Friday, 12 April 2024

కవిత-కిటికీ


ఇలా.. కొన్ని సోమరి మధ్యాహ్నాలు.. 

కిటికీ లోంచి చూస్తే దూరంగా కొండ పై

బండరాళ్ల మీద మెరుస్తూ న్న ఎండ..

దూరం నుంచే ఎండ తీవ్రత కొలుస్తాను..!

ఎండు పుల్ల విరిగిన శబ్దం లా చిటుక్కు మని శబ్దం .. ఆ ఎండదేనేమో.

గేటు బయట చెట్టు మీద ఉడుతొకటి ఎక్కడ్నుంచో వచ్చి

ఎక్కినంత హాడావుడిగానూ దిగుతుంది..

వలయాలు తిరుగుతూ రొద చేస్తూన్న కందిరీగ .. పూటకోరకంగా వినిపించి బుల్బుల్ పిట్టల పిలుపులు..

నా మధ్యాహ్న సమయాలని శబ్దిస్తూనే

నిశ్శబ్ధ భావనలోకి నెట్టి వేస్తాయి..

మూగన్ను గా పట్టే నిద్ర లోకి

చిన్ని పిట్ట రాగమై వచ్చి కల నిజం చేస్తుంది.



చిన్ని పిట్ట రాగమై వచ్చి కల నిజం చేస్తుంది.

Sunday, 18 February 2024

చెట్టు

వాలడానికో చెట్టుండాలి
 రెక్కలు కట్టుకొని వాలడానికి 
ఓ చెట్టుండాలి.. 
 ఉల్లాసంగా కొమ్మనంటి ఊగడానికి 
 ఓ చెట్టంటూ ఉండాలి; 

 వెలుతురు వస్తూ .. కొత్తచూపు యిస్తుంది అప్పుడే వేటా మొదలౌతుంది.. 
పొద్దు వాలిపోతుందనగా... రెక్కల మాటున రగిలే ఆరాటం.. 
స్వరాల రాగాల దారి తప్పనీయని ఆనవాళ్లని.. జాడల్నీ వెంబడిస్తూ వచ్చి, 
వాలేందుకు.. ఓ చెట్టు ఉండాలి.
 
రెక్కల అలుపు తీరేందుకు, 
చీకటి మాటున వొదిగేందుకు 
ఓ చెట్టు ఉండాలి.. 
సద్దుమణిగాక.. వాటి పాటల తో పాటే, 
వాటిని తన ఆకుపచ్చని వొడిలోకి తీసుకున్న ఆ చెట్టూ.. రాత్రంతా.. నిశ్శబ్ద గీతం పాడుకుంటుంది..

Tuesday, 13 February 2024

కాశీ యాత్ర-2


 


"బాబాను(శివుణ్ణి) నీ గురువు గా భావించు. "


#విశ్వనాథుడు.


సానందమానందవనే వసంతం, ఆనంద కందం హతపాప బృందం |

వారణాసీ నాథమనాథ నాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే ||


కాశీకి ఆనందవనమనే పేరు ఉన్నదనీ.. ఎటువంటి ప్రళయ కాలం లోనూ... పరమశివుడు తన త్రిశూలంతో ఎత్తి ఉంచే క్షేత్రమనీ..  అందువలన కాశీని అవిభక్త క్షేత్రం అనీ అంటారని 'కాశీ ఖండం' లో చదివాను.


పార్వతీ పరమేశ్వరులు నిత్యం కొలువుండే క్షేత్రమైన కాశీ క్షేత్రం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సినది ఉంటూనే వస్తున్నది. కాశీ లో ..అక్కడి ధూళి లో.. ప్రతి  రేణువులో గొప్ప కాంతి వుంటుందని అందుకే కాశీ(వెలుగు) అయిందని అంటారు.  

ఇది మూడవ సారి కాశీ క్షేత్రం వెళ్లడమైతే, తొమ్మిది రోజుల కాశీ వాసం రెండవ సారి. కాశీ వాసం పేరుతో తొమ్మిది నెలలు ఉంటారు చాలా మంది. కనీసం కార్తీకమాసం నెల రోజులు ఉంటారు. 

