#పుస్తక_పరిచయం.
The Hen who dreamed she could fly
- by Sun-mi Hwang
మాతృత్వపు కోరిక చాలా సహజమైనది. మనుషుల లో సరే, పశు,పక్ష్యాదులలో కూడా ఉంటుందా? ఉంటే అదెలా తీరుతుంది? అదెలా తీరిందో ఆసక్తి కరంగా చెప్పిన కథే ఇది.
'స్ప్రౌట్' (Sprout) అని తనకు తనే పేరు పెట్టుకున్న ఫారం కోడిపెట్ట కథ. అప్పటికి ఏడాది పైనే అయింది తను ఆ ఫారం కి వచ్చి. వచ్చినప్పటి నుంచీ గుడ్లు పెట్టడమే తనపని. రోజూ యజమాని వచ్చి ఆ గుడ్డును తీసుకు పోతాడు. ఇంత దాణా వేసిపోతాడు అంతే. అసలు బయటకు విడిచి పెట్టడం అంటూ వుండదు. తనను ఉంచిన కోళ్లగూడు ఊచల మధ్య నుంచి బయటకు చూస్తూ ఉంటుంది స్ప్రౌట్ . అక్కడ మిగతా అన్నిరకాల పెంపుడు జంతువులు స్వేచ్చగా తిరుగుతూ ఉంటాయి. అలా మొదలైంది తన స్వేచ్ఛా కాంక్ష.
ఓ కోడిపెట్ట అయితే మరీ బడాయి. తన బుజ్జి బుజ్జి పిల్లల ని వెంటేసుకుని బయట అంతా తిరుగుతూ ఉంటుంది. తన వెంటే పుంజూను. అదిగో స్ప్రౌట్ అది చూసినప్పటి నుంచీ తనూ తన పిల్లలను అలాగే తన రెక్కల మాటున దాచేసుకుంటూ.... వెంట తిప్పుతూ విశాలమైన ఆ పశువుల కొట్టం (barn yard) అంతా తిరగాలనే కోరిక. ఇదే కల ! తను ఫారం కోడి ననీ, తను పెట్టిన గుడ్డు పొదగడం అసాధ్యమని తెలియదు. ఒక్క గుడ్డుని ఎలాగైనా పొదిగి పిల్లని చేసి చూసుకో వాలి ఆని ఆశ. కానీ అది కల్లో వార్త. గాలిలో ఎగరాలనే కలలా!
ఓడి పోకూడదు అనే గట్టి సంకల్పం గల ఆ ఫారం కోడిపెట్ట ఒక్క గుడ్డుని ఎలాగైనా పొదిగి పిల్లని చేసి చూసుకో వాలి ఆని ఆశ. తన కలా ఎలా నెరవేర్చుకుంది? ఎన్ని పరీక్షలు ఎదుర్కొంది..?
ఇవన్నీ తెలుసుకోవాలంటే కొంత కథను చెప్పాలి.
తను పెట్టిన గుడ్డును తానే పొదగాలన్న కోరిక రోజు రోజుకూ తీవ్రమైపోతుంది మన స్ప్రౌట్ కు. తిండి సయించదు.. చిక్కిపోతుంది.. దాంతో అది పెట్టే గుడ్డు పరిమాణం కూడా చిన్నదైపోతుంది. అది చూసి ఆ రైతు దంపతులు.. లాభం లేదు దీన్ని పంపేయాలి (sent for culling) వాళ్లలో వాళ్ళు అనుకోవడం వింటుంది. Culling అంటే ఏమిటో తెలియని స్ప్రౌట్ మాత్రం బయటకు వదిలేస్తారని ఆనంద పడిపోయింది. తనని బయటకు వదిలేస్తారన్న మాటకే దాని గుండె వేగంగా కొట్టుకుంది. మరుక్షణం.. రైతు తనని ఈకలు పీకి, రెక్కలు విరిచి పట్డుకుని వీల్ బర్రో లోకి విసిరేయడం జరిగింది. తేరుకునే లోగానే, ఇట్లాగే గుడ్లు పెట్టలేని కోళ్లను ఏరేస్తూ.. వరసపెట్టి పడేస్తుంటే, అవన్నీ స్ప్రౌట్ మీద పడి స్పృహ పోతూండగా విషయం అర్థం అవుతుంది.
తను చచ్చి పోకూడదు. ఎలాగోలా తప్పించుకుని పోవాలి. ఆ ప్రాంగణంలో లో ఉన్న అకాషియా చెట్టు ని దాని ఆకులూ, పూలూ... వాటి సువాసనా గాఢంగా ఊహించుకుంటూ, తనకున్న ఒకే ఒక కోరిక ఒక పిల్లని పొదగడం, తన రెక్కలకింద పొదుపుకుని... ... ...
అలా కలలోకి జారి పోతుంది.
తిరిగి స్పృహ వచ్చేసరికి తననెవరో పిలుస్తున్నట్టయి చూస్తే, తనో కళేబరాల గుట్ట మధ్య ఉంటుంది. తను బతికే ఉంది. కాని బలహీనంగా అనిపిస్తుంది. లేచి రెక్కలు విదల్చడానికి ఏవీ?
Weasel పొంచి ఉండి తనని కబళించడానికి చూస్తోందని, తనని హెచ్చరిస్తూన్నది ఎవరో కాదు, అదే యార్డ్ లో ఎక్కడినుంచో వచ్చి ఉంటూన్న వలసపక్షి తెల్లబాతు. తతిమా బాతుల మందలో కలవడు కనుక Straggler అని పిలుస్తారు. ఒక స్నేహితుడి లా శత్రువు నుండి స్ప్రౌట్ ను రక్షిస్తాడు.
