Tuesday, 4 September 2018

చారథామ్ యాత్ర- గంగోత్రి

ముదిమి లో సాహస యాత్ర చార్ ధామ్ యాత్ర

అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం,
దేహాంతే తవ సాయుజ్యం, దేహి మే పార్వతీ పతే

చతుర్విధ పురుషార్ధాలలో మోక్ష సాధనే కదా అంతిమ లక్ష్యం.  మోక్షసాధన కోసం చేసేది ఈశ్వారన్వేషణ.....!
లౌకికులకు  తీర్థయాత్రల ద్వారానే అది కుదురుతుంది. కాదంటారా?

మే నెల 24 నుంచి జూన్ 7 వరకు మా  చార్ ధామ్ యాత్ర సాగింది. అసలు యాత్ర, రిషికేశ్ నుంచి మొదలవుతుంది.
దేవభూమి గా పిలవబడే ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్-  నాలుగూ...  పడమర నుంచి తూర్పు వరకు  స్ట్రాటజిక్ గా ఉన్నాయి.  యమునోత్రి, గంగోత్రి ఉత్తరకాశి జిల్లా లో, కేదార్‌నాథ్ రుద్రప్రయాగ్ జిల్లా లో,బద్రీనాథ్ ఛమోలీ జిల్లాలో వున్నాయి.

ఎత్తైన హిమాద్రి పర్వత శ్రేణికి చెందిన పర్వతాలు..లోయలు, నదీ నదాలు.. పచ్చని చెట్లు... కనుల పండువుగా...
తపోనిష్టలో ఉన్నట్టు నిటారుగా ఉన్న చెట్ల సముదాయం... వేటికవే ఈశ్వర ఉనికిని చాటుతున్నట్టు..ఏదో మార్మిక రహస్యం గుట్టు విప్పబోనున్నట్టు.
మనసు మురిసిపోదా. ఈశ్వరుడు ఉండేది ఇక్కడే...కనగలిగిన మనసుంటే...!

ఆధ్యాత్మిక చింతన కోసం మరీ ముక్కు మూసుకొని ఉండే పనిలేదు..ఇలా పకృతి రమణీయత ను కళ్లు విప్పార్చుకొని చూస్తూ, ఈ నిశ్శబ్ద సంగీతాన్ని చెవులు దోర చేసుకొని వింటూ...చాలదా...! అదే విశ్వ కవీంద్రుని మాటల్లో..

వైరాగ్యం లోంచి మోక్షం నా కవసరం లేదు
సహస్ర ఆనంద బంధాలలో
స్వతంత్రం నన్నాలింగనం చేసుకుంటుంది.
………………………………………………………………
………………………………………………................
నా జ్ఞానేంద్రియ ద్వారాల్ని ఎన్నడూ మూయను.
నా దృష్టి శ్రావణ స్పర్శనానుభవాలు
నీ ఆనందాన్ని తీసుకొచ్చి నా కిస్తాయి
           ( విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ గీతాంజలి - చలం గారి అనువాదం నుంచి)

చార్ ధామ్ ప్రయాణం అంతా ఘాట్ మార్గం లోనే ఉంటుంది. అయితే సాయంత్రం ఏడు వరకూ మాత్రమే ప్రయాణం చేయగలం. చీకటి పడీపడకుండానే ఆగి ఆ రాత్రికి వసతి చూసుకోవాలి. మళ్ళీ వెలుగు రేఖలు పూర్తి గా వచ్చాకనే ప్రయాణం.

 ప్రయాణిస్తున్నంత సేపూ, ఒక పక్క పెద్ద పెద్ద పర్వతాలు ఎత్తైన వృక్షాలని మోస్తూ..నిశ్చలంగా.. గంభీరంగా..... మనకు అణకువ నేర్పిస్తాయి.  మలుపులు తిరగిన బాట దారి ఇస్తూ,  తమ లోపలకి..మరో దారి చూపిస్తూ.....మరోపక్క లోతైన లోయలు.....కొంత దూరం పోయాక తలపక్కకి తిప్పి చూస్తే.. దూరంగా అవే దారులు కదా  మనం దాటి వచ్చాం అనిపిస్తుంది.!

వీటితో పాటు..జలవిద్యుత్ కట్టడాలు..  నిర్మాణంలో ఉన్న తెహ్రీ డామ్  (modern temple)...దేశంలో నే అతి పెద్ద డామ్, భాగీరథి నదిమీద కడుతున్నారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా సాగుతున్న ప్రాజెక్టు దాదాపు పూర్తి అయింది.

ఎప్పుడో 40 ఏళ్ల కిందట మొదలైందిట ఈ ప్రాజెక్టు... రకరకాల కారణాల వల్ల... అంటే మొదట్లో సుందరలాల్ బహుగుణ వంటి ఎన్విరాన్మెంటలిస్ట్ ల వ్యతిరేకోద్యమం ,రష్యన్ సాంకేతిక  సహాయం అక్కడి రాజకీయ పరిణామాల కారణం తో నిలిచిపొవడం, కొంత నిధుల కొరత....ఎలాగైతేనేం కొంతకాలం ప్రాజెక్టు ఆగిపోయింది.  ఈ డామ్ ప్రభావం ఏమో కొన్నిచోట్ల చాలా ఎండిపోయిన..నదీ ప్రవాహ ప్రాంతాలు కనిపించాయి. వర్షాలు పడేదాకా అంతే అనుకొంటాను.

