Thursday, 6 June 2019


ఒంటరి

రచయిత - సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి

ఫలరసాదులు గురియవే పాదపములు ;
స్వాదుజలముల నుండవే సకల నదులు;

పరీక్షిన్మహారాజు కు  ఇక వారం రోజుల్లో మరణం ఆసన్నం కాబోతోంది అన్నప్పుడు శుకబ్రహ్మ వచ్చి చేసిన బోధ..

పచ్చని గడ్డి మైదానాలు, కట్టుకోవటానికి నార బట్టలు, నివసించేందుకు సహజమైన గుహలు..  ఇంకా ఫలాలనిచ్చే చెట్లు.. స్వాదు జలాలు..  పిలిచి ఆతిధ్యం ఇచ్చే పుణ్యసతులు ఉండగా, సాధువు గా జీవించడానికి పట్టుపరుపులు, పట్టు వస్త్రాలు, మేడలూ మిద్దెలూ..  ధనం మీద తీరని ఆశ ఇవన్నీ ఎందుకు..?

ఇదే ప్రశ్న మరో రూపంలో రచయిత అడుగు తున్నాడు ఈ నవలలో.
మీ చివరి జీవితాన్ని పల్లెలో ఎందుకు గడపరూ..? మీ వృత్తి నైపుణ్యాన్ని.. మీ పై స్థాయి పరిచయాల్నీ..మీవద్ద మూలుగుతూ ఉన్న సంపదనీ పల్లె బాగు కోసం ఎందుకు వినియోగించరు..
అర్థాకలి తో మాడే పల్లెలు ఎదురు చూస్తున్నాయి..కాస్త కనికరం చూపుదాం రండి అంటూ... అందుకు చేయి పట్టుకుని ఒంటికొట్టం తీసుకెళ్తాడు రచయిత...

 అదెలాగంటే...

డా.రాఘవ కోటీశ్వరుడు. స్వయంగా డాక్టర్ అయిన ఇతను ధనసంపాదన లో పడి తన రోగాన్ని గమనించు కోడు.  భార్య పోతుంది.  కొడుకు అమెరికా లో ఉంటాడు.   యాభై అయిదేళ్ల వయసులో అనారోగ్యంతో,  'ఒంటరి' వాడు అవుతాడు. 

డా. రాఘవని.. పట్టుకొన్నది మందులకు లొంగని జబ్బు.  షుగర్ వ్యాధి, నియంత్రణ లోపం వల్ల ప్రాణాంతక వ్యాధిలా పరిణ మించింది.  అత్యవసరంగా  చిరు ధాన్యాలను, అతను ఆహారం లో చేర్చాలని ఎవరో సిద్ధ పురుషుడు సూచిస్తాడు.

అరికెల భోజనం- ఆకు నీడల్లో నివాసం
పొలం మట్టి లో నడక- పచ్చని గరిక పై విశ్రాంతి
సెలయేటి తో సావాసం-నీటిగుంటలతో సాయంత్రం
కొండకోనల్లో విహారం- కొమ్మల్లోని ఫలాల ఆహారం

ఈ అరికెలు ఎక్కడ పండిస్తారు అనే వెదుకులాట లో నల్లమల లో కాశినాయన జ్యోతిక్షేత్రం దగ్గర, ఒంటికొట్టం అనే ఊర్లో నర్సయ్య అనే డెభ్భై ఏళ్ల రైతు ని కనుక్కొంటాడు. 

చిరు ధాన్యాలు అంతరించి పోయాయి అని, ఇపుడు ఆ సాగు లేదని నిరుత్సాహ పడుతున్న తరుణంలో,  రైతు నర్సయ్య దగ్గర సొరకాయ బుర్ర లో దాచిన విత్తనాలు చూసాక  ఆశ చిగురిస్తుంది..

నర్సయ్య రాజులాటి రైతు. ధనానికి లొంగని అభిజాత్యం. డెబ్భై ఏళ్లన్న మాటే కాని,దృఢంగా, ఉత్సాహంగా ఉంటాడు. మాది కాశీనాయన ఆచారం అంటూ ప్రకృతి తో మాట్లాడుతాడు... పోట్లాడుతాడు.  చెట్లని..పశు పక్ష్యాదులని అమితంగా ప్రేమిస్తాడు. రంగనాథ రామాయణం అంటే కూడా అంతే ఇష్టం. పురాణాలు చదువుతాడు. కవి చౌడప్ప పద్యాలు సందర్భానికి జోడించి చెబుతాడు.