సత్రం లో ఉంటూ సాత్వికాహారం తో నూ ..  గంగా స్నానాలు, శివదర్శనం.. ఇంకేం ఆలోచనా రాదు ఆ సమయంలో..

ఇదేకదా కావలసినది అనిపించింది.!


ఔరంగజేబు కాలం లో పూర్తిగా ధ్వంసం కావించబడిన కాశీ విశ్వనాథ మందిరం .. తిరిగి పదిహేడవ శతాబ్దం లో అహల్యాదేవి హోల్కర్ తిరిగి పునరుద్దరించారు. ఇటీవలి పునర్వ్యవస్థీకరణ లో ఆలయం దగ్గర ఆవిడ విగ్రహాన్ని పెట్టడం  సంతోషకరమైన సంగతి.

ఈ సారి కాశీ  ఆలయం  వెలిగి పోతోంది. కాశీ లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విశ్వనాథుడి ఆలయ ప్రాంగణం విశాలం చేసారు. జ్ఞాన వాపిని వేపు తిరిగి ఉన్న నందీశ్వరుడుని కూడా చక్కగా అలంకరించారు. 


ప్రధాన ద్వారం నుంచి  లలితా ఘాట్ వరకు ఆధునీకరించారు. ఆవరణ లో అహల్యాబాయి, ఆది శంకరుల విగ్రహాలతో చాలా ఆహ్లాదకరంగా వుంది . అక్కడే ఓ పక్కన అన్ని సౌకర్యాలతో ఫుడ్ కోర్ట్ లు కూడా ఏర్పాటు చేసారు. 


ఒక రోజు సాయంత్రం స్పర్శ దర్శనం, అభిషేకాలు అన్నీ అయ్యాక, లలితా ఘాట్ కిందకి దిగి.. అలా నడచుకుంటూ దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర ఇచ్చే 'గంగా హారతి' చూసి వచ్చాం.  చాలా సంతృప్తిగా అనిపించింది.


కాశీ యాత్ర చేసిన ప్రముఖుల రచనలు చదివినప్పుడల్లా.. నాకు తెలియని మిస్టికల్ ప్రపంచం పట్ల నమ్మకం పెరుగుతూ వస్తోంది.

 

మీర్జా గాలిబ్ 

ఢిల్లీ నుండీ వస్తూ అనారోగ్యం వలన కాశీ లో అగవలసి వచ్చిందిట. చిత్రంగా.. అక్కడ కొన్నాళ్లు ఉండగానే కోలుకోవడమే కాదు, కాశీ పట్టణం పైన మక్కువ పెరిగి.. పెర్షియన్ భాష లో కొన్ని గీతాలు రాసాడాయన.  ఆసక్తి కలిగి ఇంగ్లీషు అనువాద పుస్తకం తెప్పించుకుని చదివాను. నా తెనుగ స్వేచ్ఛానువాదం-

మచ్చుకి ఒకటి,రెండు.


వారణాశి కి దృష్టి దోషం 

తగలకుండా

భగవంతుడు కాపాడు గాక;

ఆనందవనమనే స్వర్గ ధామం 

నిలిచిందక్కడ!


బనారస్ ని చీనీ దేశం తో పోల్చారెవరో..

అదిగో.. నాటి నుండి తన భృకుటి 

గంగమ్మ వొంపు లో... ముడుతలు తేలింది.


వారు-

పెదవి కదిపితే చాలు

కాశీ స్తుతి చేస్తారు-

ప్రారబ్ధకర్మ నమ్మే వారి

వాళ్ల కారణాలు వారివి.

(మరు జన్మ ఉండదనే నమ్మకాన్ని సూచిస్తూ)


అక్కడ

ఎగిసి పడే ప్రతి ధూళి రేణువు 

పవిత్రాలయ స్ఫురణ..

పచ్చని  ముల్లు కూడా  

నందనోద్యానం లా భాసిస్తుంది  !


ఆహా..కాశీ ఎంతమందిలో ఆధ్యాతిక దీపాలను వెలిగించిందో కదా!