*గంగోత్రి* [29/5& 30/5/2018]

 మొదట గంగోత్రి  కి వెళ్లాం. గలగలా గంగమ్మ పరవళ్ళు..
'గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా...!'

 అలాగే *బుల్లి* చెంబు సంపాదించి స్నానం చేశాను..చల్లటి నీరు వంటి మీద పడగానే చలి అనిపించింది. తర్వాత....మరోసారి..మరోసారి..గంగమ్మతల్లి కి నమస్కరించి, పొడి బట్టలు కట్టుకొని గుడికి వెళ్లాం. విశేషించి ఇక్కడ దుస్తులు మార్చుకోవడానికి చక్కటి సదుపాయం కూడా ఉంది.
గుడిలో బంగారు గంగని కళ్లారా చూసి..పక్కనే  శివుని గుడీ దర్శించుకొని బయటకు వచ్చాం. ఓ చోట కూర్చుని  ఆదిశంకరుల గంగా స్తోత్రం చదువుకొన్నాం..

'హరిపదపాద్యతరఙ్గిణి గఙ్గే హిమవిధుముక్తా ధవళతరఙ్గే  దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్'

మొదట, నిరాకార అయిన గంగ బ్రహ్మ మానస పుత్రిక అనీ..వామనావతారం లో విష్ణుమూర్తి ఆకాశంలో పాదం పెట్టగా ఆ పాదాన్ని, బ్రహ్మ ,గంగ ని సాకారమొనర్చి కడుగుతాడు..అలా
అలా...అది బ్రహ్మ కడిగిన పాదం..అలాగే విష్ణు మూర్తి పాదాల నుంచి ఆకాశగంగ జాలువారిందనీ పురాణగాథ. గంగ ని నీరు కి పర్యాయపదంగా కూడా వాడుతారు కదా. ఇది నే చదివిన పురాణం.. మాత్రమే.

అక్కడికి  దాదాపు ఓ రెండు కిలోమీటర్ల దూరంలో మేము వచ్చిన బస్ ఆపి ఉంచారు. తీరా వెళ్ళి చూస్తే మా బృందం లో వేరే వాహనాల్లో వచ్చేవారికి ఏదో అవాంతరం వచ్చింది...కనక వాళ్ళు వచ్చే వరకు ఆగాలని సమాచారం. కాని ఆ రాత్రికి గంగోత్రి లోనే బస. మా యాత్ర నిర్వాహకునికి అనుకోని పరిణామాలు ఎదుర్కోటానికి ఎటువంటి  ప్లాన్ ఉందో  తెలియదు కాని, కొంచెం ఆలస్యం అయినా ప్రత్యామ్నాయ సదుపాయాలు చేసేసారు..

ఆ రాత్రికి అక్కడే...గంగ ఒడ్డునే వసతి గృహం. పౌర్ణమి అయినా వెన్నెల ప్రభావం తక్కువే... గంగమ్మ నురగల వెలుగులే అంతా..! ఆ మనోహరమైన దృశ్యం చూసి తీరాలి..! చలిపెడుతున్నా సరే...బాల్కనీ లోంచి అలా చూస్తూ కూర్చున్నాం.

మర్నాడు పొద్దున్నే.. మొబైల్ కెమెరాలు పట్టుకొని ..వంతెన మీద నుంచి అవతలి వడ్డుకి వెళ్లాం.

'గంగ కూడా పర్వతరాజు హిమవంతుని కూతురే..శివుణ్ణి ప్రేమిస్తుంది. కాని ఆమెకు నిర్దేశించిన మార్గం వేరు అంటాడు విష్ణువు..'

నా చేయి పట్టుకొని నడుస్తూ  నా స్నేహితురాలు సరస్వతి చెప్పింది.  ఈ కోణం కొంత ఆశ్చర్యం, ఆసక్తి రెండూ కలిగించింది. టివి లో ఏదో సీరియల్ లో అలా చూపారట. కాని నాకు భగీరధుడు కథ మాత్రమే తెలుసు.

వాల్మీకి రామాయణం లో శ్రీ రామచంద్రుడు ముల్లోక పావని అయిన గంగ వృత్తాంతం చెప్పమని అడగ్గా...విశ్వామిత్రుడు చెప్తాడు. హిమవంతుని మొదటి కుమార్తె గంగ...రెండవ కుమార్తె పార్వతి. గంగ వల్ల గొప్ప దైవ కార్యాలు నెరవేరవలసి ఉండడం వల్ల దేవతలంతా గంగని సురలోకానికి పంపమంటే తండ్రి హిమవంతుడు  పంపిస్తాడు. పార్వతి తపస్సు చేసి శివుని మనసు చూరగొని అతని అర్థాంగి అయింది.