అరెకెలు అంతరించిపోయాయని తనవద్ద ఉన్న ఆ నాలుగు గింజలూ ఆఖరి వని తెలుకుని అశ్చర్య పోతాడు. ఇపుడు పునః సృష్టి చేయడం తనవంతని..సంభ్ర పడతాడు.  అరికెలను పండించడం ఒక సవాలు గా తీసుకొని వ్యవసాయం మొదలు పెడతాడు.

"పైరు పండే సరికి కుందేల్లు పిల్లల్జేసుకుంటాయి..జింకలు పొర్లేడతాయి. పైరు కోసేప్పుడయతే బో కుశాలగుంటాదిలే. నాలుగు కర్రల్ని పెనేసి ఏదో పిట్ట గూడు కట్టుకొనుంటాది ఆ గుమికొయ్యకుండా వదలేయాల.  బాగా మరుగున్న చోట కుందేలు పిల్లల్జేసుకుంటాది. కండ్లు కూడ తెరవని చంటి పిల్లలు.ఆ పొదనంతా తగలకుండా విడిచి పెట్టాల. పాది చేసుకొని పూరేలి గుడ్లు పెట్టుకోనుంటాది.ఆ పాదినంతా వదిలేయాలి. విత్తనాలు యిత్తినాంక కోతకే పోయేది."

రివరీ..!  ఆ రైతు తన్మయం... పంటచేలు..ఆవెనక ఆకుపచ్చని పర్యావరణం ఈ చక్రభ్రమణం చదువుతూనే మనసు పారేసుకొన్నా.   నర్సయ్య పక్షులు, జంతువులు.. అందరూ అయ్యాక మన వొంతు అంటాడు.

వర్షాభావ ప్రాంతాల్లో వ్యవసాయం ఎంత కష్టమో...  కరువు రూపం ఎలా ఉంటుందో,  దేని కోసం ప్రజలు.. ముఖ్యంగా పల్లె యువత ఎందుకు పట్టణ దోవ పట్టిందో..  మనసు కరుగుతుంది చదువుతుంటే.  అసలు ఈ రోడ్డు వేయడం వల్లే పల్లెలకి చేటు జరిగింది అంటాడు నర్సయ్య. చుట్టూ చేలు మధ్యలో ఇళ్లతో ఉండాల్సిన ఊర్లకి ..ఇళ్ల మధ్య రోడ్డు వచ్చి పల్లెని మింగేసిందిట.

తన చలవ గదుల సౌకర్యాలు అన్నీ వదలి నర్సయ్య అనుమతి తోనే అతని కుటుంబం తో అక్కడే చిన్న గుడిసె వేసుకొని ఉండడం మొదలు పెడ్తాడు రాఘవ. తమ కుటుంబ సభ్యుడి లాగానే అతని తిండి తిప్పలు నర్సయ్య కుటుంబం చూసుకుంటుంది.

"సంకటి మధ్యలో కుదురు చేసి.. ఎండు మిరపకాయలు కాల్చి ..తెల్లబాయలు జత చేసి, బొటనవేలు దరువేసి, మీగడపాలతో నలిచిన కారం అందులో వడ్డించింది. అప్పుడే కాచి తెచ్చిన నెయ్యిని కారం మీద పోసింది ' చుంయ్' మని శబ్దం వచ్చేలా.".  అలాటి సంకటి ముద్దల రుచి  వర్ణిస్తూంటే నే నోరూరుతుంది ఎలాంటి వారికైనా.

