గురజాడ అప్పారావు కధలు
మతములన్నియు మాసిపోవును.
జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును
కిందటి నెల సెప్టెంబర్ 21న, గురజాడ అప్పారావు గారి జయంతి నాడు, ఎప్పుడో చదివిన ఓ కధ ఒకటి గుర్తుకు వచ్చింది. నా పుస్తకాల రాక్ వెతికి తే..ఇదిగో 'గురజాడ రచనలు' అనే ఈ కధల పుస్తకం కనపడింది.
దాదాపు వందేళ్ల నాటి కధానికలు...అప్పుడే కాదు ఇప్పటికీ ఆధునిక కధలే! ఇందు లో మొట్టమొదటి తెలుగులో 'ఆధునిక కధ'అని చెప్పబడే 'దిద్దుబాటు' అనే కధ రెండు వెర్షన్స్ ఉన్నాయి. మెటిల్డా, మతము- విమతము, సౌదామిని( అసంపూర్తి కధ). దాదాపు అన్ని కధల్లో సంఘం లో దురాచారం పై వ్యంగ్యాస్త్రం సంధించారు.
అందులో నేను ఎంచుకున్న కధ పెద్ద కధ..
' మీ పేరేమిటి' లేదా
'దేవుడు చేసిన మనుషుల్లారా...మనుషులు చేసిన దేవుళ్లారా...
మీ పేరేమిటి?'
హిందూ మతం లోనే శైవులకు వైష్ణవులకు మధ్య మతపరమైన వైషమ్యాలు ఇలా ఉండేవా అనిపించింది మొదట చదివినపుడు.
మాటా మాటా అనుకోవడం..ఆ తర్వాత సర్దుబాట్లు. ఇవన్నీ లౌకికవాద రాజకీయాలే.
గురజాడ వారు కదా....మనుషుల లో మౌఢ్యం ఎంత దూరం వెడుతుందో ...హాస్యం,రవంత వ్యంగ్యం,నాటకీయత..జోడించి మరీ రాశారు. ఆయన కధనం లో ప్రత్యేకత అదే. ఇక పోతే
కొన్ని పదాలు నాకు కొత్తగా అనిపించాయి.
ఉదా. సాతాన్లు అని చదివినపుడు నాకు తెలియ లేదు. వికిపిడియా ఉపకరించింది.
**(సాతానులు వైష్ణవమత సంప్రదాయానికి చెందిన వారు. శైవం, వీరశైవం ఆంధ్రదేశంలో విజృంభించిన తరువాత తెలుగుదేశంలో రామానుజుని వైష్ణవం ప్రవేశించింది. వైష్ణవ దేవాలయాల్లో గుడి సేవకులుగా ఒక శూద్ర వర్గం ఏర్పడిందనీ, వారినే సాతానులంటారనీ, ఆరుద్ర గారు ప్రజాసాహితీ సంచికలో ఉదహరించారు. ...వికిపిడియా)
స్థూలంగా ఈ కధ చెప్పటానికి ప్రయత్నిస్తాను.
' బౌధ్దులు యెషువంటి వారు శాస్తుల్లుగారూ?'
రామ్మూర్తి అడిగాడు బౌద్ధ మతం పైన గురువు గారి ప్రసంగం వింటూ.
సోక్రటీస్ శిష్యులలాగా శాస్తుల్లుగారి కి కొంతమంది శిష్యగణం వుంటారావూర్లో. ఈ కధ ఉత్తమపురుష...అంటే 'ఫస్ట్ పర్సన్' లో చెప్పబడింది.
శాస్తుల్లుగారు సంస్కృతం, తర్కశాస్త్రాల లో పండితుడు.
రిటైర్ అయ్యి పింఛను పుచ్చుకొంటూ, రకరకాల వృత్తులలో స్థిరపడి అదే ఊర్లో ఉంటున్న తన శిష్యుల కి క్లాసులు తీసుకొంటూ కాలం గడుపుతూ వుంటారు. సాధారణంగా ఈ సమావేశాలు అందరిలో మోతుబరి, వ్యవసాయ దారుడు అయిన రామ్మూర్తి కి చెందిన పూల తోటలో జరుగుతుంటాయి. ఆ రోజు బౌద్ధ మతం విషయమై ఆయన ఉపన్యాసం. రామ్మూర్తి దగ్గరున్న బుద్దచరిత్ర అడిగి తీసుకుని చదువుతాడు..అది చదివాక..అంటాడు..
