Monday, 23 August 2021

శ్రావణ మేఘాలు

 



Petrichor!  వేడెక్కిన నేల మీద వర్షపు చినుకులు పడగానే వచ్చే మట్టి వాసన..!!వాన కురుస్తోందంటే  అప్పటిదాకా వేడెక్కి ఉన్న  భూమి, రాళ్లు కూడా తమ లో నిక్షిప్తమైన తైలం లాటిదేదో ఆవిరి గా వెలిగక్కుతూ  సువాసనలు వెదజల్లుతూ ఉంటాయ‌ట.  

 దేశం.. భాష, కాలం  ఏదైనా అనుభవం.. అనుభూతి ఒకటే కదా .

నిద్రా శనైః కేశవమభ్యుపైతి

ద్రుతం నదీసాగర నభ్యుపైతి

 వర్షరుతువు లో జీవుడు నెమ్మదిగా పరమాత్మవైపు తిరుగుతాడట.. నదులు సాగరం వైపు పరుగులు తీస్తాయట. సాధకులు ఆధ్యాత్మిక వేపు మళ్లుతారు. ఆధ్యాత్మిక సాధనకు బహు అనుకూలమైన రోజులు.. ఈ నాలుగు నెలలు అంటారు.

వేసవి వేడి ఆవిరులు తగ్గి.. మేఘుడు కురిపించిన వానలకు తాపాలు చల్లారిన కాలం.

ఆ తర్వాత కురిసిన వానకి భూమి చల్లబడి ఎక్కడెక్కడి పూల వాసనలూ జడివానలో కొట్టుకుని  వచ్చి దోసిళ్ల తో దాహాన్ని తీరుస్తాయిట..  

నేనింకా దోసిళ్ల తో తాగుతూ నే ఉన్నా..ఆ పరిమళపు తేమగాలిని!


ఈ భావనలకు వాల్మీకి మహర్షి కి ప్రణామాలు.🙏

Monday, 2 August 2021

ఉయ్యాల బల్ల

ఉయ్యాల బల్ల

వైజాగ్ ట్రాన్సఫర్ అయిన ఇన్నాళ్లకి ..మేం ఒకప్పుడు ఉన్న ఇల్లు ఒకసారి చూడాలని అనిపించింది. అదీ నొస్టాల్జియా .. ఆ భావసంచలనం అనుభవం లోకి వస్తే తెలుస్తుంది.

ఆ యింటి ద్వారబంధం మీద చేయి వేయడం ఆలస్యం.. సరిగమలు పలికే హంపీ స్తంభాల్లా "రావే..  నీరజా.." అని పలికేది.. జానకమ్మ గారి గొంతు అరువు తెచ్చుకుని.

 ఏ భోజనాల వేళకో వెడితే మాత్రం  " రావే..నువ్వూ కంచం పెట్టుకో.‌.. అరటి కాయ ఆవ పెట్టాను. నీకిష్టమని తలచుకుంటున్నా.. నువ్వే వచ్చావు. "
 ఏదైనా తినడానికి పెట్టినప్పుడు, నీకిష్టమని  అనడం ఆవిడకు అలవాటు.. అలా అనగానే 'నేనెప్పుడు చెప్పాను ?'  అని అనలేం.. అదో మంత్రం. ఆకలి లేకపోయినా విస్తరి వేయక తప్పేది కాదు.
చాలా పాత యిల్లు. ఏళ్ల తరబడి సున్నం వేయని గోడలు పెచ్చులు రాలిపోతూ .. ఆ గోడల మీద బలంగా దిగేసిన మేకులు..వాటికి వేలాడేసిన పాత ఫోటోలు.. 
మధ్యలో గుమ్మం పైన  శ్రీ రామ పట్టాభిషేక పటం.. 
పురాతనమే.. కాని ఎంత సనాతనం..
ఇవన్నీ కాదు..

ఆ పాత ఇంట్లో ఉయ్యాల బల్ల ఒక్కటే నండీ రాజసాలు పోతూ ఉండే ఒకే ఒక ఫర్నిచర్. అదంటే నాకెంత యిష్టమో.
అరిగి పోయిన వెండి బిళ్లలు నాలుగు వేపులా తాపడం చేసి ఉండేవి.  తీగమీద నిలువునా వాలినట్టున్న  చిలుకల బొమ్మలతో ఇత్తడి గొలుసులు.. నాలుగు వేపులా...!!