భగీరధుని ప్రార్థన ఫలిస్తుంది. ఉధృతంగా పైనుంచి దుమికిన ఉన్న గంగను తన జటాజూటం లో స్థానం కల్పిస్తాడు శివుడు.. అపుడు గంగ .....శివుని తనతో పాతాళానికి తీసుకొని పోదామని భావిస్తుంది. కాని ఆమెను శివుడు తన శిగలో బంధిస్తాడు. తిరిగి ప్రార్థించగా...ఓ పాయను విడుస్తాడు అలా భగీరధుని వెంట పరవళ్ళు తొక్కుతూ... పరుగులు పెడుతూ కొన్ని చోట్ల, నిదానంగా మరి కొన్ని చోట్ల,  కొన్ని చోట్ల దుడుకుగా..గంగా ప్రవాహం సాగుతుంది.. జహ్నుముని ఆశ్రమం ముంచెత్తగా,  కోపించి గంగను ఔపోసన పడ్తాడాయన..తిరిగి తన చెవిలోంచి వదులుతాడు..అక్కడ జాహ్నవిగా ప్రవహిస్తుంది. అలా..భగీరధుని వెంట పాతాళానికి వెళ్ళి అతని పితృదేవతలను పునీతం చేస్తుంది..  అయితే గంగ పరాశక్తి అంశగాను, శివుని శిరమందు బంధించ బడినందువల్లనూ శంకరుని పత్ని అయినది....ఇది పురాణం.

గంగ కి ఒక వ్యక్తిత్వం ఇచ్చారు మనవాళ్ళు.  జీవనది గా తాను ప్రవహించినంత మేరా సస్యశ్యామలం చేస్తూ, నడక ని కూడా పల్లవించిన ప్రాంతానికి అనుగుణంగా,నిదానంగా, మెల్లగా మార్చుకొంటూ...చిన్న, చిన్న నదీనదాల్ని సోదరి లాగ ఆదరించి కలుపుకొంటూ ప్రవహించినంత మేరా పావనం చేస్తూ పోతుంది గంగ. పాప ప్రక్షాళన చేసి జీవులకి సద్గతి ని  ప్రసాదించే మహత్తర బాధ్యత ఆమె పై ఉంది కదా..బహుశా కలియుగాంతం వరకూ ఇంతేనేమో...!  తిరిగి శివుని చేరేదెన్నడో...!!

భౌగోళికంగా  చూస్తే.. గోముఖం దగ్గర సన్నధార గా మొదలైన గంగ అక్కడ భాగీరథి నది గా పిలవబడింది... తెల్లగా నురగలు కక్కుతూ..కిందికి జారింది.....దేవ ప్రయాగ దగ్గర అలకనంద తో సంగమించి 'గంగ' గా పిలువబడుతుంది..ప్రవాహమార్గంలో ఎన్నో నదులు కలుపుకొంటూ హరిద్వార్ దగ్గర ఉధృతంగా ప్రవహిస్తూంటుంది గంగ. యమునానది గంగ కి ఉపనది అయినా ప్రాశస్త్యం తక్కువేమీలేదు. గంగేచ...యమునేచ అంటూ ఆహ్వానిస్తారు కదా!  యమునా నది అలహాబాదు దగ్గర గంగ తో కలుస్తుంది.. అక్కడ సరస్వతీ నది అంతర్వాహిని. కలిపి త్రివేణి సంగమం.
సరస్వతీ నది *మన* దగ్గర  అంతర్థానమైంది..పురాణ కధ ఏమంటే,  మహాభారత రచన సమయంలో నదీ హోరుకు ఏకాగ్రత భంగమవగా వ్యాసులవారు సరస్వతి నదిని అంతర్థానం కమ్మని శపిస్తారు. ఈ ప్రాంతం బదరి కి  3 కి.మీ దూరంలో ఉంది కాని అప్పటికే.. సమయం కలసి రాకపోవడం వల్ల ..వెళ్లలేకపోయాం.

*ఈశ్వరానుభవం*

ఇంకా గంగోత్రి లోనే...ఉన్నాం కదా. అంతకు ముందు రోజు స్నానాలు చేయలేకపోయిన వాళ్ళు కూడా ఉదయాన్నే స్నానాలు చేశారు...అవును మరి.. మన ఇంటి దగ్గర ..చెంబెడు నీళ్ళలో గంగాదేవిని ఆహ్వానించి.. స్నానం చేయగాలేనిది, సాక్షాత్తూ గంగమ్మ దగ్గర కి వచ్చి చలి అనుకొంటే ఎలా...! అందుకే అంతా పొద్దున్నే గంగానదిలో స్నానాలు చేశారు.

