Sunday, 27 January 2019

కాశీ— దేవఘర్

కాశీ -దేవ్‌ఘర్

నవంబర్ 23.
గయనుంచి కాశీకి

తెల్లవారుజాము నాలుగు అవుతుండగా కాశీ స్టేషన్లో దిగాం.
కాశీ అంటేనే వెలుగు. ఓ తేజస్సు.
బయటకు వచ్చి చూస్తే..... ఇదిగో ఇలా,  గాజు దీపాల వెలుగు .
గుంపులు గుంపులుగా చలికి ముడుచుకొని ఉన్న ప్రయాణీకులు ఓ వైపు.  అలా  పరిసరాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఉండగలగడమే , అసలైన యాత్ర.  అదీ.భక్తీ,శ్రద్ధ.

మేం అటోలు చేసుకొని,  ముందు గా రూం లు బుక్ చేసుకున్న
శృంగేరి మఠానికి వెళ్లాం.  ఆ రోజు కార్తీక పౌర్ణమి. గంగా నదీ స్నానాలు. వెంటనే రెడీ అయి కేదార్ ఘాట్ దగ్గర కు వెళ్లాం. స్నానాలు,నీళ్లలో దీపాలు. ఒకప్పుడు ఏమిటీ వెర్రి అనుకొనేదాన్నే.  అలా అందరి తోపాటు నీళ్ల లోమునకలు వేస్తూ ..ఉనికిని మరచిపోయే స్థితి. నమ్మాలి.

పగలంతా కాశీ పట్టణ సందర్శన.  బిర్లా మందిరం. BHU.  ఆరోజు బెనారస్ హిందూ యూనివర్సిటీ స్నాతకోత్సవాలు. పిల్లల తో ఏం సందడి. సరదాగా కొంతమంది తో ఫోటో తీయుంచు కొన్నాము. ఆ యూనివర్సిటీ లో చదవాలనే కోరిక ఉండేది అదిలా తీరింది అంటూ సుజాత అని ఒక ఫ్రండు మహా సంబరపడింది.
తర్వాత, కొన్ని ఆలయాలు,సంకటమోచన్ హనుమాన్, తులసీ మందిరం.. ఇట్లా. విశేషం ఏమిటంటే, ప్రతీ గుడి దగ్గర అక్కడ అమ్మకునే వాళ్లు. మమ్మల్ని గమనించి తెలుగులో మాట్లాడటం.. ఎక్కువగా చిన్నపిల్లలు. పూలో, పూజసామానో పట్డుకొని.  ఇదే బతక నేర్వడం.  ఏ యూనివర్సిటీ చెప్పని చదువు.

సాయంత్రం గంగా హారతి. గంగానది లో బోటులో వెడుతూ ఉంటె  నదీ తీరంలో దీపాలకాంతి. ఇటు నన్ను చూడమన్నట్టు పున్నమి చంద్రుడు.ఆనక గంగా హారతి. కొంత సేపు చూసి అప్పటికి ఉన్న రద్దీ ని గమనించి  బయటకు వచ్చేశాం. కాని కొంత తొక్కిసలాట తప్పలేదు. అదొక అనుభవం.

అదే రోజు రాత్రి కాశీ నుండి దేవఘర్ కి దురంతో ట్రైన్ బుక్ చేసుకొన్నాం. పన్నెండు గంటల ప్రయాణం. కాని మేం ఎక్కవలసిన ట్రైన్ ఏడు గంటలు ఆలస్యం. ఇలా ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుందిట. ఇదివరకు మా వాళ్లు ఇలాగే ట్రైన్ ఆఖరున కాన్సిల్ అయి వెళ్లలేకపోయారుట. ఇక...ఎలా...
మళ్ళీ ఓ మినీ బస్ ఒకటి మాట్లాడుకున్నాం దేవఘర్ వెళ్ళి రావడానికి. చేరిన రోజే తిరుగు ప్రయాణం కనుక ఇద్దరు డ్రైవర్లు.  శృంగేరి మఠం మానేజర్ వాళ్ల అబ్బాయి కి  ట్రావెల్ ఏజెన్సీ ఉంది.