ఇలా నవలలోకి వెళ్తూంటే.. అక్కడి వాతావరణం తో పాటు
నర్సయ్య భార్య ఓబులమ్మ, తల్లి గంగమ్మ,కూతురు రాములమ్మ... ఇంకా డబ్బుకోసం చెట్లను అమ్మలేదని తండ్రి మీద అలిగి దూరంగా మరో ఊర్లో ఉంటున్న అతని కొడుకు... ఇతర సన్నకారు రైతులు..వాళ్ల కష్టాలు ఇష్టాలు ...అన్నీ పరిచయం అవుతాయి.
ముఖ్యంగా  అందరిలోనూ మూగజీవాలపట్ల ఉండే కరుణ. ఉత్త పుణ్యానికే హింసకు పాల్పడరెవరూ.

ఆ రేగడి నేలను స్వాధీన పరచుకుని.. సాగుచేయడం ఎంత కష్టమో రాఘవకూ అనుభవం లోకి వస్తుంది.  విత్తు మొలకెత్తిన దగ్గరనుండి పంట చేతకొచ్చేదాక  రైతెంత శ్రమిస్తాడో తెలుస్తుంది క్రమంగా.  నర్సయ్యకు  తెలుసు 'అరికె' ఎంత మొండి పంటో. అతను మొదట నుండి అరెక చేను గురించి పరిచయం చేస్తూనే ఉంటాడు.  అరెక చెత్తలో కూడా ఎంత వేడుంటుందో కూడా పురాణ కథ ఉదాహరణ తో చెప్తాడు.
" దీన్ని సాకి పైరుజేస్తేనే గదా రైతు మొగోడనిపించుకొనేది".. అంటాడు.
" గుంపించి ఎండగాస్తే వాడుబడ్తాది. గుంపులు గుంపులు చస్తాయి.  అయినా నేను చావనిస్తానా. స్ప్రేయర్ తో నీల్లు చిలుకరించి మొలకలన్నీ తడపనా.... బతికించనా... రైతును నేను"
నిజంగానే అరికెల మొలకలకు ఎండ కొడుతుంటే..నీళ్ల టాంకు ను వీపుకు ఎత్తుకుని..నీళ్లను స్ప్రే చేయడం.. ఎంత శ్రమ... ఎండలు ..కరువు.
ఆఖరికి గొర్రెల మంద రూపంలో కరువు చుట్టుముట్టి పంటచేను నాశనమైతే బాధ పడతాడు నర్సయ్య కాని, నిరాశ పడడు.
 ఆ వెంటనే వచ్చిన పెద్ద వాన తో చేను మళ్ళీ పునరుజ్జీవనం పొందుతుంది. మరోసారి వాన.

అలా ఆర్నెల్ల పాటు ప్రకృతి కి దగ్గరగా నర్సయ్య అడుగు జాడ లలో వ్యవసాయ పనులు చూస్తూ...  అన్నీ తెలుసుకుంటూ
గడిపేసరికి ..రాఘవ కి ఇంచుమించు అన్ని రోగాలు మాయమై కొత్త ప్రపంచం చూసినట్లు అనిపిస్తుంది.

అనేక రకాల పక్షులు.. వాటిని అరుపు.. సందడిని బట్టి పోల్చు కోవడం.  రుతువులను బట్టి సహజంగా  దొరికే పళ్ళు....  మేడిపండ్లు,బలుస పండ్లు, బిక్కి పండ్లు, నిమ్మ, దానిమ్మ, సీతాఫలాలు, రేగి,పరిక పండ్లూ... ఇంకా ఇవి కాక పొద్దకంకులూ,శెనక్కయాలు,కందికాయలు అలసందలు. ఇంతే కాదు  చేలల్లో..గట్లమీదా మొలిచే రకరకాల ఆకు కూరలు.. వీటిని వెదికి తెలుసుకోవడం. ఇలా అన్ని విద్యలూ అబ్బుతాయి. వీటి తో పాటు  జ్ఞానేంద్రియాలు పునరుజ్జీవనం పొందుతాయి.
ఓ చోట, వానలో బురదలో కాలు బెసగ కుండా ఎలా నడవాలో రాములమ్మ నేర్పిస్తుంటే.. నడక కీ వ్యాకరణమా అనుకుంటాడు.

"ఒక్క నెల రోజులపాటు నర్సయ్యతో కలిసి వ్యవసాయ పనులు చేస్తే చాలు..అన్ని వ్యాయామాలూ,యోగాలూ, ప్రాణాయామాలు చేసినంత ఫలితం లభిస్తుంది." అనుకుంటాడు రాఘవ.

