Tuesday, 16 December 2025

కోనసీమ ప్రయాణం-3

 

తొలి తిరుపతి


గొల్లలమామిడాడ గోపురం


ఆలయ దర్శనాలు


కాకినాడ  లో  పొద్దున్నే బయల్దేరి అన్నవరం, పిఠాపురం, తొలి తిరుపతి, గొల్లల మామిడాడ,  బిక్కవోలు, సామర్లకోట, ద్రాక్షారామం యిలా అన్నీ ఆలయాలను చూసుకుని  ఆ రాత్రికి రాజమండ్రి చేరాం. 


ఇందులో అన్నవరం, పిఠాపురం ..ఇవన్నీ ఇదివరకు చూసినవే కాని, ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టు ఉంది. ముఖ్యంగా అన్నవరం ఎన్ని సార్లు వెళ్లానో! కాని ఇప్పుడు పై అంతస్తు లో  స్పష్టంగా  ఒక పక్క సత్యదేవుడు, మరోపక్క శివుడు, కింద అంతస్తులో బ్రహ్మ.. చక్కని దర్శనం అయింది.

అలాగే పిఠాపురం లో  పూర్వం చూసిన గుర్తు లేదు. కుక్కుటేశ్వరుడి పక్కనే అద్దంలో "పురూహుతిక" అమ్మవారిని చూసాను. ఈ ప్రతిమే అసలైన శక్తిపీఠం అన్నారు.  పక్కన వేరే అమ్మవారికి ఉపాలయం ఉంది అనుకోండి. మరో విషయం చెప్పారు.. పిఠాపురం లో శిష్టికరణాల వీధిలో, శ్రీపాద శ్రీవల్లభుల పీఠం పక్కన, అసలైన శక్తిపీఠం ఉందని. నేను చూడలేదు.


ద్రాక్షారామం గర్భాలయం లో ప్రదక్షిణ చేయమని అక్కడి అర్చకస్వామి చెప్పారు. అక్కడో చిన్న స్థంభం సందున రావడం మోక్షమార్గం అని చెప్పారు. కైలాస మానస సరోవర యాత్ర తరువాత,ఇహం గాను,పరం గాను చూస్తే "తగ్గాను" నేను.. అందువల్లే సులభంగా బయటకు రాగలిగా!

అక్కడి 'మాణిక్యాంబ' అమ్మవారు శక్తిపీఠం. పేరుకు తగ్గట్టు మణిమయ కాంతితో కన్నుల్లో నిలిచిపోయారు. అక్కడే  కాలభైరవుని ఉపాలయం.  ఇవన్నీ చూసుకుని ఆ రాత్రికి రాజమండ్రి చేరాం.

ఈ ట్రిప్ లో చూసిన  'తొలి తిరుపతి'  'గొల్లల మామిడాడ'  ఇదే మొదటి సారి.


తొలితిరుపతి - 

కాకినాడ దగ్గర దివిలి గ్రామం లో వుంది. తిరుమల లో కంటే ముందే ఇక్కడ వెలిశాడట  వెంకటేశ్వర స్వామి.  శ్రీదేవి,భూదేవి రెండువేపులా ఉండే దివ్యమంగళ విగ్రహం.

ఈయనను శృంగారవల్లభస్వామి అంటారు. 'శృంగార' అన్న పదం సౌందర్యానికి చెందినది. పూర్వం మాకు తెలిసిన ఒకావిడ పేరు 'శృంగారమ్మ గారు'.

మా అమ్మ ఎప్పుడూ ఆవిడని తలచుకోవడం వల్ల ఆ పేరు గుర్తుండి పోయింది. బహుశా ఈ స్వామివారి పేరే పెట్టారేమో అని యిప్పుడు తోస్తోంది.


మరో విశేషం ఏమిటంటే, 

 "ఎంత మాత్రమున ఎవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు"- అని అన్నమయ్య శ్రీవేంకటేశుని కొనియాడినట్లు, ధ్వజస్థంభం దగ్గర నుంచుని చూస్తే ఎంత వారికి అంతే కనిపిస్తాడన్నారు. 

దీనికో అందమైన పురాణ గాథ నేపథ్యం చెబుతారు. ధృవుడు, అయిదేళ్ల పసివాడు. తండ్రి నిర్లక్ష్యం, పినతల్లి వేధింపు వల్ల క్షోభకు గురై, తల్లి చెప్పగా తపస్సు చేసుకుందుకు అడవిదారి పడతాడు.  నారదుడు కనిపించి 'నారాయణ' మంత్రాన్ని ఉపదేశించగా ఘోరమైన తపస్సు చేస్తాడు. శ్రీమహావిష్ణువు ప్రత్యక్షం అవుతాడు.. మహా వెలుగలా కనిపించిన నిలువెత్తు స్వామిని చూడలేకపోతే, స్వామి తన రూపాన్ని తగ్గించుకుని కనిపిస్తాడుట ధృవుడికి.

ఇదిగో, ఆ ఘటన యిక్కడే జరిగిందని, అందుచేతే, ఈ ఆలయం లో  స్వామివారు

ఎంత వారికి అంత మాత్రమే కనిపిస్తాడని చెబుతారు.  ఇటువంటి అందమైన ఉపాఖ్యానం వలన మనకీ మరింత 'లో చూపు' ఏర్పడుతుంది కదా!

మా తో ఆజానుబాహువులు ఎవరూ రాలేదు కనక ఆ తేడా తెలియలేదు సుమా! ఈయన ఆపద మొక్కులవాడే. పటికబెల్లం ప్రసాదం.

కష్టం తీరాక, ఎవరికోసం మొక్కుకున్నారో వారి ఎత్తు పటిక బెల్లం సమర్పించుకోవాలిట. వెనకాల వున్న బావి లో నీరూ పవిత్రమైనవి అని చెప్పారు.

ఇలా వరుస దర్శనాలు అయ్యాక ఆ రాత్రికి రాజమండ్రి చేరాం.

No comments:

Post a Comment