'తప్పకుండా ఈ మహానుభావుడు శ్రీ మహావిష్ణు అవతారఁవేన్రా' అని. అలా బుద్దుడిని చదివాక..మాష్టారు బౌధ్దులని తిట్టడం మానేశాడట. కానీ, క్రైస్తవులని అంటూ వచ్చాడుట. అయితే క్రీస్తు శ్రీమహావిష్ణువు పదకొండవ అవతారం గా చెయ్యడం చాతగాక ఊర్కొన్నాం అంటూ చమత్కరిస్తాడు మన కధకుడు.
ఇలా ఈ గురు శిష్యుల సమావేశాలు జరిగినపుడల్లా..... ఓ స్వర్గ ఖండం ఒకటి అకడ దిగినట్టు ఉంటుందిట. అసలు కధ ఇది కాదు. ఇది prelude మాత్రమే..!
వారి వూరికి కొద్ది దూరంలో ' రామగిరి' అనే విష్ణు క్షేత్రం ఉంది. అక్కడి నల్లకొండలలో శిధిలమై న బౌద్ధ కట్టడాలున్నాయి..కాని, అక్కడి వారు వాటిని పాండవుల పంచలంటారు.
"ఈ దేశంలో పాండవులు ఉండని గుహలూ,సీతమ్మ వారు స్నానమాడని గుంటలూ లేవు" అంటారు రచయిత.
ఓ ఇంగ్లీషు దొర ఓ నాడు వచ్చి ..సదరు కొండల మధ్య ఉన్న దిబ్బల్లో తవ్వకాలు చేస్తుండగా, రకరకాల బౌద్ధ చిహ్నాలు బయటపడ్డాయి. ఆ వింత చూడడానికి ఈ గురు శిష్య బృందం వెళ్ళి అక్కడ శాయన్న భుక్త గారి ఇంట బస చేస్తారు.
అక్కడ గుహలో ఉన్న బుద్ధుని పాలరాతి ప్రతిమ, అందరి దృష్టి ఆకట్టుకుంటుంది. ఆ బౌద్ధ విగ్రహం శివుడనీ, దాని పక్కన ఉన్న దేవీ విగ్రహాన్ని 'గౌరి' గా భావించి అక్కడి జంగమవారు పూజ చేస్తుంటారు. అక్కడ పూజారి శరభయ్య, తన్ని తాను వృషభావతరంగా ప్రకటించుకొంటాడు.అలా అని అంతా నమ్ముతారు కూడా.
జంగాలు శివుడు గా పూజ చేసే ఆ బుద్ధ ప్రతిమ ని దొరగారు తనకివ్వమని అడిగినా, శైవులలో పెద్దలు ప్రాణం పోయినా సరే ఇవ్వమని చెప్తారు. చేసేది లేక దొర తిరుగుముఖం పడతాడు.
కాని పూజారి శరభయ్య ఆ విగ్రహం పెరికి దొరకి చాటుగా అమ్మబోయాడు. దొర ఆవిధమైన దొంగచాటు వ్యవహారానికి ఒప్పుకోడు. మిగతా పెద్దలకు కబురు చేస్తాడు. శరభయ్య మాత్రం అక్కడ నుంచి పారిపోతాడు.
'బుద్ధుడు విష్ణ్వతారం కదా ఈ జంగాలు శివుడని ఎలా పూజ చేస్తున్నార్రా?'
గురువు గారి సందేహం.
శాయన్న భుక్త గారింట డాబా మీద చేరిన వీళ్లంతా సమవేశమై బౌద్ధ క్షేత్రం గురించీ, గత కాలపు స్థితిగతులు, చర్చ చేస్తారు. అపుడు శాయన్న భుక్త దానికీ ఓ కధ ఉందంటాడు. అదే ఈ కధ.
శైవులు, వైష్ణవులు తమ తమ మతం గొప్పదని దురహంకారంతో కాదు.. మూర్ఖత్వం తో ఏదో చేయ బోయి అభాసు పాలైన ఆ ఊరి కధ..కడమకు ఎలాదారి తీసిందో..!
జంగాలకు,దేవంగులకూ, పూజారి శరభయ్య నందీశ్వరుడి అవతారం. విగ్రహం అమ్మచూపడం కూడా ఆ దొర పూర్వ జన్మలో పరమేశ్వరుడని.....ఆ కారణంగా విగ్రహం అతనికి చేర్చే ప్రయత్నం జరిగిందనీ కధనం. వాళ్ల మూఢ భక్తికి ఆశ్చర్య పడుతూ, ఈ ప్రపత్తి పండితులకుండదు అనుకొంటారు అంతా. కాని ఆ మూఢ భక్తే ప్రాణాంతక మవుతుందని శాయన్న భుక్త జరిగినది చెబుతాడు.
