేస్తాడా

తక్కిన అమూర్త భాగానికి 

దక్కని గౌరవం ఏదో దక్కించుకున్న

ఆ మూర్తి ని

మా ముందరే తరలించుకు పోతుంటే

వళ్లంతా కళ్ళై చమర్చిన తడి 

మీకు ఎలా తెలుస్తుంది?

ఫెటీల్మనే విస్ఫోటనం వెనుక

మమ్మల్ని అనేక భాగాలు చేసాక,

ఏ రెండు భాగాలో ఆర్తిగా హత్తుకు పోతూ;

ఏ అమూర్త భాగమో నిటారుగా నిలదొక్కుకుంటూ,

అస్తిత్వాన్ని కాపాడుకొనే ప్రయాస.

అదీ మేమే!


అనుకోకుండా

మళ్ళీ మంచి రోజుల వచ్చాయి..

ఎలా అంటారా?అది మీకూ తెలుసు.

మా మహోన్నత సౌందర్యానికి

మురిసి పోతూనే, మరో పక్క మా విధ్వంసానికి

పన్నాగాలు పన్నే స్వార్ధ పరుల 

రాక ...హటాత్తుగా ఆగింది.


కురిసే మబ్బుల జాడ కి ఎగురుతూ

వచ్చి వాలిన నెమళ్ళు... 

జడిసి  జరజరా తడి పొదలమధ్య కి

జారిపోయే సర్పరాజాలు;


మా వెన్ను మీద  తమ పొడవు కాళ్లని అన్చి,

నీటి జాడ కోసం చూసే వలస

పక్షులు 

పూల సందడి కబురంది కమ్ముకునే

తేనె పిట్టలు,తేనెటీగలు..

జీవ వైవిధ్యం మాతో బాటే!


మా చుట్టూ ఆకుపచ్చదనం

పట్టు కుచ్చులు పోస్తూ ఆవరించింది.

ఉలి తాకిడి లేకనే మలచబడిన

చెక్కని శిల్పాలలా

దర్పంగా మేము!


కాని,

ఏ అర్థరాత్రో దూరంగా ప్రొక్లెయినర్ల

చప్పుళ్ళు  భ్రమసిన మా గుండెలని 

భయపెడతూనే ఉన్నాయి...

తనువంతా కళ్లే అయి నీటి చలమల్ని

దాచుకున్న మాలో తడిని ఆవిరి చేస్తూ

సున్నపు పొడిలా నుగ్గు నుగ్గు చేసిన భయం

వెన్నంటే వుంది.

అయినప్పటికీ

ఒకటే జాలి వీళ్ల గురించి

లక్షల వేల సంవత్సరాల మా అస్తిత్వాన్ని

విధ్వంసం చేసే  వీరు, వీరు,

వీళ్లంతా... 

యుగయుగాల తమ ఉనికిని

కాపాడుకోగలరా అనే!

—౦—