Sunday, 28 October 2018

గురజాడ కథలు


గురజాడ అప్పారావు కధలు

మతములన్నియు మాసిపోవును.
జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును
                         
కిందటి నెల సెప్టెంబర్ 21న, గురజాడ  అప్పారావు గారి జయంతి నాడు, ఎప్పుడో చదివిన ఓ కధ ఒకటి గుర్తుకు వచ్చింది. నా పుస్తకాల రాక్ వెతికి తే..ఇదిగో 'గురజాడ రచనలు' అనే ఈ కధల పుస్తకం కనపడింది.
దాదాపు వందేళ్ల నాటి కధానికలు...అప్పుడే కాదు ఇప్పటికీ ఆధునిక కధలే! ఇందు లో మొట్టమొదటి తెలుగులో 'ఆధునిక కధ'అని చెప్పబడే 'దిద్దుబాటు'  అనే కధ రెండు వెర్షన్స్ ఉన్నాయి. మెటిల్డా, మతము- విమతము, సౌదామిని( అసంపూర్తి కధ). దాదాపు అన్ని కధల్లో సంఘం లో దురాచారం పై వ్యంగ్యాస్త్రం సంధించారు.

అందులో నేను ఎంచుకున్న కధ పెద్ద కధ..
' మీ పేరేమిటి'  లేదా
'దేవుడు చేసిన మనుషుల్లారా...మనుషులు చేసిన దేవుళ్లారా...
మీ పేరేమిటి?'
హిందూ మతం లోనే శైవులకు వైష్ణవులకు మధ్య మతపరమైన వైషమ్యాలు ఇలా ఉండేవా అనిపించింది మొదట చదివినపుడు.
మాటా మాటా అనుకోవడం..ఆ తర్వాత సర్దుబాట్లు. ఇవన్నీ లౌకికవాద రాజకీయాలే.
గురజాడ వారు కదా‌‌‌....మనుషుల లో మౌఢ్యం ఎంత దూరం వెడుతుందో ...హాస్యం,రవంత వ్యంగ్యం,నాటకీయత..జోడించి మరీ రాశారు. ఆయన కధనం లో ప్రత్యేకత అదే. ఇక పోతే
 కొన్ని పదాలు నాకు కొత్తగా అనిపించాయి.
 ఉదా. సాతాన్లు అని చదివినపుడు నాకు తెలియ లేదు. వికిపిడియా ఉపకరించింది.
**(సాతానులు వైష్ణవమత సంప్రదాయానికి చెందిన వారు. శైవం, వీరశైవం ఆంధ్రదేశంలో విజృంభించిన తరువాత తెలుగుదేశంలో రామానుజుని వైష్ణవం ప్రవేశించింది. వైష్ణవ దేవాలయాల్లో గుడి సేవకులుగా ఒక శూద్ర వర్గం ఏర్పడిందనీ, వారినే సాతానులంటారనీ, ఆరుద్ర గారు ప్రజాసాహితీ సంచికలో ఉదహరించారు. ...వికిపిడియా)

స్థూలంగా ఈ కధ చెప్పటానికి ప్రయత్నిస్తాను.

' బౌధ్దులు యెషువంటి వారు శాస్తుల్లుగారూ?'

రామ్మూర్తి అడిగాడు బౌద్ధ మతం పైన గురువు గారి ప్రసంగం వింటూ‌. 

సోక్రటీస్ శిష్యులలాగా శాస్తుల్లుగారి కి కొంతమంది శిష్యగణం వుంటారావూర్లో.  ఈ కధ ఉత్తమపురుష...అంటే 'ఫస్ట్ పర్సన్' లో చెప్పబడింది.

శాస్తుల్లుగారు సంస్కృతం, తర్కశాస్త్రాల లో పండితుడు.
రిటైర్ అయ్యి పింఛను పుచ్చుకొంటూ, రకరకాల వృత్తులలో స్థిరపడి అదే ఊర్లో ఉంటున్న తన శిష్యుల కి క్లాసులు తీసుకొంటూ కాలం గడుపుతూ వుంటారు‌. సాధారణంగా ఈ సమావేశాలు అందరిలో మోతుబరి, వ్యవసాయ దారుడు అయిన రామ్మూర్తి  కి చెందిన పూల తోటలో జరుగుతుంటాయి.  ఆ రోజు బౌద్ధ మతం విషయమై ఆయన ఉపన్యాసం. రామ్మూర్తి దగ్గరున్న బుద్దచరిత్ర అడిగి తీసుకుని చదువుతాడు..అది చదివాక..అంటాడు..
'తప్పకుండా ఈ మహానుభావుడు శ్రీ మహావిష్ణు అవతారఁవేన్రా' అని.   అలా బుద్దుడిని చదివాక..మాష్టారు బౌధ్దులని తిట్టడం మానేశాడట. కానీ, క్రైస్తవులని అంటూ వచ్చాడుట. అయితే  క్రీస్తు శ్రీమహావిష్ణువు పదకొండవ అవతారం గా చెయ్యడం చాతగాక ఊర్కొన్నాం అంటూ చమత్కరిస్తాడు మన కధకుడు.

ఇలా ఈ గురు శిష్యుల సమావేశాలు జరిగినపుడల్లా..... ఓ స్వర్గ ఖండం ఒకటి అకడ దిగినట్టు ఉంటుందిట. అసలు కధ ఇది కాదు. ఇది prelude మాత్రమే..!

వారి వూరికి కొద్ది  దూరంలో ' రామగిరి' అనే విష్ణు క్షేత్రం ఉంది. అక్కడి నల్లకొండలలో శిధిలమై న బౌద్ధ కట్టడాలున్నాయి..కాని, అక్కడి వారు వాటిని పాండవుల పంచలంటారు.

 "ఈ దేశంలో పాండవులు ఉండని గుహలూ,సీతమ్మ వారు స్నానమాడని గుంటలూ లేవు" అంటారు రచయిత.

ఓ ఇంగ్లీషు దొర ఓ నాడు వచ్చి ..సదరు కొండల మధ్య ఉన్న దిబ్బల్లో తవ్వకాలు చేస్తుండగా, రకరకాల బౌద్ధ చిహ్నాలు బయటపడ్డాయి. ఆ వింత చూడడానికి ఈ గురు శిష్య బృందం వెళ్ళి అక్కడ శాయన్న భుక్త గారి ఇంట బస చేస్తారు.

అక్కడ గుహలో ఉన్న బుద్ధుని పాలరాతి ప్రతిమ,  అందరి దృష్టి ఆకట్టుకుంటుంది.  ఆ బౌద్ధ విగ్రహం శివుడనీ, దాని పక్కన ఉన్న దేవీ విగ్రహాన్ని 'గౌరి' గా భావించి అక్కడి జంగమవారు పూజ చేస్తుంటారు.  అక్కడ పూజారి శరభయ్య, తన్ని తాను వృషభావతరంగా ప్రకటించుకొంటాడు.అలా అని అంతా నమ్ముతారు కూడా.
జంగాలు శివుడు గా పూజ చేసే  ఆ బుద్ధ ప్రతిమ ని  దొరగారు తనకివ్వమని అడిగినా,  శైవులలో పెద్దలు ప్రాణం పోయినా సరే ఇవ్వమని చెప్తారు. చేసేది లేక దొర తిరుగుముఖం పడతాడు.
కాని పూజారి శరభయ్య ఆ విగ్రహం పెరికి దొరకి చాటుగా అమ్మబోయాడు. దొర ఆవిధమైన దొంగచాటు వ్యవహారానికి ఒప్పుకోడు. మిగతా పెద్దలకు కబురు చేస్తాడు. శరభయ్య మాత్రం అక్కడ నుంచి పారిపోతాడు.

 'బుద్ధుడు విష్ణ్వతారం కదా ఈ జంగాలు శివుడని ఎలా పూజ చేస్తున్నార్రా?'
 గురువు గారి సందేహం.
 శాయన్న భుక్త గారింట డాబా మీద చేరిన వీళ్లంతా సమవేశమై బౌద్ధ క్షేత్రం గురించీ, గత కాలపు స్థితిగతులు, చర్చ చేస్తారు. అపుడు శాయన్న భుక్త దానికీ ఓ కధ ఉందంటాడు. అదే ఈ కధ.
శైవులు, వైష్ణవులు తమ తమ మతం గొప్పదని దురహంకారంతో కాదు.. మూర్ఖత్వం తో ఏదో చేయ బోయి అభాసు పాలైన ఆ ఊరి కధ..కడమకు ఎలాదారి తీసిందో..!

జంగాలకు,దేవంగులకూ, పూజారి శరభయ్య నందీశ్వరుడి అవతారం.  విగ్రహం అమ్మచూపడం కూడా ఆ దొర పూర్వ జన్మలో పరమేశ్వరుడని.....ఆ కారణంగా విగ్రహం అతనికి చేర్చే ప్రయత్నం జరిగిందనీ కధనం.  వాళ్ల మూఢ భక్తికి ఆశ్చర్య పడుతూ, ఈ ప్రపత్తి పండితులకుండదు అనుకొంటారు అంతా. కాని ఆ మూఢ భక్తే ప్రాణాంతక మవుతుందని శాయన్న భుక్త  జరిగినది చెబుతాడు.

ఇలా బుద్ధుని ప్రతిమ ను శివుడిగా చేసి పూజించే శివస్థలం ఒకవైపు ఉండగా,  మరో వైపు విష్ణుస్ధలం.. కూడా ఉంది.
అప్పటికే రెండువందల ఏళ్ల కింద ఓ మహారాజు  విష్ణు స్థలం కట్టించి, ఒక గ్రామం అందుకింత ధారాదత్తం చేస్తాడు. ఆ ఆలయ ధర్మకర్తలు రంగాచార్యులు, వారి కుటుంబం.. రంగాచార్యులు వారి కొడుకు కృష్ణమాచార్యులు,  కోడలు నాంచారమ్మ. నాంచారమ్మ ది  పండిత వంశం. జ్ఞానవంతురాలని కూడా చెప్పుకుంటారు.. ఇల్లూ దేవాలయం  భాద్యతలు చక్కబెట్టే సమర్ధురాలు కూడా.

శాయన్న భుక్తగారీ వివరాలు శాస్తుల్లుగారు, వారి శిష్యులకీ చెప్తూ..అక్కడి సంగతులు ఇంకా తెలియాలంటే మర్నాటి దాకా ఉండమని చెప్తాడు.

వైష్ణవ పక్షానికి కెప్టెన్ *సాతాని మనవాళ్లయ్య.  శైవ పూజారి శరభయ్య వృషభావతారం అయినపుడు, తాను గరుడాళ్వారి నఖముల తేజస్సు కలవాడిగా చెప్పుకొంటాడు మనవాళ్లయ్య.  సాతాన్లు చాలామంది ఇయన శిష్యులే అయినా, వారి లో ఐకమత్యం లేకపోవటంతో అతన్ని అవతార పురుషుడని చెప్పరు.

మతపరమైన గొడవల్లో అయ్యవార్లు(రంగాచార్యులు) కలగ జేసుకోరు కాని, మనవాళ్లయ్య అవతార వ్యవహారానికి పిలిచి చివాట్లేస్తాడు.ఆ చీవాట్లు తినీ అంటాడుట కదా
'యీ బ్రాహ్మణులదీ...జ్ఞానమూ కాదు,అజ్ఞానమూ కాదు. కడజాతి మనుషులే భక్తి ప్రభావంచేత ఆళ్వార్లు అయి ఉండిరి కదా? ఇంత కాలవాఁయి రాముడి ధ్వజమును జయప్రదంగా మోస్తూ... శైవ సంహారం చేసిన శ్రీ మద్గరుడాళ్వారి నఖాగ్రం యొక్క అవతారం ఏల కాను?'

ఆ మాటకు వెంకయ్యనే శిష్యుడు, 'పాత రోజులైతే వీళ్లే అవతారలయిపోదురు. వీరి పేరిట బొమ్మలు నిలిపి దేవాలయాలు కట్టి పూజ చేద్దుం.' అని వ్యాఖ్యానిస్తూ, 'మరి బుద్దుడూ మనిషే గదండి' అంటాడు. సరిసరి అన్నీ ఒకటేనా అంటూ అతని మాట కొట్టిపారేస్తారంతా.

అలాగే ఆ ఉర్లో మరో నాయళ్ల వర్గం. కాస్త ఉన్నవాళ్లే అంతా.
ఓ దక్షిణ దేశపు అయ్యవార్లువచ్చి నాయుళ్లందరికీ చక్రాంకితం చేసి వైష్ణవమిస్తాడు.

ఆ ఊరి మునసబు రామానాయుడు. కొంచెం భోజనప్రియుడూ, మందు ప్రియుడూను.  ఆ తాలూకాలో కెల్లా ఆ ఊళ్ళో నే పెద్ద సారాయి దుకాణ ఉందిట. అక్కడి వాళ్లని అంచనా వేయొచ్చు!
మునసబు కొంత మూర్ఖుడు కూడా. కానీ, గుళ్లో ప్రసాదమైన పులిహోర, వైష్ణవమూ ఏక కాలంలో గ్రహిస్తాడు.
సారధి నాయుడని మరో మోతుబరి ఈ ప్రసాదాల కి వనరులు సమ కూరుస్తూంటాడు. అలా ద్వాదశి అంటే పెద్ద పండగే వాళ్లకి.

 ఇలా నాయుళ్లంతా వైష్ణవం పుచ్చుకోవటం నచ్చదు పూజారి శరభయ్య కి. అప్పట్లో నే హైదరాబాదు రాజ్యం నుంచి శివాచార్యులు ఆ ప్రాంతానికి వచ్చారు. శరభయ్య వేసిన ఎత్తేమో  రోజూ అర్ధరాత్రి శివార్చనలు,శంఖాలు, జయఘంటలు! ఇలా ఊళ్ళో జనాలకి భయోత్పాతం కలిగించారు ట.
ఈ అట్టహాసానికి వైష్ణవం పుచ్చుకున్న నాయుళ్లు, ఒక్కక్కరే నామాలకి నామం పెట్టి,విభూది రుద్రాక్ష ధారణ చేయడం మొదలు పెట్టారు. ఇంక సారధినాయుడుని మార్చాలంటే, శివాచార్లు గుండం తొక్కడం అనే  పెద్ద యత్నం తలపెట్టాడు.

ఈ విషయం విన్నాక కూడా అయ్యవార్లు చలించలేదు సరికదా,..'వైష్ణవుడు, శైవుడు కావాలని కోరితే,అడ్డి ఏమి ప్రయోజనం... ఏ మతమైనా ప్రపత్తి ఉన్నవాడికి తోవ ఉంటుంది. అది లేకుంటే వైష్ణవుడైనా కార్యం లేదు' అంటూ నిర్లిప్తత చూపించాడు..ఈ ఉదాసీనత మిగతా వాళ్లకి నచ్చదు

'ఈ బ్రాహ్మడికి వైష్ణవాభిమానం తక్కువ. కనక మనం విజృంభిస్తేనే వైష్ణవ మతాని కి తిరిగి గౌరవం వస్తుంది' అని మనవాళ్లయ్య  ప్రగల్భాలు చెప్పి, శివాచార్యులు గుండం దొక్కే నాటి రాత్రికి....కోవిల దగ్గర రావిచెట్టు కింద ఓ పెద్ద మీటింగ్ చేశాడు. సాతాన్లు,నాయలు వందలకు జమ అయ్యారు.