మేమీ ఒడ్డున గంగాదేవి కథలు చెప్పుకొంటూ కూర్చున్నామా, మాతో వచ్చిన మరో మితృరాలు వల్లీ,  వంతెనమీద కనిపించింది... తనకి మా ఫోన్ కాల్ అందలేదు..చేతులూపినా చూడలేదు. ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు పర్వతాలకేసి చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. సరే మేమే నిదానంగా లేచి తనని కలిశాం. ఇంకా అలాగే ఎదో లోకం లో ఉన్నట్లు.. పలకరిస్తే..   'ఫోన్ ఛార్జింగ్ పెట్టాను' అని జవాబిచ్చి, మళ్లీ చెప్పింది. 'ఇలా వచ్చి ఈ పర్వతాలను చూస్తుంటే..ఈశ్వరుడు ఇక్కడే తిరుగాడుతున్నాడా అన్నట్లుంది.  పరమేశ్వరుడు.. పెద్ద పెద్ద అంగలతో కలియ తిరుగుతున్నట్లు... సతీదేవిని ఎడబాసిన బాధ, కోపం కలిసి..'. ఉద్వేగంతో  తన గొంతు పూడుకు పోయింది.  ఓ క్షణం వెర్రి దానిలా చూశా..!
*ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పోలిక*...ఈశ్వరుడు ఎవరికి ఎలా కనిపిస్తాడో కదా.....పరమేశ్వరా..! అనుకొని మనసులోనే నమస్కరించాను.

ఈ లోగా ప్రయాణం హడావుడి.. యథా ప్రకారం సామాన్లు సర్దుకుని బస్ దగ్గర కు నడక.(ఇంకా ఉంది)
###########

#బద్రీ నాథ్ [1/6 & 2/6/18  ]


గంగోత్రి లో కొంచెం త్వరగానే లంచ్ చేసి బయల్దేరాం. మా యాత్ర నిర్వాహకులు శర్మ గారు, ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా, మా అందరికీ కాఫీలు, ఫలహారాలు..భోజనాలు సదుపాయం గానే చేశారు.  ఈ సుదీర్ఘ ప్రయాణాల్లో, ఆరోగ్యంగా ఉండడమే కదా ముఖ్యం. 


30/5/18 

రాత్రికి ఉత్తర కాశిలో బస.  అనుకొన్న ప్రకారం వెళ్లడానికి

కేదార్‌నాథ్ లో వాతావరణం అనుకూలంగా లేదని.. బదరీ అన్నారు. మళ్ళీ ప్రయాణం. అవసరమైన దుస్తులు ఓ చిన్న బాగ్ లో సర్దుకుని.. పెద్ద పెట్టి లాక్ చేసి బస్ డిక్కీలో నే ఉంచేశా అందరిలాగానే.


31/5/18.

సరే.. ఉదయమే అల్పాహారం అవుతూనే బయల్దేరాం.

రోజంతా ప్రయాణం. అక్కడక్కడా కాఫీ,టీ లకి చిన్న చిన్న విరామం.  అయితే ఇక్కడొకటి చెప్పుకోవాలి. మా బస్ లో చాలా మంది శ్రవణానందకరంగా భక్తి పాటలు పాడారు.. ముఖ్యంగా శ్రీమతి రాజశ్రీ గారు శివానందలహరి ఎంత చక్కగా ఆలపించారో. ఇంకా శ్రీమతి జయ,శాంతి, వల్లీ..వీరంతా చక్కని గీతా కదంబమాల తో వాతావరణం లో పరిమళం నింపారు.

ఆకలి దప్పిక ల్లాంటి చిన్న ఆరాటాల్లో ...జారిపోతున్న వేళ ...భక్తిని మళ్ళీ పొదువు కొంటూ అవసరమైన చోట గొంతు కలిపారంతా. సాయంత్రం ఏడు అయితే చాలు ఘాట్ రోడ్డు లో ప్రయాణం ఆగిపోతుంది.  కర్ణప్రయాగ దగ్గర ఓ హొటల్లో ఆరాత్రి ఆగాం. 


1/6/2018


తెల్లవారుతూనే  బదరీకి ప్రయాణం. ఓ మూడు,నాలుగు గంటల్లో  బద్రీనాథ్ చేరవచ్చు. ఒక రెండు గంటలు ప్రయాణించాక జోషీ మఠ్ వచ్చింది. శంకరమఠం చూడాలని ఉన్నా బదరీ ఆరోజే వెళ్లాలని, కొందరు అక్కడ బ్రహ్మ కపాలం దగ్గర పితృకార్యాలు చేయించే ఉద్దేశంతో ఆగలేదు. కాని,  కొంత దూరం పోయాక ఆగక తప్పలేదు. తామొకటి తలిస్తే, అన్నట్టు దైవికమేమో కాని, దారిలో కొండ చరియలు విరిగి పడ్డాయి, దారి మూసుకు పోయిందనీ, పూర్తి గా అడ్డు తీయాలంటే ఎంత లేదన్నా ఓ నాలుగు గంటల సమయం పడుతుంది అనీ సమాచారం. ఉసూరు మంటూ కూర్చున్నాం. కొంతసేపటికి, తను..శీమతి రాజశ్రీ గారు ముకుందమాల పాడటం ప్రారంభించారు. కృష్ణ శబ్దం తప్ప దూరానికి ఏఁవీ స్పష్టంగా లేదు కాని..చక్కని రాగాలాపన..అగరొత్తుల గుభాళింపులా...అంతా ఆవరించింది. బహుశః అది బదరీ నారాయణుని చేరిందో ఏమో..కాసేపటికి మాకు క్లియరెన్స్ వచ్చేసింది. ( ఆవిడ ఏం పాడారో తర్వాత అడిగి తెలుసుకొన్నా).


