Saturday, 17 February 2018

తీర్థయాత్ర

*తీర్థయాత్ర*
యాత్రలు చేయాల‌నే అభిలాష కలగాలే కాని....ఎలాగైనా మార్గం దొరుకుతుంది.  ఈ సారి జనవరి 26న మా మిత్రులు,అంతా కలిసి ఆరుగురం  ఇన్నోవా వెహికిల్ మాట్లాడుకొని మాహుర్,పర్లి వైద్యనాథ్ పుణ్య క్షేత్రాలు దర్శించడానికి కి బయల్దేరాం. మూడు పగళ్లు,రెండు రాత్రులు. మా ప్రణాళిక.

*26/1/2018*

 ముందుగా మాహుర్ వయా బాసర.  పదకొండు- పదొకొండు న్నర కి బాసర చేరాం. వ్యాసపురి కాలక్రమంలో బాసరగా మారిందని పురాణం‌. ఇక్కడ జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మీ,
 ‎మాహా కాళి సమేతంగా కొలువు తీరి ఉన్నారు. వేదవ్యాసునిచే  నిర్మితమైన ఈ మూడు ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. విశేషమేమిటంటే దేశం మొత్తం  ఉన్న రెండు సరస్వతీ ఆలయల్లో ఒకటి బాసర అయితే, ఇంకొకటి కాశ్మీరులో ఉన్నది.  అక్కడి సరస్వతీ మాత ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చామంతా. అటునుండి మాహూర్ వెళ్లాలి.

బయట కొచ్చాక, జామ కాయలు కొనుక్కొందామని చూశాం కాని సరైనవి కనిపించలేదు పైగా సాయంత్రం లోగా మాహుర్ చేరాలి. దోరదోరవి రేగి పళ్ళు కనిపించాయి...అవే తీసుకొన్నాం.
చలికాలంలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో దొరికే పళ్లలో రేగుపండు ప్రత్యేకమైంది. మంచి ఎపిటైజర్ ..ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి. రేగు పండు గుజ్జులో  ఉప్పు, పచ్చిమిర్చి కలిపి వడియాలుగా చేసి, ఎండబెడతారు కూడా.

సాయంత్రానికి మాహూర్ చేరాలి... మాహూర్ కూడా ఒకప్పుడు తెలంగాణా ప్రాంతంలో దేనట. వెళ్తూనే ముందుగా మేం ఆనలైన్ లో బుక్ చేసుకొన్న హోటల్ కి చేరి, కూడా తెచ్చుకొన్న లగేజ్ అక్కడ పడేసి, రిఫ్రెష్ అయి బయటపడ్డాం. రేణుక అమ్మవారి గుడి రాత్రి ఎనిమిది దాకా తెరిచే ఉంటుందన్న సమాచారం. కాని దగ్గర, దగ్గర రెండొందల పైనే మెట్లు ఎక్కాలి. అంతకుముందు ఒకసారి నేను వెళ్ళి ఉండటంతో... నాకు తెలుసు... అప్పుడు కూడా మెట్లెక్కడం కష్టమనిపించలేదు. అదే చెప్పాను మా వాళ్లతో. వాళ్లంతా దానికి సిద్ధమే అనుకోండి.

"ఇసుక తో కుండ చేసి, దాని తో రోజూ నది నించి నీరు తేవడం చేస్తూంటుంది రేణుకాదేవి. యిసుక తో కుండ చేయడం అంటే ఎంతో నైపుణ్యం ఉండాలి..కాని ఓ రోజు.. పరపురుషుడెవరో(ఎవరన్నది అప్రస్తుతం అని నా ఉద్దేశం) నదిలో స్నానం చేస్తుంటే, తను ఆగిపోతుంది. కుండ కుదురు గా రాదు.  బీట వారుతుంది. ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. దానితో ఆమె భర్త అనుమానించి, కోపంతో ఆమె కు మరణ శిక్ష వేస్తాడు. .."

