Wednesday, 30 January 2019

పెరియ పురాణం-2

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

శ్రీ రమణులు చెప్పిన కధలు_
పెరియ పురాణ కథలు(సంక్షిప్త సమీక్ష)
అజ్ఞానభిత్(అప్పార్)

జ్ఞానసంబంధార్ 'అప్పా' అని సంబోధించడం వల్ల ఈయనకి అప్పార్ అని పేరు వచ్చింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు మరుల్ నీక్కియార్. ఇతనిది సాదా సీదా వ్యవసాయ కుటుంబ నేపథ్యం.
ఆమూర్ అనె పల్లె లో కీర్తిమంతుడు, మాదిని అనే దంపతులకు జన్మించాడు. వారికి  ముందు తిలకావతి అనే కూతురు కూడ ఉన్నది. మా అజ్ఞానభిత్(మరుల్ నీక్కియార్) పుట్టిన ఆమూరు ఊరి దైవము వీరాట్టేశ్వరుడు.

 ఆ పల్లె గురించి "భగవాన్* ఎంత మనోహరంగా వర్ణించారంటే ఆయన మాటల్లోనే *వ్యవసాయ దారులు తమ పొలములలో కుప్పతెప్పలుగా పోగులయేట్లు పండించేవారు. ప్రజలు 'అన్నపూర్ణాదేవి దగ్గర బంధువులా' అనిపించేంత ఉదారులు. సోమయాజులు నిర్వహించే నిరంతర యాగ యజ్ణములనుండి వెలివడే ధూమం మబ్బులై,వర్షమును కురిపించు చుండేవి*
ఇంత సుసంపన్నమైన ఊరిలో, పరమేశ్వరుడు ' వీరాట్టేశ్వర' రూపంలో కొలువై ఉన్నచోట మన కవి బాల్యం బాగానే గడిచింది. చదువుసంధ్యలు  బాగా నే అబ్బేయి.

ఇతని సోదరి తిలకావతి కి వివాహం నిశ్చయమౌతుంది.వరుడు
ఆదేశపు రాజు దగ్గర సేనానాయకుడు గా చేస్తుంటాడు దురదృష్టవశాత్తూ, పెళ్లికి ముందే యుద్దము లో ఆయువకుడు చనిపోతాడు. ఈ హఠాత్పరిణామానికి హతాశుడైన వారి తండ్రి కూడా మరణిస్తాడు.
తిలకావతి విరాగి అవుతుంది. పూర్తిగా వీరాట్టేశ్వర స్వామి వారి సేవలలో అంకింతమై పరమ భక్తురాలౌతుందామె.  ఆ సమయంలో అజ్ఞానభిత్ ధర్మబద్ధంగా జీవిస్తున్నపటికీ, ధర్మ కార్యాలకు అమితంగా ధనం వ్యయం చేస్తాడు. అతనికి జైన మతస్థుల తో పరిచయం అవుతుంది. వారితో తర్కములొ పాల్గొంటాడు. వారు తము నిర్వహించిన వివిధ సభలలో వైదిక మార్గం ఖండన చేస్తూ,తమ మతము అహింసా ప్రధానమైనదని, సూర్యాది గోళములన్నీ భౌతికములే అయి ఉండగా వాటికి పూజలెట్లా సమంజసమని, అందు చేత అన్నిటికన్నా తమ మార్గమే విశిష్టమైన దనీ..అనే వారివాదనలలో క్రమేపీ నమ్మకం ఏర్పడుతుంది అతనికి. క్రమంగా వారి సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై మతం మార్చు కొని ధర్మసేనుడు గా తన పేరు మార్చుకుంటాడు. పాటలీపుత్ర మతాచార్యుడు గా నియమింపబడతాడు.
 శివభక్తి గల అతని అక్క  తిలకావతి ఎంత వారించినా లక్ష్య పెట్టడు. తిలకావతి మహా భక్తురాలు తన తమ్ముడి మనసు మార్చమని ఆ పరమ శివుని ప్రార్థిస్తుంది. ఆవిడ ప్రార్థన పరమేశ్వరుడు ఆలకించినట్లే ఉంది.
 ‎ఓ  రోజు అతనికి విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. ఎంతకీ ఉపశమించదు. తన సోదరికి కబురుచేస్తాడు. ఆమె అతనినే తనదగ్రకు రమ్మనమని, జైన మత సూచిక లైన దుస్తులు అవీ మార్చుకొని,నదీ స్నానం చేసి విభూతి అద్దుకొని వస్తే కాని చూడనని నిష్కర్షగా అంటుంది. అతనలాగే చేస్తాడు ఉపశనమార్గం వేరే లేక. అమే    వీరాట్టేశ్ర్వ ర స్వామి సన్నధికి తీసుకు వెళ్ళి శివదీక్ష ఇస్తుంది అప్పటికి అతని ఆవేదనంతా ఉపశమిస్తుంది. ధర్మసేనుడు తిరిగి అభిజ్ఞతుడై అక్క దగ్గర శివకైంకర్య విధానాన్ని ఆమూలాగ్రంగా తెలిసికొని ఆచరించడం మొదలుపెట్టాడు. శివసన్నధిలో దేవుని స్తోత్రం చేయాలనే ఆతని కోరికకు పరమేశ్వరానుగ్రహంతో సరస్వతీదేవి నాలుకపై నిలిచి ప్రేరేపించింది.... ఆశువుగా పరమేశ్వరుని స్తుతించసాగాడు. అప్పటినుంచి వాగీశుడు అన్న పేరొచ్చింది అని ఇతిహాసం.

