నిరీక్షణ
వెలుగుతోనే లేచి
నీకోసం చూస్తూంటా రోజూ
యిదొక వేళంబం అయిపోయింది.
ఓ రహస్యం చెప్పాలి నీతో..!
రాత్రి వేళ నేను మరణిస్తాను.
అదో రహస్యమా అంటావేమో?
అదికాదు అసలు..
అప్పుడు నన్ను నేనొక
కొత్త చోట కనుక్కుంటా..
నేనేనా?
ఇప్పటి రూపం కాదది.. శ్వాసిస్తున్నంత సహజంగా
హృదయాన్ని గుప్పెట్లో మోస్తూన్న కాలం.
ఏదో నిరీక్షణ ..
గుమ్మం లో ఆటో ఆగిన చప్పుడు కి
మనింటికే చుట్టాలని వీధిలోకి పరిగెత్తిన
చిన్నపిల్లలా..
ఉద్విగ్నత పరాకాష్ఠ చేరుతూండగా
చేయజారినట్లు..
శేషభాగం అస్పష్టంగా..కదలి తెరమరుగైంది.
తృప్త మనసు భాష రాక యింకా
కలవరిస్తూనే వుంది
అదట్లాగే వుండనీ.. అస్థిమితంగా.
ఇదిగో మళ్ళీ..
తెల్లారిందే తడవు..
విడిచిన కుబుసాన్నే, తిరిగి ఓవర్ కోటు లా వేసుకుని
ఇలా వచ్చేసాను నిన్నెక్కడ మిస్ అవుతానో
నని.
🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸
ఒక్కోసారి
ఒక్కోసారి
ఖాళీ అయిపోతాం..
ఇక చేయడానికి ఏమీ లేనట్లు
ప్రయాణం చివరికి వచ్చేసినట్లు;
అప్పటిదాకా వాయిదా వేసుకున్నవి
ఒక్కటీ గుర్తు రాదు..
కలలు కనడం కూడా !
ఒక్కోసారి బరువేదో
దించుకున్నాక..
తేలికవుతావు కాని..
ఎంచేతో.. అపరాధ భావం
కాస్త ఆనందాన్నీ.. మసకబరుస్తుంది.
సంతోషాలు యిక లేవనుకున్నాక కూడా
అసంతృప్తి అక్కరకు రాని చుట్టం అయి
తిష్ట వేసుకునే ఉంటుంది.
మరి ఒక్కసారి..
మధ్యాహ్నపు తీరిక
రెప్పల్లోకి జారినప్పుడు,
నులి వెచ్చదనం ఎక్కడనుంచో మాదకం లా
నరాల్లోకి ప్రవహిస్తుంది..
అప్పుడు ఓసారి మాత్రం
ఇంకా సాయం కాలం
కాలేదని ఎదురు చూపు కలేదో
నిజం అనిపించేలా రగ్గు కప్పి వెళ్ళి పోతుంది.
ఇంకాసేపు అలాగే..
నొస్టాల్జియా చెయ్యిపట్టి..
దగ్గరకు తీసుకుంటుంది!