 వాళ్ళు చేసిన పనే మనమెందుకు చేయరాదు అంటాడు  గరుడాళ్వారి అవతారం అయిన మనవాళ్లయ్య.  వాళ్ల కంటే పెద్ద గుండం తయారు చేద్దాం, రాగి ధ్వజం చేతబట్టుకొని  మనవాళ్లయ్య గుండం తొక్కితే సరి అంటారు తతిమా వాళ్ళు. ఈ పనికి అభ్యంతరం ఉన్నవాళ్లసలు వైష్ణవులు కాదని కూడా తీర్మానిస్తారు.
ఇక మనవాళ్లయ్య నోరెళ్లబట్టే పని! తాను నిజంగ గరుడాళ్వారు అయితే ఎగిరిపోనా అనుకొంటాడు...ఏం లాభం..లౌక్యం గా తప్పుకోటానికి మరొకరి పేరు చెప్తాడు.ఊహు కుదరదు. రామానాయుడు అతడ్ని హెచ్చరిస్తాడు.. సారధినాయుడే జంగాలలో కలసిపోతే..పులిహోర చక్ర పొంగలి ఎలా.. ఇహ తప్పలేదు మనవాళ్లయ్య కు. శివాచార్యులు నెత్తిన వీరభద్రుని విగ్రహం ..శంఖం ఊదుతూ గుండం దాటినట్లే...తనుక్కూడా నెత్తిన రామస్వామి ఉత్సవ విగ్రహం పెట్టాలంటాడు. ఆమట్న..అయ్యవార్లను ఉన్నపళంగా పిల్చుకొస్తారు...
విషయం తెలిసి రంగాచార్యులు గుండం తొక్కడం వైష్ణవ విరుద్ధం ..అంటాడు.
కాని మునసబు ఊర్కొంటాడా...

'శక్కరం తొటి వొళ్లల్లా తెగ్గాల్చడానికి మంతరం కద్దా! అట్టే మాటలు శలవియ్యక, ఆ యిగ్గరమేదో సాతానోడికియ్యండి'

 తేల్చి చెప్పేస్తాడు... దానికి రంగాచార్యులు ఉత్సవవిగ్రహాలు శూద్రులు ముట్టుకోకూడదు ఇవ్వనంటాడు. ఇకనేం మనవాళ్లయ్య కు జీవం లేచొచ్చింది. తాను విగ్రహం తాకకూడదు కాబట్టి, రంగాచార్యులు ముసలాయన కాబట్టి అతని కొడుకు కృష్ణమాచార్యులు ఆ పని చేయాలంటారు. అందుకాయాన ఒప్పుకోడు. తనే సిద్దమౌతాడు చేసేది లేక.
అప్పుడు అకస్మాత్తుగా అక్కడికి ఒక చేత కరదీపము, రెండవచేత సూరకత్తి పట్టుకొని ..ఉంగరాల జుత్తు గాలికి తూగులాడుతూండగా...చెట్టు చాటునుంచి వస్తుంది నాంచారమ్మ. రంగాచార్యుల కోడలు. ఆరూపం చూసే  బెదరుతారు అంతా.  వస్తూనే ఆయన రెక్కలు పట్టుకొని ఉన్న నాయళ్లకు బాకు మొన చూపి ఆయన్ని వదలమని బెదిరిస్తుంది. అంతా బెదరి దూరం జరుగుతారు.
అసలీ గుండం తొక్కడమేమిటి..ఎందుకు..ఒక సారధి నాయుడు మతం మారితే తమకు దక్కని  పులిహోర, చక్కెరపొంగలేనా లేక వైష్ణవ మత ఉద్ధరణకా..వరుసగా ప్రశ్నించీ,తర్కించీ ముసలాయనను అగ్ని గుండం తొక్కించే బదులు తనే వస్తాను వెంటెవరు వస్తారూ...అంటే, ఒక్కరూ మాటాడరు. ఆ మట్నే పీరు సాయిబు ని పిలిచి, గుండం తొక్కగలవా అంటే ..నిస్సందేహంగా అంటాడతను.
పీరు సాయిబు..దూదేకుల సాయిబు..రామభక్తుడు కీర్తనలు చెపుతాడు..అతని సంసిద్ధత చూపి..ఇప్పుడు చెప్పండి.. మీ వైష్ణవ మతం గొప్పా? అతగాడి తురక మతం గొప్పా? అని నిలదీస్తుంది నాంచారమ్మ. సరే ఇక ...మీకేం కావాలి ...ఇపుడు శైవులకి పరాభవం జరగాలి. అంతే కదా అని అడిగి..తానో ఉపాయం చెప్తాను అంటుందామె.
శైవుల్లో శివాచార్లు లా గుండం తొక్కడానికి  వైష్ణవులలో కూడా ఓ తెగ  ఉన్నారు తెలుసా.. వారే తురకలు...పీరు సాయెబులు..అసలు పీరు అంటేనే స్వామివారి తిరునామమే.
అసలు పట్టణం లో హిందువులే పీర్ల పంజాలు ఉంచి గుండం తొక్కుతారు. ఇపుడీ పీరు సాయిబు..కబీరు దాసంత భక్తుడు ...ఇతడే గుండం తొక్కుతాడు..మీరంత అతని వెంట వెళ్ళి జయించుకు రండి అని చెప్తుందామె...

చివర మాటో చురక.. '
వేళకి భక్తి నిలుస్తుందో నిలవదో, చేతి కర్రలు మాత్రం మరవకండి' అని సలాహా కూడా.
ఆ తెల్లవారు ఝామున శివాచార్లు కణకణలాడే నిప్పుగుండం ఏర్పాటు చేసుకొన్నపుడు అకడికి శాయన్న గారు కూడా వెళ్లానంటాడు. శివాచార్లు గుండం దాటి అభిముఖంగా తిరిగాడో లేదో...'అల్లా-రామ్' అంటూ అరుస్తూ  ముందు వెండి పీరు తో
ప్రవాహంగా అటునుండి గుండం దాటుకు సాగిపోయారు కొందరు.  అంతా అరనిముషం సేపే. ఇరు పక్షాల కొందరికి కాళ్ళు కాలినా అది భక్తి లోపం కింద జమకట్టారు.
శరభయ్య కీ మనవాళ్లయ్య కు రాజీ కుదిరింది అంటారు కాని పైకెపుడూ దెబ్బలాడుకొంటూనే ఉంటారట.

అదిగో అప్పట్నుంచీ ఆ రచ్చ సావిట్లో నిలిపిన  ఆ పీరు తో ఊర్లో పీర్ల పండగ చేస్తారు శైవ వైష్ణవ భేదం లేకుండా.శాయన్న భుక్త తన కధ పూర్తి చేశాడు.

శాస్తుల్లుగారు, అంతా విని  కలికాలం లో మనుష్యలే కాదు దేవుళ్ళు కూడా సంకరం అవుతున్నారని వాపోతాడు.
' అయినా తప్పేమి? శివుడన్నా,విష్ణన్నా, పీరన్నా, బుద్ధుడన్నా ఆ పరమాత్మ ఒక్కడే కదా.. '







 





 

Thursday, 18 October 2018

నీలి కురింజి

ఓ పూవు పూసింది


పన్నెండు సంవత్సరాల కి ఒకసారి పూసే పూలు ' నీలికురింజి' పూలు. ఇవి పశ్చిమ కనుమల్లో పూస్తాయి.

ఈ సారీ పూసాయి. కాని కాస్త ఆలస్యంగా.  కేరళ.. మున్నార్ ప్రాంతం అంతా ఈ పూల సంబరాలకి, అందుకోసం వచ్చే యాత్రీకులను, దృష్టిలో పెట్టుకుని ని ఎదురు చూస్తూంటే, అనుకోని విపత్తు... వర్షాలు, వరద‌..విలయతాండవమే చేసింది ప్రకృతి. అది తీవ్రమైన విఘాతం ..  చెట్ల న్నీ మళ్ళీ పచ్చదనం తొడుక్కున్న సమాచారం. నీలి కురింజి ..పూలు పుష్పించాయి..పర్వత కనుమలు... అందాలు చూడడానికి ఆహ్వానం పలికింది.

అందుచేత మున్నార్ ప్రయాణం పెట్టుకొన్నాం. అయితే ఈ పూలు చూడాలంటే...Eravikulam national park కి వెళ్లాలి. మున్నార్ పట్టణం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 97 చదరపు కి.మీ విస్తీర్ణం ఉన్న ఈ పార్క్ అన్నమలై నుంచి తమిళనాడులోని పళని కొండలవరుకు ఉన్న అటవీ ప్రాంతపు అంతర్భాగం. కేరళ అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది ఈ నేషనల్ పార్క్.  ఇంకా లోపలకు వెళ్లడానికి అటవీ శాఖ వారికి, అక్కడి ట్రైబల్స్ కి తప్ప ఎవరికీ అనుమతి లేదు. ఇకడికి చేరుకోటానికి  మన ప్రైవేటు వాహనాలు అనుమతించరు. టికెట్ కొనుక్కొని  అటవీ శాఖ వారి వాహనం లో వెళ్లాలి. కొంత దూరం లో వదిలి వేస్తారు. 
అక్కడ్నుంచి దాదాపు రెండు కి.మీ. దూరం ట్రెక్కింగ్ ఉంది.

నీలి కురింజి పూల ను వెతుక్కుంటూ వెళ్లాం. కొన్ని చోట్ల తప్ప,
ఇవి ఆశించినంతగా విరగబూయ లేదు.

కాకపోతే, వానమబ్బుల్లోంచి నడుస్తూ, పచ్చదనాలను చూస్తూ...చిన్న చిన్న నీటి ప్రవాహాలను చూస్తూ.. నడిచినంత మేరా...చాలా బాగుంది.  పర్యాటకులు కూడా చాలామంది వచ్చారు. ఇంకా వస్తున్నారు.
మరి, పన్నెండు సంవత్సరాల కు ఓసారి పూసే ఈ పూలు..ఎలా ఉంటాయో అనే కుతూహలమే!

ఈ అపురూపమైన పూవుకి ఓ ఫోటో తీశాను

సంగం సాహిత్యం లో  కురింజి తిన్నై అనే పద్యాలతో కూడిన భాగం ఉంది‌.  అంటే,  ఈ కురింజి పుష్పాలపేరే...!
ఎంత అందమైన పేరు ఈ కవిత్వానిది!
 'కురింజి తిన్నై'. అందమైన ఈ పడమటి కనుమల్లో ఉండే  జన జీవనానికి సంబంధించినదీ కవిత్వం.

అనేకమంది కవులు  ఒకే విధంగా రాసి సంకలనం చేసిన చిన్న చిన్న పదాలతో కూడిన  పద్యాలు గా చెప్పబడినవన్నీ ఎనిమిది ప్రకరణాలుగా విభజింప బడ్డాయి. 'ఎట్టు తొంగై' అంటారు అన్నిటినీ కలిపి. ఒక్కో ప్రకరణానికి ఒక్కో పేరు ఉంది.
ఎలా అంటే ప్రజల జీవన విధానం వారు జీవించే నేల లేదా నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఉంటుంది. వీటిని ఐదు ' తిన్నై' లు గా వర్గీకరించారు. ఇవి వరుసగా కురింజి, ముల్లై, మారుతమ్, నైతాల్, పాలమ్.
కొండ ప్రాంతం అంతా కురింజి అని, అడవి ప్రాంతం భూమి మలై అని, సముద్ర ప్రాంతం లో భూములు నైతాల్, చదునుగా ఉన్న భూభాగం మారుతం‌‌. చివరగా 'పాలమ్'  ప్రాంతం విడిగా ఏమీ లేదు కాని, వర్షాభావం వల్ల బీడుగ మారిన అడవి, కొండ ప్రాంతాలు..ఇందులో వర్గీకరించారు.

కురింజి తిన్నై పద్యాలు ప్రేమికుల రహస్య సమావేశాలు, వారి ప్రేమ ,పెళ్ళి ల పై..రేగే పుకార్లు.....ప్రేమికుల సమాగమం ప్రధానాంశంగా ఉంటాయి కురింజి తిన్నై పదాలు.

కవిత్వ కాలం ' కుళిర్' కాలం...చల్లని సమయాలు..ఈ ప్రాంతంలో అక్టోబర్ మధ్య నుంచి నవంబరు మధ్య దాక, తమిళం లో 'అయిప్పాసి' అంటారుట. (మన ఆశ్వయుజ మాసం లాగా). బహుశా, అంత ముందు కురిసిన వానలకి ఆ కొండ ప్రాంతం లో ఏర్పడిన చిన్న చిన్న జలపాతాలు..పచ్చని చెట్లు..వలసవచ్చిన పక్షులకిలకిలు. ఓ చల్లని వాతావరణం ఏర్పడుతుంది.

 ప్రేమలో పడ్డాక..ఒకరినొకరు చూడకుండా ఉండలేరట.ఒకానొక పడచు తన నెచ్చెలి ప్రణయ బాధను ఇలా అన్యాపదేసంగా చెప్తోంది ఇలా..

అర్థరాత్రి రావద్దు.

కొమ్మల్లో వేలాడుతూ దూకే నల్ల కళ్ల మగ కోతి ప్రమాదవశాత్తు చనిపోతే, తన మగని మరణాన్ని సహించలేని ఆడ కోతి తన పసి బిడ్డను తనవాళ్లకి అప్పగించి తనూ ఎత్తైన కొండమీదనుంచి దూకడానికి సిద్ధమైంది. గిరి సంచారకా..నీవు మాత్రం అర్ధరాత్రి రాకు. చిరాయడవు కా. మాకు కష్టం కలిగించద్దు సుమా!

ఎంతో అలవాటు గా కొండల అంచుల్లో దూకే కోతే ఓ రాత్రిపూట పట్టుదప్పి ప్రాణాలు పోగొట్టుకొంది. అంటే ఈ కొండదారి ప్రమాదకరం సుమా అంటూ హెచ్చరిస్తూ, తన చెలి అతని వియోగం ఏ మాత్రం భరించలేదనీ...చెబుతోంది. మరి ఎలా..
అంతరార్ధం... అతనెంత పర్వతాల్లో తిరిగినవాడైనా అర్ధరాత్రి కొండదారి ప్రమాదం అని, తన సఖిని మనువాడితే, ఈ అర్ధరాత్రి ప్రమాదకరమైన ప్రయాణాలు తప్పుతాయి కదా అని చెప్పడఁవూ ఉంది.
ఇలా పదాలు, ప్రాచీన తమిళ భాషలో రాయబడ్డాయి.. వీటిని అనేకమంది ఇంగ్లీషు లో అనువదించారు... అంతే కాదు వీటికి పెద్ద చరిత్రే ఉంది.

Ms Grace Piradhiba బ్లాగ్ చదివి తనతో చెప్పి ఇలా నాబ్లాగ్ లో రాసుకోవడానికి పర్మిషన్ అడిగా....తనెంతో సంతోషంగా వొప్పుకొంది... తమిళ సాహిత్యం అందరికీ తెలియడం మంచిదేగా అంటూ. తన బ్లాగ్ లింక్ కూడా ఇస్తున్నా.

http://sangamliteratureinenglish.blogspot.com/search/label/Introduction%20to%20Sangam%20Literature?m=0





Tuesday, 4 September 2018

చారథామ్ యాత్ర- గంగోత్రి

ముదిమి లో సాహస యాత్ర చార్ ధామ్ యాత్ర

అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం,
దేహాంతే తవ సాయుజ్యం, దేహి మే పార్వతీ పతే

చతుర్విధ పురుషార్ధాలలో మోక్ష సాధనే కదా అంతిమ లక్ష్యం.  మోక్షసాధన కోసం చేసేది ఈశ్వారన్వేషణ.....!
లౌకికులకు  తీర్థయాత్రల ద్వారానే అది కుదురుతుంది. కాదంటారా?

మే నెల 24 నుంచి జూన్ 7 వరకు మా  చార్ ధామ్ యాత్ర సాగింది. అసలు యాత్ర, రిషికేశ్ నుంచి మొదలవుతుంది.
దేవభూమి గా పిలవబడే ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్-  నాలుగూ...  పడమర నుంచి తూర్పు వరకు  స్ట్రాటజిక్ గా ఉన్నాయి.  యమునోత్రి, గంగోత్రి ఉత్తరకాశి జిల్లా లో, కేదార్‌నాథ్ రుద్రప్రయాగ్ జిల్లా లో,బద్రీనాథ్ ఛమోలీ జిల్లాలో వున్నాయి.

ఎత్తైన హిమాద్రి పర్వత శ్రేణికి చెందిన పర్వతాలు..లోయలు, నదీ నదాలు.. పచ్చని చెట్లు... కనుల పండువుగా...
తపోనిష్టలో ఉన్నట్టు నిటారుగా ఉన్న చెట్ల సముదాయం... వేటికవే ఈశ్వర ఉనికిని చాటుతున్నట్టు..ఏదో మార్మిక రహస్యం గుట్టు విప్పబోనున్నట్టు.
మనసు మురిసిపోదా. ఈశ్వరుడు ఉండేది ఇక్కడే...కనగలిగిన మనసుంటే...!