#స్పర్శ దర్శనం


రెండవ రోజే భోజనాల తర్వాత బయల్దేరి వెళ్లాం .  ఈ సత్రాలు అవీ ఉన్న చోటు అంత సన్నటి ఇరుకు సందులు.

చిన్నప్పుడు  మన పెద్దవాళ్లు 

కాళ్లకి రాసిన వెన్నపూస గట్టిదనం ఇప్పుడు తెలుస్తోంది.

గుడికి నడిచి వెళ్లడానికి మొత్తం అరగంట పడుతుంది. అదీ ఆగకుండా నడిస్తే.

 ఆ సన్నటి రోడ్ల లో నే మోటార్ బైక్స్ రద్దీ బానే వుంటుంది. 

ఈ సారి రోడ్ కి అడ్డంగా ఆవులు బైఠాయించి కనిపించలేదు. మోటార్ సైకిళ్లు రెండు వేపులా,  హారన్ కొట్టుకుంటూ తిరిగేస్తున్నాయి. 

రోడ్ అంతా బండలు పరచి ఉన్నా, పేరుకున్న చెత్తని శుభ్రపరచే లోగా కుక్కలు  లాగి పడేసిన దృశ్యాలు చాలానే చూస్తాం. 

చిత్రమేమంటే ఎంతోమంది విదేశీ యాత్రికులు ఇక్కడే.. ఈ ఇరుకు గల్లీ ల్లోనే నివశిస్తున్నారు . వాళ్ళ కోసం అన్నట్టు  చిన్న చిన్న 'మోడ్రన్ రెస్టరెంట్స్'  ఉన్నాయి‌.


విశ్వనాథుని దగ్గర మాత్రం స్క్రీనింగ్ వుంటుంది. మొబైల్స్ సరే, పెన్నులు,పెన్సిళ్ల వంటి షార్ప్ గా వుండే వాటిని కూడా అనుమతించరు. 

ఉత్తరాది వాళ్ల సౌరమానం ప్రకారం కార్తీక మాసం నడుస్తోంది వారికి. రద్దీ బాగానే ఉంది. -మనది చాంద్రామానం కదా

దీపావళి అమవాస్య తరువాత కార్తీకం ఆరంభం మనకి.


ఓ రోజు;

క్యూలో దాదాపు ఓ గంట వేచి చూసాక, విశ్వనాథ గర్భాలయ ప్రవేశం.. 

అలా క్యూలో ఉండగా.‌.  ఒక ఉత్తర హిందుస్తానీ స్త్రీని నా ముందు నించో బెట్టి వెళ్లింది సెక్యూరిటీ అమ్మాయి.  కాసేపు వున్నాక ఆవిడ ఉన్నట్టుండి వెనక్కి తిరిగి నాతో చెప్పడం మొదలు పెట్టింది‌ .. హిందీ లో.

"చూడూ.. బాబాను(శివుణ్ణి) నీ గురువు కమ్మని కోరుకో.. అప్పుడు నీ చేయి వదలడు."

వినడానికి బాగుంది కదా.. 

విని నవ్వి ఊరుకున్నా.  

మళ్లీ కాసేపు తర్వాత అన్నది.

"నువ్వు నమ్మాలి.. ఏదీ నా కూడా నే చెప్పినట్టు అను.. బాబా..నన్ను నీ శిష్యురాలిని చేసుకో

నా భారం అంతా ఇక నీదే.."

ఆవిడలా తరచి..చెబుతుంటే అన్నాను.

నా పేరు అడిగి, ఆశీర్వాదం లాటి ప్రార్థన చేసిందావిడ.

మొత్తం హిందీనే. 


గర్భాలయంలో చిన్న లోటాలతో నీళ్ల లాటి పాలు.. 

పైనుంచి జారే అభిషేక జలం.. 

విభూతి, గంథాల తో నిర్వికార నిరంజనుడు, 

నైరూప్యుడైన భగవంతుని- కాశీనాథుని తాకి..

'స్పర్శ' లో చేతి నిండా అంటిన చిక్కని విభూతి ..! 

కాస్త నుదుట దిద్దుకుని- 'మమ' అనుకోవడం  లో ఓ శాంతి!