ఈకలు కూడా లేకుండా, చావుబతుకుల మధ్య, తడబడతూ.. తెల్ల బాతు సాయంతో బయట పడుతుంది స్ప్రౌట్. కాని ఎక్కడ ఉంటుంది? కోళ్ల గూడులో ఉండటానికి మిగతా మామూలు కోళ్ళూ , బాతులూ.. వాటిని కాపలా కాసే కుక్కా, ఇవేవీ ఇష్టపడవు. అలాగే వాటిని బతిమాలుకుంటూ ఆ చెట్టు చాటు , అదీ చూసుకుని తప్పించుకుని తిరుగుతూంది. స్ప్రౌట్ కు తన శత్రు వు, వీజిల్ నుండి తనని తను కాపాడుకోవడం రోజు రోజుకూ కష్టమవుతూ ఉంటుంది. కొన్నాళ్లకు కొత్తగా రెక్కలు వస్తాయి. కొద్దిగా ఓపికా వస్తుంది ఎలాగో barnyard నుండి బయటకు ఒక్క ఉదుటున తప్పించుకుని బయటపడుతుంది.
అప్పటికే కొన్ని రోజుల నుంచి Straggler తెల్లబాతు, మరో ఆడబాతు, రెండూ కనిపించకుండా పోతాయి.
ఒక్క సారి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న స్ప్రౌట్ మళ్ళీ తన కల అన్వేషణ కొనసాగిస్తుంది... బయట తిరుగాడుతున్న తనకి ఓ చెట్టు తొర్రలో ఓపెద్ద గుడ్డు కనిపిస్తుంది. ఇంకేం స్ప్రౌట్ ఎవరూ లేకపోవడం చూసి.. ఆ గుడ్డుని పొదగాలని అనుకుంటుంది. తన గుడ్డు కాకపోతేనేం? వెచ్చదనం అంతా వంట్లోకి తెచ్చుకుని.. పొదిగి పిల్లని చేస్తుంది.
ఇక్కడ ఓ ట్విస్ట్ ఏమిటంటే, straggler అనే బాతు మరో తెల్లబాతు కొట్టం నుండి బయటకు వచ్చేసాయి కదా.. అదిగో వాటికి సంబంధించిన దే ఈ గుడ్డు. తెల్లబాతు గుడ్డు ను పెట్టాక వీజిల్ బారిన పడి చనిపోతుంది. Straggler బాగా దెబ్బతిని ఉంటాడు. వీజిల్ బారినుండి స్ప్రౌట్ ని, తన పిల్లనూ కాపాడే ప్రయత్నం లో స్ట్రాగ్లర్ చనిపోతాడు.
ఇంక స్ప్రౌట్ తన పిల్లను వెంట వెంట తిప్పుతూ, వీజిల్ నుండి రక్షిస్తూ.. అక్కడా,అక్కడా తలదాచుకుంటూ ఉంటుంది. సరదాగా ఓ సారి బార్న్ యార్డ్ కూడా వెళ్ళి గర్వంగా తన పిల్లని చూపించి వచ్చేస్తుంది కూడా. తన పిల్లకి రెక్కలొచ్చి ఇంచక్కా అక్కడ చెరువు లో ఈత కొట్టడం చూసి గర్వపడుతుంది. అయితే, వీజిల్ పెద్ద శత్రువు అయి మాటువేసి ఉంటుంది. దానితో తన గోళ్లతో ముక్కుతో పొడిచి అలసి పోయేలా యుద్ధం చేసి తన బాతు పిల్లను కాపాడుతుంది.
చివరగా ఎప్పటిలాగే ఆ చెరువు దగ్గరకి వలస వచ్చే బాతులతో కలిపి.. కలిసి ఎగిరిపొమ్మని చెబుతుంది. అలా వలసవచ్చి తప్పిపోయిన బాపతే పిల్లబాతు తండ్రి స్ట్రాగ్లర్ కూడా. అది వెళ్లిపోతుంటే వీడ్కోలు చెబుతుంది హాయిగా.
అంతలోనే తన శరీరం తేలికై గాలిలో ఎగురుతూ ఉన్నట్లు అనిపిస్తుంది.. స్వేచ్ఛ గా ఎగరాలి అనుకున్న కల నెరవేరింది. కిందకి చూస్తే.. వీజిల్ ఈడ్చుకుపోతున్న తన కళేబరం.
Sun-mi Hwang అనే సౌత్ కొరియా రచయిత్రి రాసిన ఈ పుస్తకం ఆవిడకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అనేక ప్రపంచ భాషలలోకి అనువదించారు కూడా. ఇప్పటి ఇంగ్లీషు అనువాదం Chi-Young Kim.
ఈ కథ పిల్లల సినిమా కూtడా తీశారు ట. చూడడానికి చిన్న పిల్లల పుస్తకం లా ఉండే ఈ నూట నలభై నాలుగు పేజీల పుస్తకానికి ఆపకుండా చదివించే గుణం ఉంది.
ఈ నవలని Animal farm తో పోలుస్తారు. నాకు మాత్రం రెండూ వేరనిపించాయి. స్వేచ్చ ప్రధాన వస్తువు కాని, Animal Farm రాజకీయ చైతన్యానికి సంబంధించిన వ్యంగ్య రచన అయితే, ఇది వ్యక్తిగత స్వేచ్ఛ కి ప్రతీకగా రాసినది. పిల్లలకు పెద్దలకు నచ్చే పుస్తకం.
సునీత పొత్తూరి.
#book_review