మెట్లెక్కుతూంటే...సరస్వతి (నా మితృరాలు) ఈ కధ చెప్పుకొచ్చింది. నేనూ చదివాను కాని సమయానికి ఈ పురాణ కధ గుర్తు రావటం... మననం చేసుకోవడం ఓ విశేషం అనిపించింది.
రేణుక జమదగ్ని మహాముని భార్య,పరశురాముని తల్లి.  తండ్రి ఆజ్ఞ తో తన తల్లి తల నరికినా, తిరిగి తండ్రి నుంచి వరం పొంది తనతల్లిని బతికించు కొంటాడు పరశురాముడు. చేయని తప్పు కి శిక్ష అనుభవించడం ఎంత కష్టం? తన లోని పాతివ్రత్యం, మాతృత్వం, శిల్పకళా నైపుణ్యం... ఇన్ని విశిష్ట లక్షణాలు కల రేణుకా దేవి  పరాశక్తి అవతారమే!

ఇక్కడ ఆలయం అంతా  సింధూరం రంగులో వుంది. చిన్న ద్వారం లోంచి వెళ్లాలి. పెద్దగా రద్దీ లేదుకాని, ఇరుకుగా ఉండటంతో ఆగి నిలబడి దణ్డం పెట్టుకోనే ఆస్కారం లేకుండా పోయింది. వెంటనే బయటకొచ్చినా మరోసారి చూసి వచ్చాం.
అమ్మవారు  కేవలం శిరస్సు  మాత్రమే ఉంటుంది... సింధూర వర్ణం అంతా. ముక్కు,నోరు కళ్లు మాత్రం...స్పష్టంగా కనిపిస్తూ...అందులోనూ, నూరిన తాంబూలం ఈ అమ్మవారి కి ప్రసాదం..కనుక, లలితా సహస్రనామం లో చెప్పినట్లుగా *తాంబూలపూరిత ముఖీ*  అన్నట్టు ఉంది.
బయట ఈ తాంబూలం రోట్లో దంచి అమ్ముతుంటారు.
ఇవతల కొచ్చాక గాజుల దుకాణాలు మమ్మల్ని ఆకర్షించాయి.

 ఇక ఆరోజుకి  విశ్రాంతి. మేమున్న హోటల్ కి ఎదురు గానే మాకు శాకాహార భోజనం దొరికింది.
 ‎
 ‎*27/01/2018*
 ‎
మర్నాడు ఉదయమే లేచి అనసూయ- అత్రి మహాముని గుడి, దత్తాత్రేయ లవారి గుడి చూసి ఏకవీర  అమ్మవారిని(శక్తిపీఠం) దర్శించుకొని అటునుండి అటే పర్లికి వెళ్లాలి. క్రితం సారి నేను వెళ్ళినపుడు సెప్టెంబరు నెల కావడం వల్ల విపరీతంగా వర్షం పడింది...మెట్లు అవీ చూసి..వీలుకాక అనసూయ తల్లికి కిందనుంచే నమస్కరించి  వెళ్ళి పోయాం‌. ఇపుడలాకాదు.

 పొద్దున్నే కాబట్టి హుషారుగా నే మెట్లన్నీ ఎక్కాం. ఈ ఆలయం దగ్గర విపరీతంగా కోతులు అటూఇటూ దూకుతూ...;
 ‎కళ్ళజోళ్ళు మాత్రం పదిలమని హెచ్చరించుకొంటూ ఎక్కాము. తీరా ...చిన్న నిరాశ. ఉదయం 8.30 కి గాని తలుపులు తీసి హారతి ఈయరట. ఈ లోగా పెద్ద క్యూ నే ఏర్పడింది. ఉస్సురనట్లు చుట్టూ చూస్తున్న మాకు శాస్త్రి గారు(మా మిత్ర బృంద సభ్యులు) స్థల పురాణం సంబంధించిన కధ చెప్పటం మొదలు పెట్టారు.

