Sunday, 27 January 2019

శ్రీ శైల యాత్ర-3

అహోబిలం

అది మూడవ రోజు తిరుగు ప్రయాణం రోజు.ఎంత త్వరగా అనుకొన్నా, అహోబిలం చేరేసరికి దాదాపు పన్నెండు అవుతోంది. గుడి మూసివేసే సమయం. గబగబా ఏవో పూజా సామగ్రి తీసుకొని లోపలికి వెళ్లాం‌! 

 భక్తవరదుడు, ఆపన్న ప్రసన్నుడు, విశేషించి ప్రహ్లాదవరదుడు రమ్మంటూ ఆహ్వానం పలికాడా లక్ష్మినారసింహుడు. ప్రాంజలితో అంతరాలయం ప్రవేశించాం. ఇది దిగువనున్న ఆలయం అనీ, ఇంకా కొండపైన అహోబిలంలో నరసింహస్వామి ని కూడా చూడాలి అన్నారు. ఇక్కడి అమ్మవారు 'అమృతవల్లి' . అపరాహ్ణమైనా, దైవసన్నధి కదా, ధ్వజస్తంభం దగ్గర తెచ్చిన దీపాలు వెలిగించారు.
బస్ లో ఎగువన ఉన్న నరసింహస్వామి ఆలయానికి వెళ్లాం. ఆలస్యం అయింది కదా. గుడి మూసేశారు.
పక్కనే అన్నసత్రం.
పరబ్రహ్మ స్వరూపం...
'ఆరంగించి కూర్చున్నాడు అల్లవాడే...'
మరి మనకో..అంటూ వెళ్తే,  రండి రండి అంటూ విస్తర్లు వేసి..ముందూ..వెనుకగా అందరికీ భోజనం పెట్టారు.
'అన్నదాతా సుఖీభవ..!' అంటూ  సత్ర నిర్వాహకుల వితరణ ని ప్రశంసించి...వెయ్యనూట పదహార్లు డొనేట్ చేసి బయటకు వచ్చాను. నేనూ మా చెల్లెలు నెమ్మదిగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టాం. రెయిలింగ్ ఉంది కనక ఎనభై మెట్లదాకా ఉన్నా ఎక్కగలిగాం.  రెండవ పంక్తి లో భోజనాలు చేసినవారు అంతా కొద్ది సేపట్లోనే వచ్చారు.

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం

ప్రహ్లాదుని రక్షించడం కోసం స్థంభం నుంచి వెలువడి నారసింహుని అవతారం విశేషం ఈ కొండపైనే జరిగిందని పురాణ కధ.

కొండమీద బిలం లో వెలిసిన నరసింహుని  ఇక్కడ స్వామి స్వయంభువుగా చెప్పారు మాకు పూజారి గారు. అపరాహ్ణవేళ పూజలు ఉండవు కాబట్టి తీర్థ, ప్రసాదాలు లభించాయి. చెంచులక్ష్మి అమ్మవారు ఇక్కడ.

ఇక్కడి గుహలోనే కాకుండా ఇంకా పైన కూడా చూడవలసిన వి ఉన్నాయన్నారు కాని, అంత శక్తి సమయం రెండూ లేవు. కాని మా దత్తాత్రేయశర్మ గారు వదలి పెట్టలేదు కనీసం ఇక్కడ ఉన్న గుండం చూడండి అని ఓ రెండు కి.మీ. ముందు కి తీసుకుని వెళ్లారు. 'భవనాశిని' ట అది నరసింహ స్వామి పాదాలు కడిగిన నీరు..అంటూ . కాసేపు ఆ మడుగు చుట్టూ చేరి కాళ్ళు నీళ్లలో ఉంచితే...చూడాలి..పాదాల చుట్టూ చేపపిల్లలు చేరాయి. పైనుంచి ఎక్కడినుంచో నీటి ధార అక్కడ మడుగు అయింది. ఇంకా పైకి ఊడలు దిగిన చెట్లు.. ఇంకా పైదాకా వెళ్లి అన్నీ చూసే అవకాశం లేదు.

**అలంపురం జోగులాంబ-బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయం.
శ్రీ శైలానికి పడమటి ద్వారం ఆలంపురం.
మాది తిరుగుప్రయాణం

*లంబస్తనీం, వికృతాక్షీం,ఘోరరూపాం, మహాబలాం!
ప్రేతాసన సమారూఢాం, జోగుళాంబాం నమామ్యహం*

అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవది జోగులాంబ శక్తి పీఠం. ఇక్కడ సతీదేవి పై దంతం పడినట్లు పురాణం. మేము అహోబిలం లో బయలు దేరి అలంపూర్ కి వచ్చేసరికి చీకటి పడింది. ఇక గుడి మూసేస్తారు అన్నపుడు అంతా బస్ దిగి పరుగులాటి నడకతో వెళ్ళి అమ్మవారిని దర్శించుకొన్నాము. పైన చెప్పిన శ్లోకం అక్కడ రాసి ఉంది.