ఇలా బుద్ధుని ప్రతిమ ను శివుడిగా చేసి పూజించే శివస్థలం ఒకవైపు ఉండగా, మరో వైపు విష్ణుస్ధలం.. కూడా ఉంది.
అప్పటికే రెండువందల ఏళ్ల కింద ఓ మహారాజు విష్ణు స్థలం కట్టించి, ఒక గ్రామం అందుకింత ధారాదత్తం చేస్తాడు. ఆ ఆలయ ధర్మకర్తలు రంగాచార్యులు, వారి కుటుంబం.. రంగాచార్యులు వారి కొడుకు కృష్ణమాచార్యులు, కోడలు నాంచారమ్మ. నాంచారమ్మ ది పండిత వంశం. జ్ఞానవంతురాలని కూడా చెప్పుకుంటారు.. ఇల్లూ దేవాలయం భాద్యతలు చక్కబెట్టే సమర్ధురాలు కూడా.
శాయన్న భుక్తగారీ వివరాలు శాస్తుల్లుగారు, వారి శిష్యులకీ చెప్తూ..అక్కడి సంగతులు ఇంకా తెలియాలంటే మర్నాటి దాకా ఉండమని చెప్తాడు.
వైష్ణవ పక్షానికి కెప్టెన్ *సాతాని మనవాళ్లయ్య. శైవ పూజారి శరభయ్య వృషభావతారం అయినపుడు, తాను గరుడాళ్వారి నఖముల తేజస్సు కలవాడిగా చెప్పుకొంటాడు మనవాళ్లయ్య. సాతాన్లు చాలామంది ఇయన శిష్యులే అయినా, వారి లో ఐకమత్యం లేకపోవటంతో అతన్ని అవతార పురుషుడని చెప్పరు.
మతపరమైన గొడవల్లో అయ్యవార్లు(రంగాచార్యులు) కలగ జేసుకోరు కాని, మనవాళ్లయ్య అవతార వ్యవహారానికి పిలిచి చివాట్లేస్తాడు.ఆ చీవాట్లు తినీ అంటాడుట కదా
'యీ బ్రాహ్మణులదీ...జ్ఞానమూ కాదు,అజ్ఞానమూ కాదు. కడజాతి మనుషులే భక్తి ప్రభావంచేత ఆళ్వార్లు అయి ఉండిరి కదా? ఇంత కాలవాఁయి రాముడి ధ్వజమును జయప్రదంగా మోస్తూ... శైవ సంహారం చేసిన శ్రీ మద్గరుడాళ్వారి నఖాగ్రం యొక్క అవతారం ఏల కాను?'
ఆ మాటకు వెంకయ్యనే శిష్యుడు, 'పాత రోజులైతే వీళ్లే అవతారలయిపోదురు. వీరి పేరిట బొమ్మలు నిలిపి దేవాలయాలు కట్టి పూజ చేద్దుం.' అని వ్యాఖ్యానిస్తూ, 'మరి బుద్దుడూ మనిషే గదండి' అంటాడు. సరిసరి అన్నీ ఒకటేనా అంటూ అతని మాట కొట్టిపారేస్తారంతా.
అలాగే ఆ ఉర్లో మరో నాయళ్ల వర్గం. కాస్త ఉన్నవాళ్లే అంతా.
ఓ దక్షిణ దేశపు అయ్యవార్లువచ్చి నాయుళ్లందరికీ చక్రాంకితం చేసి వైష్ణవమిస్తాడు.
ఆ ఊరి మునసబు రామానాయుడు. కొంచెం భోజనప్రియుడూ, మందు ప్రియుడూను. ఆ తాలూకాలో కెల్లా ఆ ఊళ్ళో నే పెద్ద సారాయి దుకాణ ఉందిట. అక్కడి వాళ్లని అంచనా వేయొచ్చు!
మునసబు కొంత మూర్ఖుడు కూడా. కానీ, గుళ్లో ప్రసాదమైన పులిహోర, వైష్ణవమూ ఏక కాలంలో గ్రహిస్తాడు.
సారధి నాయుడని మరో మోతుబరి ఈ ప్రసాదాల కి వనరులు సమ కూరుస్తూంటాడు. అలా ద్వాదశి అంటే పెద్ద పండగే వాళ్లకి.