दुःख में सुमिरन सब करे सुख में करै न कोय। 

जो सुख में सुमिरन करे दुःख काहे को होय ॥


సుఖ దుఃఖాల కతీతమైనదే శాంతి అంటాను.

Monday, 1 January 2024

కాశీయాత్ర-1.గంగానది

 



కాశీ యాత్ర


అలా మొదలైంది !


నవంబరు ఆరు సాయంత్రం హైదరాబాద్ లో  ఇండిగో ఫ్లైట్..! 

 'వెల్కం ఆన్ బోర్డ్' 

అన్నారు 'క్రూ' అంతా. .

జాగ్రత్తలు, నియమాలు demonstrate చేశారు.. 

అలా ఆ కబురూ, ఈ కబురూ మధ్య 

'ఇదిగో వారణాసి వచ్చేసేం' అన్నారు..

మా లోహ విహంగ చోదకులు ( పైలట్)

అందరికీ కాశీ విశ్వేశ్వరులు,అన్నపూర్ణ, విశాలాక్షుల దర్శన ప్రాప్తికి శుభకామనలు తెలిపి, వీడుకోలు చెప్పిన మా పైలట్ 

మిష్టర్ గణేష్!

భలే కదా! యాధృచ్ఛికం అయినా.. చాలా గమత్తుగా అనిపించింది. పైలట్ కూడ  conscious గానే ఆ రెండు మాటలూ చెప్పారు అనిపించింది.

అలా మొదలైంది మా ప్రయాణం!



గంగాతీరం:


కాశీ లో మొదట నేను చూడాలని ఉబలాట పడింది గంగా నదీమ తల్లిని. మరుసటి రోజు ఉదయమే  మాకు దగ్గరలో ఉన్న నారద ఘాట్ కి వెళ్లాం.. 

ప్రశాంత నదీ ప్రవాహం చూస్తూంటే.. ఉదయ రాగం లో.. 

బిస్మిల్లా ఖాన్ షహనాయి  విన్నట్టు.. ఎంత ఆహ్లాదకరంగా వుందో..

(మహానుభావులు కాశీనాథుని తన సంగీతం తో  ఎంతో ఆరాధించారుట.)


ఉదయపు సూర్యుని కిరణాలు నదిలో మునకలేస్తూండగా..  ఆ వెచ్చదనం లో స్నానాలు చేస్తూ..  ఆర్ఘ్యంగా  యిస్తూ జనం! 

ఇంతంత నీడలు పరుస్తూ.. వచ్చే పోయే పడవలు; 









Raja ghat/ Narada ghat is within the walkable distance from our choultry.

We had to negotiate the narrow path and deal with the steps of more than one foot height.   

Speaking about hurdles, there is this 'doha' about ancient Kasi written by sant Kabir-

"Raand, Saand, Seedi, Sanyasi, inse Bacche toh Sevai Kashi." - Sant Kabir

 widows, bulls, stairs and the spirituals persons(sadhus) are the  obstacles to deal with in Kashi.


Now, in modern Kashi, and more specifically in our recent trip this year,  we did not encounter bulls on the roads.  Sadhus too are a rare sight n are scattered.. the only hurdle left is stairs. well, that is the uniqueness of the place.


But once you reach the river bank, you will forget all the pain.

A dip in the Ganges is enough to love the 'eternal flow' that sanctifies you from within! 

The reason, why for ages, Sages have praised Ganga in many ways..!


చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారు( తిరుపతి వెంకట కవులలో ఒకరు..)- తమ "కాశీయాత్ర" పుస్తకం లో గంగా నది మీద వారు రాసిన స్తోత్రం గురించి చెబుతూ,అక్కడ ఉన్నన్ని రోజులూ తన ఆరోగ్యం కాపాడినది ఆ స్తోత్రమే అని చెబుతారు.  వారు చిన్న వయసులోనే చదువుకుందుకు కాశీ వెళ్లారుట. కాశీయాత్ర సంకల్పించిన తనకు వివాహం నిశ్చయమైందని, వివాహతంతు లో భాగమైన కాశీయాత్ర తరువాతే కాశీకి వెళ్లానని రాసుకొచ్చారు.