"పాతివ్రత్యం మీద త్రిమూర్తుల భార్యలకు పోటీ వస్తుంది... అనసూయా దేవి మించి పతివ్రత ముల్లోకాలలో లేదని నారదుడు చెప్తాడు. తమ భార్యల కోరికమీద  ముగ్గురు అయ్యలూ అనసూయ వద్దకు మారువేషంలో వస్తారు...ఆ సమయంలో అత్రి మహాముని ఆశ్రమంలో ఉండరు. అనుష్టానం తీర్చుకొని ఆయన వచ్చేదాక ఆగలేమని ఆకలి గా ఉంది భోజనం పెట్టమని అడుగుతారు. అలాగేనని అనసూయ మాత సిద్ధం కాగా, ఆమె వివస్త్ర గా తమకు భోజనం పెట్టమని విచిత్రమైన కోరిక కోరతారు. ఆవిడ పతివ్రత కనుక వచ్చినవారెవరో గ్రహిస్తుంది. వారు ముగ్గురిని పసిపిల్లలను చేసి, కోరినట్లే వివస్త్ర గా అయి పాలిచ్చి వారి ఆకలి తీరుస్తుంది. ఇక ముగ్గురు తల్లులూ తమతమ భర్తలకోసం వచ్చి ఆమె కాళ్లమీద పడతారు. అత్రి,అనసూయల అనుగ్రహం తో  త్రిమూర్తులు తిరిగి తమ నిజరూపం పొందుతారు. అనసూయ,అత్రి దంపతులకు  వారి ముగ్గురి అంశలతో కుమారుడు కలిగేటట్లు వరమిస్తారు. ఆ కుమారుడే దత్తాత్రేయుడు." . 

 .....  క్యూ ఎప్పుడు కదిలిందో...మేమెలా ముందు కి వెళ్లామో.... తెలియనే లేదు. అనసూయ కథ అందరమెరిగి ఉన్నప్పటికీ... అలా స్మరించుకోవటం బాగుంది.. ఆ తల్లి, మహర్షులకు కూడా పూజ్యనీయమై మహోన్నత స్థానాన్ని పొందింది. శ్రీరాముడు  అరణ్య వాసం చేస్తూ అత్రి,అనసూయలను దర్శించినపుడు, అనసూయ, సీతకు పతివ్రతా ధర్మాలు ఉపదేశిస్తుంది.

 ఇంతలో వెనకనుంచి ఒకరిద్దరు ఆడవాళ్ళు, మహరాష్ట్రీయలు కాని, అటవీ ప్రాంతం వారి లా ఉన్నారు. పూనకం వచ్చినట్లు అరుస్తూ మమ్మల్ని దాటుకు ముందుకి వెళ్లారు. మా వంతు దర్శనం వచ్చింది . ఇక్కడా, అమ్మవారు ...కేవలం ముఖం మాత్రమే ఉంది.  ఇక పోతే, గుడి ఆవరణలోనే అత్రి మహాముని ఆశ్రమ ప్రదేశం అంటూ అక్కడ ఒక లింగం చూపారు. మా ఆలోచనలు తెలిసినట్లు గా శాస్త్రి గారు, స్థల మహత్యం తప్ప విగ్రహాలకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదంటూ చెప్పుకొచ్చారు... అంతే కదా అనుకొన్నామంతా.
 ‎
శ్రీ గురు దత్తుల ఆలయానికి వెళ్లాం తర్వాత. మాహూర్ లోనే దత్తాత్రేయ స్వామి జన్మించాడని భావిస్తారు. శ్రీ దత్తాత్రేయ లు తిరిగి శ్రీపాద శ్రీవల్లభునిగా ఆంధ్ర ప్రదేశ్ లోని  పిఠాపురంలో రెండవ అవతారంగా ను, మూడవ అవతారంగా మహరాష్ట్ర లో శ్రీ నృసింహ సరస్వతులు  గాను జన్మించినట్లు చెప్పబడింది. షిరిడి సాయిబాబా కూడా దత్తావతారమేనని భావిస్తారు.