లలిత గుడి దగ్గరకి వచ్చేసరికి "ఎక్కడ మాడమ్?" అని అడిగాడు ఆటో అతను. ఆ పక్క సందు లోనే ఇల్లు...
 ఆటో నెమ్మదిగా పోనిమ్మన్నా.. తీరా ఆ సందులో మళ్లగానే ఎక్కడ ఉందో ఇంటిని పోల్చుకోలే‌క కాస్త ముందు.. వెనక అయ్యాను. ఎవరో ఒకతను అటు వస్తుంటే అడిగాను సుందరరామయ్య గారి ఇల్లు ఎక్కడ అని‌.

ఆయన ఆలోచనలో పడ్డాడు.. అటు ఇటూ చూసి 'ఏ సుందరరామయ్య? ' అన్నాడు. 
ఎలా చెప్పాలి?..  ఆయన గంభీరమైన రూపం.. మెదిలింది.
అచ్చంగా అదీ కాదు. ఎలా అంటే..

 సుందరరామయ్య గారు ఎక్కువ గా  ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవారు.
 
సుందరరామయ్య గారు ఆ ఇంటి యజమాని. ఒక్కో సమయంలో ఒక్కోలా కనిపిస్తారు.  చాలా గంభీరంగా కూర్చుని కవిత్వమో... కథో రాసుకుంటూ కూర్చుని ఉంటే ఆయన బమ్మెర పోతన ;

ఎపుడైనా.. అక్కడే స్నేహితులతో సమా వేశమైనపుడో‌‌.. తానొక రాజకీయవేత్త;

ఎవరైనా  ఆయన ఇచ్చే హోమియో మందు కోసము వస్తే.. వైద్యులు;

అరుదుగా అయినా, సరుకులు నిండుకున్నాయి అని భార్య చెప్పడానికి వచ్చినప్పుడు, మాత్రం బేల గా దిక్కులు చూసే కుచేలుడు; 
ఆయనకీ ఉన్నాడు ఓ సన్మిత్రుడు. లక్ష్మీనారాయణ అని‌. అడ్వకేట్. ప్రాక్టీస్ లేకపోయినా, పూర్వీకుల ఆస్తి ఉన్నవాడు.. ఉన్నవాడూను.
కాని, పాపం లక్ష్మీ నారాయణగారు మాత్రం సుదాముడికి శ్రీకృష్ణుడే. స్నేహానికి తప్ప చేయి చాచని మిత్రుడి మనసు ఎరిగినవాడు ఆయన. ఏదో సర్దుబాటు చేసేవాడు లోపాయికారిగా.‌
తరువాత;
 
 ఏదో ఆ పూట భోజనం అయి..  చిన్న వక్కపలుకు వేసుకుని నములుతూ ఉయ్యాల బల్ల మీద విశ్రమించే మధ్యాహ్నం వేళ... పక్కన భార్య కూర్చుని విసన కర్రతో విసురుతూ.. ఉంటే, చూడాలి ..
 అప్పుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు.
 
యోగీంద్రుడు ఆయనే-  భోగీంద్రుడు  ఆయనే ... ఆయా వేళలను బట్టి. 

సర్వావస్తలలోనూ... ఆయన నోటి వెంట సంగీతం పలికేది. ఆయన సంగీత విద్వాంసుడు కాదు కాని. కర్ణాటక సంగీతం అంటే ప్రీతి. 
ఎక్కడ్నుంచో ఓ పాట వినిపిస్తుంది.. ఆ రాగం మెదులుతుంది‌‌‌‌..  అంతే..తన్మయత్వం ఆవహిస్తుంది. వెళ్ళి న పనికూడా మరచిపోయేవారు‌.
అలుపూ, విసుగూ లేని  'సంతృప్తి' అనే అయిశ్వర్యం ఉండేది ఆ ఇంట.

కొన్నేళ్లుగా పొరుగునే ఉన్న నేపథ్యంలో.. విన్నవి,చూసినవి విశ్లేషణలో నాకు పొడకట్టిన భావరూపం...

నా ఆలోచనల్లో ఉండగానే మొహం చిట్లించుకుని ఆ పెద్ద మనిషి వెళ్లి పోయాడు. 

