హేమంత ఋతువు
కిందటి వారం దాకా ఉదయాన్నే గంగ వొడ్డున తిరుగుతూ, సూరీడు జారవిడిచిన నారింజరంగు చీరను చుట్టుకున్న గంగమ్మ తరంగాలలో స్నానించిన నాకు.. ఆ వెచ్చదనం ఇంకా స్వప్నం లాగే ఉంది!
ఇప్పుడిక్కడ చలి బాగా పెరిగింది..
ఇక్కడో ఋతువు తెల్లటి పరదా చాటు చేసుకుని ఇళ్లల్లోకి జొరబడిపోయింది.. !
నందివర్ధనం పూవొకటి మంచు చినుకుని ఢీ కొని చెట్టు గుబురు పైనుంచి ఠీవి గా తలెత్తింది..
మాలతీ తీగకు గుత్తులుగా గిన్నె మాలతీలు విరబూసాయి!
బంతులు, చేమంతులు ఈ ఋతువు మాదేనన్నాయి..గర్వంగా!
-- ఎంతో యిష్టంగా మంచు బిందువులను ముత్యాల్లా ధరించిన లేత గడ్డి పరకలూ.. సరేసరి..వస్తూ వస్తూ శీతాకాలం బహుకరించిన ముత్యాలహారాన్ని గర్వంగా చూస్తూ దక్షిణం వైపుకి తలతిప్పాయి!
*"మాసానాం మార్గశీర్షోఽహమ్"*
అని పలికిన శ్రీకృష్ణుడికి యిష్టమైన *మార్గశిర మాసం!* వచ్చేసింది.
శరదృతువు వెళ్లి హేమంత ఋతువు ప్రవేశించింది.
ఇది *శ్రీరామచంద్రుడికి యిష్టమైన ఋతువు!*
*శరదృతువు వెళ్లి నీకిష్టమైన హేమంత ఋతువు ప్రవేశించింది* అని అంటాడు లక్ష్మణుడు శ్రీరాముడితో!"
అరణ్య కాండలో.. అవి శ్రీరాముడు సీతా,లక్ష్మణులతో పంచవటి లో నివాసం ఉన్న రోజులు..
శీతాకాలం-
సూర్యుడు చంద్రుడిలా చల్లగా అనిపించే- వెలుగొందే కాలం;
ఉదయం వేళ సూర్య కిరణాలు తెలుపు పసుపు వన్నెలు తిరిగి చల్లగా ఉంటుంది.
పచ్చని గడ్డి పరకల మీద మంచు బిందువులు నిలిచి ముత్యాల్లా మెరుస్తూ వుంటాయి.
పొగమంచు చే కప్పబడిన నదీ జలాల ఉనికి బెగ్గురు పక్షులు తమ కిలకిలారావములతో తెలియచేస్తుంటాయి.
మధ్యాహ్నం వేళలో సూర్యకిరణాల స్పర్శ సుఖాన్నిస్తాయి! అని అభివర్ణిస్తారు అరణ్యకాండ లో ఆదికవి వాల్మీకి.
అంతే కాదు శీతాకాలం.. భగవత్ చింతన కల వారందరికీ బహుపుణ్య కాలం!
అందరికీ మార్గశిర మాస శుభాకాంక్షలు!🌺🌺🙏

No comments:
Post a Comment