ఉదయ రాగం.
శరత్పూర్ణిమ
రావే రాధ రాణి రావే..
రాధ నీవే కృష్ణుడు నేనే ..
రమ్యమైన శారద రాత్రి..
రాసలీల వేళ యిదే !
రాసలీల వేళ యిదే !
అవునండీ.. సినిమా పాటే.. నాకూ ఈ నాలుగు ముక్కలకు మించి గుర్తులేదు. కాని శారద రాత్రి గురించి ఓ చక్కని పాట కాదా..ఈ శరత్కాలం అంతా వెన్నెల వేళలదీను.
రాస లీలా వేళ యిదే..!
అలనాడు శ్రీకృష్ణుడు శరత్పూర్ణిమ రోజున బృందావనం లో జరిపే రాసకేళి..పోతన భాగవతం లో అద్భుతంగా వర్ణించారు.
కర్ణావతంసిత కర్ణికారప్రభ;
గండభాగద్యుతిఁ గడలుకొలుప
భువనమోహనమైన భ్రూవిలాసంబుతో;
వామభాగానతవదన మొప్ప
నపసవ్యకర మృదులాంగుళీ చాతురి;
షడ్జధ్వనికి మర్మసరణిఁ జూప
డాకాలిమీఁద నడ్డము చాఁచి నిల్పిన;
పదనఖద్యుతి భూమిఁ బ్రబ్బికొనఁగ
మౌళిపింఛముఁ గంఠదామమును మెఱయ
విలసితగ్రామముగ నొక్క వేణువందు
బ్రహ్మగాంధర్వగీతంబు పరఁగఁ జేసెఁ
జతురనటమూర్తి గోపాలచక్రవర్తి.
అలా బృందావనం లో..
తెల్లటి శరద్రాత్రి వెన్నెల పరచుకుని ఉండగా..
శ్రీకృష్ణుడు వేణువు ఊదడం మొదలు పెట్టాడు...
మంద్రంగా మొదలై..
మధ్యమ,తార స్థాయిలలో రాగాలాపనలు చేస్తూ.....
స్వరాలు.. కళలూ, జాతులూ, ఆరోహాణా..అవరోహణములు తెలిపేటట్లు అవ్యక్త మధురంగా సాగింది ఆ వేణు గానం.
ఆ మధుర మంజుల నాదానికి గోపస్త్రీ లంతా బిలబిల లాడుతూ వచ్చారు. ఆనాటి బృందావనంలో.. అది శ్రీ కృష్ణుని రసరమ్య రాసకేళి..!
ఆతని మధుర మంజుల వేణుగానం వినడానికి ఉత్సుకతతో ఓ నాడు కైలాస పర్వతం మీద తపస్సు వీడి, శివుడు వస్తాడుట. అదీ అందమైన గోపస్త్రీ రూపం లో వచ్చి నృత్యం చేస్తాడు..
వేణుగానానికి పోటీయా అన్నట్టుండే విధంగా!
పున్నమి వెన్నెల తో సాటి అన్న చందాన వెన్నలాటి తెలుపు- లావణ్యం కల 'శివుడు' చేసే ఆ నృత్యం- లాస్యం అనాలేమో-
అందరినీ ముగ్దులను చేస్తుంది.
మరేమో.. గోపికా రూపధారి శివుని మూడోకన్ను పట్టి యిచ్చేస్తుందిట!
శ్రీకృష్ణుడూ వచ్చినదెవరో గ్రహించి నమస్కరిస్తాడుట. ఆవిధంగా శివుడు గోపీశ్వరుడు అయ్యాడట! అందుకు నిదర్శనం గా కృష్ణుని మునిమనుమడు వజ్రనాభుడు కట్టించిన మహదేవుని ఆలయం 'గోపేశ్వర్ మహదేవ్' మందిరం ఉత్తరాఖండ్ లో ఉంది.
మనకు ఈ సారి నవంబర్ నెల రాకుండానే
సగం రుతువు అయిపోయింది. అదీ కాకుండా అకాల వర్షాలు..
ఇవాళ చంద్రుడు కనబడతాడా అన్నది సందేహమే..!
అయినా పగటి వెన్నెలలాటి శరత్కాలం ఇంకా పదిహేను రోజులు వుంది. ఆనక వచ్చే హేమంతం లోనూ చలిగాలులకి శరీరం ముడుచుకు పోతున్నా, మనసున మాత్రం ఆధ్యాత్మిక చింతన మరింత ధృఢమై శివవకేశవులను ఆరాధన కొనసాగుతూనే వుంటుంది.

No comments:
Post a Comment