ఈ లోగా అనుకోకుండా బస్ ఓ మోస్తరు పెద్ద రెస్టారెంట్ దగ్గర ఆగిందేమో, కాఫీ,టీలు, భోజనాలు ఎవరికి వారే కానిచ్చారు. 

బదరీ నారాయణ్... బదరీ విశాల్ కి జేజే ధ్వనులు పలుకుతూ కదిలాం.


ఎలాగైతేనేం ..రోడ్డు బాగయింది..ప్రయాణం కొనసాగింది. సాయంత్రానికి బద్రీనాథ్ చేరాం. మఠం లో పెద్ద హాలు ఇచ్చారు అందరికీ కలిపి. సామాన్లు పడేసి సాయంత్రం దర్శనానికి వెళ్లాం.


అసలు చార్ ధామ్ అంటే బద్రీనాధ్,ద్వారకా,పూరీ ఇంకా రామేశ్వరం ఈ నాలుగూ.  మేం ఇప్పుడు చూసినది చిన్న చార్ధామ్.(యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్).

బద్రీనాథ్ ఆలయం ఆది శంకరుల చే పునరుద్ధరించబడింది.

అంతకు మునుపు బౌద్ధ ఆరామంట. అందుకే కాబోలు గుడి ముఖ ద్వారం బౌధ్దారామాన్ని పోలి ఉంటుంది. 

 

అలకనందా నది పక్కనే వెలసిన క్షేత్రం బదరీక్షేత్రం. దాదాపు 10800 అడుగుల ఎత్తు. చలీ ఎక్కువే. గుడి వేపుకు వెడుతుంటే ఎడమ పక్క దూరంగా మంచు కప్పిన పర్వతాలు కనిపించాయి. శిఖరంలా ఉన్న దానికి రాత్రి వెలుగు లో ఫోటో తీశా. అది *నీలకంఠ పర్వతమని* తర్వాత తెలిసింది.


నరనారాయణులు వెలసిన ప్రాంతం. బదరీ అంటే రేగి చెట్టు అని, నారాయణుడు బదరీ చెట్టుకింద ధ్యానంలో ఉండాగా లక్ష్మీదేవి రేగుచెట్టు తానై నీడనిచ్చిందని అప్పట్నుంచీ రేగి చెట్టు లక్ష్మీనివాస స్ధానం అయింది ..అలా విష్ణు మూర్తి అక్కడ బదరీ నారాయణుడిగా అవతరించాడని కధ. నాకైతే ఆ ప్రాంతంలో రేగి చెట్టు కనపడలేదు. స్థల పురాణానికి సంబంధించిన పుస్తకం కూడా  కొన్నా. 

 

దైవ దర్శనం అయితే కాస్త దూరంగానే చూడనిచ్చారు. అక్కడ చలికాలం లో గుడి మూసివేసినా కూడా వెలిగే అఖండ జ్యోతి ఉంది .చలికాలంలో నారదుడు వచ్చి స్వామిని పూజిస్తాడని చెప్తారు. లక్ష్మీదేవి తో పాటు నారదుడు, కుబేరుడు స్వామి వారి పక్కన కొలువై ఉంటారు


2/6/2018

నిజరూప దర్శనం తెల్లవారుజామున ఉంటుంది అని కొంతమందిమి లేచి వెళ్ళి నిజరూప దర్శనం చేసుకొన్నాం. తెల్లవారేసరికి అతి పెద్ద క్యూ. అంతరాలయానికి వెళ్ల లేకపోయాం అదే కొరత.  నర నారాయణులు లోక కళ్యాణం కోసం తపస్సు చేసిన స్థలం. విష్ణు సహస్రనామం చదువుకొన్నాము.


ఆ రోజు ఉష్ణగుండం లో స్నానం. పట్ట లేనంత వేడి. ఎన్ని సదుపాయాలున్నా, జనం ఎక్కువగా వచ్చారారోజు. 


*బ్రహ్మ కపాలం* మరో ప్రాంతం అనుకొన్నా అక్కడికి వెళ్లేదాకా. గుడి దాటి, అలకనంద కి ఎగువగా దాదాపు ఒక కి.మీ దూరం లో ఉంది. అతి పెద్ద రాయి..కపాల ఆకారంలో ఉంటుంది.