" ఒంటరి కానిదెవరు...గుంపులో ఉన్నపుడు ఒంటరి తనం పోయినట్లనిపిస్తదిగాని ఆలోచనలన్నీ ఒంటరివే....."
"... సుఖమూ..దుఃఖమూ అన్నీ ఒంటరి వే. నలుగురితో పంచుకోవడం కూడా ఒంటరి భావనను తృప్తి పరిచేందుకే. ఒంటరి భావనను శిఖరాగ్రానికి చేర్చి చివరకు దాన్ని కూడా లయం చేయటమే గదా ఆధ్యాత్మిక తకు అంతిమ లక్ష్యం."
" మనిషి మనిషికి మధ్య మానసిక సంబంధాలు పెంచుకోవాలి.. అంతే కాని మనుషుల మధ్య బతికినంత మాత్రాన ఒంటరితనం పోదు. "  ఒంటికొట్టం లో తన కుటుంబంతో దాదాపు ఒంటరిగానే నివసిస్తున్న నర్సయ్య ఒంటరితనం పై తత్వ బోధ.

ఇందులో డాక్టర్ రాఘవనూ నేనే... రైతు నర్సయ్య నూ నేనే అంటాడు రచయిత తన ముందు మాటలో. 

This novel is about agricultural diabetes  అన్నారు పతంజలి శాస్త్రి గారు. అంతరించి పోతున్న ప్రాచీన వ్యవసాయ విధానం కావచ్చు.  కధ పూర్తయ్యాక.. నాకనిపించింది అంతరించి పోతున్నది ఓ పంట కాదు.  మాయ మయ్యేది రైతనీ..  ఇంతకంటే తీవ్రమైన పరిస్థితి నెలకొనివుందని ఉందని.

ఇప్పటికే బోలెడు ప్రశంసలు, అనేక రివ్యూ లు జరిగాయి. ఆపైన పతంజలి గారి పరిచయ వాక్యాలు..  తినబోతు రుచి చూసినా... ముందు నవల పూర్తి చేయాలనే ఉత్సాహం అలాగే ఉంటుంది.

ఈ రచయిత పుస్తకాలు ఇంతకు ముందు నేను చదవలేదు.కాని
చాలా .. .చాలా... సంవత్సరాల తర్వాత , ఇన్నాళ్లకి..   ఒక్క రోజులో పూర్తి చేసానీ  250 పేజీల పుస్తకాన్ని. అంతగా కూర్చోబెట్టి చదివించింది.  రాయలసీమ మాండలికం అంతో ఇంతో పరిచయమున్నా..అక్కడక్కడ  సందర్భాన్ని బట్టి అన్వయించుకున్నా.. ఎక్కడైనా విడిగా అర్ధాలు ఇచ్చి ఉంటే బాగుంటుంది అని నాకనిపించింది. అయితే అదేమీ కధ ముందు కు సాగడానికి అడ్డు కాలేదు.

చివరికి, అరెకల ధాన్యం తో  సిద్ధ పురుషుడు దగ్గరకు వెళ్దామనుకొన్న  రాఘవకు. అసలు వెళ్లడం అవసరమా అనిపిస్తుంది.  అదే పాఠకులనూ అడుగుతాడు.. పల్లెలను ఆదుకోమని.

మరి మీరేం చేస్తారో కాని.. అది అర్ధం చేసుకోవటానికి.. పుస్తకం మాత్రం కొని చదవమని నా సూచన.

ఈ పుస్తకం  TANA పబ్లికేషన్.  తొలి ప్రచురణ 2017 డిసెంబర్‌ నెలలో.  2018 జనవరి లో మలి ముద్రణ కాపీ నా దగ్గర ఉన్నది. ఆన్లైన్ లో తెప్పించుకొని చదివాను.

Remark by one reader

 The review is so good that it
prods the reader to go get this novel. A wonderful book. It is more than a novel.
It needs serious attention.
A fitting dialect. Well, I speak from experience that it is absolutely true. I went to the villages myself to help myself.
.

No comments:

Post a Comment