"బాబాను(శివుణ్ణి) నీ గురువు గా భావించు. "
#విశ్వనాథుడు.
సానందమానందవనే వసంతం, ఆనంద కందం హతపాప బృందం |
వారణాసీ నాథమనాథ నాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే ||
కాశీకి ఆనందవనమనే పేరు ఉన్నదనీ.. ఎటువంటి ప్రళయ కాలం లోనూ... పరమశివుడు తన త్రిశూలంతో ఎత్తి ఉంచే క్షేత్రమనీ.. అందువలన కాశీని అవిభక్త క్షేత్రం అనీ అంటారని 'కాశీ ఖండం' లో చదివాను.
పార్వతీ పరమేశ్వరులు నిత్యం కొలువుండే క్షేత్రమైన కాశీ క్షేత్రం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సినది ఉంటూనే వస్తున్నది. కాశీ లో ..అక్కడి ధూళి లో.. ప్రతి రేణువులో గొప్ప కాంతి వుంటుందని అందుకే కాశీ(వెలుగు) అయిందని అంటారు.
ఇది మూడవ సారి కాశీ క్షేత్రం వెళ్లడమైతే, తొమ్మిది రోజుల కాశీ వాసం రెండవ సారి. కాశీ వాసం పేరుతో తొమ్మిది నెలలు ఉంటారు చాలా మంది. కనీసం కార్తీకమాసం నెల రోజులు ఉంటారు.
సత్రం లో ఉంటూ సాత్వికాహారం తో నూ .. గంగా స్నానాలు, శివదర్శనం.. ఇంకేం ఆలోచనా రాదు ఆ సమయంలో..
ఇదేకదా కావలసినది అనిపించింది.!
ఔరంగజేబు కాలం లో పూర్తిగా ధ్వంసం కావించబడిన కాశీ విశ్వనాథ మందిరం .. తిరిగి పదిహేడవ శతాబ్దం లో అహల్యాదేవి హోల్కర్ తిరిగి పునరుద్దరించారు. ఇటీవలి పునర్వ్యవస్థీకరణ లో ఆలయం దగ్గర ఆవిడ విగ్రహాన్ని పెట్టడం సంతోషకరమైన సంగతి.
ఈ సారి కాశీ ఆలయం వెలిగి పోతోంది. కాశీ లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విశ్వనాథుడి ఆలయ ప్రాంగణం విశాలం చేసారు. జ్ఞాన వాపిని వేపు తిరిగి ఉన్న నందీశ్వరుడుని కూడా చక్కగా అలంకరించారు.
ప్రధాన ద్వారం నుంచి లలితా ఘాట్ వరకు ఆధునీకరించారు. ఆవరణ లో అహల్యాబాయి, ఆది శంకరుల విగ్రహాలతో చాలా ఆహ్లాదకరంగా వుంది . అక్కడే ఓ పక్కన అన్ని సౌకర్యాలతో ఫుడ్ కోర్ట్ లు కూడా ఏర్పాటు చేసారు.
ఒక రోజు సాయంత్రం స్పర్శ దర్శనం, అభిషేకాలు అన్నీ అయ్యాక, లలితా ఘాట్ కిందకి దిగి.. అలా నడచుకుంటూ దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర ఇచ్చే 'గంగా హారతి' చూసి వచ్చాం. చాలా సంతృప్తిగా అనిపించింది.
కాశీ యాత్ర చేసిన ప్రముఖుల రచనలు చదివినప్పుడల్లా.. నాకు తెలియని మిస్టికల్ ప్రపంచం పట్ల నమ్మకం పెరుగుతూ వస్తోంది.
మీర్జా గాలిబ్
ఢిల్లీ నుండీ వస్తూ అనారోగ్యం వలన కాశీ లో అగవలసి వచ్చిందిట. చిత్రంగా.. అక్కడ కొన్నాళ్లు ఉండగానే కోలుకోవడమే కాదు, కాశీ పట్టణం పైన మక్కువ పెరిగి.. పెర్షియన్ భాష లో కొన్ని గీతాలు రాసాడాయన. ఆసక్తి కలిగి ఇంగ్లీషు అనువాద పుస్తకం తెప్పించుకుని చదివాను. నా తెనుగ స్వేచ్ఛానువాదం-
మచ్చుకి ఒకటి,రెండు.
వారణాశి కి దృష్టి దోషం
తగలకుండా
భగవంతుడు కాపాడు గాక;
ఆనందవనమనే స్వర్గ ధామం
నిలిచిందక్కడ!
బనారస్ ని చీనీ దేశం తో పోల్చారెవరో..
అదిగో.. నాటి నుండి తన భృకుటి
గంగమ్మ వొంపు లో... ముడుతలు తేలింది.
వారు-
పెదవి కదిపితే చాలు
కాశీ స్తుతి చేస్తారు-
ప్రారబ్ధకర్మ నమ్మే వారి
వాళ్ల కారణాలు వారివి.
