Sunday, 27 January 2019

శ్రీ శైల యాత్ర-2

రెండవ రోజు దర్శనాలు

మల్లికార్జునుడు

జ్యోతిర్లింగాలలో 'స్పర్శ దర్శనం'  ఓ ప్రత్యేకత.  మర్నాడు   తెల్లవారు ఝామున అంతా లేచి తయారై గుడికి వెళ్లాం.
 మేం వెళ్లేటప్పటికే,  ఓ పాతిక మందికే ఆ స్పెషల్ దర్శనం పరిమితం చేసి, మాకు లేవన్నారు. చేసేదేముంది. మాములు దర్శనమే.

మల్లికార్జునుడు గుడిలో వీరశైవ మంటపం...ఒక inscription చదివాను. పదమూడవ శతాబ్దం లో అనవేమారెడ్డి అనే రాజు ఈ వీరశైవ మంటపం కట్టించాడని. వీర శైవ భక్తులు చేతులు, నాలుక..ఇతర అవయవాలు నరుక్కుని భక్తిని చాటడాన్ని ' వీరాచారం' అంటారనీ రాసి ఉంది. అమ్మో అనిపించింది.

*భ్రమరాంబాదేవి:*

అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది ఈ శక్తి పీఠం.   సతీదేవి కంఠ భాగం ఇక్కడ పడినట్లు పురాణ కథనం. శ్రీశైల పీఠాన్ని అధిష్టించిన భ్రామరీ శక్తి భక్తుల కోరికలను తీరుస్తుంది.

సేకరించిన స్థల పురాణం—( వికీపీడియా)

 ఒకప్పుడు అరుణాసురుడనే రాక్షసుడు బ్రహ్మను నుండి రెండు, నాలుగు కాళ్ళా ప్రాణులనుండి తనకు మరణం లేకుండా వరం పొందాడు, అతని సంహారం కోసమై ఆదిశక్తి,  వేలాది తుమ్మెదల ను సృష్టించి, వాటిచే కుట్టించి, అతనిని సంహరించి లోకాలను కాపాడింది. తుమ్మెదలన్నీ ఆరుకాళ్ళ జీవులు కదా! దేవతల కోరికపై ఆదిశక్తి భ్రమరాంబికగా అక్కడ వెలసింది. ఇప్పటికి అమ్మవారి వెనుక గోడల నుండి భ్రమర ఝంకారం వినిపిస్తుంది.

అది వినడానికి వెనక వేపు  చెవిపెట్టి వినడానికి ప్రయత్నం చేశా కాని,  అంత సందడిలో నాకు మాత్రం ఏదీ వినబడలేదు.

*పాతాళ గంగ*

పాతాళ గంగను చేరడానికి ఇపుడు రోప్ వే ఉంది. అందుకని అంతా బయలుదేరి వెళ్లాం. పైనుంచి చుట్టూ చూస్తుంటే పూర్వపు పచ్చదనం కాస్త తగ్గింది అనిపించింది.

దత్తావతార పరంపరలో, శ్రీపాద శ్రీవల్లభుని తర్వాత అవతరించిన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తారు. తంతకుడు వారి శిష్యుడు, సేవకుడు. ఓ సారి శివరాత్రి నాడు,అంతా శ్రీ శైల యాత్ర వెళుతుంటే, తనవద్దే ఉండి పోయిన తంతకున పిలిచి, కళ్లుమూసుకొని తన పాదుకలు పట్టుకోమన్నాడు. అంతే కళ్లు తెరవగానే శ్రీశైలం లో ఉంటారిద్దరూ.  అట్లా తన భక్తునికి శ్రీశైల క్షేత్ర దర్శనం చేయించారు శ్రీ నృసింహ సరస్వతి.  చివరకు తన అవతార సమాప్తి కూడా పాతాళ గంగలో కావిస్తారు. ఇప్పటికీ స్వామి అచటి  కదళీవనంలో గుప్తరూపంలో ఉన్నట్లు దత్తభక్తుల విశ్వాసం.