#దేవఘర్

నవంబర్ 24

దేవఘర్ లో మా SBI holiday home ముందు గానే బుక్ అయింది.  కాశీ లో బయల్దేరటమే లేటు. చేరేసరికి ఎక్కువ సమయం పట్టింది.  ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది పదవది. ఇక్కడ శివుడు..వైద్యనాథుడు.  పర్లి లో కూడా  వైద్యనాథలింగం ఉంది. కాని దేవ్‌ఘర్ లోని దే ద్వాదశ జ్యోతిర్లింగాల లెక్కలో వస్తుంది అన్నారు.

రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని కోరి, తన తలలు నరుక్కోగా, పరమశివుడు రావణుని భక్తి కి మెచ్చి,చికిత్స చేసి తిరిగి దశకంఠుని శిరస్సులను తిరిగి పెట్టినట్లు స్థల పురాణం.(వికీపీడియా)
 మేమంతా పన్నెండు మంది బృందం. మాతో ఒక పండిట్ సంకల్పం చెప్పించాడు, లొపల ఆ నీళ్ళు అభిషేకం చేయించాడు.
తరువాత ఆ ఆవరణ లో అన్ని ఆలయాలు దర్శించి,వెనక్కి వచ్చాం.

 నవంబర్ 25

తెల్లగా తెల్లవారింది కాశీకి తిరిగి వచ్చేసరికి.  ప్రయాగ కూడా వెళ్దాం. అక్కడి శక్తి పీఠాన్ని చూడాలని‌. నాతో సహా కొందరు చూసినా...మళ్ళీ ఫ్రెషప్ అయి, ప్రయాగ ‌..ఈసారి రెండు కార్లు చేసుకొన్నాం. త్రివేణి సంగమం లో స్నానాలు,  మాధవేశ్వరి దేవి,వేణీ మాధవుడు ఇలా చూసుకుని. వెనక్కి కాశికి. కాశీ చేరుతూనే దైవదర్శనానికి వెళ్లాం. చాలా రాత్రి అయింది. కాని అదృష్టం, విశాలక్షి అమ్మవారు,విశ్వనాధుడు,అన్నపూర్ణ తల్లి.ఎంత ప్రశాంతంగా.. చూశామో. ఒకటికి రెండుసార్లు అన్నట్లు.

నవంబర్ 26 .

పొద్దున్నే ఎయిపోర్ట్ కి వెళ్లాలి. అయినా తెల్లవారుజామున మరోసారి వెళ్దాం హారతి దొరుకుతుందేమో అన్నారు. నేను వెళ్లలేక పోయాను. కార్తీక సోమవారం, హారతి దర్శనం దొరకలేదు కాని, దైవదర్శనం  బాగా అయింది అన్నారు. ఇంకా వారాహి అమ్మవారిని కూడా దర్శించుకొన్నారట అంతా. నేనూ వెళ్ళి ఉండాల్సింది అనిపించింది. మాలో ఓ నలుగురు అక్కడ తొమ్మిది రోజుల నిద్ర చేయడానికి ఆగిపోయారు.
అరు రోజులు రాత్రి ప్రయాణం, పగలు తిరుగుతూ ఉత్సాహంగా గడిపాం.

అగస్త్యుల వారికే కాశీ పట్టణం వదలి వెళ్లాలంటే ఎంతో బాధ కలిగిందిట. అక్కడి  సకల దేవతలనీ ప్రార్ధిస్తాడుట. కాని వదలక తప్పలేదు. కాశీ వదలి  దక్షిణ దేశం వెళ్లాక కూడా...అకడ గోదావరీ తీరాన వీచే  గాలి ని చూసి.. కాశీ పట్టణ కుశలం అడుగుతూండే వాడట.

 అలా మేమంతా ఫ్లైట్ ఎక్కేవరకు అక్కడి అనుభూతులు చిక్కపరచుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యాం.


ముక్తాయింపు

2018  సంవత్సరం తీర్థ యాత్రా స్పెషల్... !
గంగోత్రి మొదలు, అన్ని తీర్థాల లో స్నానం..
" అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా"..
అయిందా...!
అంతఃశుద్ధి..సంగతేమిటి.?
ఈ మధ్య వాట్సాప్ లో ...
ఏ ప్రవచనాల మధ్య పిట్టకదో...కాని వచ్చింది.
ఎన్ని తీర్థాలలో ముంచి తెచ్చినా పోని దోసకాయ చేదు.
మనిషి అలా కాదే. తీర్థం  ఉత్త నీరేనా...అందు లో స్నానం చేస్తే నే పాపం పోతుందా.. పాపం సంగతి కాదు..నిన్ను నీవు మరచి, ముక్కు మూసుకొని, మునక వేయడ మే కదా స్నానం.