చతుర్ముఖ బ్రహ్మ గారికి ముందు ఐదు తలకాయాలు వుండేవట. శివపార్వతుల కళ్యాణం చేయిస్తూ పార్వతి సౌందర్యానికి మైమరచిన పాపానికి,  శివుని చేత తల తెగుతుంది. కాని ఆ తల ఊడి పడక శివుని చేతికే అతుక్కుని ఉంటుంది. బ్రహ్మ హత్య పాప పరిహారానికి శివుడు అంతా భిక్షాటన చేసి ఇక్కడ విష్ణువు దగ్గర కి వచ్చేసరికి అది ఊడిపడిందిట. స్థల పురాణం.. తెలిసినా చెప్పుకోవడం ఆనవాయితీ.

 బ్రహ్మకపాలం దగ్గర పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వర్తిస్తే, వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. కొంతమంది ఆత్మ పిండం కూడా పెట్టుకుంటారు కాని అలా చేస్తే ఇక ఏ శుభానికీ పనికిరారని చెప్పి, అలా  అనుకొన్న వాళ్ల సంకల్పం మానిపించారు పంతులుగారు. ఇక్కడ జ్ఞాతులకే కాక బంధు మిత్ర వర్గాల్లో..ఎవరికైనా పిండప్రదానం చేయ వచ్చు... పోయిన వాళ్లంతా మంచి వాళ్లే...అనుబంధాలు గుర్తుకొచ్చి కళ్లు చెమర్చే క్షణాలు...!

  

బదరీ నారాయణుని దర్శించి.. స్మరించి.. ఆ మధ్యాహ్నం భోజనాలు అవుతూనే తిరుగు ప్రయాణం. ఎంచేతో అంతా బాగా అలసిపోయాం. బరువుగానే బయల్దేరామంతా. ఇక అక్కడ దగ్గర లోనే ఉన్న అతి ముఖ్యమైన ప్రదేశం  'మన' చూడ్డానికి ఎవ్వరికీ ఓపిక లేక పోయింది. 

'మన'  లోనే  వేదవ్యాసుడు మహా భారతం రచన చేసినట్లు.. చెప్తారు. వ్యాసుడు చెప్తూ ఉండగా విఘ్నేశ్వరుడు వ్రాసినట్లు తెలుస్తున్నది. సరస్వతీ నదీ సుళ్లు తిరుగుతూ ఇక్కడే అంతర్థానమవుతుంది..వ్యాసులవారి శాప కారణంగా... ఉత్సాహంతో చూడాలనుకొన్నా సమయాభావం.. 

కేదారేశ్వరుడు పిలుస్తున్నాడు ఒక పక్క..!!!


@@@@@@@@@

చార్ ధామ్ _3


*కేదార్‌నాథ్* (.3/6, 4/6 ..5/6)


ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కేదారేశ్వర లింగం. 

ఈ ఆలయాన్ని శ్రీ ఆదిశంకరులు పునరుద్దరించారట. .


సముద్ర మట్టానికి 11700 అడుగుల ఎత్తు లో ఉండే ఈ శిఖరంపై  క్షణం లో వాతావరణం మారిపోతూ ఉంటుంది. .ప్రతికూల వాతావరణం ఏర్పడిందంటే ఎప్పుడు సాధారణ పరిస్థితి కి వస్తుందో చెప్పలేం. విపరీతమైన మంచు కారణం గా నవంబర్ నుంచి ఆరు నెలలు మూసి ఉంచుతారు ఈ ఆలయాన్ని. తిరిగి అక్షయ తృతీయ నాడు తెరుస్తారు.


జూన్ 2


యధాప్రకారం గా బస్ ప్రయాణం. బదరీనాధ్ నుంచి. ఎంత అలసిపోయాం అంటే. చుట్టూ ఎటు వెడుతున్నామో కూడ ఆసక్తి లేదు. దూరం దాదాపు 200 కి.మీ పైనే..ఘాట్ రోడ్ లో 20  స్పీడ్ దాటకూడదు. అలా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ హోటల్ లో బస. తెల్లారి పొద్దున్నే కేదార్‌నాథ్ కి.


జూన్ ౩(ఆదివారం)


కేదారేశ్వరా ....!  జేజేలు కొట్టుకొంటూ కదిలింది మా బస్.  ఉదయం పదకొండూ ఆ ప్రాంతంలో చేరాం. అసలు కధ అక్కడ మొదలైంది.  


ముందు అనుకొన్నట్టుగా కేదార్‌నాథ్ వెళ్లకపోవడం తో, మా హెలికాప్టర్ కి బుక్ అయిన  ఆన్ లైన్ టిక్కెట్లు  కాన్సిలైతే, మళ్ళీ ప్రయత్నించి 3,4 తేదీల్లో చేయించాడు మా టూర్ నిర్వాహకుడు.  హెలికాప్టర్ సర్వీసులు రెండు మూడు ఉన్నాయి. అయినా, ఏదో లాటరీ తీసినట్లు వచ్చాయి. ఇక అక్కడనుంచి అందరికీ ఆదుర్దా..