*తారక్ష్య నదీతీరాన వెలసినట్టియు,విద్రుమాద్రి శిఖరసీమలో నివసించునట్టియు, చూపు తోనే రోగములను నివారచునట్టి వీరాట్టేశ్వరునకు నతి*
*దుష్టుడనైన నాకు శిష్ట బుధ్ధి నిచ్చి,వినయసంపన్నుని చేసి, రోగముక్తుణ్ణి చేసి,నీ భక్తునిగా మలచుకొన్న దయావారాశివైన నీకు ఏటికోళ్లు*

ఈ పరమ భక్తుడు తన దాస్యభక్తి తో అనేక క్షేత్రాలు దర్శించి పరమశివుని ఎలా ప్రసన్నం చేసుకొన్నాడో..అప్పార్ గా జ్ఞాన సంబంధునితో చేరి శైవమతం ప్రచారం...ముఖ్యంగా అతని కవిత్వంలో ని ప్రత్యేకత.
ఆవిధంగా ఆసువుగా భక్తి కీర్తనలు ఆలపించిన అజ్ఞానభిత్
( మరుల్ నీక్కియార్ ) వాగీశుడనే బిరుదు పొందాడు. ఇక్కడ ఒకటి గ్రహించాలి. శ్రీ రమణులు పుస్తకం లో అజ్ఞానభిత్ పేరు బ్రాకెట్ లో మరుల్ నీక్కియార్ అని ఇచ్చారు. బహుశ అది అనువాద పేరేమో. సంబంధార్ ని కలిసే దాక వాగీశుడు పేరుతో నే వ్యవహరించారు. జ్ఞాన సంబంధులు (Gnana Sambamdhar), ఈయన వయసులో తనకంటే పెద్దవాడవటం వల్ల వీరిని అప్పార్ అని పిలవడం తో అప్పార్ గానే ప్రఖ్యాత మయ్యారు. అందుచేత ఇకముందు అప్పార్ గానే వ్యవహిరిద్దాం.

కవిత్రయం లా సంబంధార్,అప్పార్,సుందరార్ ఈ ముగ్గురు నాయానర్ల లో ప్రముఖులు... వారి భక్తి సంకీర్తనలే ' తేవారం' గా
శివాలయాల్లో పాడుతారు.(Tevaram or Devaram which means garland of poems)

*' సంబంధార్ తనకోసం పాడాడు, సుందరార్ ధనం పై ఆశతోనూ, అప్పార్ నాపై భక్తి తోనూ పాడారని 'పరమేశుడే అన్నట్టు కూడా చెప్తారు.*