ఇలా నాయుళ్లంతా వైష్ణవం పుచ్చుకోవటం నచ్చదు పూజారి శరభయ్య కి. అప్పట్లో నే హైదరాబాదు రాజ్యం నుంచి శివాచార్యులు ఆ ప్రాంతానికి వచ్చారు. శరభయ్య వేసిన ఎత్తేమో రోజూ అర్ధరాత్రి శివార్చనలు,శంఖాలు, జయఘంటలు! ఇలా ఊళ్ళో జనాలకి భయోత్పాతం కలిగించారు ట.
ఈ అట్టహాసానికి వైష్ణవం పుచ్చుకున్న నాయుళ్లు, ఒక్కక్కరే నామాలకి నామం పెట్టి,విభూది రుద్రాక్ష ధారణ చేయడం మొదలు పెట్టారు. ఇంక సారధినాయుడుని మార్చాలంటే, శివాచార్లు గుండం తొక్కడం అనే పెద్ద యత్నం తలపెట్టాడు.
ఈ విషయం విన్నాక కూడా అయ్యవార్లు చలించలేదు సరికదా,..'వైష్ణవుడు, శైవుడు కావాలని కోరితే,అడ్డి ఏమి ప్రయోజనం... ఏ మతమైనా ప్రపత్తి ఉన్నవాడికి తోవ ఉంటుంది. అది లేకుంటే వైష్ణవుడైనా కార్యం లేదు' అంటూ నిర్లిప్తత చూపించాడు..ఈ ఉదాసీనత మిగతా వాళ్లకి నచ్చదు
'ఈ బ్రాహ్మడికి వైష్ణవాభిమానం తక్కువ. కనక మనం విజృంభిస్తేనే వైష్ణవ మతాని కి తిరిగి గౌరవం వస్తుంది' అని మనవాళ్లయ్య ప్రగల్భాలు చెప్పి, శివాచార్యులు గుండం దొక్కే నాటి రాత్రికి....కోవిల దగ్గర రావిచెట్టు కింద ఓ పెద్ద మీటింగ్ చేశాడు. సాతాన్లు,నాయలు వందలకు జమ అయ్యారు.
వాళ్ళు చేసిన పనే మనమెందుకు చేయరాదు అంటాడు గరుడాళ్వారి అవతారం అయిన మనవాళ్లయ్య. వాళ్ల కంటే పెద్ద గుండం తయారు చేద్దాం, రాగి ధ్వజం చేతబట్టుకొని మనవాళ్లయ్య గుండం తొక్కితే సరి అంటారు తతిమా వాళ్ళు. ఈ పనికి అభ్యంతరం ఉన్నవాళ్లసలు వైష్ణవులు కాదని కూడా తీర్మానిస్తారు.
ఇక మనవాళ్లయ్య నోరెళ్లబట్టే పని! తాను నిజంగ గరుడాళ్వారు అయితే ఎగిరిపోనా అనుకొంటాడు...ఏం లాభం..లౌక్యం గా తప్పుకోటానికి మరొకరి పేరు చెప్తాడు.ఊహు కుదరదు. రామానాయుడు అతడ్ని హెచ్చరిస్తాడు.. సారధినాయుడే జంగాలలో కలసిపోతే..పులిహోర చక్ర పొంగలి ఎలా.. ఇహ తప్పలేదు మనవాళ్లయ్య కు. శివాచార్యులు నెత్తిన వీరభద్రుని విగ్రహం ..శంఖం ఊదుతూ గుండం దాటినట్లే...తనుక్కూడా నెత్తిన రామస్వామి ఉత్సవ విగ్రహం పెట్టాలంటాడు. ఆమట్న..అయ్యవార్లను ఉన్నపళంగా పిల్చుకొస్తారు...
విషయం తెలిసి రంగాచార్యులు గుండం తొక్కడం వైష్ణవ విరుద్ధం ..అంటాడు.
కాని మునసబు ఊర్కొంటాడా...
'శక్కరం తొటి వొళ్లల్లా తెగ్గాల్చడానికి మంతరం కద్దా! అట్టే మాటలు శలవియ్యక, ఆ యిగ్గరమేదో సాతానోడికియ్యండి'
తేల్చి చెప్పేస్తాడు... దానికి రంగాచార్యులు ఉత్సవవిగ్రహాలు శూద్రులు ముట్టుకోకూడదు ఇవ్వనంటాడు. ఇకనేం మనవాళ్లయ్య కు జీవం లేచొచ్చింది. తాను విగ్రహం తాకకూడదు కాబట్టి, రంగాచార్యులు ముసలాయన కాబట్టి అతని కొడుకు కృష్ణమాచార్యులు ఆ పని చేయాలంటారు. అందుకాయాన ఒప్పుకోడు. తనే సిద్దమౌతాడు చేసేది లేక.