అసలు వెళ్లగలిగితే చాలనుకొన్నాం. జూన్ మూడు, ఆదివారం. మాలో ఓ పదమూడు మందిని పినాకిల్ హెలీపాడ్ దగ్గరకు పంపారు. మా ఆధార్ కార్డ్స్ వెరిఫై చేశారు. వెయిట్ నోట్ చేసుకొన్నారు.  మధ్యాహ్నం వాళ్ల లంచ్ బ్రేక్ తర్వాత అన్నారు. వెయిట్ చేశాం. అంతే ....! వాతావరణం బాగాలేదని  హెలికాప్టర్ సర్వీసులు ఆపేశారు. 

మర్నాడు పొద్దున్నే నాలగున్నర కి రిపోర్ట్ చేస్తే ఫస్ట్ అవర్ లో పంపిస్తామన్నారు. ఉసూరంటూ హోటల్ రూమ్ కి  తిరిగి వచ్చేశాం.  మళ్ళీ అన్నమాట ప్రకారం పొద్దున్నే వెళ్తే.. చెక్ చేసి ఆరుగురు బాచ్ గా వెళ్లమన్నారు.  


ఇక్కడో ముఖ్య మైన సంగతి..ఎవరైనా ఎనభై కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటే పెనాల్టీ ఫీ కట్టాలి. బరువు లని బట్టి మనుషులను అడ్జస్ట్  చేస్తారు. 


హెలికాప్టర్ ఎక్కాం. deja vu....,! 


కింద పర్వతాలు, లోయలు దాటిపోతున్నాయి.  తూనీగలా వెంబడిస్తూ హెలికాప్టర్  నీడ. 

ఇరవై నిముషాల్లో కొండ మీద. 

దిగ గానే హెలికాప్టర్ వాళ్ల మనిషి..దర్శనానికి తీసుకు పోవడం మొదలు పెట్టాడు..ఓ పండిట్ ని మాట్లాడు కొన్నాం అంతా కలిసి. అన్నట్టు స్పెషల్ దర్శనం టికట్  ₹2500/-కి ఒకటి కిందనే తీసుకొన్నాం ..అది మల్టీ పర్పస్ ..స్పెషల్ దర్శనం లో శీఘ్ర దర్శనం ఒకటి,  వెళ్ళి న రోజే వెనక్కురావడం మరోటి. భరోసాగానే ఉన్నాం. 


ముందు రోజు వచ్చిన కొందరు పైనే ఉండిపోయారు.. (హెలికాప్టర్ సర్వీసు నమ్ముకొన్నందు వల్లనే_టిక్కెట్లు రెండువేపులా కదా)..అలా రాత్రికి ఉండడం అదో అనుభవం. మరోసారి దర్శనం చేసుకోవచ్చు.. కాస్త చలికి ఓర్చుకోవాలి అంతే.


*కేదార్‌నాథ్ స్థల పురాణం*


శివుడు ఇక్కడ పశుపతి నాధుడుగా ఉంటాడని చెప్తారు.తల భాగం నేపాల్ లో ని పశుపతినాథ్ లో ఉండగా ఇక్కడ మూపురం మాత్రం కనిపిస్తుంది. దీనికి ఓ స్థల పురాణం ఉంది


పాండవులు యుద్ధం అయ్యాక, తమ జ్ఞాతులను చంపిన పాప పరిహారం కోసం కేదారేశ్వరుడు దగ్గరి కి వస్తారుట.  ఆయన అందుకు ఇష్ట పడక వృషభ రూపంలో పశువుల మందలో కలసి పోతాడుట. కాని భీమ సేనుడు తన రెండు కాళ్లను ఎడంగా పెట్టి.. ఈశ్వరుడు తప్పించుకో లేడని భావిస్తాడు. అయితే ఈశ్వరుడు భూమిలోంచి దారి తీయగా, భీముడు  అది కనిపెట్టి తన గద తో మూపురం పైన అదిమి..పెడ్తాడు.అందుచేత అక్కడ మూపురం ఉంటుంది. కాని స్వామి తల పశుపతి నాథ్ ( నేపాల్) లో ఉంటుంది. వెన్నుకి అయిన గాయానికి నేటికీ ..మూపురాన్ని నేతి తో మర్దన చేస్తూంటారు. ఇలా, ఈ కధ అడగగా ఓ ఉత్తర హిందుస్తానీ ఆవిడ చెప్పింది.


శ్రీ ఆది శంకరుల వారిని సాక్షాత్తూ పరమేశ్వరుని అవతారంగా భావిస్తారు. నాలుగు దిక్కులా అద్వైత మఠాలని స్థాపించారు  ఆయన. తన ముఫ్ఫై రెండవ యేట...బదరీ...కేదార్‌నాథ్ వచ్చారు. ఇక్కడి కి ఆయన వచ్చిన పని అయింది. ఎంత శ్రమ..కఠిన దీక్ష..అంతా ఒక్క తాటిన నిలబెట్టడానికి. డస్సి పోయుంటారు బహుశ...!  ఇక్కడే నిధనం అయినట్టు చెపుతారు ,కాని మాకు వారి సమాధి చూసే అవకాశం లేక పోయింది.


