Sunday, 27 January 2019

అయోధ్య-

అయోధ్య

21/11/2018

మా లిస్ట్ లో తర్వాత అయోధ్య. రాముడి అయోధ్య.సాకేత రాముడి నగరం. అక్కడ చూడడానికి ఏముంది అన్నారు. ఏముందో..... అనే వెళ్లాం.
మన బాపూ గారు(మన చిత్రకారులు) అన్నట్టు, అక్కడ పాయసం తింటే పిల్లలు పుడతారని, అదీ శ్రీ రామచంద్రు లాంటి కొడుకేనని...ఆ చోద్యం జగత్విదతం కనక...ఆ నేల,ఆ గాలి, సరయూ నది చూద్దామని.

రామాయణం లో అయోధ్య వర్ణన‌

సరయూ నదీ తీరంలో కోసలదేశం ఉంది .ఆ కోసల దేశపు రాజధాని అయోధ్య. ఇక్ష్వాక వంశానికి చెందిన  ఎందరో రాజులు  రాజ్యమేలారు  ధశరధ మహారాజు  ఇప్పుడు రాజ్యమేలుతున్నాడు అతని కుల దీపకుడే శ్రీ రామచంద్రుడు
పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు ..అంటే ఇప్పటి లెక్కలో దాదాపు మూడు వందల చదరపు కిలో మీటర్ల వైశాల్యం.  అయోధ్యా నగరపు వీధులు దారిపక్కన పూల చెట్లు రాల్చిన పూల తో సహజంగా అందంగా ఉంది.  అద్భుతమైన రాజరికపు కట్టడాలు ఉన్న గృహాలు.
నగరం మధ్య పలురకాల అంగళ్లు.. అందులో రకరకాల ఆయుధాలు,యంత్రాలు అమ్మకానికి ఉన్నాయి.
ఎత్తైన కొట బురుజుల తో , ధ్వజములతోవందల కొలదీ శతఘ్నులు..ఆనగరపు రక్షణ వ్యవస్థ. పాడిపంటలు సమృద్ధిగా ఉన్న ఆనగరం లో అన్నార్తులెవరూ ఉండరు.ఆకలి తో అలమటించే వారు లేరు.

ప్రస్తుతం

అది ఇప్పుడు రాజకీయ అయోధ్య. ట్రాఫిక్ పోలీస్ మా బస్ లోపలకి వెళ్లదు అన్నాడు. అపుడు మా వాళ్ళు వెళ్ళి మేం స్టేట్ బాంక్ ఉద్యోగుస్తులం అని ఐడి ప్రూఫ్ లు చూపిస్తే, అపుడు అనుమతించారు. ఊరు మొదట్లో నే ఒక గైడ్ దొరికాడు.బస్ ఎక్కాడు. ఎక్కాడా, ' జై బోలో శ్రీరామ్ కీ' ...అన్నాడు దాదాపు అరచినట్టు గా....ఉలిక్కిపడ్డాం అంతా...!  వంత పలికాం భక్తిగా! బస్ ఊళ్లోకి వెళ్లాక...మరో ఐదు, పది నిముషాల్లో నే రకరకాలుగా మా చేత చెప్పించాడు.. భయ భక్తులు కలిపి.

సరయూ నది దగ్గకరకి తీసుకుని వెళ్లాడు....నీళ్లలో కి కాళ్ళు తడిసేలా దిగాం. అక్కడే దొప్పల్లో అమ్ముతున్న దీపాలు వెలిగించి నదిలో విడిచి పెట్టాం. గోపూజ,దక్షిణ.కొన్ని ఫోటోలు.

రామజన్మభూమి ఆలయనిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశం.
సరయూ నదికి వచ్చే దారిలో నే ...బస్ దిగకుండా నే చూశాం. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చేదాక..ఆలయ నిర్మాణానికి అవసరమైన శిల్పాలు, స్థంభాలు..అన్నీ దాదాపు 80%  పూర్తి అయినట్లు చెప్పారు.

అయోధ్యలో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం.  ఇక్కడ దాతలసహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తారుట.
 ఒక  ముసలాయన దగ్గర కు తీసుకు వెళ్ళాడు మాగైడ్. ఆయన ఆధ్వర్యంలో ఈ అన్నదాన,  కార్యక్రమం నిర్వహణ  జరుగుతుంది అన్నారు. వెయ్యి నూటపదాహార్లు ఆ పైన ఇస్తే,శిలాఫలకం పై పేర్లు వేయిస్తామని..నిర్భంధం ఏమీ లేదు మీకు తోచింది దానం చేయమంటే.. ఒకళ్లిద్దరు వెయ్యనూటపదహార్లు ఇచ్చారు కాని మిగతా అంతా  వంద! యాభై మాత్రమే ఇచ్చి బయటపడ్డాం.