అప్పుడు అకస్మాత్తుగా అక్కడికి ఒక చేత కరదీపము, రెండవచేత సూరకత్తి పట్టుకొని ..ఉంగరాల జుత్తు గాలికి తూగులాడుతూండగా...చెట్టు చాటునుంచి వస్తుంది నాంచారమ్మ. రంగాచార్యుల కోడలు. ఆరూపం చూసే బెదరుతారు అంతా. వస్తూనే ఆయన రెక్కలు పట్టుకొని ఉన్న నాయళ్లకు బాకు మొన చూపి ఆయన్ని వదలమని బెదిరిస్తుంది. అంతా బెదరి దూరం జరుగుతారు.
అసలీ గుండం తొక్కడమేమిటి..ఎందుకు..ఒక సారధి నాయుడు మతం మారితే తమకు దక్కని పులిహోర, చక్కెరపొంగలేనా లేక వైష్ణవ మత ఉద్ధరణకా..వరుసగా ప్రశ్నించీ,తర్కించీ ముసలాయనను అగ్ని గుండం తొక్కించే బదులు తనే వస్తాను వెంటెవరు వస్తారూ...అంటే, ఒక్కరూ మాటాడరు. ఆ మట్నే పీరు సాయిబు ని పిలిచి, గుండం తొక్కగలవా అంటే ..నిస్సందేహంగా అంటాడతను.
పీరు సాయిబు..దూదేకుల సాయిబు..రామభక్తుడు కీర్తనలు చెపుతాడు..అతని సంసిద్ధత చూపి..ఇప్పుడు చెప్పండి.. మీ వైష్ణవ మతం గొప్పా? అతగాడి తురక మతం గొప్పా? అని నిలదీస్తుంది నాంచారమ్మ. సరే ఇక ...మీకేం కావాలి ...ఇపుడు శైవులకి పరాభవం జరగాలి. అంతే కదా అని అడిగి..తానో ఉపాయం చెప్తాను అంటుందామె.
శైవుల్లో శివాచార్లు లా గుండం తొక్కడానికి వైష్ణవులలో కూడా ఓ తెగ ఉన్నారు తెలుసా.. వారే తురకలు...పీరు సాయెబులు..అసలు పీరు అంటేనే స్వామివారి తిరునామమే.
అసలు పట్టణం లో హిందువులే పీర్ల పంజాలు ఉంచి గుండం తొక్కుతారు. ఇపుడీ పీరు సాయిబు..కబీరు దాసంత భక్తుడు ...ఇతడే గుండం తొక్కుతాడు..మీరంత అతని వెంట వెళ్ళి జయించుకు రండి అని చెప్తుందామె...
చివర మాటో చురక.. '
వేళకి భక్తి నిలుస్తుందో నిలవదో, చేతి కర్రలు మాత్రం మరవకండి' అని సలాహా కూడా.
ఆ తెల్లవారు ఝామున శివాచార్లు కణకణలాడే నిప్పుగుండం ఏర్పాటు చేసుకొన్నపుడు అకడికి శాయన్న గారు కూడా వెళ్లానంటాడు. శివాచార్లు గుండం దాటి అభిముఖంగా తిరిగాడో లేదో...'అల్లా-రామ్' అంటూ అరుస్తూ ముందు వెండి పీరు తో
ప్రవాహంగా అటునుండి గుండం దాటుకు సాగిపోయారు కొందరు. అంతా అరనిముషం సేపే. ఇరు పక్షాల కొందరికి కాళ్ళు కాలినా అది భక్తి లోపం కింద జమకట్టారు.
శరభయ్య కీ మనవాళ్లయ్య కు రాజీ కుదిరింది అంటారు కాని పైకెపుడూ దెబ్బలాడుకొంటూనే ఉంటారట.
అదిగో అప్పట్నుంచీ ఆ రచ్చ సావిట్లో నిలిపిన ఆ పీరు తో ఊర్లో పీర్ల పండగ చేస్తారు శైవ వైష్ణవ భేదం లేకుండా.శాయన్న భుక్త తన కధ పూర్తి చేశాడు.
శాస్తుల్లుగారు, అంతా విని కలికాలం లో మనుష్యలే కాదు దేవుళ్ళు కూడా సంకరం అవుతున్నారని వాపోతాడు.
' అయినా తప్పేమి? శివుడన్నా,విష్ణన్నా, పీరన్నా, బుద్ధుడన్నా ఆ పరమాత్మ ఒక్కడే కదా.. '
No comments:
Post a Comment