ఈ సారి మరో పెద్దాయన ఎదురుగా వస్తుంటే ఆటో దిగి మరీ అడిగాను. సుందరరామయ్య గారి ఇల్లు తెలుసా అని‌. 
"ఇక్కడే ఉండాలండీ వారిల్లు.. మంచి కవి. రామాయణం లో సుందరకాండ  వచనం చేసారు. .."  నేను ఇంకా ఏదో అనబోతుంటే గుర్తుకొచ్చినట్టు..

"ఆయన హోమియో వైద్యం చేసేవారు కదా "అన్నారు ఆయన.

" అవునండీ.." 
నవ్వాడు చిన్నగా.. "వారు కాలం చేసి చాలా కాలం ..అయింది. వారిల్లు..అపార్ట్మెంట్స్ కట్టారు.. ముందు వేపు జేగురు రంగు వేసుందే.. అదీ."
ఒక్కసారి నిరాశ కమ్ముకుంది.  నామొహం చూసి కామోసు.‌‌‌..
" వెళ్లండి పర్వాలేదు వాళ్ల చిన్నబ్బాయి ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటాడు."
వచ్చినందుకు ఒకరైనా ఉన్నారు.. హమ్మయ్య.. అని ఆయనకు కృతజ్ఞతలు చెప్పి.. వెళ్లాను.  
వాళ్ల చిన్న అబ్బాయి కృష్ణ ఇంటోనే ఉన్నాడు. నన్ను గుర్తు పట్టలేదు. ఎప్పటికో "బుజ్జక్కా ! " అన్నాడు గుర్తు చేసుకుని.
తెచ్చిన పళ్లు టీపాయ్ మీద పెట్టాను.
"పళ్ళు తెచ్చాను .. మీ మిసెస్ కు ఇవ్వు అన్నా. అప్పటి కి తేరుకుని కూర్చోమన్నాడు..
చిన్నప్పుడు బుజ్జక్కా అంటూ నా వెనక మోపెడ్ ఎక్కి ..తిరిగినవాడు.  ఎంచేతో మొహమాట పడుతున్నాడు‌‌.
"పిల్లలెందరు?" అని అడిగాను.
"ఒక అబ్బాయి.. "  కింద ఆడుకుందుకు వెళ్లాడు.
సుందరరామయ్య గారు వెళ్ళి పోయి అయిదేళ్లయిందిట.
వాళ్లమ్మగారు జానకమ్మ గారు ఇక్కడ లేరుట.  అన్నయ్య దగ్గర హైదరాబాదులో ఉంటున్నారు.  
"అమ్మనైనా చూడగలిగి తే బాగుండును" అన్నా.
" కిందటి వారమే వెళ్ళింది. ఆరునెలలు ఇక్కడా‌‌‌... ఆరునెలలు అక్కడా " అన్నాడు‌. ఎందుకో చివుక్కు మంది‌.
నువ్వేం చేస్తున్నావ్ అడిగాను. చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు.. క్లుప్తంగా ' బిజినెస్' అన్నాడు.
ఇక నాకేమీ మాటాడబుద్ది కాలేదు. లోపలనుండి వాళ్లావిడ బయటకు రాలేదు.  రాకూడని వేళ వొచ్చానేమో.. ఇక వెళ్తా అనగానే తలూపాడు.
వస్తుంటే.. నాతో టే వచ్చాడు.
ఇక ఉండబట్టలేక అడిగా.." అన్నట్టు ఉయ్యాల బల్ల  ఏం చేశారు? "
అదోలా నవ్వి అన్నాడు.. " అదా. పాత బడింది..అపార్ట్మెంట్ లో పట్టదు కదా.‌‌  కింద  రూమ్ లో పడేసాను.. అమ్ముదామంటే ఏమీరాదు కూడా ‌." 
"ఉందా..చూపిస్తావా?" అన్నా దాన్ని చూస్తే అన్నా పెద్దాయన్ని చూసినట్లు ఉంటుంది అని.  అలాగే పైకి వెళ్ళి తాళం చెవి పట్టుకొచ్చాడు.. వాచ్మెన్ ఎవరూ లేరట..అది ఇలా సామాను పడేసి.. ఉంచారు ట. ఎవరికైనా అవసరం పడ్డప్పుడు రూమ్ వాడుకోవచ్చు ట.. 
ఖైదీ అయిన రామదాసులా  ఉయ్యాలబల్ల  మూలన చూసి.  
నాటి వైభవం గుర్తుకు వచ్చి మనసు మూలిగింది బాధ తో. 
పోనీ.. నేను కొనుక్కుంటా.. అమ్ముతావా? నువ్వు చెప్పిన రేటుకే..అన్నాను. కృష్ణ ఆశ్చర్యం గా చూసాడు.
" అలాగే మీ అడ్రస్ ఇవ్వండి " అన్నాడు.  అడ్రస్ ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చేసాను. నా ఎదుటే టెంపో పిలిచాడు‌.
హైదరాబాదు లో మేం కడుతున్న కొత్త ఇల్లు మనసులో మెదిలింది. 
హాలులో  ఉయ్యాల బల్ల ని ఊహించుకుంటూ వెనక్కి వచ్చాను.