అటునుండి వచ్చాక మా హోటల్ రూమ్ ఖాళీ చేసి..ఏకవీరికా  అమ్మ వారి ఆలయానికి వెళ్లాం. పొలాల మధ్య ప్రశాంత వాతావరణం లో ఉంది ఆలయం.  కాకపోతే ఈ ఆలయం నిర్మాణ దశలోనో..మరమ్మత్తులో ఉంది.  పూజలు, హారతులు చేస్తున్నారు బయటనించే. అంతా అక్కడ కూర్చుని లలిత చదువుకొని, పూజ చేయించాం. 
లోపల ఉన్న అమ్మవారు కేవలం ముఖం మాత్రమే ఉంది. అష్టాదశశక్తి పీఠములలో ఎనిమిదవది అయిన శ్రీ ఏకవీరికాదేవి శక్తి పీఠంగా భక్తులు కొలుస్తారు. అసలు కొండ మీద ఉన్న రేణుకాదేవి నే శక్తి పీఠం గా అక్కడ చెప్తారు కొందరు. ఇక్కడి స్థలం అమ్మవారి ‘కుడి చేయి’ పడిన స్థలంగా ఇటీవలే గుర్తించారని అక్కడి పూజారి చెప్పాడు. ఇంతకు ముందు అనుకొన్నట్లుగా స్థల మహత్యం ఒకటే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. విగ్రహం ఓ గుర్తు మాత్రమే.

 మాహూర్ కి నాలుగున్నర గంటల ప్రయాణ వ్యవధిలో అవుంధ నాగనాధ్ (Aundha Nagnadh) ఆలయం చూడాలని నిర్ణయం. అనుకొన్న టైమ్ కంటే ఆలస్యం అయింది. అవుంధ్ లో ఆగి పర్లి వెళ్ళే సరికి మరీ లేట్ అవుతుందేమో...అర్ధరాత్రి మా బస ఏర్పాటు సమస్య కావచ్చని ఆందోళన చెందామంతా.  అయినప్పటికీ, కాస్త దారిలో చెరుకు రసం తాగి, బెల్లపచ్చులు, బెల్లపు పానకం బేరాలాడి..కాని కదల్లేదు.

అవుంధ్ చేరేసరికి సాయంత్రం నాలుగు.  కాస్త క్యూలో నిలబెట్టాడు దేముడు. ఇది కూడా జ్యోతిర్లింగమే. పాండవ వనవాసం సమయంలో యుధిష్టురునిచే ప్రతిష్టించ బడిన లింగం ట. ఏడు అంతస్తులుగా ఉన్న ఈ మందిరాన్ని ఔరంగజేబు కాలంలో కూల్చబడింది ట. (వికిపిడియా).
అయినా లోపల ఓ రెండు మెట్లు కిందకి దిగాలి..చిన్న గుహ లా ఉన్నచోట శివలింగం, పానుపట్టం ఉన్నాయి. కాని దిగలాంటే ఓ మనిషి పట్టే చోటే ఉంది..చేతిలో మారేడు దళాలు పూలు శివలింగంపై ఉంచి ,కొద్దిగా దక్షిణ సమర్పించుకొని దర్శనం చేసుకొన్నాక, తిరిగి పైకి ఎక్కిరావడం కూడా ఇబ్బందే...కాని అదొక అనుభవం. బయటకు వచ్చాక ఆలయ శిల్ప సంపద పురాతనమైనది గాను, ప్రత్యేకంగా ను అనిపించాయి. అంతా ఫోటో లు తీసుకొన్నాం ‌...చేతి లో ఉన్న మొబైల్ ఫోన్ కెమెరాలే.

ఇక ఆగకుండా పర్లి వైపుకు పరుగెత్తించాం మా వాహనాన్ని పర్బని మీదుగా ప్రయాణం. పర్లి చేరేసరికి రాత్రి తొమ్మిది అయింది. అక్కడ ఆలయానికి దగ్గర్లో భక్తసదన్ లో మాకు ఎకామడేషన్ దొరికింది. మేం భోజనాలు చేసి వచ్చేసరికి.. ఓ పూజారి మాకోసం కాచుకొని ఉన్నాడు ..మర్నాడు అభిషేకాలు కోసం. అభిషేకానికి ₹250/- ట. వెంటనే ఒప్పేసుకొని మర్నాడు ఉదయమే రమ్మన్నాం. 