నదీస్నానం

ఇలా పుణ్య మాసాలలో చేసే స్నానాల ప్రత్యేకతే వేరు. జ్ఞాన గంగ లో మునక వేసిన ఏ కొద్దిమందో తప్ప, మిగతావారికి ఇటువంటి మునక అవసరమే అంటారు పెద్దలు.
కృష్ణమ్మ  లో స్నానం.  ఆహ్లాదంగా ఉంది.  మనసు, ఒళ్ళూ, పరితప్తమైనట్లు... ఆ స్నానం తో అందరి ముఖాలు దీప్తి వంతమయ్యాయి. ఆ తర్వాత అందరం నదిలో దీపాలు విడవడం, పండగలా జరిగింది అంతా.

త్రిపురాంతకం.

*చిదగ్నికుండ సంభూతా* బాలాత్రిపురసుందరి.

శ్రీ శైలానికి తూర్పున ఉన్న మరో ప్రధాన ద్వారం త్రిపురాంతకం. ఇక్కడ బాలాత్రిపురసుందరి అమ్మవారు కొలువై ఉంది. మా బస్ అక్కడికి చేరే సరికి సాయంత్రం అయింది.  పైకి వెళ్లగానే, ఎండోమెంట్స్ డిపార్టుమెంటు వారి బోర్డు చూశాం. అందులో స్థలపురాణం రాసి ఉంది. ఈ ఆలయం రాక్షస నిర్మాణం అనీ, అందుచేత నైరుతి ద్వార ప్రవేశం అనీ రాశారు.

ఇక్కడి అమ్మవారు 'చిదగ్నికుండ సంభూత'. త్రిపురాసుడు అనే రాక్షసుని సంహరించడాని ఉద్భవించినట్లు స్థల పురాణం.
అక్కడి ఆలయ పూజారి  ఓ చక్కని విషయం చెప్పాడు.  అమ్మవారు, రాత్రులు సంహారానికి దిగుతుంది ...అనే కధలు అతడు తోసిపుచ్చాడు.  పూర్వపు రోజుల్లో కొంతమంది తాంత్రిక శక్తి ని అభ్యసించి..అక్కడ కొండమీద సాధన చేసేవారని, ఎవరూ అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి అలాటి కథలు ప్రచారం లోకి వచ్చాయని చెప్పాడు. ఇపుడా ఆలయం ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో నడుస్తోంది. పూజలు సక్రమంగా జరుగుతున్నాయి. విశేషించి అక్కడి తీర్థం లో తేనె, మిరియాలు కలుపుతారు.. రాక్షస ప్రవృత్తి కి విరుగుడు అంటూ చెప్పారు. అక్కడ కాసేపు కూర్చుని మేమంతా లలితా సహస్రనామం చదువుకొన్నాం. అలాగే కింద  త్రిపురాంతక స్వామి  వారిని దర్శించాం‌. అప్పటికే సాయంత్రం ఆరున్నర దాటింది. ఇంకా మహానంది వెళ్లాలి.

మహానంది

మహానంది చేరుకొనేసరికి రాత్రి పదకొండు. మేం ముందుగా అనుకొన్న ప్రణాళిక కాస్త మారింది. అందువల్ల మరో మితృలు రఘువీర్ గారు ముందుగా అక్కడికి ఫోన్ చేసి వసతి, భోజనము అదీ అందరికీ ఏర్పాటు చేశారు.

ఉదయమే ఆలయ సందర్శనం. ఇక్కడ స్వామి మహా నందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి.

మహా నందీశ్వర దేవాలయం 7వ శతాబ్దినాటిదని చరిత్ర.  ఇక్కడి శివలింగము గోష్పాద ముద్రతో ఉన్నది.  పుట్టలో ఉన్న స్వామివారికి,  ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా, పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కడం వల్ల ఆవు కాలిగిట్ట గుర్తు లింగముపై పడిఉంది.  (ఇట్లాగే మళ్ళీ ఆలంపూర్ స్వామి నీ చూశాం). గర్భాలయం లోకి ప్రవేశించి అంతా..'స్పృశించి ' దర్శనం చేసుకొన్నాం.

మహానంది ప్రత్యేకత అక్కడ పుష్కరిణి. స్వచ్ఛంగా, స్ఫటికంలా, అడగు భాగంలో రాళ్ళు కూడా స్పష్టంగా కనిపించేంత పారదర్శకంగా ఉంటాయి నీళ్ళు. పుష్కరిణి లో స్నానాలు చేశారంతా.

తిరుగు ప్రయాణం లో మహానంది నుంచి  అహోబిలం, అలంపురం...

No comments:

Post a Comment