అందరిలాగే వాళ్ళూను..ఆస్తి పంపకాలు చేసుకున్నారు.. కొత్తేమీ కాదు‌. పాపం జానకమ్మ గారే.. వేళ్లు కత్తిరించిన బొన్సాయ్ మొక్కలా..చెరో ఆర్నెల్లూ..  అటూ- యిటూ మారుతూ.


 
 





 

Sunday, 1 August 2021

స్నేహ సందేశం

 




స్నేహ సందేశం


అర్జునుడు సమ్మోహనాస్త్రం వేసాడు. ఓ అందమైన అప్సరస వచ్చీ చేతిని అలా... తిప్పగానే  కౌరవ సేన అంతా మాయ కమ్మి, గాఢ నిద్రలోకి జారుకుంది.  ఉత్తర కుమారుడు సాహసోపేతంగా వచ్చి కలలన్నీ వొలుచుకున్నాడు.. జ్ఞాపకాలుగా.. 

రాత్రి మాంఛి నిద్ర.. ఫోన్ అనే అస్త్రం.. చేతిలోంచి జారిపోయింది.   గుప్పెట మూసే ఉంది.. దూసుకున్న కలలన్నీ ఖాళీచేసి వెళ్ళి పోయాయి!

ఈ రోజు స్నేహితుల దినోత్సవం ట. స్నేహితుల ని కలుసుకోవడం కూడా కల లో మాటే! 

బయట చూస్తే వెన్నెల కాస్తూన్నట్టు.. చల్లని సూర్యుడు పైకి వచ్చేశాడు.  ఉత్తర దిశలో వానమబ్బులు  మాత్రం సూర్యుడికి భయపడవట.. గబ గబా ఆ దిక్కున ప్రయాణం చేస్తూ ఉన్నాయి.. 

పరుగెత్తే ఈ మబ్బులని కాసేపు ఆపి అడుగుదాం.. కబుర్లు ఏమైనా అందిస్తాయేమో.


ఓ వాన మబ్బుల్లారా.. !

మీరెటు పోతున్నారో కాని

మీ దారిలో 

నా మిత్రులు చాలామంది ఉన్నారు.

చరవాణిలో నేనెలాగూ సందేశాలు పంపాను..

పూలగుత్తి బొమ్మలను పెడుతూ..

కానీ;

కానీ.. ఊరి అవతల..కొండపక్కన

నా మిత్రుడు ఒకడు ఉన్నాడు..

రాళ్లూ..ముళ్లూ ఏరి చదును చేసి..

పదును చేసి..  నీ రాక కోసం చూస్తూ ఉంటాడు.

గవర్నమెంట్ ఇచ్చింది ట..

కొండ పక్కనే.. ఏ వానమబ్బో కొండచరియ తో

చెలిమి చేసి..స్నేహ వాగు కురిపించదా

అన్నాడు‌.. అచ్చం ఇట్టాగే కాదనుకో.

తన భాషలో.. తెల్లని తన నవ్వులో

ఆకాశమంత ఆశను పరచి..

చెప్పాడు అపుడెపుడో.

అక్కడి దాకా వెడతారని నాకు తెలుసు

స్నేహమై కురుస్తారని తెలుసును..

అయినా ఏదో నామాటగా.. 


అందరికీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు💐

Sunday, 18 July 2021

కారుమబ్బులు.


హోరు గాలీ కారు మబ్బులు.. ముసిరేలోగా.. మూగే లోగా ఊరు చేరాలి! వానాకాలం లో తరచుగా వినిపించే పాట.. అందరి మనసుల్లో..  లయబద్దంగా సాగే గిట్టల చప్పుడు..!

అలాగే.. #సంగం_సాహిత్యం లో చెప్పబడిన ఓ చిన్న కవిత.