*28/01/2018*

అనుకొన్న సమయానికి అంతా గుడికి నడిచే వెళ్లాం. పూజారి గారి సాయం తో అభిషేకాలు.. ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు మిగతా పూజారులు కూడా. ఇక్కడ ఒక  విషయం ఉంది వైద్యనాధ జ్యోతిర్లింగం గా చెప్పబడే వి ఇంకా రెండున్నాయిట. ఒకటి జార్ఖండ్, మరొకటి హిమా చల్ ప్రదేశ్ లోను.(అంతర్జాలం చెప్పింది).  అయినా నా లెక్కలో ఇది జ్యోతి ర్లింగ దర్శనమే. ఆలయ ప్రాంగణంలో ఫోటోలు నిషిద్దం. సగ్గుబియ్యం కిచిడి ప్రసాదం బాగుంది. బయటకొచ్చి బ్రేక్ ఫాస్ట్ చేసి తిరుగు ప్రయాణంలో పడ్డాం. దారిలో *అంబాజోగాయ్*  లో *యోగేశ్వరి* ఆలయం ఉంది చూసి వెడదాం అని శాస్త్రి గారు సూచించారు. ఆయన మహరాష్ట్ర ప్రాంతం లో పనిచేసి ఉన్నందువల్ల ఈ ఆలయలాన్నీ లోగడ చూసి ఉన్నవే. అమ్మవారు దుర్గాదేవి బాలికా రూపం లో ఉంటుందని ... అడిగితే అక్కడి పూజారి చెప్పాడు.  తిరిగి ప్రయాణం లో పర్బని లో ఆగి చక్కటి లంచ్ చేశామంతా.
ఆఖరి మజిలీ...జహీరాబాద్ దగ్గర పడుతూండగా సంధ్య, మరో మితృరాలు  సంగమేశ్వర ఆలయం కూడా చూడాలని కోరారు. నిజమే కదా, మళ్ళీ ఇటు వచ్చి చూడాలంటే ఎన్నాళ్లకి వీలవుతుందో. మన దగ్గరలో ఇంత పురాతనమైన ఆలయముందా అనుకొన్నా అక్కడికి వెళ్లాక. శ్రీ కేతకీ సంగమేశ్వరుల  ఆలయం. గుడి తెరిచే ఉంది. చక్కగా పూజ చేయించారు.ఆ గుడి ప్రాంగణంలో అమృతగుండం అనే తటాకం ఉంది. అతి పవిత్రమైన ఆగుండంలో నీరు సర్వ రోగ నివారిణి అని పురాణం. పునర్ దర్శన ప్రాప్తి రస్తు అంటూన్న ఆలయం పై రాతలు చదువుకొని ఇంటిముఖం పట్టాం.

ప్రయాణం లో చిన్నచిన్న విశేషాలు. పగలంతా ప్రయాణం కదా. కూడా తెచ్చుకొన్న బ్రడ్,చట్నీలే కాదు పళ్లు మిగతా తినుబండారాలు... మా దంత సిరి కి ఆనందించి సహకరించాయి. మధ్యలో పూర్వపు యాత్రానుభవాలు కూడా చెప్పుకొంటూంటే..చాలా విషయాలు తెలిసాయి. ఉత్తరోత్రా చూడాలి,చూద్దామనుకొన్న ప్రణాళికలు పంచుకొన్నాం. సహకరించిన ఆరోగ్యం.. మితృల ముందు చూపు...ఆలోచనల వల్ల మొత్తం యాత్ర సుఖవంతంగాను,అర్ధవంతంగాను పరస్పరాభినందనలతో  సాగింది

ఇలా  చిన్నదైనా ఫలవంతమైన మా యాత్ర విశేషాలు చదివిన వారికి ఏమాత్రం ప్రేరణ కలిగినా సంతోషమే.

No comments:

Post a Comment