అప్పర్ ది దాస్య భక్తి. స్వతహాగా వ్యవసాయ నేపథ్యం ఉండటం వల్ల అతని కీర్తనలలోనూ అది కనిపిస్తూంటుంది. ఒకసారి మతం మారి తిరిగి స్వమతంలోకి వచ్చినందువల్ల అపరాధభావము అతనిని వెంటాడుతూ వుంది. ఈ కారణంగా అప్పార్ స్వామి జైనుల నుంచి ఎన్నో బాధలు పడ్డాడు. పల్లవరాజు సాయంతో వారు ఇతనిని ఉడుకుతున్న సున్నపు బట్టీ లో వేయిస్తారు వొకసారి. కాని, దైవప్రార్ధన తో చందనం లేపితం లా  కించిత్ కూడా కందకుండా బయటపడతాడు. మరోసారి ఏనుగుల చేత తొక్కించడమూ, విషాహారం తినిపించడం, అదీ విఫలమైతే పెద్ద బండరాయి నడుముకి కట్టి ఏటిలో పడవేయడం చేస్తారు. ఆ శివుడినే నమ్ముకొన్న తను అన్ని ఆపదలనుంచి బయట పడతాడు.
అతనిని వేధించిన పల్లవరాజు కూడా తనతప్పు తెలిసుకొని అప్పార్ స్వామి కాళ్లమీద పడి శైవమతం స్వీకరించి, జైనులనందరినీ బహిష్కరిస్తాడు.

*శివక్షేత్ర సందర్శన...*
మొదట పలుగు, పార తీసుకుని వీరాట్టేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి శివాలయ ప్రాంగణం లో గడ్డి,పిచ్చిమొక్కలూ పీకి మొత్తం పరిశుభ్రం చేశాడు. అది మొదలు వెళ్లిన ప్రతి ఆలయం అట్లాగే శుభ్రపరుస్తూ ముందుకు సాగాడు.  భక్తి ఉద్యమం అలా మొదలైంది అనుకోవచ్చు.  అలా వివిధ శివక్షేత్రములు సందర్శించు కొంటూ,  తన కవితా వైభవం తో శివస్తోత్రాలు చేసుకొంటూ వెళ్లాడు.
ఒక చోట *పెణ్ణాగడం* అనే ఊరిలో అక్కడ శంకరుడు సాక్షాత్కరించి అతని కోరిక పై తన భూతమునొకరిని పంపి శూలము,వృషభము చిహ్నాలు ముద్రింప చేశాడని పురాణ కధ.

 _ఇందుకు సంబంధించిన కవిత్వం నాకు  ఇంగ్లీషు లో లభ్యం అయింది. అది నేనునా అనువాదరూపంలో ఇస్తున్నా_

పద్యం:
అన్ని లోకాల్లో ఆతని రాజదండం శాసిస్తుంది
కైలాసం లో మాత్రం ఆయనే సర్వాధికారి
నీ పాదం కింద నలిగి అణిగింది దర్పం
హిమగిరి మంచుకొండలా ధవళ వన్నె గల
నీ వృషభ చిహ్నం నాపై ముద్రించు
ఓ నా నిజ దైవమా..
నన్ను  అనుగ్రహించు -
*తుంగనాయిమడం*
మా ఊరి ఆలయం  వెనక చెట్ల తోపుల్లో పైనుంచి
 నిశ్చలంగా వెలుగుతున్న చంద్రుడున్న చోట

శివ ముద్ర వేయించుకోవడం అంటే...తనను స్వామి ఆస్తి గా భావించుకోవడం. ఇంతకంటే దాస్య భక్తి వేరే ఉంటుందా?

నా ప్రభువు చరణ యుగళ ఛాయ లో
ఎలా ఉంటుందంటే.
శృతి చేసిన వీణ లా
సాయంకాలపు నిండు జాబిలి లా,
మందంగా వీచే దక్షిణ గాలి లా,
 ‎నవ వసంతం లా, తుమ్మెదల గుంపు
 ‎ఝంకారాలతో కూడిన సరస్సు లా

అతని గీతాల్లో వాడబడిన ఉపమానాలు గమనిస్తే ఏమనిపిస్తుందంటే...ఓ చక్కని పల్లె వాతావరణం.. తో పాటు కవి యొక్క వ్యవసాయపు నేపధ్యం తెలియవస్తుంది..