పరాయి దేశం వెళ్ళి న అతను వానాకాలం సమయానికి ఇంటికి ముఖం పట్టాడు.. నాట్లు వేసే సమయం.. వ్యవసాయ పనులు వెనక్కి పిలిచాయి. వచ్చాక తన భార్య తో ఇలా అన్నాడుట.

నిన్ను పోలిన నెమలి ఆట,

నీ నెన్నుదుటి  తావి లా ‌

విచ్చుకున్నవి.. అడవిమల్లెలలు!

 జింక పిల్ల నీలాగే  బెదురు చూపులు చూస్తూంది.

నీ గురించి తలపులతోనే

వానకారు మొయిలి కంటే ముందే

వడి వడిగా వచ్చాను చెలీ.

The peacock danced like you, the jasmine flowers blooming with fragrance of your beautiful forehead, the deer gave a scared look like you. Woman with beautiful forehead, thinking about you, I came here swifter than the rain clouds


ninne polum manjnjai aala nin

nannudhal naarum mullai malara

ninne pola maa marundu nokka

ninne ulli vandhanen

nannudhal arivai kaarinum viraindhe


Mullai

-Peyanar(AINKURUNURU 492)

మన గాథాసప్తశతి లాగే ఈ సంగం సాహిత్య పద్యాలూను. ఓ చిన్న పరిచయం ఈ సందర్భంగా.సంగం సాహిత్యాన్ని స్థూలంగా రెండు గా విభజించారు. ఒకటి 'అగం'.   మరోటి భాగం 'పురం.' - ఆత్మాశ్రయ మైనవి, జనాంతికమైనవి.. 

ప్రజల జీవన విధానం, వారు జీవించే నేల లేదా నైసర్గిక స్వరూపాన్ని బట్టి  మళ్లీ  ఐదు ' తిన్నై' లు గా వర్గీకరించారు.

కురింజి, ముల్లై, మారుతమ్,నైతాల్, పాలమ్.

కురింజి అంటే కొండప్రాంతం,  మలై అనగా అడవి ప్రాంతం భూమి,  నైతాల్ సముద్ర ప్రాంతం లో భూములు, మారుతం చదునుగా ఉన్న భూభాగం.

చివరగా పాలమ్ ఈ ప్రాంతం విడిగా ఏమీ లేదు. కాని, వర్షాభావం వల్ల బీడుగ మారిన అడవి, కొండ ప్రాంతాలు ఇందులో వర్గీకరించారు.


పై పద్యం 'ములై' విభాగానికి చెందినది. 'పెయనార్' అన్న కవి రాసారు. ఈ విషయాలు అన్నీ అంతర్జాల వివరాలతో పాటు‌, Ms Grace బ్లాగ్ నుండి ..వారి అనుమతి తో.

https://sangamliteratureinenglish.blogspot.com/2014/04/thinking-of-you-beautiful-lady-of-mine.html?m=1

Monday, 22 March 2021

ఎల్లో రిబ్బన్ -మోహ లేఖలు

  

'ఎల్లో రిబ్బన్' మోహ లేఖలు. 

                             –కుప్పిలి పద్మ

చినుకు చినుకు నడుమ

చిన్న చోటేదో వుంది 

నీకో లేఖను రాయమంటోన్నాయి.

ఉత్తరాలు రాయడం ఒక కళ. అందు లో కవులు, రచయితలు రాసే ఉత్తరాలు ప్రత్యేకం.  కుప్పిలి పద్మ గారి  మోహలేఖలు  చదువుతుంటే,  చలం గారు, తెన్నేటి హేమలత గారు గుర్తు కి వస్తారు.వారికి దాపరికాలు లేవట.  అటువంటి స్వేచ్ఛా యుత కవితాగానం కుప్పిలి పద్మగారు మళ్ళీ రుచి చూపించారు!

సున్నితంగా, నెమలీక తో సుతారంగా  రాస్తూన్నట్టున్న ఈ మోహలేఖలు, ఆవిడ అన్ని ఇష్టాల్లాగే మంచి కాఫీ తాగినంత ఆనందంగా చదివాను.  

హిమాలయాలలో మొదలుపెట్టి, మోహపు గోదావరి ఒడ్డుకు లాక్కొచ్చీ.. వెన్నెలా, వానా చూపించి  ఆ అనుభూతి ని జాతీయం చేసారు.  కడియం పంటకాలువ వెంట నడిచిన అనుభవం లో వాస్కోడిగామా ఫీలయ్యారట. అనుభవం తనది మాత్రమే అయినప్పుడు అది డిస్కవరీ నే కదా.. 