ఆధ్యాత్మిక చింతన కోసం మరీ ముక్కు మూసుకొని ఉండే పనిలేదు..ఇలా పకృతి రమణీయత ను కళ్లు విప్పార్చుకొని చూస్తూ, ఈ నిశ్శబ్ద సంగీతాన్ని చెవులు దోర చేసుకొని వింటూ...చాలదా...! అదే విశ్వ కవీంద్రుని మాటల్లో..

వైరాగ్యం లోంచి మోక్షం నా కవసరం లేదు
సహస్ర ఆనంద బంధాలలో
స్వతంత్రం నన్నాలింగనం చేసుకుంటుంది.
………………………………………………………………
………………………………………………................
నా జ్ఞానేంద్రియ ద్వారాల్ని ఎన్నడూ మూయను.
నా దృష్టి శ్రావణ స్పర్శనానుభవాలు
నీ ఆనందాన్ని తీసుకొచ్చి నా కిస్తాయి
           ( విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ గీతాంజలి - చలం గారి అనువాదం నుంచి)

చార్ ధామ్ ప్రయాణం అంతా ఘాట్ మార్గం లోనే ఉంటుంది. అయితే సాయంత్రం ఏడు వరకూ మాత్రమే ప్రయాణం చేయగలం. చీకటి పడీపడకుండానే ఆగి ఆ రాత్రికి వసతి చూసుకోవాలి. మళ్ళీ వెలుగు రేఖలు పూర్తి గా వచ్చాకనే ప్రయాణం.

 ప్రయాణిస్తున్నంత సేపూ, ఒక పక్క పెద్ద పెద్ద పర్వతాలు ఎత్తైన వృక్షాలని మోస్తూ..నిశ్చలంగా.. గంభీరంగా..... మనకు అణకువ నేర్పిస్తాయి.  మలుపులు తిరగిన బాట దారి ఇస్తూ,  తమ లోపలకి..మరో దారి చూపిస్తూ.....మరోపక్క లోతైన లోయలు.....కొంత దూరం పోయాక తలపక్కకి తిప్పి చూస్తే.. దూరంగా అవే దారులు కదా  మనం దాటి వచ్చాం అనిపిస్తుంది.!

వీటితో పాటు..జలవిద్యుత్ కట్టడాలు..  నిర్మాణంలో ఉన్న తెహ్రీ డామ్  (modern temple)...దేశంలో నే అతి పెద్ద డామ్, భాగీరథి నదిమీద కడుతున్నారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా సాగుతున్న ప్రాజెక్టు దాదాపు పూర్తి అయింది.

ఎప్పుడో 40 ఏళ్ల కిందట మొదలైందిట ఈ ప్రాజెక్టు... రకరకాల కారణాల వల్ల... అంటే మొదట్లో సుందరలాల్ బహుగుణ వంటి ఎన్విరాన్మెంటలిస్ట్ ల వ్యతిరేకోద్యమం ,రష్యన్ సాంకేతిక  సహాయం అక్కడి రాజకీయ పరిణామాల కారణం తో నిలిచిపొవడం, కొంత నిధుల కొరత....ఎలాగైతేనేం కొంతకాలం ప్రాజెక్టు ఆగిపోయింది.  ఈ డామ్ ప్రభావం ఏమో కొన్నిచోట్ల చాలా ఎండిపోయిన..నదీ ప్రవాహ ప్రాంతాలు కనిపించాయి. వర్షాలు పడేదాకా అంతే అనుకొంటాను.

*గంగోత్రి* [29/5& 30/5/2018]

 మొదట గంగోత్రి  కి వెళ్లాం. గలగలా గంగమ్మ పరవళ్ళు..
'గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా...!'

 అలాగే *బుల్లి* చెంబు సంపాదించి స్నానం చేశాను..చల్లటి నీరు వంటి మీద పడగానే చలి అనిపించింది. తర్వాత....మరోసారి..మరోసారి..గంగమ్మతల్లి కి నమస్కరించి, పొడి బట్టలు కట్టుకొని గుడికి వెళ్లాం. విశేషించి ఇక్కడ దుస్తులు మార్చుకోవడానికి చక్కటి సదుపాయం కూడా ఉంది.
గుడిలో బంగారు గంగని కళ్లారా చూసి..పక్కనే  శివుని గుడీ దర్శించుకొని బయటకు వచ్చాం. ఓ చోట కూర్చుని  ఆదిశంకరుల గంగా స్తోత్రం చదువుకొన్నాం..

'హరిపదపాద్యతరఙ్గిణి గఙ్గే హిమవిధుముక్తా ధవళతరఙ్గే  దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్'

మొదట, నిరాకార అయిన గంగ బ్రహ్మ మానస పుత్రిక అనీ..వామనావతారం లో విష్ణుమూర్తి ఆకాశంలో పాదం పెట్టగా ఆ పాదాన్ని, బ్రహ్మ ,గంగ ని సాకారమొనర్చి కడుగుతాడు..అలా
అలా...అది బ్రహ్మ కడిగిన పాదం..అలాగే విష్ణు మూర్తి పాదాల నుంచి ఆకాశగంగ జాలువారిందనీ పురాణగాథ. గంగ ని నీరు కి పర్యాయపదంగా కూడా వాడుతారు కదా. ఇది నే చదివిన పురాణం.. మాత్రమే.

అక్కడికి  దాదాపు ఓ రెండు కిలోమీటర్ల దూరంలో మేము వచ్చిన బస్ ఆపి ఉంచారు. తీరా వెళ్ళి చూస్తే మా బృందం లో వేరే వాహనాల్లో వచ్చేవారికి ఏదో అవాంతరం వచ్చింది...కనక వాళ్ళు వచ్చే వరకు ఆగాలని సమాచారం. కాని ఆ రాత్రికి గంగోత్రి లోనే బస. మా యాత్ర నిర్వాహకునికి అనుకోని పరిణామాలు ఎదుర్కోటానికి ఎటువంటి  ప్లాన్ ఉందో  తెలియదు కాని, కొంచెం ఆలస్యం అయినా ప్రత్యామ్నాయ సదుపాయాలు చేసేసారు..

ఆ రాత్రికి అక్కడే...గంగ ఒడ్డునే వసతి గృహం. పౌర్ణమి అయినా వెన్నెల ప్రభావం తక్కువే... గంగమ్మ నురగల వెలుగులే అంతా..! ఆ మనోహరమైన దృశ్యం చూసి తీరాలి..! చలిపెడుతున్నా సరే...బాల్కనీ లోంచి అలా చూస్తూ కూర్చున్నాం.

మర్నాడు పొద్దున్నే.. మొబైల్ కెమెరాలు పట్టుకొని ..వంతెన మీద నుంచి అవతలి వడ్డుకి వెళ్లాం.

'గంగ కూడా పర్వతరాజు హిమవంతుని కూతురే..శివుణ్ణి ప్రేమిస్తుంది. కాని ఆమెకు నిర్దేశించిన మార్గం వేరు అంటాడు విష్ణువు..'

నా చేయి పట్టుకొని నడుస్తూ  నా స్నేహితురాలు సరస్వతి చెప్పింది.  ఈ కోణం కొంత ఆశ్చర్యం, ఆసక్తి రెండూ కలిగించింది. టివి లో ఏదో సీరియల్ లో అలా చూపారట. కాని నాకు భగీరధుడు కథ మాత్రమే తెలుసు.

వాల్మీకి రామాయణం లో శ్రీ రామచంద్రుడు ముల్లోక పావని అయిన గంగ వృత్తాంతం చెప్పమని అడగ్గా...విశ్వామిత్రుడు చెప్తాడు. హిమవంతుని మొదటి కుమార్తె గంగ...రెండవ కుమార్తె పార్వతి. గంగ వల్ల గొప్ప దైవ కార్యాలు నెరవేరవలసి ఉండడం వల్ల దేవతలంతా గంగని సురలోకానికి పంపమంటే తండ్రి హిమవంతుడు  పంపిస్తాడు. పార్వతి తపస్సు చేసి శివుని మనసు చూరగొని అతని అర్థాంగి అయింది.

భగీరధుని ప్రార్థన ఫలిస్తుంది. ఉధృతంగా పైనుంచి దుమికిన ఉన్న గంగను తన జటాజూటం లో స్థానం కల్పిస్తాడు శివుడు.. అపుడు గంగ .....శివుని తనతో పాతాళానికి తీసుకొని పోదామని భావిస్తుంది. కాని ఆమెను శివుడు తన శిగలో బంధిస్తాడు. తిరిగి ప్రార్థించగా...ఓ పాయను విడుస్తాడు అలా భగీరధుని వెంట పరవళ్ళు తొక్కుతూ... పరుగులు పెడుతూ కొన్ని చోట్ల, నిదానంగా మరి కొన్ని చోట్ల,  కొన్ని చోట్ల దుడుకుగా..గంగా ప్రవాహం సాగుతుంది.. జహ్నుముని ఆశ్రమం ముంచెత్తగా,  కోపించి గంగను ఔపోసన పడ్తాడాయన..తిరిగి తన చెవిలోంచి వదులుతాడు..అక్కడ జాహ్నవిగా ప్రవహిస్తుంది. అలా..భగీరధుని వెంట పాతాళానికి వెళ్ళి అతని పితృదేవతలను పునీతం చేస్తుంది..  అయితే గంగ పరాశక్తి అంశగాను, శివుని శిరమందు బంధించ బడినందువల్లనూ శంకరుని పత్ని అయినది....ఇది పురాణం.

గంగ కి ఒక వ్యక్తిత్వం ఇచ్చారు మనవాళ్ళు.  జీవనది గా తాను ప్రవహించినంత మేరా సస్యశ్యామలం చేస్తూ, నడక ని కూడా పల్లవించిన ప్రాంతానికి అనుగుణంగా,నిదానంగా, మెల్లగా మార్చుకొంటూ...చిన్న, చిన్న నదీనదాల్ని సోదరి లాగ ఆదరించి కలుపుకొంటూ ప్రవహించినంత మేరా పావనం చేస్తూ పోతుంది గంగ. పాప ప్రక్షాళన చేసి జీవులకి సద్గతి ని  ప్రసాదించే మహత్తర బాధ్యత ఆమె పై ఉంది కదా..బహుశా కలియుగాంతం వరకూ ఇంతేనేమో...!  తిరిగి శివుని చేరేదెన్నడో...!!

భౌగోళికంగా  చూస్తే.. గోముఖం దగ్గర సన్నధార గా మొదలైన గంగ అక్కడ భాగీరథి నది గా పిలవబడింది... తెల్లగా నురగలు కక్కుతూ..కిందికి జారింది.....దేవ ప్రయాగ దగ్గర అలకనంద తో సంగమించి 'గంగ' గా పిలువబడుతుంది..ప్రవాహమార్గంలో ఎన్నో నదులు కలుపుకొంటూ హరిద్వార్ దగ్గర ఉధృతంగా ప్రవహిస్తూంటుంది గంగ. యమునానది గంగ కి ఉపనది అయినా ప్రాశస్త్యం తక్కువేమీలేదు. గంగేచ...యమునేచ అంటూ ఆహ్వానిస్తారు కదా!  యమునా నది అలహాబాదు దగ్గర గంగ తో కలుస్తుంది.. అక్కడ సరస్వతీ నది అంతర్వాహిని. కలిపి త్రివేణి సంగమం.
సరస్వతీ నది *మన* దగ్గర  అంతర్థానమైంది..పురాణ కధ ఏమంటే,  మహాభారత రచన సమయంలో నదీ హోరుకు ఏకాగ్రత భంగమవగా వ్యాసులవారు సరస్వతి నదిని అంతర్థానం కమ్మని శపిస్తారు. ఈ ప్రాంతం బదరి కి  3 కి.మీ దూరంలో ఉంది కాని అప్పటికే.. సమయం కలసి రాకపోవడం వల్ల ..వెళ్లలేకపోయాం.

*ఈశ్వరానుభవం*

ఇంకా గంగోత్రి లోనే...ఉన్నాం కదా. అంతకు ముందు రోజు స్నానాలు చేయలేకపోయిన వాళ్ళు కూడా ఉదయాన్నే స్నానాలు చేశారు...అవును మరి.. మన ఇంటి దగ్గర ..చెంబెడు నీళ్ళలో గంగాదేవిని ఆహ్వానించి.. స్నానం చేయగాలేనిది, సాక్షాత్తూ గంగమ్మ దగ్గర కి వచ్చి చలి అనుకొంటే ఎలా...! అందుకే అంతా పొద్దున్నే గంగానదిలో స్నానాలు చేశారు.

మేమీ ఒడ్డున గంగాదేవి కథలు చెప్పుకొంటూ కూర్చున్నామా, మాతో వచ్చిన మరో మితృరాలు వల్లీ,  వంతెనమీద కనిపించింది... తనకి మా ఫోన్ కాల్ అందలేదు..చేతులూపినా చూడలేదు. ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు పర్వతాలకేసి చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. సరే మేమే నిదానంగా లేచి తనని కలిశాం. ఇంకా అలాగే ఎదో లోకం లో ఉన్నట్లు.. పలకరిస్తే..   'ఫోన్ ఛార్జింగ్ పెట్టాను' అని జవాబిచ్చి, మళ్లీ చెప్పింది. 'ఇలా వచ్చి ఈ పర్వతాలను చూస్తుంటే..ఈశ్వరుడు ఇక్కడే తిరుగాడుతున్నాడా అన్నట్లుంది.  పరమేశ్వరుడు.. పెద్ద పెద్ద అంగలతో కలియ తిరుగుతున్నట్లు... సతీదేవిని ఎడబాసిన బాధ, కోపం కలిసి..'. ఉద్వేగంతో  తన గొంతు పూడుకు పోయింది.  ఓ క్షణం వెర్రి దానిలా చూశా..!
*ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పోలిక*...ఈశ్వరుడు ఎవరికి ఎలా కనిపిస్తాడో కదా.....పరమేశ్వరా..! అనుకొని మనసులోనే నమస్కరించాను.

ఈ లోగా ప్రయాణం హడావుడి.. యథా ప్రకారం సామాన్లు సర్దుకుని బస్ దగ్గర కు నడక.(ఇంకా ఉంది)
###########

#బద్రీ నాథ్ [1/6 & 2/6/18  ]


గంగోత్రి లో కొంచెం త్వరగానే లంచ్ చేసి బయల్దేరాం. మా యాత్ర నిర్వాహకులు శర్మ గారు, ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా, మా అందరికీ కాఫీలు, ఫలహారాలు..భోజనాలు సదుపాయం గానే చేశారు.  ఈ సుదీర్ఘ ప్రయాణాల్లో, ఆరోగ్యంగా ఉండడమే కదా ముఖ్యం. 


30/5/18 

రాత్రికి ఉత్తర కాశిలో బస.  అనుకొన్న ప్రకారం వెళ్లడానికి

కేదార్‌నాథ్ లో వాతావరణం అనుకూలంగా లేదని.. బదరీ అన్నారు. మళ్ళీ ప్రయాణం. అవసరమైన దుస్తులు ఓ చిన్న బాగ్ లో సర్దుకుని.. పెద్ద పెట్టి లాక్ చేసి బస్ డిక్కీలో నే ఉంచేశా అందరిలాగానే.


31/5/18.

సరే.. ఉదయమే అల్పాహారం అవుతూనే బయల్దేరాం.

రోజంతా ప్రయాణం. అక్కడక్కడా కాఫీ,టీ లకి చిన్న చిన్న విరామం.  అయితే ఇక్కడొకటి చెప్పుకోవాలి. మా బస్ లో చాలా మంది శ్రవణానందకరంగా భక్తి పాటలు పాడారు.. ముఖ్యంగా శ్రీమతి రాజశ్రీ గారు శివానందలహరి ఎంత చక్కగా ఆలపించారో. ఇంకా శ్రీమతి జయ,శాంతి, వల్లీ..వీరంతా చక్కని గీతా కదంబమాల తో వాతావరణం లో పరిమళం నింపారు.

