కుక్కపిల్ల....
కుఁయ్... మంటూ లేచిందా.. కుక్కపిల్ల.... డొక్కలో సూటిగా వచ్చి తగిలిన రాయికి విలవిలలాడుతూ. కండలూడపెరికేంత కోపంతో కోరలు వెళ్ల బెట్టి గుఁర్్...మంది కాని, ఆ రాయి విసిరిన కుర్రాడు తుర్రుమని ఆ యింటి గేట్ తీసుకుని లోపలికి పరుగెత్తాడు .
గుర్ర్..ర్..మంటూనే....నెమ్మదిగా మూలుగుడు లోకి దిగింది దాని రాగం. నిస్సహాయంగా మళ్లీ లేచిన చోటే మరింత చదును చేసుకుని చుట్టుకు పడుకుంది. కళ్లు మూతలు పడుతున్నాయి
కాని దాని కడుపులో కరకరలాడుతోంది. అంతే కాదు అవాళ లేచినప్పటినుండీ దానికేం బాగోలేదు. ఉదయం జరిగింది తలచుకొన్న కొద్దీ దుఃఖం వచ్చేస్తోంది. ఎంత నిర్దయ యీ మనుషులకి. ముందుకాళ్లు పై తల వాల్చి.. కళ్లు మూసుకుని
.....వెచ్చని కల లోకి జారిపోయింది.
"తల్లి పాలన్నా వదలని పసికూన ఎక్కడనుంచి వచ్చిందో...
ఎంత తెల్లగా వుందో.... నుదట చూడు బొట్టు లా ఆ నల్లటి మచ్చ... ఎంత ముద్దుగా వుందో..."
యాదమ్మ తో అంది మహాలక్ష్మమ్మ..
దాన్ని అరచేతుల్లోకి తీసుకొని... అటు తిప్పి..ఇటు తిప్పి..కాళ్ల గోళ్లూ లెక్క చూస్తూ..."ఒరే బాలూ, నాకు తోడు గా ఉండి పోతావా?" నామకరణం చేస్తూనే బంధం వేసింది...గోముగా.
తెల్లటి చీర కుచ్చిళ్లు ....మెత్తటి స్పర్శ.... తెలియని వెచ్చదనం.. కుఁయ్...కుఁయ్ మంది అది సమాధానం గా.
గబగబా ఓ చిన్న గిన్నెలో లో పాలు పోసి పెట్డింది ఆవిడ...
అలా....
ఓ అసుర సంధ్య వేళ..తెలుపూ... నలుపూ కాని ముని మాపు వేళ...లో ఆ మూగ జీవి ఆ యింటి పంచలో చేరింది. పాత గొనెపట్టా..దానిపైన ఓ మెత్తటి పాత దుప్పటి....
మేడ మీద భాగం లో అద్దెకు ఉన్న భార్యాభర్తలు ఇద్దరూ బయటకు వెడుతూ. సరిగ్గా మెట్ల దిగువ ఉన్న ఈ ప్రాణి ని చూసి కనులెగరేసారు...కొద్ది అయిష్టత కలిపి.
అప్పటికింకా...కు..య్..కుయ్ మంటూనే ..వుందది.
అయితే పక్క అపార్ట్‌మెంట్‌లో వాచ్మెన్ గా ఉంటున్న యాదగిరి భార్య యాదమ్మ మాత్రం మురిసి పోయింది...ఆ చిన్ని ప్రాణిని చూసి.
'అమ్మకు యిగ సందడే సందడి' అని. యాదమ్మ మహాలక్ష్మమ్మ యింట్లో పనిచేస్తుంది. కూడా తన మూడేళ్ల కూతురు మంజు ని తెస్తుంది. యాదమ్మ పనిజేస్తున్నంత సేపూ మహాలక్ష్మమ్మ కి మంజుతో కాలక్షేపం... దాని కబుర్లు చేష్టలు ఆవిడకు వినోదం.
కాలి గజ్జెలు మోగించు కొంటూ పరిగెత్తి వచ్చింది మంజు.
అది కుతూహలం గా కుక్కపిల్ల దగ్గరకు రావడం...అమ్మో అని భయం నటిస్తూ దూరంగా పరుగెత్తడం.. రోజంతా ఇంచు మించు అదే ఆట.
"దీనికి వాక్సినేషన్ వేయించాలండీ మహాలక్ష్మి గారూ" అని
పైన అద్దెకున్న అతను చెప్పాడు ఓనాడు.
అతని సాయంతో నే ఓ ఆదివారం ఆటో లో వెటర్నరీ డాక్టర్ దగ్గర కు వెళ్లి వాక్సినేషన్ వేయించింది. మళ్లీ ఓ మూడు నెల్లో రావాలన్నారు...ఇంకా ఏవో ఇంజెక్షన్లు ట. 'స్ట్రే డాగ్' కదా అన్నాడు వెటర్నరీ డాక్టర్. బాలు కేమీ అర్థం కాలేదు కాని..తన గురించే నని తప్ప.
మెడలో అలంకారం.. పట్డీ వచ్చింది...దానికో చిన్న మువ్వ.
తెల్లని చీర కుచ్చిళ్లు..ఆనవాలు గా..మహాలక్ష్మమ్మ వెంట వెంట గునగునా తిరుగుతూ... బాలూ మెడలో మువ్వ చిరు మోత..
ఎడారి లో పూలు పూసినంత ఆనందం..
అమ్మగారు పెట్టే పప్పన్నం, పెరుగన్నం...కాకుండా ఏ ఆదివారమైనా యాదమ్మ... వాళ్లు చేసుకున్న దాంట్లో తెచ్చి వేస్తుంది ఆవిడ చూడకుండా.