ప్రతయాణాలు.. ఒంటరి ప్రయాణాలంటే ఆసక్తి.  క్వీన్ సినిమా లో కంగనా చేసిన ఒంటరి ప్రయాణం అంటే ఇష్టం. స్త్రీ లు ఒంటరిగా ఎందుకు ప్రయాణం చేయరూ అని తన చిన్నప్పటి కల్పిత కథలో తప్పిపోయిన జింక పిల్లను వెతుక్కుంటూ బయలుదేరిన ఒక రాణి పూటకూళ్ల ఇంట్లో బసచేయడం బాగుంది కదా. అయితే ఒంటరి గా ప్రయాణం ఓ మిథ్ అంటారు. మనషులు కావాలి. అయితే... ఎవరి ఇన్నర్ జర్నీ వారికి ఉండాలి అంటారు.

ఇన్నిన్ని విషయాలు చేరవేస్తూ, మాటల్లో  పెట్టలేనంత ఆపేక్ష అక్షరాల్లో కి పొదుగుతూ.. తనకు ఎదురయ్యే అనుభవాలను నెరేట్ చేస్తూ..  నువ్వుంటేనా అని సహచరుని ఎడబాటు ను గుర్తు చేసుకుంటూ మురుస్తూ, మురిపిస్తూ ఆహ్లాదం గా సాగిన లేఖలు ఇవి.

అంతటి భావావేశానికి అడదడపా చిన్న బ్రేక్ పెట్టి, ప్రస్తుతం లోకి వస్తూ అనేక సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ, వాస్తవిక చిత్రీకరణ చేస్తూనే రొమాంటిక్ టచ్ చెదరకుండా..  బాలన్స్ చేశారు.  అదే ఆవిడ ఈ రచనలో 'మేజిక్'.  కేవలం మోహావేశాన్నుంచి‌‌‌‌..  ఒక మెట్టు ఎక్కువేనేమో  అనిపించిన తాత్విక రచన. 

 

Friday, 8 January 2021

lockdown-musings



రాతి పూలు

అహములు సన్నములయ్యెను

దహనము హితమయ్యె, దీర్ఘదశలయ్యె నిశల్

 బహుశీతోపేతంబయి

యుహుహూ యని వఁడకె లోక ముర్వీనాథా!

-పోతన భాగవతం

ఇదీ చలి ప్రభావం.  రెండురోజులగా మరీ వణికిస్తోంది. ముసురు పట్టి మరీను. కాళ్లకు రాసిన లేపనం కరిగి  అప్పుడే ఏడాది కావస్తోంది.  దారులన్నీ మూతబడ్డాయి. 

అంచేత... ఉన్న చోటే గోపురం.. ! మానస సంచరమే సంచారం. లోలోపలే 'కొలంబస్' లా దారులు వెతుక్కుంటూ!ఉదయపు నడక కూడా డాబాపైకి మారిపోయింది నాకు.

మా ఇంటి పరిసరాలలో నే  ఓ చిన్న కొండ, దాని పైన దుర్గ గుడి. ఈ గుట్ట చుట్టూ కోటలా  పెద్ద పెద్ద రాతిబండలు...!

రోజూ చూస్తున్న దృశ్యాలే... 

సూర్యుడు వస్తాడు- రాడు. పందెమా.. ఎదురు చూపులు.

ఎండాకాలం పచ్చగా,ఎర్రగా మెరిసిపోయే  ఆ  రాతి బండలు, వర్షాకాలం అభిషేకం జరిపించుకుంటాయి. మంచు కమ్మినపుడో... మార్మికత ను తమలోనే దాచుకున్న మునులే అవుతాయి.  

అప్పుడు కురిసిన వర్షాలకి, ఆ కొండ ప్రాంతం పచ్చదనం తో నిండి 'మినీ' శ్రీశైలం లా ఉండేది మా డాబా మీంచి చూస్తే. అన్నట్టు అక్కడ దేవుడు కూడా మల్లన్న ట!  

ఆ బండరాళ్లని, వాటి చుట్టూ ఉండే  పచ్చని పొదలు , రోజూ చూస్తున్నా ఆ కొండ రాళ్ల మీద ఇంకా.... ఇంకా అభిమానం పెరిగిందే కాని విసుగు రాలేదు. 

నా మొబైల్ తో ఎన్ని ఫోటోలు తీసానో!