ఆకలి దప్పిక ల్లాంటి చిన్న ఆరాటాల్లో ...జారిపోతున్న వేళ ...భక్తిని మళ్ళీ పొదువు కొంటూ అవసరమైన చోట గొంతు కలిపారంతా. సాయంత్రం ఏడు అయితే చాలు ఘాట్ రోడ్డు లో ప్రయాణం ఆగిపోతుంది.  కర్ణప్రయాగ దగ్గర ఓ హొటల్లో ఆరాత్రి ఆగాం. 


1/6/2018


తెల్లవారుతూనే  బదరీకి ప్రయాణం. ఓ మూడు,నాలుగు గంటల్లో  బద్రీనాథ్ చేరవచ్చు. ఒక రెండు గంటలు ప్రయాణించాక జోషీ మఠ్ వచ్చింది. శంకరమఠం చూడాలని ఉన్నా బదరీ ఆరోజే వెళ్లాలని, కొందరు అక్కడ బ్రహ్మ కపాలం దగ్గర పితృకార్యాలు చేయించే ఉద్దేశంతో ఆగలేదు. కాని,  కొంత దూరం పోయాక ఆగక తప్పలేదు. తామొకటి తలిస్తే, అన్నట్టు దైవికమేమో కాని, దారిలో కొండ చరియలు విరిగి పడ్డాయి, దారి మూసుకు పోయిందనీ, పూర్తి గా అడ్డు తీయాలంటే ఎంత లేదన్నా ఓ నాలుగు గంటల సమయం పడుతుంది అనీ సమాచారం. ఉసూరు మంటూ కూర్చున్నాం. కొంతసేపటికి, తను..శీమతి రాజశ్రీ గారు ముకుందమాల పాడటం ప్రారంభించారు. కృష్ణ శబ్దం తప్ప దూరానికి ఏఁవీ స్పష్టంగా లేదు కాని..చక్కని రాగాలాపన..అగరొత్తుల గుభాళింపులా...అంతా ఆవరించింది. బహుశః అది బదరీ నారాయణుని చేరిందో ఏమో..కాసేపటికి మాకు క్లియరెన్స్ వచ్చేసింది. ( ఆవిడ ఏం పాడారో తర్వాత అడిగి తెలుసుకొన్నా).


ఈ లోగా అనుకోకుండా బస్ ఓ మోస్తరు పెద్ద రెస్టారెంట్ దగ్గర ఆగిందేమో, కాఫీ,టీలు, భోజనాలు ఎవరికి వారే కానిచ్చారు. 

బదరీ నారాయణ్... బదరీ విశాల్ కి జేజే ధ్వనులు పలుకుతూ కదిలాం.


ఎలాగైతేనేం ..రోడ్డు బాగయింది..ప్రయాణం కొనసాగింది. సాయంత్రానికి బద్రీనాథ్ చేరాం. మఠం లో పెద్ద హాలు ఇచ్చారు అందరికీ కలిపి. సామాన్లు పడేసి సాయంత్రం దర్శనానికి వెళ్లాం.


అసలు చార్ ధామ్ అంటే బద్రీనాధ్,ద్వారకా,పూరీ ఇంకా రామేశ్వరం ఈ నాలుగూ.  మేం ఇప్పుడు చూసినది చిన్న చార్ధామ్.(యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్).

బద్రీనాథ్ ఆలయం ఆది శంకరుల చే పునరుద్ధరించబడింది.

అంతకు మునుపు బౌద్ధ ఆరామంట. అందుకే కాబోలు గుడి ముఖ ద్వారం బౌధ్దారామాన్ని పోలి ఉంటుంది. 

 

అలకనందా నది పక్కనే వెలసిన క్షేత్రం బదరీక్షేత్రం. దాదాపు 10800 అడుగుల ఎత్తు. చలీ ఎక్కువే. గుడి వేపుకు వెడుతుంటే ఎడమ పక్క దూరంగా మంచు కప్పిన పర్వతాలు కనిపించాయి. శిఖరంలా ఉన్న దానికి రాత్రి వెలుగు లో ఫోటో తీశా. అది *నీలకంఠ పర్వతమని* తర్వాత తెలిసింది.


నరనారాయణులు వెలసిన ప్రాంతం. బదరీ అంటే రేగి చెట్టు అని, నారాయణుడు బదరీ చెట్టుకింద ధ్యానంలో ఉండాగా లక్ష్మీదేవి రేగుచెట్టు తానై నీడనిచ్చిందని అప్పట్నుంచీ రేగి చెట్టు లక్ష్మీనివాస స్ధానం అయింది ..అలా విష్ణు మూర్తి అక్కడ బదరీ నారాయణుడిగా అవతరించాడని కధ. నాకైతే ఆ ప్రాంతంలో రేగి చెట్టు కనపడలేదు. స్థల పురాణానికి సంబంధించిన పుస్తకం కూడా  కొన్నా. 

 

దైవ దర్శనం అయితే కాస్త దూరంగానే చూడనిచ్చారు. అక్కడ చలికాలం లో గుడి మూసివేసినా కూడా వెలిగే అఖండ జ్యోతి ఉంది .చలికాలంలో నారదుడు వచ్చి స్వామిని పూజిస్తాడని చెప్తారు. లక్ష్మీదేవి తో పాటు నారదుడు, కుబేరుడు స్వామి వారి పక్కన కొలువై ఉంటారు


2/6/2018

నిజరూప దర్శనం తెల్లవారుజామున ఉంటుంది అని కొంతమందిమి లేచి వెళ్ళి నిజరూప దర్శనం చేసుకొన్నాం. తెల్లవారేసరికి అతి పెద్ద క్యూ. అంతరాలయానికి వెళ్ల లేకపోయాం అదే కొరత.  నర నారాయణులు లోక కళ్యాణం కోసం తపస్సు చేసిన స్థలం. విష్ణు సహస్రనామం చదువుకొన్నాము.


ఆ రోజు ఉష్ణగుండం లో స్నానం. పట్ట లేనంత వేడి. ఎన్ని సదుపాయాలున్నా, జనం ఎక్కువగా వచ్చారారోజు. 


*బ్రహ్మ కపాలం* మరో ప్రాంతం అనుకొన్నా అక్కడికి వెళ్లేదాకా. గుడి దాటి, అలకనంద కి ఎగువగా దాదాపు ఒక కి.మీ దూరం లో ఉంది. అతి పెద్ద రాయి..కపాల ఆకారంలో ఉంటుంది.

చతుర్ముఖ బ్రహ్మ గారికి ముందు ఐదు తలకాయాలు వుండేవట. శివపార్వతుల కళ్యాణం చేయిస్తూ పార్వతి సౌందర్యానికి మైమరచిన పాపానికి,  శివుని చేత తల తెగుతుంది. కాని ఆ తల ఊడి పడక శివుని చేతికే అతుక్కుని ఉంటుంది. బ్రహ్మ హత్య పాప పరిహారానికి శివుడు అంతా భిక్షాటన చేసి ఇక్కడ విష్ణువు దగ్గర కి వచ్చేసరికి అది ఊడిపడిందిట. స్థల పురాణం.. తెలిసినా చెప్పుకోవడం ఆనవాయితీ.

 బ్రహ్మకపాలం దగ్గర పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వర్తిస్తే, వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. కొంతమంది ఆత్మ పిండం కూడా పెట్టుకుంటారు కాని అలా చేస్తే ఇక ఏ శుభానికీ పనికిరారని చెప్పి, అలా  అనుకొన్న వాళ్ల సంకల్పం మానిపించారు పంతులుగారు. ఇక్కడ జ్ఞాతులకే కాక బంధు మిత్ర వర్గాల్లో..ఎవరికైనా పిండప్రదానం చేయ వచ్చు... పోయిన వాళ్లంతా మంచి వాళ్లే...అనుబంధాలు గుర్తుకొచ్చి కళ్లు చెమర్చే క్షణాలు...!

  

బదరీ నారాయణుని దర్శించి.. స్మరించి.. ఆ మధ్యాహ్నం భోజనాలు అవుతూనే తిరుగు ప్రయాణం. ఎంచేతో అంతా బాగా అలసిపోయాం. బరువుగానే బయల్దేరామంతా. ఇక అక్కడ దగ్గర లోనే ఉన్న అతి ముఖ్యమైన ప్రదేశం  'మన' చూడ్డానికి ఎవ్వరికీ ఓపిక లేక పోయింది. 

'మన'  లోనే  వేదవ్యాసుడు మహా భారతం రచన చేసినట్లు.. చెప్తారు. వ్యాసుడు చెప్తూ ఉండగా విఘ్నేశ్వరుడు వ్రాసినట్లు తెలుస్తున్నది. సరస్వతీ నదీ సుళ్లు తిరుగుతూ ఇక్కడే అంతర్థానమవుతుంది..వ్యాసులవారి శాప కారణంగా... ఉత్సాహంతో చూడాలనుకొన్నా సమయాభావం.. 

కేదారేశ్వరుడు పిలుస్తున్నాడు ఒక పక్క..!!!


@@@@@@@@@

చార్ ధామ్ _3


*కేదార్‌నాథ్* (.3/6, 4/6 ..5/6)


ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కేదారేశ్వర లింగం. 

ఈ ఆలయాన్ని శ్రీ ఆదిశంకరులు పునరుద్దరించారట. .


సముద్ర మట్టానికి 11700 అడుగుల ఎత్తు లో ఉండే ఈ శిఖరంపై  క్షణం లో వాతావరణం మారిపోతూ ఉంటుంది. .ప్రతికూల వాతావరణం ఏర్పడిందంటే ఎప్పుడు సాధారణ పరిస్థితి కి వస్తుందో చెప్పలేం. విపరీతమైన మంచు కారణం గా నవంబర్ నుంచి ఆరు నెలలు మూసి ఉంచుతారు ఈ ఆలయాన్ని. తిరిగి అక్షయ తృతీయ నాడు తెరుస్తారు.


జూన్ 2


యధాప్రకారం గా బస్ ప్రయాణం. బదరీనాధ్ నుంచి. ఎంత అలసిపోయాం అంటే. చుట్టూ ఎటు వెడుతున్నామో కూడ ఆసక్తి లేదు. దూరం దాదాపు 200 కి.మీ పైనే..ఘాట్ రోడ్ లో 20  స్పీడ్ దాటకూడదు. అలా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ హోటల్ లో బస. తెల్లారి పొద్దున్నే కేదార్‌నాథ్ కి.


జూన్ ౩(ఆదివారం)


కేదారేశ్వరా ....!  జేజేలు కొట్టుకొంటూ కదిలింది మా బస్.  ఉదయం పదకొండూ ఆ ప్రాంతంలో చేరాం. అసలు కధ అక్కడ మొదలైంది.  


ముందు అనుకొన్నట్టుగా కేదార్‌నాథ్ వెళ్లకపోవడం తో, మా హెలికాప్టర్ కి బుక్ అయిన  ఆన్ లైన్ టిక్కెట్లు  కాన్సిలైతే, మళ్ళీ ప్రయత్నించి 3,4 తేదీల్లో చేయించాడు మా టూర్ నిర్వాహకుడు.  హెలికాప్టర్ సర్వీసులు రెండు మూడు ఉన్నాయి. అయినా, ఏదో లాటరీ తీసినట్లు వచ్చాయి. ఇక అక్కడనుంచి అందరికీ ఆదుర్దా..

అసలు వెళ్లగలిగితే చాలనుకొన్నాం. జూన్ మూడు, ఆదివారం. మాలో ఓ పదమూడు మందిని పినాకిల్ హెలీపాడ్ దగ్గరకు పంపారు. మా ఆధార్ కార్డ్స్ వెరిఫై చేశారు. వెయిట్ నోట్ చేసుకొన్నారు.  మధ్యాహ్నం వాళ్ల లంచ్ బ్రేక్ తర్వాత అన్నారు. వెయిట్ చేశాం. అంతే ....! వాతావరణం బాగాలేదని  హెలికాప్టర్ సర్వీసులు ఆపేశారు. 

మర్నాడు పొద్దున్నే నాలగున్నర కి రిపోర్ట్ చేస్తే ఫస్ట్ అవర్ లో పంపిస్తామన్నారు. ఉసూరంటూ హోటల్ రూమ్ కి  తిరిగి వచ్చేశాం.  మళ్ళీ అన్నమాట ప్రకారం పొద్దున్నే వెళ్తే.. చెక్ చేసి ఆరుగురు బాచ్ గా వెళ్లమన్నారు.  


ఇక్కడో ముఖ్య మైన సంగతి..ఎవరైనా ఎనభై కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటే పెనాల్టీ ఫీ కట్టాలి. బరువు లని బట్టి మనుషులను అడ్జస్ట్  చేస్తారు. 


హెలికాప్టర్ ఎక్కాం. deja vu....,! 


కింద పర్వతాలు, లోయలు దాటిపోతున్నాయి.  తూనీగలా వెంబడిస్తూ హెలికాప్టర్  నీడ. 

ఇరవై నిముషాల్లో కొండ మీద. 

దిగ గానే హెలికాప్టర్ వాళ్ల మనిషి..దర్శనానికి తీసుకు పోవడం మొదలు పెట్టాడు..ఓ పండిట్ ని మాట్లాడు కొన్నాం అంతా కలిసి. అన్నట్టు స్పెషల్ దర్శనం టికట్  ₹2500/-కి ఒకటి కిందనే తీసుకొన్నాం ..అది మల్టీ పర్పస్ ..స్పెషల్ దర్శనం లో శీఘ్ర దర్శనం ఒకటి,  వెళ్ళి న రోజే వెనక్కురావడం మరోటి. భరోసాగానే ఉన్నాం. 


ముందు రోజు వచ్చిన కొందరు పైనే ఉండిపోయారు.. (హెలికాప్టర్ సర్వీసు నమ్ముకొన్నందు వల్లనే_టిక్కెట్లు రెండువేపులా కదా)..అలా రాత్రికి ఉండడం అదో అనుభవం. మరోసారి దర్శనం చేసుకోవచ్చు.. కాస్త చలికి ఓర్చుకోవాలి అంతే.


*కేదార్‌నాథ్ స్థల పురాణం*


శివుడు ఇక్కడ పశుపతి నాధుడుగా ఉంటాడని చెప్తారు.తల భాగం నేపాల్ లో ని పశుపతినాథ్ లో ఉండగా ఇక్కడ మూపురం మాత్రం కనిపిస్తుంది. దీనికి ఓ స్థల పురాణం ఉంది


పాండవులు యుద్ధం అయ్యాక, తమ జ్ఞాతులను చంపిన పాప పరిహారం కోసం కేదారేశ్వరుడు దగ్గరి కి వస్తారుట.  ఆయన అందుకు ఇష్ట పడక వృషభ రూపంలో పశువుల మందలో కలసి పోతాడుట. కాని భీమ సేనుడు తన రెండు కాళ్లను ఎడంగా పెట్టి.. ఈశ్వరుడు తప్పించుకో లేడని భావిస్తాడు. అయితే ఈశ్వరుడు భూమిలోంచి దారి తీయగా, భీముడు  అది కనిపెట్టి తన గద తో మూపురం పైన అదిమి..పెడ్తాడు.అందుచేత అక్కడ మూపురం ఉంటుంది. కాని స్వామి తల పశుపతి నాథ్ ( నేపాల్) లో ఉంటుంది. వెన్నుకి అయిన గాయానికి నేటికీ ..మూపురాన్ని నేతి తో మర్దన చేస్తూంటారు. ఇలా, ఈ కధ అడగగా ఓ ఉత్తర హిందుస్తానీ ఆవిడ చెప్పింది.


శ్రీ ఆది శంకరుల వారిని సాక్షాత్తూ పరమేశ్వరుని అవతారంగా భావిస్తారు. నాలుగు దిక్కులా అద్వైత మఠాలని స్థాపించారు  ఆయన. తన ముఫ్ఫై రెండవ యేట...బదరీ...కేదార్‌నాథ్ వచ్చారు. ఇక్కడి కి ఆయన వచ్చిన పని అయింది. ఎంత శ్రమ..కఠిన దీక్ష..అంతా ఒక్క తాటిన నిలబెట్టడానికి. డస్సి పోయుంటారు బహుశ...!  ఇక్కడే నిధనం అయినట్టు చెపుతారు ,కాని మాకు వారి సమాధి చూసే అవకాశం లేక పోయింది.