కాశీ- దేవఘర్ ప్రయాణం తో నాకు..ద్వాదశ జ్యోతర్లింగాల దర్శనం పూర్తి అయింది.
అయితే ఏమిటి... ఏం పుణ్యం వడికట్టుకు వచ్చావ్ అంటే... 'ఏమీలేదు' అనే చెప్తాను. అసలు ఎవరు ఏ యాత్రలు చేసినా, తీర్థ యాత్ర మాత్రమే కానక్కరలేదు. ఏం తెస్తారో ఆమాత్రం నేనూ దక్కించుకొన్నా.

ముఖ్యంగా తీర్థ యాత్రలు  చేసేటప్పుడు ఎలాటి వారైనా సాత్విక జీవితం గడపడానికి సిద్దంగా ఉంటారు. ఆ  కొద్దికాలం  వారి ప్రశాంత జీవితం తమ మిగతా జీవితాన్ని సానుకూలపరుస్తుంది అనే భావనలో ఉంటారు. ( అదే కోరిన కోరికలు తీరడం)

చాలా మంది తమ యాత్రానుభవాలు రాసేటప్పుడు...  'చరైవేతి చరైవేతి' అని  ఓ మాట తమ ప్రయాణానికి అన్వయించి చెప్తూ ఉంటారు.  తిరిగే తేనెటీగకే మధువు దొరుకుతుంది ట. ఇది ఉపనిషత్తు ల లో ఐతరేయ బ్రాహ్మణ్యము లోనిదిట.

హరిశ్చంద్రుని కుమారుడు లోహితాస్యునికి ఇంద్రుడు చెప్పాడని చదివాను..వికిపీడియా చేసి, ఇంగ్లీషు నుంచి తర్జుమా చేసుకొంటే ఇలా.

*చరించినందువలన   మధువు దొరుకుతోంది(తేనెటీగలకు) చరించినందువలననే   అత్తి ఫలాలులాటి తీయని ఫలాలు లభిస్తున్నాయి(పక్షులకు)
సూర్యుడిని చూడు,  చరిస్తున్నందుకు  అలుపు లేకుండా ఎంత ఆనందం గా ఉంటాడో - నడవాలి, నడవాలి.

*సంచారకుని  కాళ్లు పుష్పించే చెట్ల కొమ్మల్లాంటివి. వాటి మధుర ఫలాలు అతని ఆత్మ పొందుతుంది. అతని దోషాలు అన్నీ హరించిపోతాయి,నడిచిన శ్రమతో‌.

*ఎక్కడికీ కదలక ఉండే వాడికి సంతోషం ఉండదు అంటారు. సమాజం లో నలుగురి మధ్య గడుపుతూ, కాలం వెళ్లదీసేవాడు ఎంత మంచివాడవనీ తప్పు దోవన పడతాడు. కనుక సంచరించు.

*కదలక చతికలపడి ఉన్నవాడికి..వాని అదృష్టం కూడా కూర్చుంటుంది.అతడు లేస్తే లేస్తుంది,పడుకుంటే పడుకుంటుంది, నడిస్తే నడుస్తుంది..కాబట్టి. నడకసాగించు..సంచరించు.

మరి వచ్చే కొత్త సంవత్సరం కూడా ఇంకా కొన్ని కొత్త ప్రాంతాలు చూడాలనే ఉత్సాహం అయితే ఉంది. ఆ పై సర్వేశ్వరుని దయ.

శుభం 🙏



చరణ్వై మధు విందతి
చరణ్స్వాదుముదుంబరం
సూర్యస్య పశ్య శ్రేమాణం, యోన
తంద్రయతే చరశ్చరైవేతి చరైవేతి

చరించినందువలన [ తేనెటీగలకు ] మధువు దొరుకుతోంది చరించినందువలననే [ పక్షులకు ] స్వాదువైన ( అత్తి/ అంజూర )ఫలాలు లభిస్తున్నాయి చరిస్తున్నందుకు సూర్యుడు గౌరవించబడుతున్నాడు - నడవాలి, నడవండి ''

No comments:

Post a Comment