'డెక్కన్ రాక్స్ ఎన్నాళ్లకి చూసానో భలే గుర్తు చేసావ్' అని నా ఫ్రండ్ సరదా పడింది నే పంపిన ఫోటోలు చూసి. వాళ్లున్న  రాజభవన్ రోడ్ ప్రాంతం లో.. పొడుచుకు వచ్చిన రాళ్లు,గుట్టల పైనుంచి టాంక్ బండ్ కనబడేది ట వెనకటి రోజుల్లో. 

అప్పుడు గుర్తుకు వచ్చింది... ఈ బండల మాటున ఏ చరిత్ర ఉందో.దక్కన్ పీఠభూమి కి సంబంధించిన ముఖ్య నగరాల్లో హైదారాబాదు ఒకటి కదాని. 

'మా హైదరాబాదు' అని అనుకోగానే.. ఎత్తైన కొండ మీద నిలబడి జెండా ఎగరేసినట్టు  గర్వంగా ఫీలవుతారు హైదారాబాదు నగరవాసులు... 

హైదరాబాదు మహానగరం ఉనికి కి అసలు ఈ రాతి బండలే ఆనవాళ్ళు. ఇంకా చుట్టూ చెరువులు. కూడా. చారిత్రాత్మక స్మృతి చిహ్నాల లాగ అద్భుతమైన  ఈ రాతి అమరికలు, చూసే వాళ్లని ఓ రకమైన మోహం లో పడేస్తుంటాయి.

హైదరాబాదు లో ఈ stone lovers చాలామంది ఉన్నారు. కుర్రకారు అంతా తరచుగా ట్రెక్కింగ్ కి వెడుతూ ఉంటారు. అదొక అనుభవం.  ఫేస్‌బుక్ లో తమ పేజి ఉన్న, Society to save Rocks  సంస్థ ఒకటి దాదాపు రెండు దశాబ్దాల కి పైగా పని చేస్తోంది. హెరిటేజ్ ని కాపాడే ప్రయత్నం లో.

స్థూలంగా చూస్తే తూర్పు కనుమలకు, పడమటి కనుమలకు మధ్య ఉన్న ఎత్తైన ప్రాంతమే ఈ దక్కన్ పీఠభూమి.  దాదాపు అరవై ఐదు మిలియన్ సంవత్సరాల కిందట అగ్నిపర్వత విస్ఫోటనం వలన పెల్లుబికిన లావా వింధ్య పర్వతాలకి దక్షిణాన విస్తరించి ఎత్తైన పీఠభూమి గా ఏర్పడింది‌

ఇక్కడి రాళ్ల గురించి భౌగోళిక శాస్త్ర వేత్తలతో సహా చాలామంది మాట్లాడిన విషయాలను విన్నాను. ఈ రాక్స్ యొక్క ఉపరితలం మృదువుగా కనిపిస్తుందనీ...  అనేక సూక్ష్మ రంధ్రాలతో Porous గా వుండే ఈ రాళ్ళు తేమను పీల్చుకొని వాతావరణం నియంత్రిస్తాయని అంటారు . హైదరాబాదులో ఉన్న పెద్ద పెద్ద కొండ రాళ్లవలనే సహజంగా చాలా చెరువులు ఏర్పడ్డాయని అన్నారు.  

నగర విస్తరణ అనివార్యం అయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. కొండలు కరిగించారు. చెరువులు పూడ్చేసారు. గేటెడ్ కమ్యూనిటీ లు ఏర్పడ్డాయి.

బాధా కరమైన విషయం ఒకటి మనం గమనించాలి. అడవులు నశించి పోతున్నాయి అంటే, పూనుకుని మళ్ళీ మొక్కలు పాతి తిరిగి అడవులను పెంపొందించడం వీలవుతుంది.  కాని, ఈ రాళ్ల విషయం అలా కాదుకదా.  ఇవి సెడిమెంటరీ రాక్స్.  అరవై ఐదు మిలియన్ సంవత్సరాల నిక్షేపాలు.  కాపాడుకోవాలే తప్ప పునర్నిర్మించలేరు. అదే అంటారు ఈ సేవ్ రాక్స్ సొసైటీ వాళ్లు.  ఈ అవేర్నెస్ కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు

అయినా జరగవలసిన నష్టం జరగనే జరిగింది. అది మనకు తెలిసిన దే. ఇటీవలి అకాల వర్షాలు, వరదలూ, అడపాదడపా భూమి కూడా కంపించడం ఇవన్నీ దేనికి సంకేతాలు?