*దైవ దర్శనం* 


 ప్రత్యేక దర్శనం టికెట్టు తీసుకొన్నా.. సాధారణ క్యూలోనే కలిపేసారు.అదీ ఒకందుకు మంచిదే. నిదానంగా చూట్డూ చూసుకుంటూ క్యూ లో కదిలాం.  కుంతీ దేవి, పాండవుల విగ్రహాలు ఒకటొకటి ..పరికించి చూశాక. .నందీశ్వరుడు..

లొపలికి వెళ్తుంటే వెచ్చని ఉద్వేగం....

చెంబెడు నీళ్ళు అభిషేకం.. ఆ అభిషేక ప్రియునికి..మెత్తగా జారిపోతూ నేయి రాసిన మూపురం..పూజాద్రవ్యాలు అలా తాకించి వెనక్కు ఇచ్చేశారు. పూజారి గంధమో, నెయ్యో.నుదుట అద్దాడు...'మందాకినీ సలిల చందన చర్చితాయ'

ఓం నమః శివాయః🙏.  స్వామి ని తాకి నమస్కరించడం. ఓ అనుభూతి.....శంకరా..!

  కేదారేశ్వరు ని దర్శనం  కోసం అంత వరకు ఎంత ఆరాట పడ్డాం...!  ఎంత శ్రమ తట్టుకొన్నాం. ..! ఏమీ గుర్తు రాలేదు. బయటకు రాగానే ఎంతో తేలికగా అనిపించింది.


పార్వతీ దేవి విగ్రహం బయటకు వస్తుంటే ఉంది. అక్కడ తోచిన దక్షిణ సమర్పించి బయటకు వచ్చాను. చాలా మంది ముందు ఆలోచనతో అమ్మవారికి చీర తెచ్చారు.


పూర్తిగా ఆలయం బయటకు వచ్చాక, వెనకాల 2013 లో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్ గుర్తుగా  ఆగిన పెద్ద బండ. ఆలయం కొట్టుకు పోకుండా ఆపిందిట.  అప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు గుర్తుకొచ్చి వాళ్లను స్మరించుకొన్నాం. 


 దూరంగా స్వర్గారోహణ పర్వతాలు ..ఫోటోలు తీసుకొన్నా. సెల్ఫీలు సరేసరి.   దర్శనం అయిందన్న సంతృప్తి. వెంటనే హెలికాప్టర్ రెడీ... కిందకి వచ్చేశాం. !


కింద పరిస్థితి వేరేలా ఉంది..!  చాలా మందికి హెలికాప్టర్ టికెట్లు అందలేదు. మా బస్ లో ఇంకా ఉన్నారు... ఎన్నో ప్రయాసలు పడి ఇంత దాకా వచ్చాక చూడలేకపోతే..బెంగ గానే అనిపించింది. కేదారేశ్వరుడికి దణ్డం పెట్టుకొన్నా..ఎవరూ నిరుత్సాహంతో వెను తిరగరాదని. 

ఎలాగైతేనేం అందరికీ అవకాశం దక్కింది. కాని ఆలస్యం గా వెళ్ళి న వాళ్ళు ఆ రాత్రికి పైనే ఆగిపోయారు. మర్నాడు చూస్తే..కింద వర్షం... పైన సూర్యుడు వచ్చాడుట కూడా. కాని, హెలికాప్టర్ సర్వీసు లు ఆపేశారు.   పైగా ఎయిర్ టెల్ ఫోన్లు పనిచేయడం లేదు. కాస్త ఆదుర్దాగానే అనిపించింది.  మా గ్రూప్ లో పైన ఆగి పోయిన వాళ్ళు ..ప్రత్యామ్నాయం చూసుకొసాగారు. ఎవరిదగ్గరో బి.ఎస్. ఎన్. ఎల్. ఫోన్ దొరికితే కిందకి సమాచారం పంపారు. డోలీ లు కొంతమంది, గుర్రాలు కొంతమంది ఎక్కి బయల్దేరారట. మా టూర్ ఆర్గనైజర్ వీళ్ల అందరి కోసం తను ఉండిపోయి, మమ్మల్ని బస్ లొ పంపించి వేశాడు. అక్కడ నుంచి హరిద్వార్, ఆగ్రా స్టేషన్ ఎకాయెకి ఇరవై నాలుగు గంటల ప్రయాణం. హరిద్వార్ లో బస్ మారింది. స్టేషను సమాయానికి వచ్చి చేరాం. ఇంత ప్రయాణం చేసిన మాకు తిరుగు ప్రయాణంలో దూరం పెరిగినట్లు అనిపించింది. 

ఈ యాత్ర లో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయో..! అయినప్పటికీ ముఖ్యమైన మూడు  క్షేత్రాలు దర్శించుకొన్న తృప్తి.

 అందుకే అన్నాను చార ధామ్ యాత్ర సాహస యాత్ర అని. అదీ వయసుమళ్లాక..ఇంకాను


హోమ్ స్వీట్ హోమ్...అనుకొంటూ.. మళ్ళీ ఈ మాయాజగత్తు ని చుట్టుకొని సెలఫోన్ ...గణగణలాడించాం.

 

శుభం...

 అయిపోయింది



Monday, 3 September 2018

జన్మాష్టమి

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ .

హృదయం మధురం గమనం మధురం
 మధురాధిపతేరఖిలం మధురమ్ ..

అప్పటి మధురానగరం ఎలా ఉండేదో మనకి ఊహల్లో నే తెలుసు. కాని ఈ మధ్య కేదార్‌నాథ్ యాత్ర లో భాగంగా మధుర కూడా చూశాము. భక్తులు చాలామంది పరిక్రమ చేస్తున్నారు. ఎదో దుప్పటి లాటిది పరచి పొర్లుడు దండాలు కూడా చేస్తున్నారు. వచ్చేపోయే వాళ్లకి మంచినీళ్ళ పాకెట్లు అందిస్తూ.. కొంతమంది,ప్రసాదాలు పంచుతూ మరికొంతమంది.

ఆ మర్నాడు దైవ దర్శనం అయింది మాకు.
కాని నాకు మాత్రం ఇలా....

"మధురా....ధి...ప...తే అఖిలం....మధురం"
ఎంతో మధురమైన గొంతు...అక్కడి పద్ధతి లో పంచెకట్టు తో ఒకతను..దారమ్మట పాడుకొంటూ. ఊహించని విందులా...ఆనాటి వేసవి రాత్రి
అమృత వర్షమే...!

Wednesday, 23 May 2018

రామేశ్వరం- యాత్ర March 2018

రామేశ్వరం యాత్ర

“I am the Island of Rameswaram, dear friend,
Born out of the shining water of the Indian Ocean..." ____Abdul Kalam(Oceans meet)

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామనాధేశ్వర ఆలయం ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం రామేశ్వరం. శ్రీ రామ చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించి పూజించినట్లు చెప్పబడే శివలింగం.

కాశీ కి వెళ్దామను కొంటేనే వెళ్ళి నంత పుణ్యం, కాని రామేశ్వరం అలాకాదు వెళ్దామనుకో కూడదు ఉత్తినే..అనుకొంటే వెళ్లాలి అంటారు. సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి కదా. ఆవిధంగా బంధువుల తో  కలసి వెళ్లాను రామేశ్వర యాత్ర.
మేము మొత్తం పదిమందిమి. అంచేత ఒక పన్నెండు సీట్ల వాన్ లో కన్యాకుమారి నుంచి రామేశ్వరం బయలుదేరాం.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామనాధేశ్వర ఆలయం ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం రామేశ్వరం. శ్రీ రామ చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించి పూజించినట్లు చెప్పబడే శివలింగం.
రామేశ్వరం ను  పంబన ద్వీపం అని కూడా అంటారు.

ప్రధాన భూభాగం తో కలుపుతూ సముద్రం మీద నిర్మించబడిన పంబన వంతెన ఒక అద్భుత కట్టడం. ఈ బ్రిడ్జి కట్టి వందేళ్ళు అయిందిట. ఓడలు రాక పోకలకు అనుకూలంగా రైల్ బ్రిడ్జ్ మధ్యలో ఓపెన్ అవుతుంది. ఈ అపూర్వ నిర్మాణం ఇంజనీరింగ్ ఫీట్ అనుకొంటూ,  రోడ్ బ్రిడ్జ్ మీద నిలబడి దిగువగా ఉన్న రైల్ బ్రిడ్జ్ చూస్తూ ఉంటే ఏదో ఆనందం....ఆ టైం లో రైల్ వెళ్తోంది.  రైల్ లో ప్రయాణం చేయాలని పించింది. కాని సాధ్య పడలేదు.

అలా పంబన్ బ్రిడ్జి దాటి ఊళ్ళో కి అడుగు పెట్టాం. గుడికి దగ్గరగా ఉన్న హోటల్లో బస.

ఉదయం  6 గంటల లొపు స్ఫటిక దర్శనం చేసు కోవాలి, ఆతర్వాత సముద్ర స్నానం, వెంటనే నూతులలో స్నానం, ఆపైన రామలింగేశ్వరు ని దర్శనం- అది ప్రణాళిక.

తెల్లవారు ఝామునే లేచి హోటల్ రూమ్ లో స్నానాదికాలు కానిచ్చుకొని స్ఫటిక దర్శనానికి వెళ్లాం.  ఇది స్ఫటిక లింగం కదా  ఏ పరిమాణం లో ఉంటుందో అనుకొంటుంటే, ఓ పూజారి అటూ ఇటూ చూడకుండా తిన్నగా చూడండి స్ఫటికలింగం అని హెచ్చరిక లాటి సూచన ఇవ్వడం మంచిదయింది. స్వచ్ఛంగా..మెరస్తూ అగుపించింది. సర్వ, శర్వ శివ ,స్థాణు...అని విష్ణు సహస్రనామం లో ఉన్నట్టే..శివుని కీ వర్తిస్తాయి. అచలుడు...ఆద్యంతము లేని వాడు సర్వేశ్వరుడు కదా.

మరో ముఖ్యమైన ఘట్టం స్నానాలు

ప్రత్యేకించి రామేశ్వరం అనగానే సముద్ర స్నానం తో పాటు గుడి లో మరో 22 తీర్థాలలో స్నానం చేయాలి అని చాలామందికి తెలుసు. వెళ్ళే దాకా నాకు కూడా అంతే తెలుసు. తిరిగి హోటల్ కి వెళ్లి కావలసిన బట్టలూ అవీ తీసుకొని సముద్రం  దగ్గరకి వచ్చామంతా.

'అగ్ని తీర్థం' సముద్ర స్నానం...మొదటి స్నానం. ఎక్కవ లోతు లేదు. అలల పోటూ తక్కువే. కొంచెం.. కొంచెం గా ముందు కి వెళ్ళి చేయి..చేయి పట్టుకొని సరిగంగ స్నానాలు చేస్తున్నారు.

స్నానం చేస్తుండగా గమనించాను. అక్కడ స్నానాలు చేసే వాళ్లలో  కొంతమంది ఆడవాళ్ళు, మట్టితో చిన్న చిన్న లింగాకారం ముద్దలు చేసి.....సముద్రపు నీరు దోసిళ్ల తో తెచ్చి  అభిషేకం చేస్తున్నారు. చూడ ముచ్చటగా అనిపించింది. బహుశా ఇలాగే సీతాదేవి ఇసుకతో గూడు కట్టి ఉంటుంది.
'సీతమ్మ తన దోసిటి తో మెత్తని బంగారు రంగు ఇసుక ని పోగు చేసి, పసిపిల్లల ఉత్సాహంతో  రెండు చేతులా నున్నగా  తడుతూ కట్టిన గూడు...లింగాకృతి దాల్చింది.   సీతాదేవి చేసిన ఆ సైకత లింగానికే ప్రాణప్రతిష్ఠ చేస్తాడు రాముడు. అంచేతే రామనాధలింగమైంది. రాముడు సేవించిన ఈశ్వరుడు. బ్రహ్మ హత్యా పాపపరిహారమొనర్చిన దేముడు రాముడి దేవుడు శివుడు.  శివలింగం కోసం కైలాసం వెళ్లిన హనుమ రావడం ఆలస్యం అవుతుంది.. హనుమ తెచ్చిన లింగాన్ని కూడా అదే ప్రాంగణంలో ప్రతిష్ఠించాడు రాముడు.'

 *బావుల దగ్గర స్నానాలు*

మా సముద్ర స్నానాలు అయ్యాయి. అలాగే తడి బట్టలతో గుడిలోకి వెళ్లి లోపల ఉన్న  22 బావుల దగ్గర స్నానాలు చేయాలి. ఈ బావుల దగ్గర తోడి పోయడానికి మనుషులు ఉంటారు. ఏదో  ఓ బకెట్ నీళ్ళు అందరిమీదా కలిపి పోస్తారుట అని తెలిసి,  పూర్తి బకెట్ పోసే విధంగా మాట్లాడారు మావాళ్లు.

ఇక్కడింకో  విషయం తెలియాలి. రామనాధ ఆలయం ప్రాంగణం చాలా పెద్దది..దేశంలో ఉన్న అన్ని ఆలయాలలో కంటే పొడవైన నడవా(ట). ఇందాక అన్నట్టు రామేశ్వరం వెళ్ళి న వాళ్లనెవరిని అడిగినా..స్నానాలు గురించి ....22  బావులలొ స్నానం చేయాలి అంటారే కాని వివరంగా చెప్పరు...అంటే అడిగితే కదా.  అన్నీ పక్కపక్కనే ఉంటాయనే అనుకొన్నా నేను కూడా. ఈ 22 బావులు వరుసక్రమంలో ఒకే చోట ఉండవు. అక్కడక్కడా ఉంటాయి.. మొదట మూడు ఒక చోట..మరోచోట కొన్ని ..అలా.
మనకు నీళ్లు పోయాడనికి నియమింపబడ్డ వాళ్ళు సాధారణంగా యువకులు ఉంటారు. అసలే పేద్ద ప్రాంగణం, అన్నిటికంటే పొడవాటి నడవా... వాళ్ళు.. ఒక చోట నీళ్ళు పోయడం అయిపోగానే, మరోచోటికి చకచకా పరుగు లాంటి నడకతో వెళ్తుంటారా..మనం తడి బట్టలతో..వారి వెంబడే వెళ్లాంటే మన శక్తి కూడా చూసుకోవాలి. అన్ని చోట్లా బకెట్ నిండా నీళ్ళు నెత్తిన పోయించుకొంటూ..శివశివా, హరహరా అంటూ...మరో ఆలోచన లేకుండా సాగాం..

"గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు" 

అయితే ఇరవై రెండు తీర్థాల పేర్లు ఇలాగే ఉంటాయి.
మొదట మహాలక్ష్మి, సావిత్రి, గాయత్రి ఈ మూడు తీర్థాలు ఉంటాయి. తర్వాత సరస్వతి, గంగ, యమున. ఇలా అన్నీ గుర్తు పెట్టుకొందామన్నా కుదరలేదు.  చివర్న కోటి తీర్థం.. 22 వది.  ఇక్కడ మాత్రం ఓ చిన్న చెంబుతో నీళ్లు పోశారు. అలా స్నాన ఘట్టం పూర్తయింది.

దైవదర్శనం

పొడి బట్టలు కట్టుకొని అభిషేకం చేయడానికి వెళ్లాం. సంకల్పం వగైరాలు ఆలయంలో బయట చేయించి, అభిషేకం నీరు, పాలు ,కాశీ తీర్ధం..తో సహా ఆలయంలో శివలింగానికి అభిషేకం చేయించారు. రామనాధేశ్వరుని దర్శనం తర్వాత..పక్కనే అమ్మవారి ఆలయం దర్శించుకొన్నాం. బయటకొస్తుంటే ఎడమవైపు ఆంజనేయస్వామి గుడి ఉంది.అక్కడా దర్శనం ముగించుకొని ఇవతలకు వచ్చాము.