 అదే ఈ శ్లోకం


శ్లో. అంగోద్భవాహిత జటాపటలప్రసంగే రంగ రంగకనదు తమహంససంఘే తుంగాఘసంఘశమనప్రకటాంగసంగే గంగే కృపాం మయి విధేహి కృపాంతరంగే."


అన్నట్టు అప్పట్లో ఆయన వచ్చినదీ ఈ నారద ఘాట్ కే నట! 


మరో మహానుభావుడు *జగన్నాథ పండిత రాయలు రచించిన, ఆశువుగా చెప్పిన గంగా లహరి.. 

52 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం ఆయన చెబుతుంటే గంగమ్మ ఒక్కో మెట్టే పైకి వచ్చి, చివరి శ్లోకం పూర్తయ్యేసరికి ఆయనను తనలో కలిపేసుకున్నది ట గంగమ్మ తల్లి.


అట్లా ఆశువుగా స్తుతించే పాండిత్యం లేని సామాన్యులం-  ఆ యా స్తోత్రాలని చదువుకోవడమే చేయగలిగిన పని.

మునుపు గంగోత్రి వెళ్లినప్పుడు ఆది శంకరులు విరచిత గంగా స్తోత్రం -

తరళ తరంగి గంగను-

చదువుకున్నాం.  ఇపుడవన్నీ తలచుకున్నా. 


ఇంకోటి..

"తుంగ తరంగే గంగే.‌.."  అన్నది సదాశివ బ్రహ్మేంద్రుల వారి కీర్తన. బాలమురళి గారి స్వరం లోనే వినాలి. ఎవరు పాడినా.. ఎవరు రాసినా గంగా తరంగాల వడి, ఝరి మనసును పరవశింప చేస్తుంది‌.


భగీరథ మనోరథం నెరవేర్చడానికి ఉత్తుంగ తరంగం లా దూకిన గంగమ్మ శివుని జటాఝూటం లో బంధింప బడి సుళ్లు తిరుగుతూ... ఒక చిన్న పాయగా వదలగా భూమి మీదకి వచ్చింది. మధ్య మార్గం లో జహ్నుముని ఆశ్రమాన్ని ముంచెత్తినపుడు  జహ్నుముని ఒక్క గుటకలో అవుపోశన పడతారు..  తిరిగి ప్రార్థించగా ఆయన తన చెవి ద్వారా వదులుతారు. అట్లా జాహ్నవి అయింది. అలా నడచిన దారంతా నదులని, ఉపనదులని కలుపుకుంటూ సాగిన గంగమ్మ, కాశీ పట్టాణాన్ని వొరుసుకుంటు ధనువులా సాగుతుంది!  ఆ వొంపుని చూసే మీర్జా గాలిబ్ కాశీ పట్టణపు భృకుటి ముడి లా ఉందని వర్ణించారు.

ఉత్తుంగ తరంగ అయిన గంగమ్మను ఇలా స్వాగతించారు సిరివెన్నెల వారు.


"నాక లోకం నీ పుట్టిన ఇల్లు

చేపట్టిన వాడు  నాగ భూషణుడు

లోక పావనీ మందాకినీ.."

*రసవాహినీ స్వాగతం ..జీవ రసధునీ స్వాగతం!"

ఈ పాట విన్నారా ఎప్పుడైనా?

సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు రాసిన రసరమ్యమైన గంగావతరణ గీతం!

 పాడారు కూడా- యూట్యూబ్ లో ఉన్నది.


"అఘమీ భువి నిదాఘమై

అర్కద్యుతి అమోఘమై.."

అనే వత్తైన పదాల చాటున –

 సకల జగతి పాప తాపాల ప్రక్షాళన కోసం 

 దివి నుండి భువికి దిగిన గంగమ్మను "విరూపక్ష కరుణా సంప్రోక్షణ రసవాహిని" గా కళ్లముందుకి తెస్తారు ఆయన. విన్నప్పుడు మన మనసులనీ తడుపుతుందా ఝరి!


కాశీ లో ఎనభై పైనే ఘాట్లు ఉన్నాయిట. కొన్నే తెలుసును. కేదార ఘాట్, దశాశ్వమేథ ఘాట్.. మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ ఇలా.