కౌసల్యాదేవి మందిరం. సీతారాముల విగ్రహాలు... సీతమ్మ పుత్తడి తోనూ,శ్రీ రాముడు వెండితోనూ చేసిన విగ్రహాలు చూశాం.  హనుమద్ మందిరం. వాల్మికీ మందిరం.
హనుమదాలయం కొంచం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 80 మెట్లుంటాయి. ఆలయ ప్రాంగణంలో సితారాముల ఆలయం ఉంది.

అంతా హడావుడి పర్యటనలొనూ..  ఒకచోట మందిర ప్రాంగణంలో పురాణ ప్రవచనం.... రామాయణం చెపుతున్నారు ఒకాయన. ఆ గొంతు ఎంత స్వచ్ఛంగా...ప్రశాంతంగా ఉందంటే, బహుశా హనుమ, అక్కడే ఎక్కడో కూర్చుని పరవశించి వింటూండవచ్చు. నాకైతే సమయం లేకపోయింది.

రామజన్మ భూమి. బాబర్ మసీదు కట్టిన చోటే....
పూర్తి సెక్యూరిటీ ఉంది. సెల్ ఫోన్, కెమెరాలు, పెన్నుల లాంటివి కూడా లోపలకు అనుమతించరు. నేనో చిన్న బొమ్మ కొన్నా..కాని అక్కడే బయట వదిలేయాలసి వచ్చింది. లోపల నాలుగు చోట్ల చెకింగ్ జరిగింది. ఒక్కళ్లే పట్టే క్యూ ...చుట్టూ ఇనుప దడికి అవతల రక్షక భటులు.  ఒకరిని చూసి చాలా చిన్న పిల్లవాడు అని చూస్తే అమ్మాయి...!   అమ్మాయిలు కూడా సెక్యూరిటీ ఫోర్స్ లో గన్స్ పట్టుకుని ఉంటే ముచ్చటగా  అనిపించింది.
అలా అత్యంత రక్షణ చుట్టూ ఉండగా, క్యూ లో అలా  ముందుకి పోతూనే ఆలయాన్ని దర్శించాలి. ఎక్కడా ఆగకూడదు రక్షణ సిబ్బంది అనుమతించరు. ఇంత సెక్యూరిటీ మధ్య చూశాం.. సీతారాములను...!!

తమ భక్తులకు రామలక్ష్మణులు అంగరక్షకులు గా ఉంటారని, ఇప్పటికీ నమ్మినవారికి తోడై ఉంటారని అంటారు.
ఈయనకి భక్త రామదాసు ఉసురు తగిలిందేమో,..ఏమో... 'అబ్బా తిట్టితి నని ఆయాస పడవద్దు రామ చంద్రా'  అని సముదాయించినా .‌‌‌‌...! కాకపోతే, ఆ రఘవంశ తిలకునికి ఎమిటీ  చెర...!?

రామదండు మాత్రం ఆప్రాంతంలో మెండు. ఏ రక్షణ సిబ్బందీ ఏం చేయలేరు. ప్రసాదం చేతిలోది లాగేసు కొంటాయి. గమనించి ముందు గానే వాటికి పడేసాం.

వాటిని చూస్తూ మా ఫ్రండ్ అన్నది కదా...' వీటికి కూడా ఆడవాళ్ళు అంటే లోకువేట...మనం అదిలిస్తే కదలవ్' వెంటనే కొంచెం ఎడంగా ఉన్న పెద్ద కోతి..అర్ధమైనట్టు అరుస్తూ పళ్ళు చూపించింది దడచుకునేలా..! ఎవరో గట్టిగా కట్టెతో అదిలించారు.

బయటకు వచ్చి కొంత దూరం నడిచాక, మాకు అరవిందాశ్రమం కనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉందో.  కాసేపు అక్కడసేద దీరి...అక్కడ పుస్తకాల షాపులో కొన్ని సావనీర్స్ కొని బయటకు వచ్చాం.

అసలైనది చూశాం... ఇంకా లవకుశులు కట్టించినవీ..ఏవేవో ఉన్నాయి అన్నాడు. ముఖ్య మైన హనుమ ఆలయం చూసి బస్ ఎక్కేశాం. ఆ రాత్రి అయోధ్య నుంచి గయ కు ట్రైన్ లో వెళ్లాలి. ఈ లోగా మంచి హోటల్ చూసి డిన్నర్ చేసాం.  మా ట్రైన్ దాదాపు రెండు గంటలు లేటు. సామాను తో అయోధ్య స్టేషను లో మేమంతా దొరికిన చోట కూర్చుని కాసేపు కబుర్లూ...., కునికిపాట్లు..వంతులవారీగా అన్నట్టు.




No comments:

Post a Comment