ఇంకా రామేశ్వరం లో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి కదా..
గంధమాను పర్వతం, అబ్దుల్ కలామ్ గారి ఇల్లు, ధనుష్కోటి.. రాముడి పాదాలు.  దైవ దర్శనం కాగానే హోటల్ రూమ్ చెక్ అవుట్ చేసేసి. ..వాన్ లొ రామేశ్వరం ఊళ్ళో చూడాల్సిన వి చూసి..మధ్యలో ఎక్కడైనా భోజనం చేసి మధురై వెళ్లాలి. అదీ ప్లాన్. 

గంధమాదన పర్వతం..రాముడి పాదముద్రలు నిక్షిప్తమైన చోటు.  ఎత్తుగా ఉన్న మెట్లు ఎక్కగలం అనుకొన్న నలుగురం..వాన్ దిగాం. అక్కడ‌ కిందనే చెప్పులు విడిచి వెళ్లమన్నారు..కాని అప్పటికే ఎండ ఎక్కింది...ఆలోచిస్తూంటే, ఒకాయన పైనుంచి దిగుతూ  'ఫర్వాలేదు పైన విప్పవచ్చు ' అన్నాడు. ఆయనకి కాళ్లు కాలడం వల్ల చెప్పారట. సరే మెట్లెక్కి పైకి వెళ్లాం. వెళ్లాక అనిపించింది... చాలా మంచిపని చేశామని. పైనుంచి చూస్తే.. రామేశ్వరం అంతా చుట్టూతా చక్కగా కనిపిస్తోంది. ఇక్కడ రాములవారి పాదముద్రలు రాతిచక్రం పై నిక్షిప్తమై ఉన్నాయి.
స్థలపురాణం ఏమిటంటే...ఈ పర్వతం 'స్ట్రాటజిక్ వ్యూ పాయింట్' అనీ,శ్రీ రాముడు ఇక్కడ నుంచే లంకని  గమనించాడని.

అక్కడనుంచి అంత్యంత ప్రముఖ మైన చోటు అబ్దుల్ కలామ్ గారి ఇల్లు. ప్రస్తుతం మ్యూజియం గామార్చి కలాం గారి వస్తువులు, జ్ఞాపకాలు...మొదటి అంతస్తులో ఉంచారు.
ఏ ప్రాంత అస్తిత్వం అయినా ఆ గడ్డ మీద పుట్టిన మహాత్ములతో ముడివడి ఉంటుంది. ఆయన మొదట అంతరిక్ష శాస్త్రజ్ఞుడు, గొప్ప చదువరి.‌‌‌, కవి, వైణికుడు..రాజ్యాంగవేత్త...అంతకంటే గొప్ప మానవతావాది వెరసి మన భారతరత్న అబ్దుల్ కలామ్.
కలామ్ గారి మ్యూజియంలో 'Oceans meet' అనే కవితను చదివాను.
రామేశ్వరం భారత భూభాగాన్ని కలుపుతూ హిందూ మహా సముద్రం లో ఏర్పడిన దీవి.  అలాగే చైనా మెయిన్ లాండ్ ను కలుపుతూ ఫసిఫిక్ మహా సముద్రం లో ఏర్పడిన మరో దీవి ఫార్మోసా(తైవాన్).
ఇలా ఈ రెండు దీవులు పలకరించు కొంటాయి. తమ ప్రవర చెప్పుకొంటాయి....బుద్ధ భగవానుడు జన్మించిన భూమి భారత దేశం అయితే, కన్ఫ్యూషియస్ జన్మించిన దేశం.. చైనా
ప్రపంచంలో సగం మానవాళి ని కలిగి న ఈ రెండు దేశాలలో, ఈ మహానుభావులిద్దరూ  శతాబ్దాల కింద మానవాళికి ఇచ్చిన సందేశాలు....జీవితం,కుటుంబ విలువలు నైతిక బాధ్యతలు
శాంతి సందేశాలు...అజరామరం ...!
రెండు మహాసముద్రాలు, రెండుద్వీపాలు ప్రార్ధించగా...మరోసారి ఆ దివ్యా ఆత్మలు ఇద్దరూ...మానవాళి శాంతి సౌభాగ్యాలు కోరుతూ సందేశమిస్తారు...
ఈ కవిత లో కలామ్ గారి శాంతి కాముకత్వం తెలుస్తుంది
అంత ఎండ లోనూ ఆ మ్యూజియం చూసి ఇవతలకు వస్తుంటే ఎంతో సంతృప్తి కరంగా అనిపించింది.

ఆ తర్వాత  రామాలయం, పక్కనే సముద్రం ఒడ్డున న శివలింగం.. సముద్రం లో తేలుతున్న రాయి..ఒకటి చూశాం. రామాలయంలో సీతాదేవి రాముని కి కుడి పక్కన ఉంటుంది. రామరావణ యుద్ధానికి ముందే శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు..అదీ ఇదే ప్రదేశంలో. స్థలపురాణం అక్కడున్న పూజారి గారితో చెప్పించుకొని, తీర్థం తీసుకుని ఇవతలకు వచ్చాం.

ధనుష్కోటి..ghost city... తుఫాను ప్రభావం.. ఊరుఊరంతా ఊడ్చుకు పోయింది. కొన్ని శిధిలాలు..కొన్ని జ్ఞాపకాలు.. అక్కడే రకరకాల గవ్వలు.. పూసలు..లాటి మర్చండైజ్  పెట్టుకొని ఉన్నారా పల్లీయలు..పిల్లలు ఏవో దండలూ పూసలూ కొన్నారు..బేరం చేయకుండా.
తర్వాత... ధనుష్కోటి బీచ్ ...సముద్రం ఒడ్డుకు... కాదు రెండు సముద్రాల ఒడ్డుకు.
బంగాళాఖాతం ఓ వైపూ......మరో వైపు హిందూ మహాసముద్రం...!!..వెరసి చుట్టూ నీలి రంగులో విస్తరించి న అనంతమైన జలరాశి..!
ఎంత విశాలంగా... ఎంత ప్రశాంతంగా ఉందో.. కాళ్ళ కింద ఇసుక మెత్తగా జారిపోతూ..అసలు వదలబుద్ది వేయలేదు.
బంగారు రంగులో మెత్తని ఇసుక. అలల పోటూ, మంద్రంగా వీస్తున్న గాలితో  కలసిన సంగీతం వినగలిగిన మనసుంటే.. అంతా రాగమయం.
 ‎"The waves and winds joined to sing the song of life in Sri Raga"(_Kalam)

రామసేతు కట్టిన ప్రాంతం.. దాటితే శ్రీలంక. మరీ అక్కడిదాకా వెళ్లలేకపోయాం.

హిందూ మహాసముద్రం ఇంకెప్పుడు చూస్తాం అనుకొని...కాసిని నీళ్ళు తీసి నెత్తిన జల్లు కొన్నాం. (తర్వాత మధురై)






Sunday, 25 March 2018

రామకధా సుధా పానము...

రామ కధా సుధా పానము... ఒక రాజ్యము చేసునే..
‌‌‌‌
"నీకిష్టమైన కథ ఏదైనా చెప్పు". తన ఎదురుగా ఒద్దికగా ఒదిగి కూర్చున్న ఆ సీతాదేవి ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని, అడిగింది ఆవిడ.  వయోభారంతో వంగిన శరీరం, నెరసిన శిరోజాలు, కరుణ వొలికే చూపులు, మందహాసం. మహా పతివ్రత అనసూయా దేవి అత్రి మహాముని భార్య.

అరణ్యవాసం చేస్తూ రాముడు, భరద్వాజ ముని సూచన మేర  సీతా లక్ష్మణ సమేతంగా  చిత్రకూట పర్వతం పైన నివాసం ఏర్పరుచుకొన్నాడు. చిత్రకూట ప్రాంతం ఎంతో అందమైనదే కాదు, ఋషులు మునులు తపస్సు చేసుకొనే ప్రాంతం అవడం వల్ల అతి పవిత్ర మైనది కూడాను. అక్కడే అత్రి,అనసూయలు కూడా నివసిస్తూ ఉంటారు.  కాని, ఆ ప్రాంతంలో ని మునులు రాక్షసుల దాడికి భయపడి కాస్త అసహనం చెంది ఉన్నారు. రాముడు నేనున్నానని అభయమిచ్చినా, వాళ్లంతా ఆ ప్రాంతం వదలి వెళ్లడానికే నిశ్చయించుకొంటారు. జరిగిన సంఘటనలతో (భరతాదులు అక్కడికి రావడం, వగైరా) కొంత కలత చెందిన రాముడు కూడా కొంతకాలమాగి తాము కూడా చిత్రకూట పర్వతాన్ని వదలి వెళ్లడానికి నిర్ణయించుకొంటాడు. ఆ సందర్భంగా, ఒకసారి అత్రి అనసూయ దంపతులను దర్శించుకొందుకు సీతాలక్ష్మణుల తో  వెళ్తాడు.
 ‎
 దివ్యమై గానం గాలిలో తేలి వస్తూంది. పక్కనే సరోజాలతో నిండిన సరస్సు. ఇంకా రకరకాల పక్షులు సందడి చేస్తూ ఎంతో రమణీయంగా ఉంది.

వెళ్తూనే ఆ దివ్య దంపతులకు ప్రణమిల్లాడు. ఆ దంపతులు వారి తో అనునయింగా మాట్లాడారు. అత్రి మహాముని అనసూయా దేవి తపశ్శక్తి గురించి  వారికి పరిచయం చేస్తాడు. ఒకప్పుడు వర్షంలేక పదేళ్ళపాటు కరువువస్తే ఈమె తన తపశ్శక్తితో గంగను ప్రవహింప జేసి మునులకు ఫల మూలాలు ఉత్పత్తి అయేటట్టు చేసింది. ఇంతటి మహిమాన్విత అయిన ఈమె నీకు తల్లి వంటిది అంటాడు రాముడి తో. అటువంటి మహా తపస్వి అయిన సతీ అనసూయ దగ్గర కావలిసిన ఉపదేశం పొందవలసిందిగా రాముడు సీతాదేవి తో అంటాడు.

ఇల్లాలి ధర్మాలు ఉపదేశించమని వచ్చిన సీతాదేవి చేయిపుచ్చుకొని తనతో లోపలికి తీసుకు వెళ్లింది. "నీగురించి విన్నానమ్మా సీతా...! అన్నీ వదలి ఇంత లేత వయసులో భర్త వెంట అడవి కి రావడం ఉన్నదే...సామాన్య విషయం కాదు. అదృష్ట వంతురాలివి ధీరుడు..సత్యవర్తనుడైన భర్త లభించాడు నీకు.. భర్తను అనుసరించి ఉండటం మించి ప్రతివతా ధర్మమేమున్నది" అన్నది.

సీత ప్రాంజలి ఘటిస్తూ..."అమ్మా  అంతా మీ ఆశీస్సులు....
నా భర్త గుణగణాలు ప్రత్యేకించి చెప్పవలసినదేముంది. తాను దయామయుడు...జితేంద్రయుడు,ధర్మనిరతుడు పితృభక్తి కలవాడు. నా భర్తే నాకు తల్లి తండ్రీ..బాంధవ్యుడు.అటువంటి నా భర్తను అనుసరించడం నా ధర్మం అందులో గొప్పదనం ఏముంది. 
కాని మీ తపశ్శక్తి సాటిలేనిది... భీకరమైన కరవు ని ఎదుర్కోటానికి మీరు చేసిన పోరాటం అనితర సాధ్యమమ్మా..!'

"అవును సీతా పోరాటమే...సరిగ్గా చెప్పావ్.  మహా కరువు వచ్చింది. వర్షాలు లేవు...ఒకటా,రెండా పది సంవత్సరాలు.
జనం బాధ వర్ణనాతీతం అనుకో. అప్పుడే సంయమనం కావాలి. ఇదిగో ఈ ఫల వృక్షాలన్నీ ఆనాటి కృషి ఫలితమే. మన్నించి తన దారి మళ్లించుకొని ప్రవహించినంత మేర  సస్యశ్యామలం చేస్తున్న గంగాదేవి కి కృతజ్ఞతలు. అయినా మహా జ్ఞానులైన ఋషులు చేసే కృషి ముందు ఇది ఎంత".

సీతాదేవి ఆ పూజ్యురాలి కేసి ఆరాధనగా చూసింది.
"మీ ఉపదేశం నాకు శిరోధార్యము. నా అత్తగారు, నా తల్లి చెప్పిన హితవచనాలే నాకు గుర్తుకొస్తున్నాయి. " వినయంగా పలికింది సీత.

"మైథిలీ! ఎంత మధురంగా ఉన్నాయి నీ మాటలు!  ఏదైనా ఒక వరం కోరుకో నా తపశ్శక్తితో ఇవ్వగలను అని అడిగింది. దానికి సీత  మందహాసం చేసి తీయని మీ ఆశీర్వచన పలుకులే చాలన్నది. అయినా, అనసూయ తన వద్ద ఉన్న దివ్యాభరణాలను, వస్త్రాలు, అలంకరణ వస్తువులు సీత ముందు ఉంచింది.

ఆ తర్వాత ఆ మాటా ఈమాట చెప్తూ...

"నీకిష్టమైన కథ ఏదైనా చెప్పరాదా" అని అడిగింది. మెత్తని మధురమైన  సీత మాటలు వినాలనే కోరిక

"సరే ఏదో ఎందుకు, మీ వివాహం ఎలా జరిగిందో వివరించు?
స్వయంవరంలో శ్రీరాముడు నిన్ను అర్ధాంగి గా పొందిన సంగతి,
 లోగడ విన్నా కాని, సీతా ! సవిస్తరంగా నీనోట వినాలని ఉంది.  చెప్పవూ...!" మురిపెంగా అడిగింది

సీత ఒకసారి సాలోచనగా చూసి...మృదుమధురమైన తన స్వరం తో చెప్పడం మొదలు పెట్టింది.
 'నాన్నగారు జనకమహారాజు ఒకసారి నాగలి చేతబట్టి యజ్ణభూమి దున్నతుంటే నేను భూమిని చీల్చుకొని బయట పడ్డానట...ఆ సమయంలో తన చేతిలోని చల్లుతున్న ధాన్యపు విత్తనాలు, మట్టి నా పై బడి పూర్తిగా దుమ్ము కొట్టుకు పోయిన నన్ను ఆయన ఆత్రంగా లేవదేసి తన హృదయానికి హత్తుకున్నారట.
 ‎అపుడు 'ఓ రాజా ఈమె మానవ శిశువు కాదు... దివ్య శిశువు.. ధర్మము గా నీకు కుమార్తె' అని అశరీరవాణి పలికిందిట.
వారి కి సంతానం కూడా లేకపోవడంతో  నన్ను అమ్మకు కానుకగా చేతిలోపెట్టి వాళ్ల బిడ్డ లాగే సాక సాగారు. అయితే అందరి తండ్రులలాగే నాకు వివాహ వయసు రాగానే ఎటువంటి వరుని తేవాలా అని మధనపడుతూండేవారు.

వివాహానికైనా, వివాదానికైనా సమోద్యులు ఉండాలంటారు కదా.  అందునా నేను అయోనిజను ...అందుకు తగిన ఉత్తమమైన వరుడు గురించే వారి యోచన‌.  ..."
ఒక్క క్షణం ఆగింది..తెలియని విచార రేఖ పొడసూపగా..

అనసూయాదేవి ఆమె చెంపలు సవరిస్తూ..అన్నది
"...ఇదేమీ విపరీతమైన విషయం కాదు సీతా...నీకు తెలుసా , అత్రిమహాముని...కూడా అయోనిజులే...బ్రహ్మ మానస పుత్రులు..! సీతా నీవు కూడా కారణ జన్మురాలివి అమ్మా
చెప్పు ఆ తర్వాత?"