అలా.... బాలు ముందు కాళ్లల్లో బలం ..పెరుగుతూండగా..దాని పరుగు అందుకోలేక ..మహాలక్ష్మమ్మ మురిసి పోతూ వీడిక పెద్దాడై పోయాడు..అంటూండేది..
చూస్తూండగానే...బాలూ... అందరికీ అలవాటు అయిపోయింది.
మంజూకి భయం పోయింది. తోక పట్టుకు లాగేటంత.
బాలు దాని తోకను అదే అందుకోవడం కోసం....గుండ్రంగా తిరుగుతుంటే.. మంజు పడీ పడీ నవ్వింది... ఇల్లంతా పందిరిలా కదలిన సందడి ... మహాలక్ష్మమ్మ కు పట్టరాని ఆనందం.
ఉన్నట్టుండి విదేశాలలో ఉన్న మహాలక్ష్మి కూతురు, కొడుకూ సకుటుంబంగా వచ్చారు. ఎదో హడావుడి... జీన్ పేంట్లూ..పొట్టి నిక్కర్లూ ఇల్లంతా వాళ్లే...!
మహాలక్ష్మమ్మ వదనం ఎందుకో చిన్నబోయింది. బాలూకి అర్ధం కాలేదు...ఆవిడ వెనకాలే మసలే బాలుని బయట కట్డేయమని ఆవిడ కోడలు ఆజ్ఞ. వాళ్ల పిల్లలని అసలు బాలూ దగ్గరకి రానీయలేదు. ఎందుకని ఆవిడ మరీ అంత మొహం మాడ్చుకుందో....! బాలూ కి ఆ కోడలు నచ్చలేదు.
బాలు చోటు బయటకు మారింది. యాదమ్మ కూతురు మంజుకు దగ్గరగా.. కాని, బాలూ కి ఇంటి లోపలికి వెళ్లాలని...ఎవరు చూసినా కర్ర చూపిస్తున్నారు...
ఆ రోజు వాళ్లంతా దాదాపు అరచుకుంటునట్లు మాట్లాడు కుంటున్నారు..
బాలు గుమ్మం లోనే తచ్చాడింది. అన్నీ దానికి అర్ధం అవుతున్నట్టే వుంది.
ఇల్లు అమ్మేద్దామని కొడుకు, లేదు డెవలప్మెంట్ కి ఇచ్చి ఫ్లాట్స్ కట్టిద్దాం ..కూతురు. వాళ్లతాలూకు ఎవరో బిల్డర్ తీసుకోడానికి సిద్దంగా ఉన్నాడట. రోజుల తరబడి చర్చలు..
చివరికి ఒప్పందాలయ్యాయి....
అందరి మొహాలు విప్పారాయి. అప్పుడు వచ్చింది బాలు ప్రస్తావన.
" ఈ వయసులో ఈ కుక్కపిల్ల తో ఎలా వేగ గలవ్ అమ్మా...." అని కూతురు.
"వేగేందుకు ఏముంది...
దానిదో చిన్న ప్రాణం... మనం తినగా మిగిలిన ఓ ముద్ద పడేస్తే, అదే 'విశ్వాసం' గా పడి వుంటుందని.."
గుమ్మం ముందు తచ్చాడుతూనే చివ్వున తలెత్తి చూసింది బాలు. మెత్తగా ...తారాడే కుచ్చిళ్లు...పైకి..పై పైకి.... అభావం... ఇంత నిర్దాక్షిణ్యంగా...!
ఏదీ... ఏమైంది ..ఇప్పటి దాకా?
చేరదీసినా, ఛీ కొట్డినా... అంతా వీళ్లే.
మాటలన్నీ అర్థం అవుతూనే వున్నాయి...
అదిగో... అప్పటి నుండి దాని మనసు మనసులో లేదు.. బయటకు పరుగెత్తింది..
యాదమ్మ వచ్చి ...అన్నం అని పిలిచినా అటు చూడలేదు. అలా పొద్దట్నుంచీ మునగదీసుకునే వుంది.
పొగమంచులా దాని మనసులో గూడుకట్టుకున్న బాధ... చీకట్లు కమ్ముకుంటూండగా ....
'బాలూ.....అన్నం తినవూ..' మహాలక్ష్మమ్మ గొంతు.. అలవాటైన గొంతు...సునాదంలా...
కూర్చున్న చోటునుండి...ఒక్కవుదుటున ఆవిడ దగ్గరకు చేరింది. కలిపిన అన్నం ముద్ద..గిన్నెలో కి జారవిడిస్తూ...బాలూని ప్రేమ గా నిమిరింది మహాలక్ష్మమ్మ.
విజృంభించి న ఆకలితో అది తింటూంటే,
"పిచ్చి మొద్దూ...ఇంత ఆకలి పెట్డుకుని.... బయట కట్టేసినందుకే ఇంత అలక...పొద్దట్నుంచి తినలేదట యాదమ్మ పెట్డినా...
నిన్ను బయట కట్టారు..నన్నేమో బయటకు పంపిస్తారట.. ఫ్లాట్లు వేస్తారట. అందాక ఎక్కడో ఆశ్రమం ట. పద నువ్వూ వద్దువు లే"
దుఃఖం తో గొంతు పూడుకు పోతుంటే చిన్నగా గొణుగుతూ చెప్పుకు పోతోంది ఆవిడ.
పెరుగు అన్నం గబగబా తింటూన్న బాలూకి మాత్రం...తెల్లని ఆవిడ చీర కుచ్చిళ్లు తప్ప మరేమీ కనిపించడం లేదు.
No comments:
Post a Comment