*దైవ దర్శనం* 


 ప్రత్యేక దర్శనం టికెట్టు తీసుకొన్నా.. సాధారణ క్యూలోనే కలిపేసారు.అదీ ఒకందుకు మంచిదే. నిదానంగా చూట్డూ చూసుకుంటూ క్యూ లో కదిలాం.  కుంతీ దేవి, పాండవుల విగ్రహాలు ఒకటొకటి ..పరికించి చూశాక. .నందీశ్వరుడు..

లొపలికి వెళ్తుంటే వెచ్చని ఉద్వేగం....

చెంబెడు నీళ్ళు అభిషేకం.. ఆ అభిషేక ప్రియునికి..మెత్తగా జారిపోతూ నేయి రాసిన మూపురం..పూజాద్రవ్యాలు అలా తాకించి వెనక్కు ఇచ్చేశారు. పూజారి గంధమో, నెయ్యో.నుదుట అద్దాడు...'మందాకినీ సలిల చందన చర్చితాయ'

ఓం నమః శివాయః🙏.  స్వామి ని తాకి నమస్కరించడం. ఓ అనుభూతి.....శంకరా..!

  కేదారేశ్వరు ని దర్శనం  కోసం అంత వరకు ఎంత ఆరాట పడ్డాం...!  ఎంత శ్రమ తట్టుకొన్నాం. ..! ఏమీ గుర్తు రాలేదు. బయటకు రాగానే ఎంతో తేలికగా అనిపించింది.


పార్వతీ దేవి విగ్రహం బయటకు వస్తుంటే ఉంది. అక్కడ తోచిన దక్షిణ సమర్పించి బయటకు వచ్చాను. చాలా మంది ముందు ఆలోచనతో అమ్మవారికి చీర తెచ్చారు.


పూర్తిగా ఆలయం బయటకు వచ్చాక, వెనకాల 2013 లో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్ గుర్తుగా  ఆగిన పెద్ద బండ. ఆలయం కొట్టుకు పోకుండా ఆపిందిట.  అప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు గుర్తుకొచ్చి వాళ్లను స్మరించుకొన్నాం. 


 దూరంగా స్వర్గారోహణ పర్వతాలు ..ఫోటోలు తీసుకొన్నా. సెల్ఫీలు సరేసరి.   దర్శనం అయిందన్న సంతృప్తి. వెంటనే హెలికాప్టర్ రెడీ... కిందకి వచ్చేశాం. !


కింద పరిస్థితి వేరేలా ఉంది..!  చాలా మందికి హెలికాప్టర్ టికెట్లు అందలేదు. మా బస్ లో ఇంకా ఉన్నారు... ఎన్నో ప్రయాసలు పడి ఇంత దాకా వచ్చాక చూడలేకపోతే..బెంగ గానే అనిపించింది. కేదారేశ్వరుడికి దణ్డం పెట్టుకొన్నా..ఎవరూ నిరుత్సాహంతో వెను తిరగరాదని. 

ఎలాగైతేనేం అందరికీ అవకాశం దక్కింది. కాని ఆలస్యం గా వెళ్ళి న వాళ్ళు ఆ రాత్రికి పైనే ఆగిపోయారు. మర్నాడు చూస్తే..కింద వర్షం... పైన సూర్యుడు వచ్చాడుట కూడా. కాని, హెలికాప్టర్ సర్వీసు లు ఆపేశారు.   పైగా ఎయిర్ టెల్ ఫోన్లు పనిచేయడం లేదు. కాస్త ఆదుర్దాగానే అనిపించింది.  మా గ్రూప్ లో పైన ఆగి పోయిన వాళ్ళు ..ప్రత్యామ్నాయం చూసుకొసాగారు. ఎవరిదగ్గరో బి.ఎస్. ఎన్. ఎల్. ఫోన్ దొరికితే కిందకి సమాచారం పంపారు. డోలీ లు కొంతమంది, గుర్రాలు కొంతమంది ఎక్కి బయల్దేరారట. మా టూర్ ఆర్గనైజర్ వీళ్ల అందరి కోసం తను ఉండిపోయి, మమ్మల్ని బస్ లొ పంపించి వేశాడు. అక్కడ నుంచి హరిద్వార్, ఆగ్రా స్టేషన్ ఎకాయెకి ఇరవై నాలుగు గంటల ప్రయాణం. హరిద్వార్ లో బస్ మారింది. స్టేషను సమాయానికి వచ్చి చేరాం. ఇంత ప్రయాణం చేసిన మాకు తిరుగు ప్రయాణంలో దూరం పెరిగినట్లు అనిపించింది. 

ఈ యాత్ర లో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయో..! అయినప్పటికీ ముఖ్యమైన మూడు  క్షేత్రాలు దర్శించుకొన్న తృప్తి.

 అందుకే అన్నాను చార ధామ్ యాత్ర సాహస యాత్ర అని. అదీ వయసుమళ్లాక..ఇంకాను


హోమ్ స్వీట్ హోమ్...అనుకొంటూ.. మళ్ళీ ఈ మాయాజగత్తు ని చుట్టుకొని సెలఫోన్ ...గణగణలాడించాం.

 

శుభం...

 అయిపోయింది



No comments:

Post a Comment