 పుష్పవిలాపంలా ..వినిపించని రాతిపూల మనోగతాలు         ఇలా కవిత లా రాసుకున్నా.. ఛందస్సు లేని కవిత..


#రాతి_పూలు


అప్పట్లో...

మా పూర్వీకులలో

#కొందరు_మహానుభావులకు

రెక్కలు ఉండేవట.

స్వేచ్ఛ గా చరిస్తూ, సంచరిస్తూ;

రాజాగ్రహం చవి చూసేదాకా

భయం తెలియలేదు.

అయినా ఒకరిద్దరు 

గాలి రెక్కలు పొదవి పట్టుకుని

ఎగిరి పోయి దాక్కున్నారని

వినికిడి. కాని చూసింది లేదు.

అదంతా పురాణం అని మీరన్నా

చేసేదేం లేదు. 

ఆనాటి కల్పనలనే కలలుగా 

కనడం తప్ప

కదల లేము మెదల లేము;

ఎండ కాసినా, వాన కురిసినా,

మంచు కమ్ముకున్నా అచలంగా

మేమే !


అప్పుడప్పుడు.. ఉలి తాకిడి

మా కలవాటే;

శస్త్రచికిత్స చేసే వైద్యుడిలా

ఓ కళాకారుడు వెన్నుతడతాడు.

సున్నితంగా తట్డి,విభజించి

మా లోని భాగాన్ని ఓ మూర్తి ని చేస్తాడా

తక్కిన అమూర్త భాగానికి 

దక్కని గౌరవం ఏదో దక్కించుకున్న

ఆ మూర్తి ని

మా ముందరే తరలించుకు పోతుంటే

వళ్లంతా కళ్ళై చమర్చిన తడి 

మీకు ఎలా తెలుస్తుంది?

ఫెటీల్మనే విస్ఫోటనం వెనుక

మమ్మల్ని అనేక భాగాలు చేసాక,

ఏ రెండు భాగాలో ఆర్తిగా హత్తుకు పోతూ;

ఏ అమూర్త భాగమో నిటారుగా నిలదొక్కుకుంటూ,

అస్తిత్వాన్ని కాపాడుకొనే ప్రయాస.

అదీ మేమే!


అనుకోకుండా

మళ్ళీ మంచి రోజుల వచ్చాయి..

ఎలా అంటారా?అది మీకూ తెలుసు.

మా మహోన్నత సౌందర్యానికి

మురిసి పోతూనే, మరో పక్క మా విధ్వంసానికి

పన్నాగాలు పన్నే స్వార్ధ పరుల 

రాక ...హటాత్తుగా ఆగింది.


కురిసే మబ్బుల జాడ కి ఎగురుతూ

వచ్చి వాలిన నెమళ్ళు... 

జడిసి  జరజరా తడి పొదలమధ్య కి

జారిపోయే సర్పరాజాలు;


మా వెన్ను మీద  తమ పొడవు కాళ్లని అన్చి,

నీటి జాడ కోసం చూసే వలస

పక్షులు 

పూల సందడి కబురంది కమ్ముకునే

తేనె పిట్టలు,తేనెటీగలు..

జీవ వైవిధ్యం మాతో బాటే!


మా చుట్టూ ఆకుపచ్చదనం

పట్టు కుచ్చులు పోస్తూ ఆవరించింది.

ఉలి తాకిడి లేకనే మలచబడిన

చెక్కని శిల్పాలలా

దర్పంగా మేము!


కాని,

ఏ అర్థరాత్రో దూరంగా ప్రొక్లెయినర్ల

చప్పుళ్ళు  భ్రమసిన మా గుండెలని 

భయపెడతూనే ఉన్నాయి...

తనువంతా కళ్లే అయి నీటి చలమల్ని

దాచుకున్న మాలో తడిని ఆవిరి చేస్తూ

సున్నపు పొడిలా నుగ్గు నుగ్గు చేసిన భయం

వెన్నంటే వుంది.

అయినప్పటికీ

ఒకటే జాలి వీళ్ల గురించి

లక్షల వేల సంవత్సరాల మా అస్తిత్వాన్ని

విధ్వంసం చేసే  వీరు, వీరు,

వీళ్లంతా... 

యుగయుగాల తమ ఉనికిని

కాపాడుకోగలరా అనే!

—౦—