విప్పారిన కళ్లతో ఆమె చెప్పినది విని ..కొనసాగించింది తనకథనం..." అందుకేననుకొంటానమ్మా..నా జనకుడు స్వయంవరం ప్రకటించాలనుకొన్నారు..
అయితే మా నాన్న గారి వద్ద పూర్వీకుల నుంచీ తనకు వచ్చిన ఒక భారీ శివధనస్సు ఉంది. నిమి వంశంలో జనకుడి కంటే పూర్వజుడైన దేవరాతుడు మహాయజ్ఞం  చేస్తుండగా,ప్రసన్నుడై శివుడే స్వయంగా ఇచ్చాడట. ఆ ధనువును ఒకచోట నుండి మరొక చోటకి కదపడానికే..ఐదు వందల మంది మనుషులు కావాలి.  మా మానాన్నగారు ‌నాకు స్వయం వరం ప్రకటించారు. అటువంటి శివధనువు వంచిన వారికి నన్ను ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరం ప్రకటించారు నా తండ్రి. దేశ విదేశాల రాజులు, యువరాజులు శివ ధనస్సు  ఎత్తలేక అశక్తులై రెండు చేతులు జోడించి మరలి పోయారు.
 ‎
ఇది జరిగిన కొంతకాలానికి, విశ్వామితృల వారు తన వెంట రామ లక్ష్మణులను తీసుకొని, మా నాన్నగారు చేస్తున్న యజ్ణం
చూసేందుకు మిథిలకు వచ్చారు. ధర్మనిరుతుడైన నా తండ్రి వారిని తగినరీతి సత్కరించారు.

" ఓ రాజా ఇతడు శ్రీ రాముడు, అతడు లక్ష్మణుడు.. వీరిద్దరూ అన్నదమ్ములు, అయోధ్యాధిపతి దశరథుని కుమారులు. మీ దగ్గర ఉన్న శివ ధనస్సు చూడాలని ఉబలాట పడుతున్నారు... ఆ దివ్య ధనస్సు శ్రీ రామునికి చూపించండి" అని విశ్వామిత్రుల వారు  నా తండ్రి జనకమహారాజు తో చెప్పారు.

వెంటనే ఆ శివధనువు వారి దగ్గర కి చేర్చబడింది. మహా పరాక్రమవంతుడైన రఘురాముడు తృటి కాలం లో ధనస్సు వంచి వింటి నారిని సంధించగా...   వెంటనే శివధనువు ఫెళఫెళ ధ్వనులతో విరిగి ముక్కలయ్యింది..అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు ఆ ధ్వనికి.

"...సీతా మరి నీకు భయం వేయలేదా?"

" ఒక్కసారిగా ఒళ్లు ఝల్లు మన్నమాట నిజం" జ్ఞప్తికి తెచ్చుకొన్నట్టుగా ...తిరిగి పులకాంకిత అవుతూ అంది సీత.

"అపుడు నీవు రాముని చూశావా? రాముడు నిన్ను చూశాడా?"
ఈ పృచ్ఛగింపుకు కొంత సిగ్గుపడి.... నిమీలిత నేత్రాలతో...
" ..... బహుశా ఒకేసారి కావచ్చు.. "
" ఆ తర్వాత...? "
"ఆ తర్వాత అన్నమాట ప్రకారం నా  తండ్రి జనకుడు శ్రీ రాముని కాళ్లుకడిగి కన్య దానా నికి ఉపక్రమించబోగా, శ్రీరాముడు తనతండ్రి దశరథ మహారాజు అనుమతి కావాలనగానే, నా తండ్రి వెంటనే నా మామ గారైన దశరథులవారికి కబురు చేసి మిథిలకు పిలిపించారు.

ఆ విధంగా స్వయంవర విధానాన, మహా వీరులలోశ్రేష్టుడు అయిన నా భర్తకు సహధర్మచారిణి అయ్యాను.

సీత మాటలు పూర్తవతూనే...అనసూయాదేవి తనను దగ్గరకు తీసుకొని గాఢంగా హృదయానికి హత్తుకొంటూ...శిరస్సు ను ముద్దాడింది.

అప్పటికే  సాయంకాలం అయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. బయట చల్లగాలులు తిరుగుతున్నాయి.హడావుడిగా గూటికి చేరే పక్షులు చేసే వింత శబ్దాలతో నిండిపోయింది. మునులంతా నదిలో సంధ్యా స్నానాలు చేసి ఇంటి ముఖం పట్టారు. హోమవాటికలోంచి వచ్చే ఎర్రని సెగ...పలుచని పొగ తో అంతా ఓ పవిత్ర వాతావరణం ఏర్పడింది. బయట అంతా  మసక మసగ్గా అగుపిస్తోంది...ఆకులు కొద్దిగానే ఉన్నప్పటికీ... చీకటి పొగ కలిపి అంతా దట్టంగా  అగుపిస్తోంది.

"సీతా...!  ఎంత బాగా చెప్పావమ్మా! మనసు నిండిపోయింది. తనివితీరదు కదా. అయినా  బాగా పొద్దు పోయింది. నక్షత్రాలు కాంతివంతమయ్యాయి....చంద్రుడు తనవెలుగులను విస్తరింపచేస్తున్నాడు.రాత్రి అయింది. ఇక నీవు నీ పతి సేవకు వెళ్లాలి కదమ్మా!  ఏదీ వెళ్లేముందు నీ అలంకారాలు చూడనీయి."  అంటూ తన వద్దన ఉన్న నగలు,వస్త్రాలను ఆమెకు అలంకరించింది. దివ్యకాంతి తో వెలిగిపోయే సీతమ్మ ను చూసి ఎంతో ఆనందపడింది. సీతాదేవి కూడా ఆమెకు వంగి నమస్కరించింది.. సర్వాలంకృత అయిన సీతాదేవి ని శ్రీరామ చంద్రుడు... విస్మయం తోనూ సంతోషంతోనూ చూశాడు. ఒక. మహా సాధ్వి,మహా తపః సంపన్నురాలు...అనురాగంతో సీతకిచ్చిన కానుకలవి. వసివాడనివి.

అలాగే తక్కిన ఆశ్రమవాసులు,తాపసులు రాముణ్ణి ఎంతో సత్కరించి అతిధి మర్యాదలు చేసారు. ఆ రాత్రికి వాళ్లు అక్కడే విశ్రాంతి తీసుకొన్నారు. తిరుగు ప్రాయాణానాకి వారందరి అనుమతి తీసుకొని అక్కడనుంచి బయలు దేరారు.  నరమాంస భక్షకులైన రాక్షసులనుంచి తప్పించుకోవడానికి మునులు కందమూలాలు, ఫలాలకోసం వెళ్లే మార్గం ఒకటి ఉంది ఆ దారి చూపుతాను వెళ్లండి అని అత్రి  చెప్పగా వాళ్ళు అదేవిధంగా అక్కడనుండి  దండకారణ్యం వేపు నడవడం మొదలుపెట్టారు.

_వాల్మీకి రామాయణంలో అయోధ్య కాండ ఆధారంగా
.సీతారామలక్ష్మణులు అత్రి అనసూయ ల సందర్శించిన సందర్భంలో..











 ‎













  1. .

Thursday, 15 March 2018

అమ్మ జ్ఞాపకం

ఒక జ్ఞాపకం

నిను సేవించినఁ గల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ
ఘనకోటీ శకటీ కటీ తటిపటీ గందేభ వాటీ పటీ
రనటీ హారి సువర్ణహార మకుటీ ప్రఛ్ఛోటికా పేటికల్ ,
కన దామ్నాయ మహాతురంగ! శివలింగా! నీలకంఠేశ్వరా!

ఈ పద్యం నీకు తెలుసా అని అమ్మ నన్ను అడుగుతూ,  తిరిగి తనే ఆ పద్యాన్ని గుక్క తిప్పుకోకుండా చెప్పింది.

టి.వి. లో ఏదో సినిమా ఫంక్షన్. సాధారణంగా ఏదో కళ్లప్పగించి చూడటమేగాని, ఏ జరుగుతోందో బుర్రకెక్కదు.
అలాంటి టైమ్ లో పూర్తి గా శబ్దాలంకారం ఉన్న పై పద్యం వల్లించారెవరో..ఎవరోకాదు...రచయిత... తనికెళ్ళ భరణి.

ఇది జరిగిన కొన్నాళ్ళకు.. అమ్మ వెళ్ళి పోయింది. ఇప్పటికి ఐదేళ్లు అయింది. కాని నాకు ఆనాటి ఈ పద్యం మనసులో మెదులుతూ ఉంటుంది.

మా అమ్మ గొప్ప సాహిత్య అభిమాని. భాగవతం లో పద్యాలన్నీ నోటికి వచ్చు. ఎపుడైనా మేము తడుముకొంటుంటే ఆ మాత్రం తెలియదా అన్నట్టు చెప్తూ ఉండడం మాకు అలవాటే. ఆవిడకు ఇష్టమైన పద్యాలలో, మందార మకరంద మాధుర్యము....కూడా ఒకటి.

నేడు అమ్మ పుణ్య తిధి..పద్యాలతో ఆవిడకు ఉన్న పరిచయాలలో ఇదో గుర్తు.

తొలకరి- సంగం పద్యం

తొలకరి వాన లో తడిసి కరుగుతున్న ఎర్రమట్టి....
దాని తాలూకు పరిమళాలు...
నీరు, మట్టి...కలిసిపోయి‌న..ఎర్రమట్టి నీళ్లు
కలిసిన వారి ప్రేమైక హృదయాలలాగే..

 ఈ పరిమళాలు ఎలా అందాయి? నాకా భాష తెలీదు..భావం అంతూ పట్టలేదు. పాట కట్టి పడేసింది.
 ‎
యాయుమ్ యాయూమ్...యూట్యుబ్ లో   సిక్కిల్ గురుచరణ్ చక్కని ఆలాపన తో మొదలైన ఈ పద్యం(పాట?) తేనెల సోనలా.. తాకింది......
"అంబుదై........నెన్జం .....థామ్ కలన్ ధనవె"

"వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఆమెకేమో తమ ప్రేమ ఫలిస్తుందా లేదా అని బెంగ‌. అతడామెకు ధైర్యం చెప్తున్నాడు.తమది మేనరికం కాదు, ఎలాటి బంధుత్వం లేదు అయినప్పటికీ, తమనెవ్వరూ వేరు చేయలేరనీ...వర్షపునీరు ఎర్రమట్టి లో కలిసి ఎర్రనీరుగా మారినట్లు... తమ ప్రేమైక హృదయాలు కలిసే ఉంటాయని."

లింక్ పోస్ట్ చేస్తూ నా తమిళ ఫ్రండ్ ని అడిగాను. నేనది ఇంకా మళయాళం అనుకొన్నా. అది ప్రాచీన తమిళ భాషకు చెందిన సంగం సాహిత్యం లోనిది అని,అందులో పదాలు తనకూ అర్ధం కావని చెపుతూ..సొంతంగా తనూ సెర్చ్ చేసి..అన్ని వివరంగా ఉన్న ఒక బ్లాగ్ లింక్ పంపింది.

"yaayum ngyaayum yaaraagiyaro?
endhaiyum nundhaiyum emmuraik kelir?
yaanum neeyum evvazhi aridhum?
sembulap peyal neer pola
anbudai nenjam thaam kalandhanave"

My mother and your mother,
what kinship are they?
My father and your father, how related are they?
I and you, how do we know each other?
Like red soil with rain water
Earnest hearts in love became one forever

సంగం సాహిత్యం దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది. నా వెతుకులాట లో తెలిసింది ఏమిటంటే. సంగం సాహిత్య సంకలనం లో దాదాపు ఐదు వందలు పైగా కవులు ఉన్నారు. చాలామంది అజ్ఞాత కవులు.  వీరంతా సంగం గా ఏర్పడి తమతమ కవిత్వం ప్రచురించే వారట. ఇటువంటి సభలు నేటి మధురై లో సముద్రం లో కలిసిపోయిన భాగంలో.... రెండుసార్లు, మూడవసారి మీనాక్షి అమ్మవారి గుడి ప్రాంగణంలో స్వర్ణ కోనేరులో జరిగాయి ట. (ఎలాటి నిరూపణ లేదుట). కాని సాహిత్యం ఉందిగా..  ఈ సాహిత్యం తమిళుల సంపద.ఈ సాహిత్యం ముఖ్యంగా ప్రేమ, యుద్ధం, ప్రజాపాలన, వ్యాపారం మరియు ఎడబాటు వంటి విషయాలపై ఉన్నాయి.

పురాతత్వ ఆధారల ప్రకారం మదురై ఇంకా సంగంకి సంబంధించిన శాసనం 10వ శతాబ్దానికి సంబంధించినదే ఆధారంగా ఉంది.

ఈ రోజు ఒక కొత్త విషయం తెలిసింది.



http://www.kutcheribuzz.com/kb-special/kb-interviews/291-exploring-new-worlds

https://youtu.be/rjqbJQA3XAs

10/03/2018

Saturday, 17 February 2018

తీర్థయాత్ర

*తీర్థయాత్ర*
యాత్రలు చేయాల‌నే అభిలాష కలగాలే కాని....ఎలాగైనా మార్గం దొరుకుతుంది.  ఈ సారి జనవరి 26న మా మిత్రులు,అంతా కలిసి ఆరుగురం  ఇన్నోవా వెహికిల్ మాట్లాడుకొని మాహుర్,పర్లి వైద్యనాథ్ పుణ్య క్షేత్రాలు దర్శించడానికి కి బయల్దేరాం. మూడు పగళ్లు,రెండు రాత్రులు. మా ప్రణాళిక.

*26/1/2018*

 ముందుగా మాహుర్ వయా బాసర.  పదకొండు- పదొకొండు న్నర కి బాసర చేరాం. వ్యాసపురి కాలక్రమంలో బాసరగా మారిందని పురాణం‌. ఇక్కడ జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మీ,
 ‎మాహా కాళి సమేతంగా కొలువు తీరి ఉన్నారు. వేదవ్యాసునిచే  నిర్మితమైన ఈ మూడు ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. విశేషమేమిటంటే దేశం మొత్తం  ఉన్న రెండు సరస్వతీ ఆలయల్లో ఒకటి బాసర అయితే, ఇంకొకటి కాశ్మీరులో ఉన్నది.  అక్కడి సరస్వతీ మాత ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చామంతా. అటునుండి మాహూర్ వెళ్లాలి.

బయట కొచ్చాక, జామ కాయలు కొనుక్కొందామని చూశాం కాని సరైనవి కనిపించలేదు పైగా సాయంత్రం లోగా మాహుర్ చేరాలి. దోరదోరవి రేగి పళ్ళు కనిపించాయి...అవే తీసుకొన్నాం.
చలికాలంలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో దొరికే పళ్లలో రేగుపండు ప్రత్యేకమైంది. మంచి ఎపిటైజర్ ..ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి. రేగు పండు గుజ్జులో  ఉప్పు, పచ్చిమిర్చి కలిపి వడియాలుగా చేసి, ఎండబెడతారు కూడా.

సాయంత్రానికి మాహూర్ చేరాలి... మాహూర్ కూడా ఒకప్పుడు తెలంగాణా ప్రాంతంలో దేనట. వెళ్తూనే ముందుగా మేం ఆనలైన్ లో బుక్ చేసుకొన్న హోటల్ కి చేరి, కూడా తెచ్చుకొన్న లగేజ్ అక్కడ పడేసి, రిఫ్రెష్ అయి బయటపడ్డాం. రేణుక అమ్మవారి గుడి రాత్రి ఎనిమిది దాకా తెరిచే ఉంటుందన్న సమాచారం. కాని దగ్గర, దగ్గర రెండొందల పైనే మెట్లు ఎక్కాలి. అంతకుముందు ఒకసారి నేను వెళ్ళి ఉండటంతో... నాకు తెలుసు... అప్పుడు కూడా మెట్లెక్కడం కష్టమనిపించలేదు. అదే చెప్పాను మా వాళ్లతో. వాళ్లంతా దానికి సిద్ధమే అనుకోండి.

