Friday, 20 March 2026

పింక్ ట్రంపెట్ ట్రీ

 

 

పింక్ ట్రంపెట్ ట్రీ   


'చెర్రీ బ్లాసమ్' రుతువు వచ్చేసింది!


ఆ చెట్టు ఉదయపు నడకలో నా అశ్వత్థ వృక్షం;

కొత్త 'వలసపక్షి' రాగానే --

ఆకుల గలగలలాడతాయి!

నాకు  అడుగు ముందుకు పడదు‌-

అది కనబడదు..!

ఆకులన్నీ రాలుస్తూ.. గాలి కబుర్లు పోగేసుకుంటుంది..

నేనెప్పుడూ  శ్రోతనే!

తానేమో-తనువెల్లా  వసంత కాంతులీనుతూ 'హనామీ' ఉత్సవానికి ముస్తాబయింది యిప్పుడు..!

'వసంతం వచ్చేసింది రండహో ! 

అంటూ 'గులాబీపూల బాకాను' గాలిలోకి ఊదుతోంది!

ఇదిగో నా  'చెర్రీ బ్లాసమ్' రుతువు వచ్చేసింది!

ఇప్పుడిక ప్రతి రహదారి ఈ సంబరం జరుపుకుంటోంది!

Tuesday, 10 February 2026

ఉదయరాగం.


"అయ్యో 'శివ శివా!' 

అని యింకా అననే లేదు" 

అనుకున్నదేమో చలి..

వెనుదిరిగి కిటికి రెక్కలగుండా

లోపలికి చొచ్చుకు వచ్చింది;


కమ్మిన పొగమంచు నే భుజాల మీదుగా లాక్కుని కప్పుకొంటూ..

విహారానికి వచ్చిన నాకు..

శిశిరం రెక్కలల్లార్చిన పక్షిలా,  తెలిమంచు విదిల్చింది!

మంచు బిందువొక్కటి..

ముక్కుపై రాలి ముద్దు చేసింది!