మణికర్ణిక పురాణ ప్రాశస్త్యం ఉన్న ఘాట్. అక్కడ పార్వతీ దేవి చెవి కమ్మ జారిపడటం లాటి కథ ఒకటి వుంది. 

సాధారణంగా మొదట కేదార్ ఘాట్ లోనే స్నానం చేస్తారు. 

దీనికో చిన్న నేపథ్యం చదివాను ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రలో. ఆయన తన మందీ మార్బలం తో 1830 లో.. అంటే దాదాపు రెండు వందల ఏళ్ల కిందట కాశీకి వచ్చినప్పటి ముచ్చట.

మణికర్ణిక ఘాట్ కి పురాణ వైశిష్ట్యం ఉంది. అంచేత అక్కడ స్నానం చేయడం మంచిదని అంటారు. అప్పట్లో కాశీ లోని గంగపుత్రలని ఒక వర్గం వారు యాత్రీకుల వద్ద సుంకం లా ధనం వసూలు చేసే వారట. మణికర్ణిక ఘాట్ వద్ద స్నానం చేసే వారికి మనిషికి ఒక్కరికి ₹4/- చొ.న వసూలు చేసేవారట..  సామాన్యులు వారికి జంకి అక్కడ కి వెళ్లేవారుకాదుట.  ఒక రాజగారెవరో.. పురాణాలన్నీ వెదకి 'కేదారఘాట్' వృద్ధమణికర్ణిక అని చెప్పి, అక్కడ స్నానం చేసినా ఫలితం వుంటుంది అని చెప్పారుట.   వీరాస్వామయ్య గారు ముందుగానే బేరం కుదుర్చుకుని ఉండటం వల్ల  ఏ యిబ్బందీ లేకుండా మణికర్ణిక లో నే స్నానం చేసారుట.

 

హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక రెండు ఘాట్ల లో ఓ పక్కన చితి కాలుతూనే వుంటుంది.

మోక్షగాములు.. ఈ ఈశ్వర లీల ని అంతే ఆనందంగా చూసి సాగిపోతుంటారు.


గంగా నది కేదార్ ఘాట్ లోను, త్రివేణీ సంగమం లోను మూడు మునకలు వేసాను అందరితో పాటు నేనూ ను. 


పి.ఎస్;  


1. మన తెలుగు వారైన పండిత జగన్నాథ రాయలు అమలాపురం దగ్గర ముంగండ అగ్రహారీకులు. ఆయన జహంగీరు కొలువులో పని చేసారని, షాజహానుకు సంస్కృతం నేర్పారని ప్రతీతి. అట్లాగే వారు షాజహాను కుమార్తె లవంగి పెళ్లి చేసుకున్నారని.. ఇస్లాం మతం స్వీకరించమని షాజహాను నిర్భందించినపుడు.. ఇష్టం లేక, కాశీ కి భార్యతో సహా వచ్చేసారట. వీరి గురించి చాలా రకాలు గా ప్రచారం లో ఉన్న కథలను వదిలేసినా.. మహత్తరమైన వారి రచనలను విస్మరించలేం🙏



2. సిరివెన్నెల పూర్తి పాట

నాక లోకం నీ పుట్టిన ఇల్లు

చేపట్టిన వాడు  నాగ భూషణుడు

లోక పావనీ మందాకినీ.."

*రసవాహినీ స్వాగతం ..జీవ రసధునీ స్వాగతం!


రసవాహినీ స్వాగతం ..జీవ రసధునీ స్వాగతం

అఘమీ భువి నిదాఘమై

అర్కద్యుతి అమోఘమై

సకల జగతి తాహతప్త సంక్షోభితమైన నాడు

దివి వారిని  భువి సీమకు తరలించగ

తలచినట్టి భగరీథని నిరీక్షణకు

దీర్ఘ తపస్సు అవీక్షణకు

విరూపక్ష కరుణా సంప్రోక్షణ మీ రసవాహిని

నిరంతరపు ప్రయత్నమే ప్రణవారాధనగా

యుగయుగాల నిరీక్షణే నివాళి కాదా!