"ఇసుక తో కుండ చేసి, దాని తో రోజూ నది నించి నీరు తేవడం చేస్తూంటుంది రేణుకాదేవి. యిసుక తో కుండ చేయడం అంటే ఎంతో నైపుణ్యం ఉండాలి..కాని ఓ రోజు.. పరపురుషుడెవరో(ఎవరన్నది అప్రస్తుతం అని నా ఉద్దేశం) నదిలో స్నానం చేస్తుంటే, తను ఆగిపోతుంది. కుండ కుదురు గా రాదు.  బీట వారుతుంది. ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. దానితో ఆమె భర్త అనుమానించి, కోపంతో ఆమె కు మరణ శిక్ష వేస్తాడు. .."

మెట్లెక్కుతూంటే...సరస్వతి (నా మితృరాలు) ఈ కధ చెప్పుకొచ్చింది. నేనూ చదివాను కాని సమయానికి ఈ పురాణ కధ గుర్తు రావటం... మననం చేసుకోవడం ఓ విశేషం అనిపించింది.
రేణుక జమదగ్ని మహాముని భార్య,పరశురాముని తల్లి.  తండ్రి ఆజ్ఞ తో తన తల్లి తల నరికినా, తిరిగి తండ్రి నుంచి వరం పొంది తనతల్లిని బతికించు కొంటాడు పరశురాముడు. చేయని తప్పు కి శిక్ష అనుభవించడం ఎంత కష్టం? తన లోని పాతివ్రత్యం, మాతృత్వం, శిల్పకళా నైపుణ్యం... ఇన్ని విశిష్ట లక్షణాలు కల రేణుకా దేవి  పరాశక్తి అవతారమే!

ఇక్కడ ఆలయం అంతా  సింధూరం రంగులో వుంది. చిన్న ద్వారం లోంచి వెళ్లాలి. పెద్దగా రద్దీ లేదుకాని, ఇరుకుగా ఉండటంతో ఆగి నిలబడి దణ్డం పెట్టుకోనే ఆస్కారం లేకుండా పోయింది. వెంటనే బయటకొచ్చినా మరోసారి చూసి వచ్చాం.
అమ్మవారు  కేవలం శిరస్సు  మాత్రమే ఉంటుంది... సింధూర వర్ణం అంతా. ముక్కు,నోరు కళ్లు మాత్రం...స్పష్టంగా కనిపిస్తూ...అందులోనూ, నూరిన తాంబూలం ఈ అమ్మవారి కి ప్రసాదం..కనుక, లలితా సహస్రనామం లో చెప్పినట్లుగా *తాంబూలపూరిత ముఖీ*  అన్నట్టు ఉంది.
బయట ఈ తాంబూలం రోట్లో దంచి అమ్ముతుంటారు.
ఇవతల కొచ్చాక గాజుల దుకాణాలు మమ్మల్ని ఆకర్షించాయి.

 ఇక ఆరోజుకి  విశ్రాంతి. మేమున్న హోటల్ కి ఎదురు గానే మాకు శాకాహార భోజనం దొరికింది.
 ‎
 ‎*27/01/2018*
 ‎
మర్నాడు ఉదయమే లేచి అనసూయ- అత్రి మహాముని గుడి, దత్తాత్రేయ లవారి గుడి చూసి ఏకవీర  అమ్మవారిని(శక్తిపీఠం) దర్శించుకొని అటునుండి అటే పర్లికి వెళ్లాలి. క్రితం సారి నేను వెళ్ళినపుడు సెప్టెంబరు నెల కావడం వల్ల విపరీతంగా వర్షం పడింది...మెట్లు అవీ చూసి..వీలుకాక అనసూయ తల్లికి కిందనుంచే నమస్కరించి  వెళ్ళి పోయాం‌. ఇపుడలాకాదు.

 పొద్దున్నే కాబట్టి హుషారుగా నే మెట్లన్నీ ఎక్కాం. ఈ ఆలయం దగ్గర విపరీతంగా కోతులు అటూఇటూ దూకుతూ...;
 ‎కళ్ళజోళ్ళు మాత్రం పదిలమని హెచ్చరించుకొంటూ ఎక్కాము. తీరా ...చిన్న నిరాశ. ఉదయం 8.30 కి గాని తలుపులు తీసి హారతి ఈయరట. ఈ లోగా పెద్ద క్యూ నే ఏర్పడింది. ఉస్సురనట్లు చుట్టూ చూస్తున్న మాకు శాస్త్రి గారు(మా మిత్ర బృంద సభ్యులు) స్థల పురాణం సంబంధించిన కధ చెప్పటం మొదలు పెట్టారు.

"పాతివ్రత్యం మీద త్రిమూర్తుల భార్యలకు పోటీ వస్తుంది... అనసూయా దేవి మించి పతివ్రత ముల్లోకాలలో లేదని నారదుడు చెప్తాడు. తమ భార్యల కోరికమీద  ముగ్గురు అయ్యలూ అనసూయ వద్దకు మారువేషంలో వస్తారు...ఆ సమయంలో అత్రి మహాముని ఆశ్రమంలో ఉండరు. అనుష్టానం తీర్చుకొని ఆయన వచ్చేదాక ఆగలేమని ఆకలి గా ఉంది భోజనం పెట్టమని అడుగుతారు. అలాగేనని అనసూయ మాత సిద్ధం కాగా, ఆమె వివస్త్ర గా తమకు భోజనం పెట్టమని విచిత్రమైన కోరిక కోరతారు. ఆవిడ పతివ్రత కనుక వచ్చినవారెవరో గ్రహిస్తుంది. వారు ముగ్గురిని పసిపిల్లలను చేసి, కోరినట్లే వివస్త్ర గా అయి పాలిచ్చి వారి ఆకలి తీరుస్తుంది. ఇక ముగ్గురు తల్లులూ తమతమ భర్తలకోసం వచ్చి ఆమె కాళ్లమీద పడతారు. అత్రి,అనసూయల అనుగ్రహం తో  త్రిమూర్తులు తిరిగి తమ నిజరూపం పొందుతారు. అనసూయ,అత్రి దంపతులకు  వారి ముగ్గురి అంశలతో కుమారుడు కలిగేటట్లు వరమిస్తారు. ఆ కుమారుడే దత్తాత్రేయుడు." . 

 .....  క్యూ ఎప్పుడు కదిలిందో...మేమెలా ముందు కి వెళ్లామో.... తెలియనే లేదు. అనసూయ కథ అందరమెరిగి ఉన్నప్పటికీ... అలా స్మరించుకోవటం బాగుంది.. ఆ తల్లి, మహర్షులకు కూడా పూజ్యనీయమై మహోన్నత స్థానాన్ని పొందింది. శ్రీరాముడు  అరణ్య వాసం చేస్తూ అత్రి,అనసూయలను దర్శించినపుడు, అనసూయ, సీతకు పతివ్రతా ధర్మాలు ఉపదేశిస్తుంది.

 ఇంతలో వెనకనుంచి ఒకరిద్దరు ఆడవాళ్ళు, మహరాష్ట్రీయలు కాని, అటవీ ప్రాంతం వారి లా ఉన్నారు. పూనకం వచ్చినట్లు అరుస్తూ మమ్మల్ని దాటుకు ముందుకి వెళ్లారు. మా వంతు దర్శనం వచ్చింది . ఇక్కడా, అమ్మవారు ...కేవలం ముఖం మాత్రమే ఉంది.  ఇక పోతే, గుడి ఆవరణలోనే అత్రి మహాముని ఆశ్రమ ప్రదేశం అంటూ అక్కడ ఒక లింగం చూపారు. మా ఆలోచనలు తెలిసినట్లు గా శాస్త్రి గారు, స్థల మహత్యం తప్ప విగ్రహాలకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదంటూ చెప్పుకొచ్చారు... అంతే కదా అనుకొన్నామంతా.
 ‎
శ్రీ గురు దత్తుల ఆలయానికి వెళ్లాం తర్వాత. మాహూర్ లోనే దత్తాత్రేయ స్వామి జన్మించాడని భావిస్తారు. శ్రీ దత్తాత్రేయ లు తిరిగి శ్రీపాద శ్రీవల్లభునిగా ఆంధ్ర ప్రదేశ్ లోని  పిఠాపురంలో రెండవ అవతారంగా ను, మూడవ అవతారంగా మహరాష్ట్ర లో శ్రీ నృసింహ సరస్వతులు  గాను జన్మించినట్లు చెప్పబడింది. షిరిడి సాయిబాబా కూడా దత్తావతారమేనని భావిస్తారు.

అటునుండి వచ్చాక మా హోటల్ రూమ్ ఖాళీ చేసి..ఏకవీరికా  అమ్మ వారి ఆలయానికి వెళ్లాం. పొలాల మధ్య ప్రశాంత వాతావరణం లో ఉంది ఆలయం.  కాకపోతే ఈ ఆలయం నిర్మాణ దశలోనో..మరమ్మత్తులో ఉంది.  పూజలు, హారతులు చేస్తున్నారు బయటనించే. అంతా అక్కడ కూర్చుని లలిత చదువుకొని, పూజ చేయించాం. 
లోపల ఉన్న అమ్మవారు కేవలం ముఖం మాత్రమే ఉంది. అష్టాదశశక్తి పీఠములలో ఎనిమిదవది అయిన శ్రీ ఏకవీరికాదేవి శక్తి పీఠంగా భక్తులు కొలుస్తారు. అసలు కొండ మీద ఉన్న రేణుకాదేవి నే శక్తి పీఠం గా అక్కడ చెప్తారు కొందరు. ఇక్కడి స్థలం అమ్మవారి ‘కుడి చేయి’ పడిన స్థలంగా ఇటీవలే గుర్తించారని అక్కడి పూజారి చెప్పాడు. ఇంతకు ముందు అనుకొన్నట్లుగా స్థల మహత్యం ఒకటే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. విగ్రహం ఓ గుర్తు మాత్రమే.

 మాహూర్ కి నాలుగున్నర గంటల ప్రయాణ వ్యవధిలో అవుంధ నాగనాధ్ (Aundha Nagnadh) ఆలయం చూడాలని నిర్ణయం. అనుకొన్న టైమ్ కంటే ఆలస్యం అయింది. అవుంధ్ లో ఆగి పర్లి వెళ్ళే సరికి మరీ లేట్ అవుతుందేమో...అర్ధరాత్రి మా బస ఏర్పాటు సమస్య కావచ్చని ఆందోళన చెందామంతా.  అయినప్పటికీ, కాస్త దారిలో చెరుకు రసం తాగి, బెల్లపచ్చులు, బెల్లపు పానకం బేరాలాడి..కాని కదల్లేదు.

అవుంధ్ చేరేసరికి సాయంత్రం నాలుగు.  కాస్త క్యూలో నిలబెట్టాడు దేముడు. ఇది కూడా జ్యోతిర్లింగమే. పాండవ వనవాసం సమయంలో యుధిష్టురునిచే ప్రతిష్టించ బడిన లింగం ట. ఏడు అంతస్తులుగా ఉన్న ఈ మందిరాన్ని ఔరంగజేబు కాలంలో కూల్చబడింది ట. (వికిపిడియా).
అయినా లోపల ఓ రెండు మెట్లు కిందకి దిగాలి..చిన్న గుహ లా ఉన్నచోట శివలింగం, పానుపట్టం ఉన్నాయి. కాని దిగలాంటే ఓ మనిషి పట్టే చోటే ఉంది..చేతిలో మారేడు దళాలు పూలు శివలింగంపై ఉంచి ,కొద్దిగా దక్షిణ సమర్పించుకొని దర్శనం చేసుకొన్నాక, తిరిగి పైకి ఎక్కిరావడం కూడా ఇబ్బందే...కాని అదొక అనుభవం. బయటకు వచ్చాక ఆలయ శిల్ప సంపద పురాతనమైనది గాను, ప్రత్యేకంగా ను అనిపించాయి. అంతా ఫోటో లు తీసుకొన్నాం ‌...చేతి లో ఉన్న మొబైల్ ఫోన్ కెమెరాలే.

ఇక ఆగకుండా పర్లి వైపుకు పరుగెత్తించాం మా వాహనాన్ని పర్బని మీదుగా ప్రయాణం. పర్లి చేరేసరికి రాత్రి తొమ్మిది అయింది. అక్కడ ఆలయానికి దగ్గర్లో భక్తసదన్ లో మాకు ఎకామడేషన్ దొరికింది. మేం భోజనాలు చేసి వచ్చేసరికి.. ఓ పూజారి మాకోసం కాచుకొని ఉన్నాడు ..మర్నాడు అభిషేకాలు కోసం. అభిషేకానికి ₹250/- ట. వెంటనే ఒప్పేసుకొని మర్నాడు ఉదయమే రమ్మన్నాం. 

*28/01/2018*

అనుకొన్న సమయానికి అంతా గుడికి నడిచే వెళ్లాం. పూజారి గారి సాయం తో అభిషేకాలు.. ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు మిగతా పూజారులు కూడా. ఇక్కడ ఒక  విషయం ఉంది వైద్యనాధ జ్యోతిర్లింగం గా చెప్పబడే వి ఇంకా రెండున్నాయిట. ఒకటి జార్ఖండ్, మరొకటి హిమా చల్ ప్రదేశ్ లోను.(అంతర్జాలం చెప్పింది).  అయినా నా లెక్కలో ఇది జ్యోతి ర్లింగ దర్శనమే. ఆలయ ప్రాంగణంలో ఫోటోలు నిషిద్దం. సగ్గుబియ్యం కిచిడి ప్రసాదం బాగుంది. బయటకొచ్చి బ్రేక్ ఫాస్ట్ చేసి తిరుగు ప్రయాణంలో పడ్డాం. దారిలో *అంబాజోగాయ్*  లో *యోగేశ్వరి* ఆలయం ఉంది చూసి వెడదాం అని శాస్త్రి గారు సూచించారు. ఆయన మహరాష్ట్ర ప్రాంతం లో పనిచేసి ఉన్నందువల్ల ఈ ఆలయలాన్నీ లోగడ చూసి ఉన్నవే. అమ్మవారు దుర్గాదేవి బాలికా రూపం లో ఉంటుందని ... అడిగితే అక్కడి పూజారి చెప్పాడు.  తిరిగి ప్రయాణం లో పర్బని లో ఆగి చక్కటి లంచ్ చేశామంతా.
ఆఖరి మజిలీ...జహీరాబాద్ దగ్గర పడుతూండగా సంధ్య, మరో మితృరాలు  సంగమేశ్వర ఆలయం కూడా చూడాలని కోరారు. నిజమే కదా, మళ్ళీ ఇటు వచ్చి చూడాలంటే ఎన్నాళ్లకి వీలవుతుందో. మన దగ్గరలో ఇంత పురాతనమైన ఆలయముందా అనుకొన్నా అక్కడికి వెళ్లాక. శ్రీ కేతకీ సంగమేశ్వరుల  ఆలయం. గుడి తెరిచే ఉంది. చక్కగా పూజ చేయించారు.ఆ గుడి ప్రాంగణంలో అమృతగుండం అనే తటాకం ఉంది. అతి పవిత్రమైన ఆగుండంలో నీరు సర్వ రోగ నివారిణి అని పురాణం. పునర్ దర్శన ప్రాప్తి రస్తు అంటూన్న ఆలయం పై రాతలు చదువుకొని ఇంటిముఖం పట్టాం.

ప్రయాణం లో చిన్నచిన్న విశేషాలు. పగలంతా ప్రయాణం కదా. కూడా తెచ్చుకొన్న బ్రడ్,చట్నీలే కాదు పళ్లు మిగతా తినుబండారాలు... మా దంత సిరి కి ఆనందించి సహకరించాయి. మధ్యలో పూర్వపు యాత్రానుభవాలు కూడా చెప్పుకొంటూంటే..చాలా విషయాలు తెలిసాయి. ఉత్తరోత్రా చూడాలి,చూద్దామనుకొన్న ప్రణాళికలు పంచుకొన్నాం. సహకరించిన ఆరోగ్యం.. మితృల ముందు చూపు...ఆలోచనల వల్ల మొత్తం యాత్ర సుఖవంతంగాను,అర్ధవంతంగాను పరస్పరాభినందనలతో  సాగింది

ఇలా  చిన్నదైనా ఫలవంతమైన మా యాత్ర విశేషాలు చదివిన వారికి ఏమాత్రం ప్రేరణ కలిగినా సంతోషమే.