(మరు జన్మ ఉండదనే నమ్మకాన్ని సూచిస్తూ)
అక్కడ
ఎగిసి పడే ప్రతి ధూళి రేణువు
పవిత్రాలయ స్ఫురణ..
పచ్చని ముల్లు కూడా
నందనోద్యానం లా భాసిస్తుంది !
ఆహా..కాశీ ఎంతమందిలో ఆధ్యాతిక దీపాలను వెలిగించిందో కదా!
#స్పర్శ దర్శనం-
రెండవ రోజే భోజనాల తర్వాత బయల్దేరి వెళ్లాం . ఈ సత్రాలు అవీ ఉన్న చోటు అంత సన్నటి ఇరుకు సందులు.
చిన్నప్పుడు మన పెద్దవాళ్లు
కాళ్లకి రాసిన వెన్నపూస గట్టిదనం ఇప్పుడు తెలుస్తోంది.
గుడికి నడిచి వెళ్లడానికి మొత్తం అరగంట పడుతుంది. అదీ ఆగకుండా నడిస్తే.
ఆ సన్నటి రోడ్ల లో నే మోటార్ బైక్స్ రద్దీ బానే వుంటుంది.
ఈ సారి రోడ్ కి అడ్డంగా ఆవులు బైఠాయించి కనిపించలేదు. మోటార్ సైకిళ్లు రెండు వేపులా, హారన్ కొట్టుకుంటూ తిరిగేస్తున్నాయి.
రోడ్ అంతా బండలు పరచి ఉన్నా, పేరుకున్న చెత్తని శుభ్రపరచే లోగా కుక్కలు లాగి పడేసిన దృశ్యాలు చాలానే చూస్తాం.
చిత్రమేమంటే ఎంతోమంది విదేశీ యాత్రికులు ఇక్కడే.. ఈ ఇరుకు గల్లీ ల్లోనే నివశిస్తున్నారు . వాళ్ళ కోసం అన్నట్టు చిన్న చిన్న 'మోడ్రన్ రెస్టరెంట్స్' ఉన్నాయి.
విశ్వనాథుని దగ్గర మాత్రం స్క్రీనింగ్ వుంటుంది. మొబైల్స్ సరే, పెన్నులు,పెన్సిళ్ల వంటి షార్ప్ గా వుండే వాటిని కూడా అనుమతించరు.
ఉత్తరాది వాళ్ల సౌరమానం ప్రకారం కార్తీక మాసం నడుస్తోంది వారికి. రద్దీ బాగానే ఉంది. -మనది చాంద్రామానం కదా
దీపావళి అమవాస్య తరువాత కార్తీకం ఆరంభం మనకి.
ఓ రోజు;
క్యూలో దాదాపు ఓ గంట వేచి చూసాక, విశ్వనాథ గర్భాలయ ప్రవేశం..
అలా క్యూలో ఉండగా.. ఒక ఉత్తర హిందుస్తానీ స్త్రీని నా ముందు నించో బెట్టి వెళ్లింది సెక్యూరిటీ అమ్మాయి. కాసేపు వున్నాక ఆవిడ ఉన్నట్టుండి వెనక్కి తిరిగి నాతో చెప్పడం మొదలు పెట్టింది .. హిందీ లో.
"చూడూ.. బాబాను(శివుణ్ణి) నీ గురువు కమ్మని కోరుకో.. అప్పుడు నీ చేయి వదలడు."
వినడానికి బాగుంది కదా..
విని నవ్వి ఊరుకున్నా.
మళ్లీ కాసేపు తర్వాత అన్నది.
"నువ్వు నమ్మాలి.. ఏదీ నా కూడా నే చెప్పినట్టు అను.. బాబా..నన్ను నీ శిష్యురాలిని చేసుకో
నా భారం అంతా ఇక నీదే.."
ఆవిడలా తరచి..చెబుతుంటే అన్నాను.
నా పేరు అడిగి, ఆశీర్వాదం లాటి ప్రార్థన చేసిందావిడ.
మొత్తం హిందీనే.
గర్భాలయంలో చిన్న లోటాలతో నీళ్ల లాటి పాలు..
పైనుంచి జారే అభిషేక జలం..
విభూతి, గంథాల తో నిర్వికార నిరంజనుడు,
నైరూప్యుడైన భగవంతుని- కాశీనాథుని తాకి..
'స్పర్శ' లో చేతి నిండా అంటిన చిక్కని విభూతి ..!
కాస్త నుదుట దిద్దుకుని- 'మమ' అనుకోవడం లో ఓ శాంతి!
दुःख में सुमिरन सब करे सुख में करै न कोय।
जो सुख में सुमिरन करे दुःख काहे को होय ॥
సుఖ దుఃఖాల కతీతమైనదే శాంతి అంటాను.
.jpg)
No comments:
Post a Comment