'ఎల్లో రిబ్బన్' మోహ లేఖలు.
–కుప్పిలి పద్మ
చినుకు చినుకు నడుమ
చిన్న చోటేదో వుంది
నీకో లేఖను రాయమంటోన్నాయి.
ఉత్తరాలు రాయడం ఒక కళ. అందు లో కవులు, రచయితలు రాసే ఉత్తరాలు ప్రత్యేకం. కుప్పిలి పద్మ గారి మోహలేఖలు చదువుతుంటే, చలం గారు, తెన్నేటి హేమలత గారు గుర్తు కి వస్తారు.వారికి దాపరికాలు లేవట. అటువంటి స్వేచ్ఛా యుత కవితాగానం కుప్పిలి పద్మగారు మళ్ళీ రుచి చూపించారు!
సున్నితంగా, నెమలీక తో సుతారంగా రాస్తూన్నట్టున్న ఈ మోహలేఖలు, ఆవిడ అన్ని ఇష్టాల్లాగే మంచి కాఫీ తాగినంత ఆనందంగా చదివాను.
హిమాలయాలలో మొదలుపెట్టి, మోహపు గోదావరి ఒడ్డుకు లాక్కొచ్చీ.. వెన్నెలా, వానా చూపించి ఆ అనుభూతి ని జాతీయం చేసారు. కడియం పంటకాలువ వెంట నడిచిన అనుభవం లో వాస్కోడిగామా ఫీలయ్యారట. అనుభవం తనది మాత్రమే అయినప్పుడు అది డిస్కవరీ నే కదా..
ప్రతయాణాలు.. ఒంటరి ప్రయాణాలంటే ఆసక్తి. క్వీన్ సినిమా లో కంగనా చేసిన ఒంటరి ప్రయాణం అంటే ఇష్టం. స్త్రీ లు ఒంటరిగా ఎందుకు ప్రయాణం చేయరూ అని తన చిన్నప్పటి కల్పిత కథలో తప్పిపోయిన జింక పిల్లను వెతుక్కుంటూ బయలుదేరిన ఒక రాణి పూటకూళ్ల ఇంట్లో బసచేయడం బాగుంది కదా. అయితే ఒంటరి గా ప్రయాణం ఓ మిథ్ అంటారు. మనషులు కావాలి. అయితే... ఎవరి ఇన్నర్ జర్నీ వారికి ఉండాలి అంటారు.
ఇన్నిన్ని విషయాలు చేరవేస్తూ, మాటల్లో పెట్టలేనంత ఆపేక్ష అక్షరాల్లో కి పొదుగుతూ.. తనకు ఎదురయ్యే అనుభవాలను నెరేట్ చేస్తూ.. నువ్వుంటేనా అని సహచరుని ఎడబాటు ను గుర్తు చేసుకుంటూ మురుస్తూ, మురిపిస్తూ ఆహ్లాదం గా సాగిన లేఖలు ఇవి.
అంతటి భావావేశానికి అడదడపా చిన్న బ్రేక్ పెట్టి, ప్రస్తుతం లోకి వస్తూ అనేక సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ, వాస్తవిక చిత్రీకరణ చేస్తూనే రొమాంటిక్ టచ్ చెదరకుండా.. బాలన్స్ చేశారు. అదే ఆవిడ ఈ రచనలో 'మేజిక్'. కేవలం మోహావేశాన్నుంచి.. ఒక మెట్టు ఎక్కువేనేమో అనిపించిన తాత్విక రచన.

No comments:
Post a Comment