లక్ష్మీపతి విష్ణువు, చతుర్ముఖ బ్రహ్మ.
నీ ఆద్యంతాలు వెతికినా
వారు నీ పాదాలు మాత్రం కాంచలేకపోయారు
అయినప్పటికీ, ' అతిహాయి' లో ఉండే ప్రభూ
నిరాకారా, కరుణామయా, నీ పాదారవిందాలు చూచే భాగ్యం ప్రసాదించవయ్యా!

_ఆద్యాంత రహితుడైన ఆ పరమేశ్వరుడు తనంత తాను ప్రకటితమవ్వాలి తప్ప...వెదకినా దొరకడని భావం._

 ఇలా అనేక గీతాలను సృజించి... పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొన్న తిరు అప్పార్  ఒకసారి ఒకరి ఇంట ఆతిథ్యం స్వీకరించ పోయినపుడు, ఆ గృహస్థు కుమారుడు పెరటిలో అరటి ఆకు కోయడానికి వెళ్ళి పాము కాటుకి గురి అవుతాడు. అయినా అ గృహస్థు విషయం దాచి ఆతిధ్యం ఈయబోగా, గ్రహించిన అప్పార్ స్వామి ఆ పిల్లవాడిని పవిత్రవిభూతి తో బ్రతి
 ‎కించిన కధ ఒకటి రమణులు వివరించారు.

ఆ తరువాత సంబంధార్ ని కలిశాక, తనను ఆయన తండ్రీ అని నిలిచినప్పటికీ,  తనను ఆయన శిష్యుడు గా ప్రకటించుకొని అతని కూడా అన్ని శివ క్షేత్రాలను తిరిగి భక్తి ఉద్యమం స్ఫూర్తి వంతం గా నడిపాడు.
 వేదారణ్యం వెళ్ళి నపుడు ఇద్దరూ తమ గాన మహిమ తో మూసి ఉన్న వేదారణ్యేశ్వర ఆలయ తలుపులు తెరచి, మళ్ళీ మూస్తారు. ఇందులో.. ఒక పరీక్ష లాగ, వాగీశ్వరుడైన అప్పర్ గేయ దశకమును గానం చేసి ఆలయ తలుపులు తెరవగా, సంబంధుల ఒక్క గేయంతొనే  మూయబడతాయి  తలుపులు.
న్యూనత చెందిన అప్పర్ ను, పరమేశ్వరుడు అనుగ్రహంచి అనునయిస్తాడట.

అప్పర్ స్వామి అక్కడ నుంచి, చిదంబరం, నాగపట్టణం, శ్రీపురాణసరిత్తు,మొదలైన క్షేత్రాలు దర్శించి, అక్కడి శైవేతరులను తన వాదనలతో ఓడించి, అరుణాచలం చేరుకొన్నాడు.
*స్మరణ మాత్రముననే పరముక్తి ఫలద
కరుణామృత జలధి అరుణాచలమిది*
ఆ పైన కంచి,కాళహస్తి, శ్రీశైలం క్షేత్రాలు పావనం చేశాడు
అప్పార్ స్వామి దాదాపు ఎనభై ఏళ్లు జీవించాడు. తన జీవిత కాలంలో దక్షిణాన ఉన్న శివ క్షేత్రాల నన్నిటిని కాక -కాశీ, కేదార్‌నాథ్, తర్వాత కైలాస పర్వతం..ఎన్నో శ్రమలకు ఓర్చి చేరుకొన్నాడు  * సర్వం శివమయ జగత్* అంటూ అంతటా పరమేశుని చూసినవాడై, వెనుతిరిగి, మదురై,రామేశ్వరాది క్షేత్రాలు దర్శించుకొంటూ తిరుప్పహలూర్(Thiruppugalur)
చేరి ఉండగా, అతని సోదరి తిలకావతి దేహము చాలించిందని తెలిసి దుఃఖిస్తాడు. తిరుప్పహలూర్ లొనే ఉండి, అక్కడే శివసాయుజ్యం పొందుతాడు.

ఇంతటి మహోన్నత జీవితం గడిపిన  ' వాగీశుడు' అనబడే అప్పరు స్వామి చరిత ధన్యమైనది. విన్నవారికి,చదివినవారికి మోక్షసుఖం పొందుతారని, శ్రీ రమణులు శలవిచ్చారు.

No comments:

Post a Comment