తీర్థ ప్రసాదాలు తీసుకొని. బాలబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి వెళ్లాం. అక్కడా అదే పరిస్థితి. గుడి మూసేస్తున్నారు. కాని చిత్రం గా స్థల పురాణం చెప్పమని శర్మ గారు అడగ్గానే, (పూజారి, పేరు కృష్ణమూర్తి అని చెప్పినట్లు గుర్తు).  పురాణకథ యావత్తూ ఎంతో శ్రద్ధగా వివరించారు.
ఈ బాలబ్రహ్మేంద్రుని  మూర్తి కూడా మహానంది లో లా గోష్పాద ముద్ర తో మణిగి నట్టు ఉన్న శివలింగమే. అయితే అతనో విషయం చెప్పాడు. ఆ ప్రాంతం అంతా పాదరసం నిక్షిప్తమై  ఉన్నదని, ఏ పిడుగుపడటం వల్లనో ఈ లింగం లో అటువంటి మార్పు వచ్చింది అనీ చెప్పారు. ఇక్కడ శివలింగం శిల కాదు,చెక్క కూడాకాదు. ఏ పదార్థం అన్నదీ తెలియదు ట.  శతాబ్దాల కిందట అక్కడ పరసవేదికి సంబంధించిన ప్రయోగాలు చేసారట కొందరు సిద్ధులు. లోపల సిద్ధుల విగ్రహాలు ఉన్నాయి.

మేము చూసిన బాలబ్రహ్మేశ్వరుడు కాక, ఇంకా ఎనిమిది బ్రహ్మ ఆలయాలు ఉన్నాయట. మొత్తం కలిపి నవబ్రహ్మ లు ఉన్నారు. పూజారి గారు చెప్పిన దాని ప్రకారం ఆ ఊర్లో ఇంకా అనేక దేవాలాయాలు సూర్య దేవాలయం తో సహా ఉన్నాయి. అంతా విన్నాక, ఇక్కడికి  ప్రత్యేకంగా వస్తేనే అన్నీ చూడగలం అనిపించింది.
తుంగభద్ర, కృష్ణా నదుల సంగమం ఉండటం వల్ల ఈ ప్రాంతం దక్షిణ కాశి అని కూడా పిలవబడుతుంది...( అసలు దక్షిణ కాశీ అంటే శ్రీ కాళ హస్తి)

ఇది ఇలా ఉంటే,  చరిత్ర ఏం చెప్తుందో చూద్దాం.  ఈ ఆలయం ఏడవ శతాబ్దం లో బాదామి చాళుక్యుల కాలంలో నిర్మితమైంది ట. వీరు కర్ణాటక ప్రాంతం లోని బాదామి ని నుంచి వచ్చిన వారు. దక్కన్ పీఠభూమి లో ఉత్తర ప్రాంతం అంతా వీరి అధీనం లో నే ఉండేదిట. దాదాపు రెండువందల ఏళ్ల పాటు పాలించిన ఈ రాజులు..గొప్ప శిల్పకళా పోషకులు. ప్రస్తుతం అలంపూర్ లో ఉన్న ఎర్ర ఇసుక రాయి శిల్పాలన్నీ ఆ కాలం వే అని పురావస్తు శాఖ వారి నిర్ధారణ.

తర్వాత పదిహేనవ శతాబ్దం లో బహమనీ సుల్తానులు దండెత్తి నపుడు..జోగులాంబ మందిరం లో ని మూలవిరాట్టు, మిగతా విగ్రహాలను బాలబ్రహ్మేశ్వర ఆలయం లో దాచి ఉంచారట.  నాగార్జునసాగర్  డామ్ కడుతునపుడు కూడా  ఈ ఆలయం ముంపు కి గురి అవుతుంటే...స్ట్రక్చర్ ని కాపాడి, కొంచెం దూరంగా జరిపారట. అలా అనేక సార్లు ఈ ఆలయం  పునరుద్ధరణ జరిగింది.
ఇంత ఓర్పుగా అతడు  చెప్పిన ది విని ధన్యవాదాలు చెపుతుంటే, మీలా ఆసక్తి కనపరచే వారు అరుదు అని తిరిగి మమ్మల్నే మెచ్చుకొన్నాడు ఆయన. తరవాత బయటకు వచ్చి ధ్వజ స్థంభం దగ్గర దీపం వెలిగించి. గుడి లో ఇచ్చిన గుగ్గిళ్ల ప్రసాదం తలా ఇంతా తిని ఆ ప్రాంగణంలో అరుగుల మీద కూర్చున్నాం.  ఉగ్గాణి బయట ఆర్డర్ ఇచ్చివచ్చారు. అదే ఫలహారం ఆ రాత్రి కి.

ఫలహారం వచ్చేలోగా అనేకమైన రస సంభాషణలో, చతురులతో గడిపాం. స్వతహాగా సంగీత అభిమాని అయిన నా ఫ్రండ్ శ్యామల  చక్కని పాటలు ...నెమ్మదిగా పాడటం మొదలు పెట్టారు. పక్కనే కూర్చుని విప్పారిన ఆవిడ స్వరం తో పాటు ఆవిడ తో పాటు వింటున్న మా మనసులూను.   కొందరు దూరంగా ఉండటం వల్ల వినలేకపోయారు.  వాళ్ళు కూడా అదే అలౌకిక ఆనందానుభూతి లో ఉన్నారని తెలుసు.
 ఎందుకంటే, అది శారదరాత్రి, అష్టమి చంద్రుడు పైన.....
'అమ్మవారిని అష్టమీచంద్ర విభ్రాజ'   అమ్మ దరహాసం తో కరుణా వీక్షణాలు మా పై అలా ప్రసరింప చేసినందుకు కావచ్చు.

ఆలోచిస్తే మా ఆధ్యాత్మిక పర్యటన లో ఓ సంపూర్ణత్వం గోచరించింది. అమ్మవారి ని బాలా త్రిపురసుందరీ గా, ఉమాదేవిగా, భ్రమరాంబ గా, కామేశ్వరి దేవిగా చూస్తూ వచ్చి..ఇక్కడ ఒక యోగినిగా జోగులాంబ ను చూడటం...జ్ఞాన దృష్టి లో, ఒక ఆవృతం పూర్తి అయినట్లు...జన్మ తరించింది.

శ్రీ మాత్రే నమః 🙏

No comments:

Post a Comment